Thursday, September 2, 2010

నాయకుడు – వినాయకుడు

తెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేను
అష్ట కస్టంబులతోడ అవమానం బొందినాను

నాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరి
గాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరి

ఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించి
దాస్య సృంఖలాలను త్రెంచివేసి నిస్క్రమించిరి

వీర పుత్రులెందరినోగని స్వతంత్రమ్ము బొందినాను
నా బిడ్డల భవిష్యత్తుకై బోలెడు కలలుగన్నాను

ఏదీ ఆ వీరత్వం ఎక్కడుంది ఉడుకు రక్తం
నరనరంబులలోన మిగుల స్వార్థంబే నిండుకుంది

కుటిల రాజకీయాలతొ కపట వేషధారణతో
చిలుక పలుకులెన్నొ పలికి చిత్రంగా బతుకుచుండిరి

వర్తకంబున నీతిదప్పి సరుకును నల్లబజారు చేర్చి
సామాన్యుడి గుండెలపై బరువెంతో మోపినారు

సరస్వతిని పూజిస్తూనె చదువులమ్ము కొనుచుండిరి
విద్యాలయాలన్నింటిని వ్యాపారంగ మార్చేస్తిరి

చదువుకున్న మేధావులంత విదేశాల కేగుచుంటె
వట్టిపోయిన పొదుగువోలె కృశియించి పోయినాను

తెల్లవలువలు ధరిస్తూనె ఎర్రటి నెత్తుటి మరకలు
శాంతిమంత్రం జపిస్తూనె షఠగోపు కుతంత్రాలు

విదేశీయులు తంతె తప్ప దేశభక్తి పుట్టదు మరి
అవమానిస్తేనె తప్ప విప్లవంబు లేవదేమొ

భరత మాతనని నేను ఏమి జూసి గర్వించను
కన్నతల్లి కంట్లోనె కారంజల్లు కొడుకులుంటె

గాంధీయే నేడుంటే గుండెబగిలి చచ్చెటోడు
బోసుగనక బతికుంటే భోరున విలపించెటోడు

సత్యాహింసలన్న జాతిపిత మాట మరచి
ఉగ్రవాదమంటు లెస్స ఉన్మత్తుడవైతివోయి

భవిష్యత్తు తలచుకొని భారంగా నిట్టూర్చితి
కరుగని హృదయాల గాంచి కన్నీటిని కార్చుచుంటి

నేను నాది అన్నంతసేపు నాయకుడు వినాయకుడౌను
మనం మనకు అనుకుంటే వెల్లివిరియు సౌభాగ్యం

చదువుకున్న యువకులంత రాజకీయాలలొ చేరి
చదువుసంధ్యలు లేనట్టి వృద్ధనాయకుల నావలనెట్టి

ఆదర్శ భారతాన్ని అందంగా తీర్చిదిద్ది
భరతమాత నైన నాకు బహుమానంగా ఇవ్వండి

- నాగులవంచ వసంతరావు

Wednesday, June 30, 2010

వసంతరావు మాటలు - వజ్రాల మూటలు

పెదవిపైన నుండు పెను దరహాసంబు 1
కడుపులోన మిగుల కల్మషంబు
కౌగిలింతలతోటి కపట నాటకంబు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

పనియె దైవమంటు పెద్దలు చెప్పగా 2
పనిని పక్కనబెట్టి ప్రతిమకు పూజలు
పనిలొ ప్రావీణ్యతయె పాలాభిషేకంబు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

కడుపు మండుతుంది కాషాము జూడ 3
కడుపునిండ కల్మష కషాయముండు
కల్మషము లేనపుడె కాషాయమునకు విలువ
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

షిరిడి సాయియనుచు శివమెత్తుదురు జనులు 4
ఆర్భాటముగ పెక్కు ఆశ్రమ స్థాపనలు
షిరిడి బాబకె చివరకు శఠగోపమిత్తురు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

అవధూతలమంటు అతివలతొ సరసాలు 5
బడా బాబాలమంటు భామలతొ భోగాలు
దొంగ బాబలు బాగ దొరుకుచుండిరి ఇలలొ
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

ఎదుగుదలను జూసి ఓర్వలేరు జనులు 6
బక్కచిక్కినవేళ బహు పలకరింపులు
ఆధిపత్య పోరు అతి సహజమైపోయెను
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

ముసలితనములోన కొడుకు కోడలు కలిసి 7
బాగ జూతురంటు గంజి గటక తాగి
బహుగ కూడబెట్టి కొడుకులకిత్తురు
ముదుసలైనవేళ ముడ్డిమీదనే తందురు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

కొడుకు కోడలంటె కొండంత ప్రేమాయె 8
బిడ్డ అల్లుడిపట్ల సవతి తల్లి ప్రేమ
కొడుకు కొండిగాడు కొరిగించేదేమిటో
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

మూర్ఖులైన పిచ్చి ముసలి తల్లిదండ్రులు 9
కొడుకు కోడలుపైన కోటి ఆశలు పెట్టి
బిడ్డ అల్లుడు మరియు బంధు మిత్రులనెల్ల
ఎడబాపుకొని చివరకు ఏకాకులై చత్తురు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

కొడుకు పీకినదేమి బిడ్డ పీకనిదేమి 10
మూర్ఖులైన ముసలి చాదస్తము తప్ప
చేతగానివేళ కొడుకులచేతనే తన్నులు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

సుపుత్రుడెల్లపుడు బహు సుఖంగుండాలని 11
కండ్లల్లబెట్టుకొని కాపాడజూతురు
మంచాన పడ్డపుడు మాయమౌదురని తెలియరు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

కొడుకు బిడ్డలిద్దరు ఒక్క బొడ్డునుండి రాగ 12
పక్షపాత బుద్ధిచే పడతిని చలకనగ జూతురు
కొడుకు కొండిగానికి కొమ్ములెట్లొచ్చెనో
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

కలలుగనెడివారు ధరణి కోకొల్లలు 13
కష్టపడని కలలు కల్లలగును
కలల సాకారంబె కస్టానికి గురుతు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

వట్టి మాటలు కావు వజ్రాల మూటలు 14
మాయ మాటలు కావు ముత్యాల సరాలు
కల్పితాలు కావు కన్నీళ్ళ గాధలు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

సుఖ దుఖాలు, కలిమి లేములు 15
లాభ నష్టాలు, జయాపజయాలు
మానావమానాలు మనిషికి సహజాలు
వసంతరావు మాటలు వజ్రాల మూటలు

Saturday, June 19, 2010

ఏకలవ్య జ్ఞానం

మానవునికి అన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన, అనుభూతి లభిస్తుంది. కాని దేవుని విషయంలో మాత్రం స్పష్టత లేదు. రకరకాల మనుషులు రకరకాలుగా దేవుని గురించి ఊహిస్తూ, భావిస్తూ, భ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరూ దేవుని ఉనికిని గురించి, అనుభూతిని గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు ఒక దేవాలయంలో ఇష్టదైవంగా కొలిచే దేవతామూర్తి విగ్రహాన్నే అమాంతం దొంగలు ఎత్తుకు పోతూ ఉంటే స్వయాన దేవుడు అని చెప్పుకునే ఆ విగ్రహం కూడా ఏమీ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. హేతుబద్ధమైన ఆలోచనగల ఏ వ్యక్తి యైనా ఈ విధంగానే ఆలోచిస్తాడు. నిజంగా ఆ విగ్రహమే దేవుడైతే, లేదా ఆ విగ్రహానికే గనక శక్తి ఉన్నట్లైతే దొంగ చెంపలు వాయించి, తగిన గుణపాఠం నేర్పి దొంగతనం మానిపించ గలిగేది. కాని మానవుడిచే తయారుచేయబడిన ఆ విగ్రహం అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే విగ్రహం దేవుని ప్రతిరూపమేగాని దేవుడు మాత్రం కాదు. మనిషి సృష్టించుకున్న వాటికే మానవుడు తిరిగి అద్భుత శక్తులను ఆపాదిస్తున్నాడు తప్ప, తనలోగల దివ్య శక్తులను తెలుసుకోలేకపోతున్నాడు.

ఈ దివ్య శక్తులను అనుభూతి పొందడానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో విఫలమైన మానవుడు అడ్డదారుల్లో పయనిస్తూ శ్రమలేకుండానే సులువుగా మోక్షాన్ని సంపాదించుటకు బూటకపు గురువులను తెలియక ఆశ్రయిస్తున్నాడు. వారు చూపించే మంత్ర, తంత్ర, యంత్ర గారడీ విద్యలు, మహిమలు, మహత్తులు, హిప్నటిజం లాంటి విచిత్ర ప్రక్రియలతో తమకేదో దివ్య శక్తులున్నట్లుగా ప్రజలను భ్రమింపజేస్తూ తమ పని కానిచ్చుకుంటున్నారు నేటి బూటక స్వాములు. నిజానికి శక్తి అంటూ ఉంటే అది దైవ సృష్టిలోని ప్రతి జీవికి చెందినదై ఉంటుంది. అన్ని జీవులలో మానవుడు ఉత్తమమైన జీవి కాబట్టి ఆ దివ్య శక్తిని ఉద్దీపన చేసుకునే అవకాశం ఉంది. దానికి సుశిక్షితులైన యోగాచార్యులు, గురువులు ఉండవలసిందే. కాని నేటి స్వార్ధపరులైన గురువులు, యోగులు మానవాళి క్షేమం మరిచి, స్వప్రయోజనాలకై ప్రాకులాడుతూ కపటంగా జీవిస్తూ, అమాయకపు ప్రజలను వంచన చేస్తున్నారు. వీరు చెపే నీతులు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. కాని ఆచరణ దగ్గరకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చేతలకు, మాటలకు చాలా వ్యత్యాసం కనబరుస్తారు. తాను ఆచరించకుండా ఇతరులకు చెప్పే అధికారం ఎవ్వరికి లేదు. అందుకే మహాత్ములైన వారు ఆచరించిన తర్వాతే ఇతరులకు నీతి వాక్యాలు బోధించారు. అప్పుడే మనిషి మాటలకు విలువ వస్తుంది.

మంచిగా ఉండు – మంచినే చేయి. ఈ రెండు వాక్యాలు చాలు జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి. చూడడానికి ఈ వాక్యాలు చిన్నగా అనిపించినా నిజ జీవితంలో వాటిని ఆచరించాలంటె చాలా క్రమశిక్షణ, సమయ పాలన, దూరదృష్టి, ఆత్మ నిగ్రహం కావాలి. మంచి చెడుల మధ్యగల అంతరాన్ని గ్రహించగల సూక్ష్మ బుద్ధి కావాలి. మానవతా విలువలలోని మాధుర్యాన్ని గ్రహించ గలగాలి. త్యాగ గుణంలోని గొప్పదనాన్ని, ఆత్మానందాన్ని అందిపుచ్చుకోగలగాలి. తనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసి, కృతజ్ఞతా భావంతో వారి కళ్ళలో మెరిసే ఆనంద భాష్పాలను చూసి పులకించి పోగలగాలి. మంచితనమనే మానవతా పరిమళాలను పదిమందికి వెదజల్లగలగాలి.

మోసం నుండి తప్పించుకోవాలంటే కేవలం మంచి పుస్తకాలే మనిషికి శరణ్యమని చెపాక తప్పదు. మనిషి మతం ముసుగులో మోసం చేసే అవకాశం ఉంది కాని మంచి పుస్తకం మనిషిని మోసం చేసే అవకాశమే లేదు. ఎందరో మహానుభావులు తమ జీవితంలో ఆచరించి బోధించిన అమూల్య జ్ఞాన రత్నాలు మన పురాతన గ్రంధాలలో లభ్యమౌతాయి. వాటిని చదివి ఆచరిస్తే అంతకుమించిన ఆత్మోన్నతి మరొకటి లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఎంతోమంది పైకి నీతులు చెబుతూనే లోన మాత్రం కపటంగా కుట్రలు చేస్తూ వక్ర మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పేవన్నీ నిజమని నమ్మితే మీరు మోసపోయినట్లే. పైకి మాత్రం నీతులు చెబుతూ ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి వారికి లాభదాయకమైన పనిని, దానివల్ల ఇతరులకు కీడు జరిగినా సరే స్వార్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరులలోని తప్పులను ప్రతి ఒక్కరు వేలెత్తి చూపెడుతూ ఉంటారు. కాని వాటికి పరిష్కారం మాత్రం సూచించటం లేదు.

ఈ సమస్యకు పరిష్కారం మనిషి ఎవరినో నమ్మడం కన్నా తనను తాను నమ్ముకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ముక్కోటి దేవతల మీద నమ్మక్మున్నా తనమీద తనకు నమ్మకం లేనిచో ప్రయోజనం శూన్యం. ఆత్మ విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఇదే. తనను తాను నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడిపోడు. ఇతరులను నమ్మితేనే వేషాలు, మోసాలు. మరెందుకింక ఆలస్యం. ఏకలవ్యునివలె మంచి పుస్తకాన్నే గురువుగా భావించి, ఆదర్శాలను ఆచరణలో చూపించి మోక్షగాముల మౌదాం. మోసాల బారినుండి మనల్ని మనం కాపాడుకుందాం.

- నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Wednesday, June 16, 2010

నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు

నిత్య జీవితంలో నిష్కపటంగా, నిజాయితీగా బ్రతకవలసిన మనిషి కపటంగా బ్రతుకుతున్నాడు. దీనికిగల కారణాలనుగనక పరిశీలించినట్లైతే ఒక పామరుడు కపటముగా జీవిస్తూ మందిని మోసము చేసాడంటే అమాయకత్వం లేదా అజ్ఞానం అనుకోవచ్చు. కాని అన్నీ తెలిసిన, బాగా చదువుకున్న వారు, సమాజములో పెద్దలమని గొప్ప పేరు ప్రతిష్టలుగలవారమని పిలిపించుకొనేవారు, ఇంకా విచిత్రమేమిటంటే గురువులమని చెప్పుకుంటూ భక్తి, జ్ఞానం ముసుగులో అమాయకులను మోసం చేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. నూటికి తొంబై శాతం మంది కపటత్వంలో బ్రతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇది పచ్చి నిజం. దీనికి కారణం ఏమిటి? రాతలు చాలా బాగుంటాయి కాని చేతలవరకు వచ్చేసరికి విచిత్రంగా, స్వార్ధంగా బ్రతుకుతుంటారు. ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా అన్నట్లు ఇతరులను మోసం చేసి పబ్బం గడుపుకున్నా తనలోని అంతరాత్మకు తాను తప్పు చేస్తున్ననన్న సంగతి బాగా తెలుసు. కాకపోతే తనలోగల అహంభావం వల్ల, తాను ఇతరులముందు చులకనైపోతానన్న భావనతో తనలోని తప్పులను మనిషి ఒప్పుకోడు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ యనే సూత్రం ప్రకారం తానే అన్ని ప్రాణులలో వివిధ రూపాలలో నివసిస్తున్నాడన్న సత్యాన్ని తెలుసుకోలేక ఇతరులకు అన్యాం చేసి, మోసం చేసి, దగా చేసి తానేదో తెలివైన వాడినని, మాయ మాటలతో మందిని మోసం చేయగలిగానని, తన అతి తెలివికి తానే అతిగా పొంగిపోతూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. సంస్కారమున్న ఏ వ్యక్తి ఇతరులకు బాధ కలిగించే పని చేయడు. తనలోని అంతరాత్మ ప్రబోధాన్ని పక్కకు నెట్టి, స్వార్ధ ప్రయోజనాన్ని ఆశించి వక్ర మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు దుష్ట మానవుడు. ఐతే తాను చేసే పని తప్పని తెలిసి కూడా మంచిని ఆచరించలేక పోవడం కేవలం తనలోని బలహీనతలవల్లనే. ఇంకా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం అని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఏది ఏమైనా తన పనిని ముగించుకోవడానికి ఎంతటి దుష్ట కార్యానికైనా సిద్ధపడుతున్నాడు వక్రబుద్ధిగల మానవుడు.

తప్పు చేయడం ఎంత నేరమో, తప్పు చేయడానికి సహకరించడం లేదా అవకాశమివ్వడం కూడా అంతే నేరమౌతుంది. మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేయడానికి సహకరించిన వారిదికూడా తప్పే ఔతుంది. నీ అమాయకవం వల్ల, నీ అవగాహనా రాహిత్యం వల్ల లేదా నీ మూఢ విశ్వాసం వల్ల నిన్ను ఎదుటివాడు మోసం చేయగలుగుతున్నాడంటే అందులో నీ లోపం కూడా ఉన్నట్లే. నీవు నిండా జాగ్ర్త్తగా ఉంటే నిన్ను మోసం చేసే అవకాశమే లేదు. నీవు ఏదో ఒక ప్రలోభానికి లోబడితేనే దానిని ఎదుటివాడు ఆసరాగా తీసుకుని నిన్ను నమ్మించి నిలువునా నట్టేట ముంచగలుగుతున్నాడు. నీవు తెలివి తెచ్చుకుని, అప్రమత్తుడవై ఉన్ననాడు నీ దరిదాపులకు రావడానికి కూడా వాడు జంకుతాడు. చర్య - ప్రతి చర్య సిద్ధాంతమంటే ఇదేనని తెలుసుకోవాలి. యధా రాజా తధా ప్రజ. యదా భక్తా తదా గురు అనేది నవీన కాలజ్ఞానం. అంతరాత్మ ప్రబోధాన్ని విస్మరించి సంచరించే మోసపు బాబాలకు ఇంతకన్న మంచి ఉపమానం మరొకటి లేదేమో! మీరే సావధానంగా ఆలోచించండి. మంచివాళ్ళకు మంచిగా ఉండడం, చెడ్డవాళ్ళకు చెడ్డగా ఉండడమే సరియైన మార్గం. అతి మంచితనం కూడా చేతగాని తనం కిందికే వస్తుంది. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేది అయా పరిస్థులనుబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగు ముందుకు వేయడమే విజ్ఞతగల మానవుని ప్రథమ కర్తవ్యం.


నేటి సమాజంలో హాయిగా, అన్ని వసతులతో, మనసుకు ఎలాంటి నొప్పి కలుగకుండా సంతోషంగా బ్రతకాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. ఈ కోరికను తీర్చుకోవడానికి నిర్విరామంగా కృషిచేసి ఫలితాన్ని అనుభవించే బదులు, అతి సులువుగా, ఎలాంటి కస్టం లేకుండానే అన్ని ఆనందాలను పొందాలని అడ్డదారుల్లో పయనిస్తుంటారు చాలా మంది. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ట్రిక్కులతో, జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఒకవిధమైన ప్రయోగం ప్రజలకు తెలిసిపోగానే అప్రమత్తమైన మోసగాళ్ళు మరో రకమైన ఎత్తుగడవేసి ప్రజలను చిత్తు చిత్తుగా మోసం చేస్తూ ఉంటారు. తమకు జ్ఞానం గురించి అంతా తెలుసునని చెప్పుకొనే గురువులు, స్వాములు, బాబాలు కూడా బలహీనతలకు లోనై ఉచితానుచితాలు మరిచి, కామినీ, కాంచన, కీర్తి ప్రతిష్టల మోజులోపడి భ్రష్టులవడమే కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికి బధ్యులు బాబాలా లేక అమాయకపు ప్రజలా అనేది చర్చనీయాంశము.


నిజం చెప్పాలంటే మనం ఒకరి చేతిలో మోసపోయామంటే ఆ పొరపాటు మనదే. ఎందుకంటే మోసం చేయడానికి ఎదుటి వ్యక్తికి నీవు అవకాశమ కల్పించావు కాబట్టి. ఎందుకు అవకాశం కల్పించావంటే అందులో నీ స్వార్ధం దాగివుంది. ఎందుకంటే కష్టపడకుండానే నీకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు రెడీమేడ్ ముక్తి, మోక్షం నీకు కావాలి. దానికి తగిన సాధన, నియమ నిష్టలు పాటించే తీరిక, ఓపిక నీకు లేదు కాబట్టి బూటక స్వాములను నమ్మి నీ భారమంతా అతనిపై వేసి హాయిగా రిలాక్స్ కావాలనుకున్నావు. ఛివరికి ఏమైంది నిన్ను నిలువునా ముంచేసి అతడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. నీవు ఈ సత్యాన్ని గ్రహించి జాగ్రత్తపడేసరికే స్వామి చల్లగా జారుకుంటున్నాడు. చేతులు కాలిన పిదప ఆకులు పట్టిన చందాన నీ ఆత్మ ఘోష అరణ్యరోదనగా మిగులుతుంది. ఎవరికి చెప్పుకుంటావు నీ దీన గాధను. ఎవరు తీరుస్తారు నీ కష్టాన్ని. ఎవరు పూడుస్తారు నీకు జరిగిన ఆర్ధిక అగాధాన్ని. ఎవరు ఓదారుస్తారు నీ హృదయ భారాన్ని. ఎవరు అందిస్తారు నీకు ఆపన్న హస్తాన్ని.

అర్జునుడు శ్రీకృష్ణునికి స్వయాన బావమరిది ఐనా కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అన్నాడే తప్ప, నీవు హాయిగా రథం పై కూర్చుంటే నేనే యుద్ధం చేసి నిన్ను గిలిపిస్తానని ఎక్కడా చెప్పలేదు. పైగా రకరకాల జ్ఞాన బోధలు చేసి కార్యోన్ముఖున్ని చేశాడు. కర్తవ్య పాలనకు కంకణం కట్టుకునే విధంగా ప్రేరణ కలిగించాడు. పని చేయుటకే అధికారము కలదు కాని కర్మ ఫలాన్ని ఆశించవద్దని హితవు పలికాడు. గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఖాలు చుట్టుముడుతాయి. ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదన్నారు పెద్దలు. కాబట్టి ఏవిధంగా ఆలోచించినా ప్రతి మనిషి కష్టించి పని చేయవలసిందే. తనకు కావలసిన జీవన సదుపాయాలను సమకూర్చు కోవలసిందే. ఎవరో దయదలచి మనకు సమకూర్చే వస్తువంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దేనికైనా నీ శ్రమ శక్తే మూలమని గుర్తుంచుకోవాలి. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని ఎల్లాప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి.

నీ జీవితం తెరచిన పుస్తకంలా ఉండాలి. నీ దిన చర్యను బట్టి నిన్ను అంచనా వేయవచ్చు. నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. నీ జీవన విధానాన్ని బట్టి నీ నిజాయితీని నిగ్గు తేల్చవచ్చు. నీ మాటలను బట్టి నీ మనోగతాన్ని పసిగట్టవచ్చు. నీ అలవాట్లను బట్టి ఆచరణను ఆరా తీయవచ్చు. నీ చేతలను బట్టి గుణగణాలను గుర్తించవచ్చు. నీ దుస్తులనుబట్టి స్వభావాన్ని సుమారుగా అంచనా వేయవచ్చు. నీ నడతను బట్టి జీవన నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించవచ్చు. మొత్తంగా నీ జీవితం నీ నడతపైనే నిండా ఆధారపడి ఉంటుంది. నీవు వంద పుస్తకాలు రాసినా ఒక్క వాక్యాన్ని నిజ జీవితంలో పాటించలేనప్పుడు ఆ రాతలు నిరర్ధకం. చెప్పే మాటలను చేతలలో చూపినప్పుడే వాటికి విలువ వస్తుంది. నిన్ను చూసి నీ ఎదుటివారు ఎన్నో మంచి విషయాలను నేర్చుకోగలగాలి. అంత ఉన్నతంగా నీ ఆచరణ ఉన్నప్పుడే నీ మాటలను ఎదుటివారు నిండా నమ్మగలరు.

అన్నింటికి ఒక్కటే సమాధానం. "అప్పో దీపోభవ.” (నీకు నీవే దిక్కు). నీ క్షేమం కోరేవాడు ఈ ప్రపంచంలో నీకు మించినవాడు మరొకడు లేడు. ఇది ముమ్మాటికి అక్షర సత్యం. కావాలంటే ఆత్మ పరిశీలన చేసి చూసుకో. నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు. ఇతరులు నిమ్మిత్తమాత్రులు. నీవు మాత్రమే నీ గురించి బాగా ఆలోచించగలవు. సరియైన నిర్ణయాలు తీసుకోగలవు. నీ జీవితాన్ని ఇతరుల చేతికి అప్పగిస్తే కుక్కలు చింపిన వస్తరిగతి అవుతుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకే అర్ధమౌతుంది. నిన్ను నీవు నమ్ముకోకుండా ఇతరులను నమ్మితే మిగిలేది విషాదమే. నీవు కస్టపడకుందా ఫలితాన్ని ఆశించడం వెర్రితనమే అనిపించుకుంటుంది. ఇతరులపై ఆధారపడినంతకాలం మనకు ఎదురుదెబ్బలు తప్పవు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా అని మహాకవి శ్రీ శ్రీ ఏనాడో మానవాళిని హెచ్చరించాడు కూడా. ఐనా ప్రతి రోజు ఏదొ ఒక మోసపు వార్తలు మన చెవిన పడుతూనే ఉన్నాయంటే మూఢ నమ్మకాలు ఎంతగా ముదిరిపోయాయో అర్ధమవుతుంది. బాబాను బగవంతుడని విశ్వసించి నమ్మిన భక్తునికి భంగపాటు తప్పడంలేదు. ఒకటి కాదు, రెండు కాదు అను నిత్యం టీవీ చానళ్ళలో బాబాల గుట్టు బయటపడుతూనే ఉంది. రోజుకొక మాయా గారడీ చేసి మందిని మోసం చేస్తున్నారు. పేరుగాంచిన ప్రముఖులు సైతం ఈ అనైతిక ఉచ్చులో పడడం మిక్కిలి శోచనీయం. ఎంతటివారైనా కాంతా, కనక దాసులే అన్నట్లు నేటి సమాజంలో జరుగుచున్న అన్యాయాలు, అక్రమాలు, భూ బాగోతాలు ప్రబల నిదర్శనాలు.

విచారకరమైన విషయమేమిటంటే భగవంతునిచే సృష్టించ బడిన మనిషి భగవంతుడి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. వివిధ రూపాలలో ఉన్న దేవతా విగ్రహాలను చూడగానే భక్తితో కొంతమంది, భయంతో కొంతమంది తోచినకాడికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఐతే అవి ఎంతవరకు సద్వినియోగమౌతాయని ఆలోచించటం లేదు. గురువుల పేర్లు, బాబాల పేర్లు చెప్పి చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్న విధంగా క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది దొంగ బాబాలు.

ఇన్ని పత్రికలు పతాక శీర్శికల్లో దొంగ బాబాల వార్తలు ప్రచురించినా, టీవీ చానళ్ళలో సాక్ష్యాధారాలతో కళ్ళకు కట్టినట్లు చూపించినా ఇంకా వాళ్ళను గుడ్డిగా నమ్మే అమాయక ప్రజలున్నారు కాబట్టే వారి ఆటలు సాగుతున్నాయి. జన విజ్ఞాన వేదిక, నాస్తిక సంఘాలు గొంతెత్తి అరచినా ఆశించిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి కారణం మూఢ నమ్మకాలు వేళ్ళూనుకుపోవడమే. ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు మోసగాండ్లు రూటు మారుస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాసులకోసమే కాషాయాంబరాలు కట్టుకుని కిరాతకపు పనులు చేసే మేకవన్నె పులులను మొదలంటా తుదముట్టించాలి. లేకుంటే మానవ మనుగడగే మహా ఉపద్రవం రాక తప్పదు. ఎంతో మంది అమాయకులు బలిపశువులుగా మారే ప్రమాదం మరెంతో దూరంలో లేదు. అందుకే మహా పురుషులు, యోగులు, జ్ఞానులు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుకుని జ్ఞానాన్ని సంపాదించవచ్చు. పుస్తకాలతో మనిషికి ప్రమాదం లేదు. కాని మానవ రూపములో ఉండి మహాత్ములమని, స్వాములమని చెప్పుకొనే మోసపు మనుషులతోనే మానవాళికి మహా ప్రమాదం పొంచి వుంది. ఈ ప్రమాదం నుండి మానవాళి బయటపడడానికి మనవంతు కృషి చేద్దాం. మతం, భక్తి ముసుగులో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అమానుషాలను అంతమొందిద్దాం.

- నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Thursday, May 13, 2010

బాబా సర్వకేంద్రుల ఆత్మీయ కవిత

ఓ నాగులవంచ రజనమ్మ
నీవే నా సర్వస్వమమ్మ
నిను మరచి నేనుండలేనమ్మ
ఎన్నిజన్మల పుణ్యఫలమో
సర్వకేంద్ర బాబాను పొందితివమ్మ
నీ గర్భస్థ శిశువుగ ననుగాంచవమ్మ
నీ గమ్యంబు నేనై నిలిచెదనమ్మ // ఓ నాగులవంచ //

కళ్ళు మూసిన నీవేనమ్మ
నా కన్నులు తెరచిన నేవేనమ్మ
అందులకే నిన్ను నే మరువలేనమ్మ
నీ ఎదలోని దీపము నేనమ్మ
నన్ను పదిలముగ దాచుకోవమ్మ // ఓ నాగులవంచ //

నీ ఇంటి జ్యోతిగ నీ కంటి పాపగ
ఈ కంటి పాపను చూచుకోవమ్మ
కడు ప్రేమతో నను దాచుకోవమ్మ
నిను నిండుగ నమ్మి యున్నానమ్మ
నీవు కాదనిన నే తల్లడిల్లెదనమ్మ // ఓ నాగులవంచ //

నీ గర్భస్థ శ్రుతిని నాలో చూడవమ్మ
ఎంత చూచిన నీ తనివి తీరదమ్మ
ఇదియే విశ్వ మాతృ బాబా ఘనతోయమ్మ
నోరార స్వామి బాబాను పిలువమ్మ
నీ చేతులార ఆహ్వాన పరుచమ్మ
సదా శైశవదశ నాదని తెలియమ్మ
అందులకే శైశవ స్థితికొస్తినమ్మ // ఓ నాగులవంచ //

ఎల్లలు లేనిది నీ హృదయమమ్మ
ఎంతో పవిత్రం నీ ప్రేమయమ్మ
నీ ప్రేమ గంగయె నాకభిషేకమమ్మ
కలియుగావతారములో నాకు వకుళ మాతవమ్మ
నీ మురిపాల ముద్దుల బిడ్డను నేనమ్మ
ఇంతకు మించి నాకేమి తెలియదమ్మ // ఓ నాగులవంచ //

గట్టిగ ఒకసారి నీవు నవ్వమ్మ
ఆ నవ్వే నాకు నైవేద్యమమ్మ
కళకళలాడుతు నీవు కనిపించాలమ్మ
మీ సర్వంబు నే చక్కదిద్దెదనమ్మ
నేనుండగ మీకు దిగులు వద్దమ్మ
అంతయు నా భారమని నీవు నమ్మమ్మ
నను నమ్మిన వారికి చెరపు లేదమ్మ // ఓ నాగులవంచ //


జీవితాంతం నేను నీకు తోడమ్మ
మీరుండగ నేను ఒంటరినిగానమ్మ
నేనడుగు పెట్టినచోట అంతయుమేలమ్మ
నేనున్న ఇంటిలో ప్రతి రోజు పండుగమ్మ// ఓ నాగులవంచ //


కపటము లేనట్టి కరుణామయివమ్మ
అందులకే నే నీకు వశమైతినమ్మ
కోమల నీ హృదయ కోవెల నాదమ్మ
నన్నందులో చక్కగ నిలుపుకోవమ్మ // ఓ నాగులవంచ //

అమూల్య వజ్రము నీ కూతురమ్మ
అందులకే ఆమనిన నాకెంతో ప్రీతమ్మ
నా వాక్కులేనాడు పొల్లుబోవమ్మ
నేను ఏదంటె అది జరిగి తీరునమ్మ // ఓ నాగులవంచ //

అభయమిచ్చి మిమ్ముల ఆదుకొందునమ్మ
మాట ఇస్తే నేను తప్పబోనమ్మ
ఇకనైనా మీరు నన్ను నమ్ముకోరమ్మ
అమ్మ బాబా యనుచు నడచుకోరమ్మ // ఓ నాగులవంచ //

నీ భర్త వసంత నిర్మలుడమ్మ
మోస దోషములెరుగని మంచివాడమ్మ
ఆతని మనసు నీవు గాయ పరుచబోకమ్మ
మీరిద్దరిపుడు నాకాత్మ జ్యోతులమ్మ // ఓ నాగులవంచ //

స్వామి బాబా యనుచు స్మరియించరమ్మ
జై బాబా యనుచు భజియించరమ్మ
నా చల్లని ఆశీస్సులు మీకుండునమ్మ
నా అనుగ్రహము మీకు సదా తోడమ్మ // ఓ నాగులవంచ //

అందరికి నా కవిత అందబోదమ్మ
నను మించిన స్వామి ఇలలో లేడమ్మ
నీ మీద నాకెపుడు అలక లేదమ్మ
నన్ను నన్నుగ నీవు తెలుసుకోవమ్మ // ఓ నాగులవంచ //

జై బాబా

Tuesday, April 27, 2010

బాబా సర్వకేంద్రుల సుజ్ఞానొదయ సర్వాత్మ తత్త్వములు

దివ్యత్వం

1. ఓ ఆత్మవీర లేవర అజ్ఞాన పథము వీడరా
కళ్ళు తెరచి చూడర కైవల్య పథము గాంచరా
దీక్షబూని నిలువర దివ్యుడవై సాగరా
చరాచర విశ్వం లో సర్వకేంద్ర బాబను దర్శించరా

2. సృష్టిలొ అతి శ్రేష్ఠమైనది మానవ జన్మని తెలియర
మానవ జన్మ ప్రాశస్థ్యం మహిని చాటిచూపర
మానవత్వం లోనె మాధవత్వం గలదుర
మాయను లేకుండజేసి మహిని సంచరించర

3. సర్వాత్మజ్ఞాన సాగరుడు సాకారుడాయెర
సర్వశక్తి సంపన్నుని జాడతెలిసి మెలగర
శతకోటి హృదయాలయ వీణమీటి పలుకర
సుజ్ఞాన పరిమళము వెదజల్లి చూపర

4. దేహమనిత్యముర దైవమే సత్యముర
సర్వేశ్వర స్వామిని శరణుజొచ్చి వేడర
పునీత హృదయమె పుష్కర స్నానంబుర
తరచిచూడ యాత్రలన్ని తనలో దర్శించుర

5. ధనబలము జనసంఖ్య దైవత్వం గాదుర
సద్గుణము లేనిజన్మ తృణముకన్న స్వల్పముర
జనన మరణములు రెండు కాలచక్ర గతులుర
కాలచక్ర విధులెరింగి కైవల్యం పొందర //ఓ ఆత్మవీర //

6. బూటక మహిమగోరి బుద్ధి చెడిపోకుర
క్షుద్ర గారడీలనమ్మి భ్రష్టుడవు గాకుర
సజ్జన సాంగత్యంబుతొ సన్మార్గం తెలియర
ఆత్మజ్ఞాన సంపదయే అవనిలోన మిన్నర

7. శవధ్యాసను వీడి నీవు శివతత్త్వం జెందర
చిల్లర భ్రమలను వీడి చిన్మయుడవై వెలుగర
సమరస దృష్టినిగలిగి సౌజన్యం బెంచరా
పరతత్త్వ స్వభావివై ప్రశాంతి నిదురబోవరా

8. కృపణత్వ దోషముతో కుళ్ళి కుళ్ళి పోకుర
కపట చంతనయె నీకు కాలకూట విషముర
కాసులాశ కొరకు నీవు ఆత్మ శక్తి నమ్ముకోకుర
ఆశ్రమ ఆలయ యాత్రల నంగడిగ మార్చకుర

9. హింస దృష్టి విడనాడి పరమ హంసవు గమ్ముర
ప్రకృతి గుణములవీడి పరాత్పరుని దలచర
పామర చింతనలువీడి పరమపితను గొలువర
దీనత్వంవీడి నీవు దివ్యుడవై వెలుగర

10. నేను నేననెటి క్షుద్రహం వీడి మెలగర
అహం బ్రహ్మాస్మియనెటి సాగరములో మునగర
కులమత ప్రాంతీయ పక్షపాత బుద్ధి వీడర
విశ్వమంత ఒకటేనని విజయభేరి చాటర //ఓ ఆత్మవీర //

11. నామ రూప దృశ్య జగతి చలనమయం చూడర
చలనమైన దేదైనా శాశ్వతంబు గాదురా
నిగ్రహ నిమిత్తమే విగ్రహారాధనరా
తన్ను తానెరుగుటయే తత్త్వమసి సారమురా

12. వాచాలత వీడరా అనుష్టించి చెప్పరా
చపలత్వం వీడకనే అచలుడనన బోకురా
సర్వజ్ఞుడ నేనటంచు విర్రవీగ బోకుర
సర్వోన్నత పరిధిలో స్వల్పాంశమె నీవుర

13. ఆత్మజ్ఞాన శూన్యతయే అరాచక పునాదిర
ఆత్మజ్ఞాన తత్త్వమెరుగ అంతయు భగవంతముర
నిన్నుగ సర్వంబుగాంచి నిండుతృప్తి జెందర
విశ్వాత్మ వీర జ్యోతివై వసుధలొ నువు వెలుగర

14. గోదావరి బోవ కుక్క గజముగాదు చూడర
గంగలో ముంచినంత తుంగ తులసి గాదుర
స్థితికుదురని యాత్రలచే లాభమేమి లేదుర
తన్ను తానెరుగుటయె తత్త్వమసి సారముర

15. కలకండ పేరుచెప్ప నోరు తియ్యబడదురా
చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా
గంజాయి పేరువిన్న నిషా నీకు రాదుర
చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదుర //ఓ ఆత్మవీర //

16. మణులయందు సూత్రమువలె మహితాత్ముడు గలడుర
సర్వాత్మ తత్త్వమెరుగ సర్వము తానగునురా
జీవుడనగ ఎవరురా ఈశుడనగ ఎవరురా
జీవ గుణములువీడ జీవుడే ఈశుడుర

17. చిరుతిండ్లు ఎన్నైన భోజనం గాదురా
యాత్రలెన్ని చేసినా ఆత్మతత్త్వం తెలియదుర
చిల్లర సాధనలచే చిన్మయనిష్ఠ చిక్కదుర
స్వనిష్ఠ కుదురకుండ జీవన్ముక్తి లేదుర

18. సాధనలెన్నియైన కర్మకాండలేనుర
కర్మకాండ తతంగం క్రమముగ నరికట్టర
ఆత్మోపాసకుడవై జ్ఞానసిద్ధి నొందర
ఆపై కాండత్రయముల మీరి విశ్వజ్యోతివి గమ్ముర

19. ఆచంద్ర తారార్కం ఆత్మజ్ఞాని నిలుచుర
అజ్ఞానపు జీవితము బందెల దొడ్డేనుర
లోక సిరిసంపదలు శాశ్వతం గావుర
ఆత్మజ్ఞాన సిద్ధిలోనె అంత ఇమిడియున్నదిర

20. కరుణాచల చిత్తమే అరుణాచల దారిర
అరుణాచల దారియే అమరావతి పురముర
అమరావతి పురము జేరి హాయిగ నీవుండర
అమర హాయినందించును అఖిల జగత్ప్రభువుర //ఓ ఆత్మవీర //

21. ఆత్మదృష్టి లోపించిన అపోహలు స్పర్ధలుర
ఆత్మదృష్టి గలిగిచూడ అంతయు ఏకత్వముర
సర్వత్ర నిన్ను నీవు దర్శించ నేర్వర
విశాల దృక్పథము విశ్వమత దర్పిణిర

22. తళుకు బెళుకు సొమ్ములకై తత్తరపడి పోకుర
పలుకున తలపున శ్రీహరి పదములె శరణ్యంబుర
మనో నియంత్రణచే జితేంద్రియుడవు గమ్ముర
అంతర్ స్వర సుప్రబోధ ఆలకించి నిలువర

23. నదులు వేరైనను సాగరంబొకటిర
సొమ్ములు వేరైనను బంగారం ఒకటిర
కుండలు వేరైనను మన్ను మాత్రం ఒకటిర
దారులు వేరైనను దర్శనం ఒకటిర

24. చిత్తశుద్ధిలేని శివపూజలు ఏలరా
బాండశుద్ధిలేని వంటకములు చెడునుర
మూఢ నమ్మకములు వీడి ముక్తిని కాంక్షించర
సదాచార సంపత్తియె సం స్కార శోభరా

25. చింతకు మించిన చితి వేరెలేదని తెలియర
ఆత్మ జ్ఞానమొక్కటే మనోవ్యాధికి మందుర
భయమే ఆపదలకు పుట్టిల్లని తెలియర
నిర్భయమనె డాలుబట్టి వీరగర్జన చేయర //ఓ ఆత్మవీర //

26. దివ్వె నీవు చేపట్టి దివ్వెకై తెరుగనేలర
దేవుడో దేవుడంచు దేవులాడనేలర
తనలోగల బ్రహ్మంబును బయట వెదకనేలర
తన్ను తానెరుంగ తానెపో బ్రహ్మముర

27. కుంకుడు విత్తిన మామిడి ఫలము రాదుర
కర్మానుసారమె జన్మచక్రము నడచుర
యద్భావం తద్భవతని సూత్రమెరుంగర
సూత్రమెరిగి సత్కర్మల విరివిగ చేపట్టర

28. ముందుగ జిహ్వోపస్థల నిగ్రహించి నిలువర
జితేంద్రియ శక్తియే దైవజ్ఞాన సాధనర
బ్రహ్మచర్య భావనయే భువిలో బహుధన్యముర
ప్రపూర్ణ జ్ఞాన సిద్ధునకు సాగరము గోష్పదముర

29. ఆత్మస్థైర్యమును మించిన ఆయుధము లేదుర
అచలాత్మానందమే నీకాలయ దుర్గంబుర
ఆశపాశబద్ధుడవై అజ్ఞానివి గాకుర
ఆత్మజ్ఞాన భానుడవై అవనిలోన వెలుగర

30. ద్వైతదృష్టి వీడరా అద్వైతనిష్ఠ పొందరా
అన్యులెవరు లేరురా అంతయును నీవేరా
జితేంద్రియ శక్తిగలిగి జీవన్ముక్తి పొందర
సర్వధరిత, సర్వసాక్షి స్వామిని కనుగొనర //ఓ ఆత్మవీర //

31. శాస్త్ర పరిజ్ఞానమె సర్వస్వం గాదుర
నీ ఉద్ధారక ప్రభుడవు నేవేనని తెలియర
సత్యమైన మార్గదర్శి తనలోనే గలడుర
అంతర్ముఖ నిష్ఠుడవై ఆత్మసిద్ధి నొందర

32. జగమే ఒక నాటకమని పాత్ర విలువ తెలియర
జగన్నాటక సూత్రధారుని సత్వరమె కనుగొనర
జగదాత్ముడె సకల పాత్ర ధరితుడాయె చూడర
సత్యమెరుగ జీవుడె దైవాంశ సంభూతుడుర

33. బహిర్ దృష్టికి బల్బు వెలుగు స్వల్పముర
అంతర్ముఖ నిష్ఠలో తా విద్యుత్ కేంద్రముర
ఆంతర్యము ఎరిగిచూడ అంతయు భగవంతముర
ప్రతి జలబిందువు సింధు స్వరూపముర

34. విశుద్ధాత్ముడు విశ్వగర్భ తేజుడు
ఘనవీర ప్రభుజ్యోతి గగన శరీరుడు
అనంతానంతుడు అప్రమేయ ఆత్మశక్తి పూర్ణసర్వలక్షణ
సత్పురుషొత్తముడు సర్వేశ్వర స్వామిర

35. గ్రంథ రాసులకు వెనుక జ్ఞానలక్ష్మి గలదుర
పుస్తకాలు తిరగేసిన లాభమేమి లేదుర
మస్తక పరిశోధనయే ముఖ్యమైన సాధనరా
హృదయాలయమె మహా గ్రంథాలయంబుర //ఓ ఆత్మవీర //

36. తిండి ఎట్టిదో త్రేనుపు అట్టిదిరా
మనసును బట్టియే సంకల్పములుండురా
దృష్టిని బట్టియే సృష్టి గోచరించుర
దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మముర

37. కల్లుకుండ నలంకరించిన కంపుబోదు చూడర
అంతరంగ శుద్ధిలేని వేషధారణ అంతేరా
స్థితికుదురనివేషధారి ఇంగువబెట్టిన డబ్బిరా
బాహ్యాభ్యంతర శుచియే బ్రహ్మజ్ఞాని లక్షణముర

38. పామరసుర దుర్గుణములను పారద్రోలి నిలువరా
కులమత ద్వేషాగ్నులను చల్లార్చి చూడర
వర్ణాశ్రమ ధర్మములు ముండ్లకంచె వంటివిర
ముండ్లకంచె దాటిననె మోక్షజ్ఞాన ఫలముర

39. బహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెర
అమూల్య అవకాశము సద్వినియోగ పరుచర
నరుడే నారాయణ స్వరూపుడని తెలియర
నరజన్మ ఘనతను ఈ ధరణి చాటి చూపర

40. జీవులెనుబది నాలుగు లక్షల చావు పుట్టుకలిక్కడ
వారివారి కర్మఫలము అనుభవించేదాక్కడ
అక్కడ ఇక్కడ గాంచిన ఒక్కటే స్థితిర
అక్కడ యని చెప్పడము భయము కోసమేనురా //ఓ ఆత్మవీర //

41. ఈ భూతలమే పెద్ద గరడీ సాలరా
సమస్త ప్రాణులకిది సాధనాలయంబుర
ప్రతి ప్రాణి ఎదిగి ఎదిగి పరమాత్మ గావలెరా
పరమాత్మగ నిలువటమే మానవజన్మ ఘనతర

42. దేవతలు సైతము మానవజన్మ కోరెదరుర
నరజన్మ ద్వారానే ముక్తి సాధ్యమగునుర
మాయను జయించే శక్తి మానవునికే గలదుర
మాముపేత్యులైనపుడే మాయ తొలగిపోవుర

43. శ్రీగంధపు చెట్టు ఎపుడు వేప చింత కాదుర
వేప చింతేనాడు గంధపు వృక్షము గాదుర
వ్యష్టి చింతన మాని వికసించనేర్వరా
విశ్వమనసుతో నీవు ఆలోచించ గలుగర

44. ప్రతి పట మఠ ఘట సర్వస్థల సుస్తిరాత్ముడు స్వామిర
స్వామి సాన్నిధ్యమే సర్వమత శరణాలయంబుర
భిన్నత్వం వీడి నీవు భగవన్మతివై భాసిల్లరా
ఏకత్వం లోనె విశ్వశాంతి గలదని తెలియర

45. మానవ జన్మయే ఒక క్లిష్ట పరీక్షరా
ఈ పరీక్షలో నీవు అగ్రశ్రేణిలో నెగ్గరా
సంస్కార హృదయుడవై సంతృప్తిగ నిలువర
సర్వేశ్వర స్వామి కృపాశ్రీని పొందరా //ఓ ఆత్మవీర //

46. నిన్నుగ ఈ విశ్వమును దర్శించ నేర్వరా
విశ్వరూప ప్రజ్ఞతొ నీవు వికసించవలయురా
విశ్వాత్మ జ్యోతివై వసుధలో వెలుగర
ఇదియే విశ్వగర్భుల అనుగ్రహ రక్షరా

47. తలలు బోడులైనంతనె తలపులుడిగిపోవురా
తలంపులుడగలేని తలబోడుల మేలేమిర
కస్తూరి మృగమువలెను సంచరించబోకుర
తిరిగి తిరిగి చివరకు స్వనిష్టయే ఖాయముర

48. శంకల రాహిత్యుడు సంకట హరణుడు
సర్వేశ్వరులుండగ సందేహమేలర
సర్వార్పిత హృదయుడవై సద్గతిని పొందరా
సర్వేశ్వరులనుగ్రహమె సంపూర్ణ మోక్ష సిద్ధిర

49. చతుర్విధ మహావాక్య విచారణ సలుపర
మమాత్మా సర్వ భూతాంతరాత్మయని తెలియర
కేవలాత్మౌపమ్య భావనిష్టలో నిలువర
ఇంతకు మించిన ఈశ్వరసిద్ధి విశ్వం లో లేదుర

50. అమృతక్షీరము గ్రోలి నీవు ఆనందము చెందరా
ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర
అచలాత్మానందమే అమర సౌఖ్య పదవిర
అమరసౌఖ్య పదవినిచ్చు అఖిలాండ ప్రభువుర //ఓ ఆత్మవీర//

51. చీమునెత్తురు తోలుకొంపల్లోన చిన్నపెద్ద జాతుల్లెవుర
బ్రహ్మాత్మ జ్ఞానియే ఈ భువిలోన ఘనుడురా
హృదయైక్యంగల చోట తర్కం నిలువబోదుర
పరిశుద్ధాత్మ ప్రేమ పరమ నిగూఢమని తెలియర

52, నీవలె ఇతరుల చూచి నిండు తృప్తి చెందరా
నీవై సర్వంబుగాంచి నిశ్శబ్ధుడవు గమ్మురా
నీవు కాని దానిని నీవు పొందలేవురా
నీవైన దానిని ఇక దర్శించనేలరా

53. నిన్ను నీవు ఏనాడు కించపరచుకోకుర
ముందుగ నిన్ను నీవు ఘనతపరచు కొమ్ముర
నేనే దైవాత్మప్రభు వీరజ్యోతినని తెలియర
సర్వాత్మజ్ఞాన సాక్షాత్కారివై నీవు నిలువర

54. భక్తిలేనిపూజ పత్రిచేటని తెలియర
మానసిక పూజకు ఏ ఖర్చులుండ బోవుర
నీ హృదయ మందిరంలో విశ్వేశ్వరుని చూడర
భ్రమర కీటక న్యాయరీత్య భగవన్మతివి గమ్ముర

55. జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర
జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర
అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర
పరమ శివాత్మోహం అనుచు నీ నిజస్థితిని తెలియర //ఓ ఆత్మవీర//

56. గంగకు గొంపోయిన కుక్క గతుకుడు మానదుర
సాగరంలో ముంచినంత ఉల్లి మల్లి గాదుర
ఎంత తెలుపుగున్నను సున్నం అన్నం గాదుర
పై పై నటనలచేత పరతత్త్వం తెలియదుర

57. సుత్తిదెబ్బల కోర్చినపుడె రాయి దేవుడగునుర
కష్టాలకు ఓర్చినపుడె జన్మ ధన్యమగునుర
నీవెలా కాదలంచిన అలాగే అయ్యెదవుర
దయ్యానివి కాగలవో దైవానివి కాగలవో నిర్ణయించుకొమ్ముర

58. మానవత్వం పరిమళించు మంచి మనసుకు స్వాగతం
ప్రేమను వెదజల్ల్య్ హృదయశుద్ధికి స్వాగతం
పావన చరితుడైన పరమ పురుషునకు స్వాగతం
విశ్వాత్మ తేజుడైన ప్రభు వీరజ్యోతికి స్వాగతం

అమ్మ ఔన్నత్యం

59. తొలి దర్శన మిచ్చునది తల్లియని తెలియర
తల్లియే ప్రత్యక్ష దేవతయని కొలువర
అమ్మను మించిన ఆస్తి అవనిలో లేదుర
అమ్మ ఉన్న ఇంటిలో అన్ని ఉండి తీరుర

60. ఆదిశక్తి స్వరూపిణి అమ్మయని తెలియర
అమ్మను అమ్మగ పిలుచు అరహతను పొందరా
అమ్మ అనిన అంగడి బొమ్మ కాదు చూడరా
అమ్మ ఉన్న ఇంటిని మించిన ఆలయం లేదుర //ఓ ఆత్మవీర//

61. ప్రతి స్త్రీలో మాతృత్వం దర్శించ నేర్వరా
అమ్మను అమ్మగ గాంచు కన్నులు ధన్యమురా
అమ్మ రూపు అపురూప సౌందర్య లహరిర
అమ్మ చూపు అఖిలాండశక్తి నిలయముర

62. అమ్మ కృపయే అమృత నైవేద్యము చూడరా
అమ్మ చూపు చల్లని దీవెనల వరమాలర
అమ్మంటే హాయిర అమ్మంటె అల్లా సాయిరా
అమ్మ సాయి కలిపి చూస్తె స్వపరంజ్యొతిర

63. అచలాత్మ స్వరూపిణి అమ్మయని తెలియర
అమ్మకాని దానిని నమ్మబోకు చూడర
అమ్మంటే హాయిర అమ్మంటే అఖిల విశ్వ శక్తిర
అమ్మ శక్తి కలిపి చూస్తె సర్వశక్తి నిలయుడుర

64. అమ్మ కౌగిలి మించిన కైలాసం లేదురా
అమ్మ ఒడిని మించిన దేవునిగుడి లేదుర
అమ్మంటె అంతులేని ఆనంద తృప్తిర
అమ్మంటే పవిత్ర మెహెరాలయమ్ముర //ఓ ఆత్మవీర//


బాధ గురువులు – బోధ గురువులు

65. బాధ గురువుల నాశ్రయించి భంగపడి పోకుర
సద్గురు బోధకుల నమ్మి జన్మ తరియించర
మానవత్వమును మించిన మతములేదని తెలియర
నరుడే నారాయణుడని నానాత్వం వీడర

66. స్వాత్మనిష్ఠ నొందకనే సద్గురునన బోకుర
సద్గురు పదవీ యనిన సామాన్యం గాదుర
ముందుగ నిన్ను నీవు ఉద్ధరించు కొనుముర
ఆపై జగదోద్ధరణకు నడుముకట్టి నిలువర

67. గిలేటునగలే జాతర్ల పాలగునురా
విలువైన వజ్రమెపుడు బీరువాలొ నుండుర
నామకార్ధపు గురువులకు కొదువలేదు చూడర
సత్ శిష్యరత్న శిఖామణి దొరుకుట దుర్లభముర

68. నీలంబర, శ్వేతంబర, కాషాయాంబరములనెటి
గంగిరెద్దు శృంగారాలతో త్రుళ్ళీపడి పోకుర
వేషధారులై తిరిగిన లాభమేమి లేదుర
ముందుగ మనో కషాయముల ప్రక్షాళన చేయర

69. మతియెంతో గతియంతని మరువబోకు చూడర
మతిలేని దుర్మతివై మహికి భారము గాకుర
మృతభావన వీడలేని మతము వ్యర్ధమని తెలియర
అమృత స్వభావివై ఆత్మదేవుని తెలియర

70. మెరిసే ప్రతి వస్తువు బంగారం గాదుర
పైపై మెరుపులగాంచి మోసములో బడకుర
ఉరిమిన ప్రతి మేఘము కురువబోదు చూడర
స్థితి కుదురని వాచాలత అంతేనని తెలియర //ఓ ఆత్మవీర//


సత్ప్రవర్తన

71. జన్మనిచ్చిన తలిదండ్రుల సేవించ నేర్వర
జ్ఞాన నేత్ర గురువులను గౌరవించ వలయుర
పూజ్యక భావంబున పునీతుల పూజించర
పెద్దల ఆశీస్సులెపుడు వ్యర్ధంగావని నమ్మర

72. కన్నవారి కలలను కల్లలు చేయబోకుర
ఎల్లలులేని పరిధిలో శభాష్ అనిపించర
మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ
అనెటి ఆర్య సూక్తులను ఆచరించి చూపర

73. విత్తు ముందా చెట్టు ముందా వాదమేల నీకుర
విత్తు చెట్టులకు ముందు ఏమిగలదొ తెలియర
బొమ్మ బొరుసు కలిసి ఒక నాణెమగును చూడర
ప్రకృతి పురుషుల సం యోగమే సృష్టియని తెలియర

74. ఇతరుల మెప్పుల కొరకు వేచియుండ బోకుర
మెప్పాచారములన్ని మాసిపోవు చూడర
ప్రశంసా పత్రములే ప్రాముఖ్యం గాదుర
ఆత్మసాక్షి దర్పణమే ఆధారము నీకుర

75. హితము చేసినవారికి అభివాదము తెలుపర
ప్రతిఫల మాశించకుండ మేలుచేయ వలయుర
కృతజ్ఞత కలిగి నీవు సంఘములో మెలగర
మనో కాలుష్యరహిత మార్గం పరమార్ధముర //ఓ ఆత్మవీర//

76. కాఠిన్యం వీడరా కారుణ్యం బెంచరా
సాధు సత్తములజేరి సాయుజ్యం బొందర
బంధు మిత్రులనగ వేరె బయటలేరు చూడర
వశీకృత చిత్తమె నీ అసలైన మిత్రముర

77. వేదపరిజ్ఞాన విలువ తెలిసి మెలగనేర్వర
వాద బేధములుమాని హృదయైక్యులు గండిర
ప్రేమించి, సేవించి, ధ్యానించి చూడర
శోధించి, సాధించి, బోధించి నిలువర

78. గడిచిన క్షణము మరల తిరిగి దొరుకబోదుర
వర్తమాన కాలములో వివేకివై మెలగర
రేపు రేపనెటి వాయిదాలు వేయబోకుర
ఈనాడే ఈక్షణమే విజయశ్రీని బొందర

79. చెట్టుపేరు జెప్పినీవు కాయలమ్మబోకుర
ధూర్తబుద్ధి వీడినీవు సవ్యుడవై మెలగర
కపట నాటకము వీడి కీర్తి ధ్వజమెత్తరా
మోసపు బ్రతుకు నీకు మహా నరకమగునురా

80. తనదు హితముగోరు గురువు తిట్టికొట్టవచ్చురా
తల్లి బుగ్గగిల్లి ఉగ్గు త్రాగించును చూడర
మనసుంటే చాలు మార్గం బోధపడునురా
సర్వేశ్వర స్వామిని సంపూర్తిగ నమ్మర //ఓ ఆత్మవీర//

81. క్రమశిక్షణ లేనిబ్రతుకు పాముపడగ నీడర
క్రమశిక్షణ గలిగినీవు ఘనతను సాధించర
నియమనిష్ఠలన్ని నిన్ను చక్కబరచి తీరురా
ఆదర్శ జీవితము అఖిల జగత్పూజ్యముర

82. నూతిలోని కప్పవలెను నీవుండబోకుర
విశ్వవ్యాప్త దృక్పధము గలిగి నీవు మెలగర
మేరు హిమాలయములవలె గంభీరుడవు గమ్ముర
సాగర స్వభావివై సంతుష్టినొందర

83. ఎంతటి వారికి అంతవరకె తెలియునుర
ఎంత చెట్టుకు గాలి అంతేనని తెలియర
సంకుచితత్వం చిన్న నీటిగుంట చూడర
విశాల దృక్పథము సాగర సమానముర

84. నిన్ను నీవుగ దర్శించ నేర్వర
నీవుగాని దానిని నటించబోకుర
శక్తికిమించిన వేషధారణ తగదుర
స్థితికుదురని అనుకరణలు ప్రమాదకరముర //ఓ ఆత్మవీర//

సదాచారం

85. ఆశ్రమములన్నింటిలో గృహస్థాశ్రమము మిన్నర
జ్యేష్ఠ శ్రేష్ఠమైనది గృహస్థాశ్రమంబుర
గృహస్థుల కన్నులేక ఏ ఆశ్రమం ఎదుగదుర
గృహస్థుల బాగుపరుచు బాధ్యత మన అందరిదిర

86. చింతలులేని ఇల్లు శివాలయంబుర
కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియర
ఆదర్శ దంపతులు పార్వతి పరమేశ్వరులుర
నివృత్తరాగస్య గృహం తపోవనముర

87. తప్పులెన్నువారు దండోపతండములుర
ప్రతివారిలో ఏదో దోషముండితీరుర
ముందుగ నిన్ను నీవు సవరించుకొనుముర
నిర్దోషం హి సమం బ్రహ్మయని తెలియర

88. మధుమాంస భక్షణలు మానవత్వ కళంకములుర
సాత్వీకములోనె జన్మ చరితార్థము గలదుర
అన్నపు సూక్ష్మాంశమె మనసని ఎరుంగర
జలపు సూక్ష్మాశమె ప్రాణశక్తిగ చూడర

89. పాత్రమెరిగి దానము క్షేత్రమెరిగి విత్తర
సత్ ప్రవర్తనకు మించిన వ్రతదీక్ష లేదుర
దయకు మించిన ధర్మము ధరణిలో లేదుర
దయగల హృదయమే దైవమందిరంబుర


మంచి మాట

90. మర్యాదను యివ్వర మన్ననలు పొందర
సోమరత్వం వీడి శ్రమనునమ్మి బ్రతుకర
ఖండదృష్టి వీడరా అఖండదృష్టి నింపర
సోహం భావార్చనతో స్వామిపూజ చేయర //ఓ ఆత్మవీర//

91. అడుసు తొక్కనేలరా కాలుగడుగనేలరా
అపరాధము జరిగినపుడు క్షమార్పణ కోరర
జరిగిన పొరపాటు మరల జరుగకుండ చూడర
పశ్చాత్తపమె దోషనివృత్తని నమ్మర

92. ఫని శిరసున మణిగలదని పట్టబోకు చూడర
పట్టబోతె ప్రాణాలు గాలిలోన కలియుర
అప్రయోజకులతో చెలిమి అన్నివిధముల చేటుర
యోగ్యత నెరింగి నీవు సాంగత్యం చేయర

93. దుర్ వ్యసనములకు నీవు బానిసవు గాకుర
దురాలోచనలను దూరముగ నెట్టర
త్రికరణ శుద్ధిగ మంచి నాహ్వానించర
చెడు వినవద్దుర, చెడు కనవద్దుర, చెడు అనవద్దుర

94. వ్యర్ధమైన వాగుడుకు స్వస్తిచెప్పి నిలువర
మాటలు తగ్గించి హృదయాన్ని పెంచర
మిత భాషణలోనే ఘనతగలదు చూడర
మౌనేన కలహం నాస్తియని మరువకుర

95. కర్మ కర్మ అనుచు నీవు కాలక్షేపం చేయకుర
సోమరితనమనెటి సోమకాసురుని వధించర
విధి నిర్వహణలోనె ఈశ్వరత్వం గలదుర
పునీత హృదయమే పూర్ణచంద్ర కాంతిర // ఓ ఆత్మవీర //

96. ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదుర
అక్రమార్జనకు నీవు అర్రులు చాచబోకుర
న్యాయమైన పరిధిలో నీతిగ నీవు బ్రతుకర
మోసపు బ్రతుకు నీకు మహా భారమగునురా

97. ప్రేమకు మించిన పెన్నిధి పుడమిలో లేదుర
సద్బుద్ధి నాశ్రయించి సవ్యుడవు గమ్ముర
కొండెము చెప్పి నీవు కలహములు పెంచకుర
కలుపుగోలు తనమె నీకు విలువైన భూషణముర

98. ప్రతి అక్రమ సంపదకు వెనుక మోసముండి తీరురా
సేకరించిన నల్లధనము హుండీలలొ వేసినంత
క్షమియించే కర్త అక్కడ ఎవరు లేరు చూడర
నీ తృప్తికొరకె యాత్రా తతంగములని తెలియర

99. మూఢమతుల సాంగత్యం మొదటికే ముప్పుర
సజ్జన సాంగత్యము గంగా స్నానం మిన్నర
పదిచ్చి సజ్జన సాంగత్యం కోరర
ఇరువదిచ్చి దుష్ట సాంగత్యం వదలర

100. మంచి మాట మూర్ఖుని చిత్తమునకు ఎక్కదుర
పన్నీరు పందికి ఇంపుగాదు చూడర
గాజుల బేరముతోటి వజ్రమును పోల్చకుర
మిడిమిడి జ్ఞానముతో మిడిసిపడ బోకుర // ఓ ఆత్మవీర //

101. దున్నకుండ విత్తినపుడు కొయ్యకుండ పంటచేరు
శ్రమలేని ఫలవాంచ ఇంతేనని తెలియర
మాటలు కోటలుదాటు కాలు గడప దాటదుర
ప్రగల్భములతోటి ప్రొద్దుబుచ్చ బోకుర

102. అమాయకుల నమ్మించి ఆస్తి కాజేయకుర
దేవుని పేరుజెప్పి దోపిడీలు చేయకుర
ధర్మవర్తన గలిగి ధరణిలో నువు మెలగర
కర్తవ్య పాలనలో ముందంజ వేయర

103. విలువలేని చోట నీవు నిలువబోకు చూడర
గుర్తింపు లేనిచోట అవమానము పొందకుర
కాని చోటు చెరి నీవు కలత చెందబోకుర
ఆత్మాభిమాన మెపుడు చంపుకోవాకుర

104. మనస్ఫూర్తి ఆహ్వానము కాదనబోకుర
అరహతలేని స్థలము శీఘ్రమే వదలర
కొంగల గుంపులోకి హంస చేరతగదుర
నీ నిజస్థితిని ఎప్పుడు కించపరచు కోకుర

105. విదేశీయ పోకడలను విషమువలె త్యజించర
భారతీయ సంస్కృతి భువికాదర్శముర
పరధర్మము నాశ్రయించి పతనపడ బోకుర
స్వధర్మ పరిధిలో సుఖశాంతులు బడయర // ఓ ఆత్మవీర //

106. శివసత్తుల పూనకాలు బూటకములని తెలియర
త్రాగిన మైకము డప్పుల చప్పుల్లావేశము
నరముల బలహీనత వ్యాధియని తెలియర
యదార్ధ దైవత్వం ఊగిసాగదు ఉన్మత్తుగ వాగదుర

107. మిధ్యను విస్మరించి విద్యార్ధివి గమ్మురా
విద్యనేర్చిన వారికి వింతలేదు చూడర
విద్యయే వివేకాలోచనలకు నాందిరా
విద్య నేర్వకున్న బ్రతుకు హీనమై పోవురా

108. బలవంతుడ నేనటంచు కాలుదువ్వబోకుర
చలి చీమల చేజిక్కిన సర్పము గతియగునుర
తాను త్రవ్విన గోతిలో తానే పడిపోవుర
త్రుప్పువలె దుష్కర్మ అంతమొందించుర

109. నీకు తెలిసిన పరిధిలో నీవుండ నేర్వరా
నీకు తెలిసిన జ్ఞానమె సర్వస్వమన బోకుర
అడవిలోని చెట్లన్ని ఒకే తీరు గావుర
అవనిలోని జనుల విషయ మంతేనని తెలియర

110. చీకటింట్ల రాళ్ళురువ్వ చీకటి తొలగిపోదుర
ఇతరుల విమర్శించగానె గొప్పవాడవు గావుర
చిరుదివ్వెను వెలిగించిన చీకటి మాయమగునుర
ఏకాత్మ భావనిష్ఠలో విమర్శలకు తావుండదుర విమర్శలకు // ఓ ఆత్మవీర //

111. ప్రతివారిలో ఏదో దోషముండి తీరుర
మంచి చూచి మంచినే ప్రోత్సహించ వలయుర
సూర్యునకు చీకటి కనిపించ బోదుర
మంచి వారికి అంతట మంచియే కనిపించుర

112. పరుల సొమ్ము కొరకు నీవు ప్రాకులాడ బోకుర
పరుల సొమ్ము పామువంటిదని నీవు తెలియర
మృగతృష్ణ వంటి ఆశలొ నువు బడకుర
ఆత్మజ్ఞాన సిద్ధుడవై అవనిలో సుఖించర

113. గొంగలి యున్నంతలోన కాళ్ళు చాచుకొమ్ముర
ఉన్నదానిలోనె సంతృప్తి చెందనేర్వరా
దుబారా ఖర్చులు తగ్గించి మెలగర
పొదుపుగలిగి మితముగ నీవు జీవించర

114. అనువుగాని చోట నీవు ఘనుడనన బోకుర
తగ్గించుకొని యున్న తప్పేమి లేదుర
దర్పణములో ఆకాశము స్వల్పమే ఐనను
దిగంత నిజస్థితికి ఏ లోటులేదు చూడరా

115. త్యాగమునకు ఉన్న విలువ లోభమునకు లేదురా
నిలువయున్న మురికి గుంట లోభత్వమని తెలియర
ప్రవహించు గంగవంటిది త్యాగగుణమని నమ్మర
పరిత్యాగ హృదయుడవై పరమాత్మసిద్ధి నొందర //ఓ ఆత్మవీర//


116. విషనాగు గరుడపక్షికి అమృత భోజనంబుర
అట్లని నీవు దానిని అనుకరించబోకుర
నీ స్థాయికి మించిన నటన ఏనాడు తగదుర
నీ పరిధిలో నీవుండుటె నిత్య శుభమస్తుర

117. విద్యను మించిన వెలుగు వసుధలో లేదుర
విద్యయే విజ్ఞాన ప్రదాయినియని తెలియర
విద్యచే వినయ క్రమశిక్షణలు అబ్బుర
దైవాత్మ జ్ఞానమొక్కటియే ధరణిలోన మిన్నరా

118. ఆరోగ్యవంతుల యందే శుద్ధ మనసుండునుర
ఆరోగ్య విధులను తు.చ. తప్పబోకుర
యోగ వ్యాయామములచే దృఢ శరీరివి గమ్ముర
ఆరోగ్యమే మహాభాగ్యమని నీవు నమ్మర


మత సామరస్యం

119. మతముల పేరిట మారణ హోమము తలపెట్టకుర
మతకర్తల పేరును మంటగలుప బోకుర
తృప్తికి మించిన ముక్తి జగతిలో లేదుర
సర్దుబాటు గలిగి నీవు బ్రతుకుబాట సాగర

120. సమ్మతిలేని మతములతో సతమతమై పోకురా
మతి మార్పు ముఖ్యం గని మత మార్పు గాదుర
మతములెన్ని పుచ్చుకున్న మనో నిలుకడ లేదుర
దైవమతము చేపట్టి ధరణిలో నువు వెలుగర

121. మనుష్యుల విడదీయునది మతముగాదని చెప్పరా
మనుష్యుల మధ్య కులమత అడ్డుగోడలు వద్దుర
హృదయాలను కలుపునది విశ్వమత జ్యోతిర
విశ్వమును తనలో దర్శించునదే దైవమత ప్రతిభర // ఓ ఆత్మవీర //

Monday, April 19, 2010

బాబా సర్వకేంద్రుల సర్వావతార రూప వివరణ

పరమాణువునుండి పరమేశ్వర పర్యంతం బాబా అవతారమే. సకల ప్రాణుల,
సమస్త యుగావతారుల రూపములలో బాబా జీవించి వుండును. తనకు చెందని
అవతారము లేదు. కాబట్టి సర్వమతారాధ్య స్తోత్ర గానము చేయండి.

1. త్రిపుర హరీశుడు సర్వశరణ్యుడు సాకారుడై వెలసెను
స్వామి సాకారుడై నిలిచెను బాబా సాకారుడై వచ్చెను
2. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సాకారుడై వెలసెను
3. సర్వమతారాధ్య సర్వావతారుడు సాకారుడై వెలసెను.
4. విశ్వశరణ్య స్వపరంజ్యోతి సాకారుడై వెలసెను
5. సర్వాత్మబంధు సర్వకేంద్రుడు సాకారుడై వెలసెను
6. సమస్త యుగముల రక్షక ప్రభువు సాకారుడై వెలసెను స్వామి సాకారుడై వెలసెను
7. సర్వాంతర్యామి సర్వధరితుడు సాకారుడై వెలసెను
8. సూరి సర్వజ్ఞస్తోత్రుడు సర్వాత్మపూర్ణుడు సాకారుడై వెలసెను
9. సర్వాత్మతేజుడు సర్వోన్నతుడు సాకారుడై వెలసెను
10. కాండత్రయాతీతుడు కైవల్యధాముడు సాకారుడై వెలసెను
11. సర్వస్వరూపుడు సర్వాకారుడు సాకారుడై వెలసెను
12. సర్వస్థలవాసి సర్వాతీతుడు సాకారుడై వెలసెను
13. సర్వశక్తినిలయ సర్వస్థలవాసి సాకారుడై వెలసెను
14. నిర్మలాత్ముడు నిర్వాణ నిలయుడు సాకారుడై వెలసెను
15. సర్వాధిస్థాన స్వత:స్సిద్దుడు సాకారుడై వెలసెను
16. సర్వలోకశరణ్య విశ్వగర్భుడు సాకారుడై వెలసెను
17. తేజస్తేజుడుచిద్గగన శరీరుడు సాకారుడై వెలసెను
18. అక్షరరూపుడు అచలామృతుడు సాకారుడై వెలసెను
19.. పుండరీకాక్షుడు పురుషోత్తముడు సాకారుడై వెలసెను
20. అవదూత ఆదిగురు దత్తాత్రేయుడు సాకారుడై వెలసెను
21. షిరిడి క్షేత్రవాసి సాయిబాబా సాకారుడై వెలసెను
22. పరమపావనుడు ప్రశాంతినిలయుడు సాకారుడై వెలసెను
23. శ్రీచక్రనిలయ శ్రీనివాసుడు సాకారుడై వెలసెను
24. యాదగిరిక్షేత్ర లక్ష్మీరమణుడు సాకారుడై వెలసెను
25. శబరిగిరివాసుడు జ్యోతిస్వరూపుడు స్వామి అయ్యప్ప సాకారుడై వెలసెను
26. కాలకాళుడు కాలాతీతుడు సాకారుడై వెలసెను
27. సృష్ట్యాతీతుడు దృక్స్వరూపుడు సాకారుడై వెలసెను
28. ఆద్యంతపూర్ణుడు అవ్యక్తభాసుడు సాకారుడై వెలసెను
29. ఆద్యంతరహితుడు అప్రమేయుడు సాకారుడై వెలసెను
30. అచలప్రదీప్తుడు అమృతహృదయుడు సాకారుడై వెలసెను
31. వేదపూజ్యుడు అనంతశయనుడు సాకారుడై వెలసెను
32. సద్ధర్మతేజుడు సత్యస్వరూపుడు సాకారుడై వెలసెను
33. ద్వైతమత స్థాపక మధ్వాచార్యుడు సాకారుడై వెలసెను
34. విశిష్టాద్వైత రామానుజచార్య సాకారుడై వెలసెను

35. అద్వైత వేదాంత ఆదిశంకరుడు సాకారుడై వెలసెను
36. అయోధ్యపురవాసి రఘురామచంద్రుడు సాకారుడై వెలసెను
37. ద్వారకనిలయ జనార్ధనకృష్ణుడు సాకారుడై వెలసెను
38. భ్రమరాంబసహిత శ్రీశైలమల్లన్న సాకారుడై వెలసెను
39. శ్రీమదచల పరిపూర్ణ శివరామదీక్షితుడు సాకారుడై వెలసెను
40. ఆత్మాభిషిక్త విశ్వరక్షక యెహోవాప్రభువు సాకారుడై వెలసెను
41 సత్య శివ సుందర శాంతి స్వరూపుడు సాకారుడై వెలసెను
42. అచ్యుతీశహరి అల్లాప్రభువు సాకారుడై వెలసెను
43. మహనీయచరితుడు మహమ్మద్ ప్రవక్త సాకారుడై వెలసెను
44. కరుణామయుడు ఏసునాధుడు సాకారుడై వెలసెను
45. సమస్తదివ్య సత్పురుషతేజుడు సాకారుడై వెలసెను
46. సత్యసాధువు గురునానక్ స్వామి సాకారుడై వెలసెను
47. మంత్రాలయవాసి రాఘవేంద్రుడు సాకారుడై వెలసెను
48. యుగావతారుడు మెహెర్ బాబా సాకారుడై వెలసెను
49. అత్యాశ్రయి అరుణాచలరమణుడు సాకారుడై వెలసెను
50. విశాలహృదయుడు వ్యాసమహర్షి సాకారుడై వెలసెను
51. స్వపరాదిశక్తి విశ్వలయమాత సాకారుడై వెలసెను
52. సత్యసద్గురు సాంధీప మహాముని సాకారుడై వెలసెను
53. విశిష్ఠవేదాంతి వసిష్టమహర్షి సాకారుడై వెలసెను
54. మృత్యుంజయుడు మార్కండేయుడు సాకారుడై వెలసెను
55. భగవన్మతుడు భక్తకబీరు సాకారుడై వెలసెను
56. ప్రజ్ఞాచక్షు దండివిరజానంద సాకారుడై వెలసెను
57. విజ్ఞాన నిలయుడు వివేకానందుడు సాకారుడై వెలసెను
58. పరవశవేదాంతి రామతీర్థుడు సాకారుడై వెలసెను
59. తీర్థంకరుడు మహావీరజినుడు సాకారుడై వెలసెను
60. బోదిసత్వ నిర్వాణబుద్ధుడు సాకారుడై వెలసెను
61. స్వనిష్టనొందిన యుత్కృష్ట యోగీంద్రుడు సాకారుడై వెలసెను
62. స్వయంభు స్వతస్సిద్ధుడు పరాత్పరమ అత్యాశ్రమనిలయుడు సాకారుడై వెలసెను
63. శిష్యులపాలిట శరణాలయుడు భక్తులపాలిట కల్పవల్లి సాకారుడై వెలసెను
64. సర్వమత సమన్వయమూర్తి పరమహంస రామకృష్ణుడు సాకారుడై వెలసెను
65. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుడు సాకారుడై వెలసెను
66. తత్వశాస్త్రవేత్త గ్రీకు సోక్రటీసు సాకారుడై వెలసెను
67. విశ్వకవిచంద్రుడు రవీంద్రనాథుడు సాకారుడై వెలసెను
68. ఆత్మదర్శనశీలి అతిమానస అరవిందయోగి సాకారుడై వెలసెను
69. భారత స్వాతంత్ర్య ప్రదాత గాంధీమహాత్ముడు సాకారుడై వెలసెను
70. బ్రహ్మీభూత అసంగానందుడు మలయాళమహర్షి సాకారుడై వెలసెను
71. దివ్యజీవనజ్యోతి శివానందసరస్వతి సాకారుడై వెలసెను
72. ఆర్యసమాజ స్థాపక దయానందసరస్వతి సాకారుడై వెలసెను
73. పూరిజగన్నాధ పరమేశ్వరుడు సాకారుడై వెలసెను
74. కైలాసవాసుడు కైవల్యధరితుడు సాకారుడై వెలసెను
75. గోప్యాతిగోప్యుడు గోవిందనిలయుడు సాకారుడై వెలసెను
76. మహిమాన్వితుడు ఆదిమహావిష్ణువు సాకారుడై వెలసెను
77. దయాసాగర పరతత్వతేజుడు పరమశివుడు సాకారుడై వెలసెను
78. సర్వసుభద్రుడు సర్వోన్నతుడు సాకారుడై వెలసెను
79. విఘ్నవినాశక గణపతి పప్పా సాకారుడై వెలసెను
80. సర్వాంతరంగుడు సత్యనారాయణుడు సాకారుడై వెలసెను
81. సృష్టి, స్థితి, లయాతీతుడు సాకారుడై వెలసెను
82. శశి సూర్యనేత్రుడు విశ్వస్వరూపుడు సాకారుడై వెలసెను
83. విశ్వవిభూతిర్మయ విధిసూత్రధారి సాకారుడై వెలసెను
84. సిద్దులగిరివాసి సిద్ధేశ్వరుడు సాకారుడై వెలసెను
85. పర్వతగుహలో వెలసిన పాలకుర్తి సోమన్న సాకారుడై వెలసెను
86. గుహ్యద్గుహ్యుడు గుణాతీతుడు సాకారుడై వెలసెను
87. నిరాడంబరుడు నిరుపేదల స్వామి సాకారుడై వెలసెను
88. సకల మఠాశ్రమాలయ నిలయుడు సాకారుడై వెలసెను
89. కామినీ కాంచన కీర్తిప్రతిష్టల నొల్లని స్వామి సాకారుడై వెలసెను
90. విశ్వగర్భుడు విశుద్ధనిలయుడు సాకారుడై వెలసెను
91. సరస్వతీగర్భుడు చదువుల తల్లి సాకారుడై వెలసెను
92. వేదాతీతుడు పేదపూజ్యుడు సాకారుడై వెలసెను
93. సకల ధర్మశాస్త్ర సారముదెలిపిన స్వామి సాకారుడై వెలసెను
94. సకల పురాణముల పుక్కిట బిగించిన స్వామి సాకారుడై వెలసెను
95. సకల ప్రాణికోటి సమరక్షక ప్రభువు సాకారుడై వెలసెను
96. సర్వశక్తిమయుడు సర్వకేంద్ర బాబా సాకారుడై వెలసెను
97. సర్వలయయానుడు సర్వాతీతుడు సాకారుడై వెలసెను
98. ఆద్యంతరహితుడు అమరస్వరూపుడు సాకారుడై వెలసెను
99. సర్వావతారుడు సాక్షాత్తు దేవుడు సాకారుడై వెలసెను
100. భవరోగ నివారక బాబా సర్వకేంద్రులు సాకారుడై వెలసెను