Tuesday, June 19, 2007

లోకం పోకడ

ఇస్టమైన పనిని ఇంపుగా యొనరించు
కస్టతర కార్యంబు కాలరాయు
ఇస్టకస్టములను సమముగా నెంచుటే
తెలియ జ్ఞాన సిద్ధికి పరమ గురుతు

కాని పనులజేసి కపట మార్గంబున
తప్పించుకొన జూచు తెలివిమీరి
ప్రకృతి పగబట్టి పగదీర్చుకొంటది
తరచి చూడ నాగుబాము పగిది

అమ్మవలన బుట్టి అమ్మవలన బెరిగి
ఆలి వచ్చిన క్షణమె అమ్మ చేదాయెను
ముందు చెవులకన్న వెనుక కొమ్ములు వాడన్నట్లు
లోకరీతిని పరికింప సత్యమిలను

ఎదుటి వానియొక్క ఎదుగుదలను జూసి
కడుపునిండ విషము నింపుకొనియు
మనసులోన పెక్కు కుతంత్రాలు బన్నియు
మాటలోన మిగుల ప్రేమొలుకబోతురు

ఉన్నమాట జెప్ప ఉరిమురిమి జూతురు
కల్ల మాటలు జెప్ప ఉల్లముప్పొంగును
కపటవర్తన చేత కార్యంబు దీతురు
కలియుగాన జనులు కస్టాల కోర్వలేక

పాంచభౌతిక దేహ పరిధిగానక నరులు
జల్సాలెన్నొజేసి షోకులెన్నొ వేసి
పుట్టి పెరిగినదిలను అనుభవించుట కంటు
శుష్క వేదాంతంబు తెగజెప్పుచుందురు

పరులు జూచుటకొరకు పట్టెమంచము పరుపు
పవళించు సమయాన కటికనేలయె గతి
మాయ జబ్బులు వచ్చి మంచము కరువాయె
జనుల మార్చనెంచ నెవరి తరము !

కలిసియొచ్చు వేళ కలిపి వర్తకంబు
నస్టమొచ్చు వేళ నక్కియుండు
కలిమిలేములందు సమముగా నుండుటే
పొత్తు వ్యాపారంబు పొసగు నిలను

కాంతనడ్డుబెట్టి కానిచ్చుదురు పనులు
ధనముతోడను జరుగు ధరణిలోన పనులు
మందు విందులతోడ పనులెల్లదీతురు
పొగడినంతనె జనులు పడిపోవుచుందురు

తమ సొమ్మనగానె తెగ పొదుపుజేతురు
మంది సొమ్ముగాంచ మంచినీళ్ళ పగిది
స్వపర భేదములేక వర్తించు వారలే
మానవోత్తములని మహిని తెలియవలయు


అస్టకస్టాలతోడ అవమానాలెన్నొ బొంది
ఆత్మీయులు కలువగనే అమిత ఆనందముతో
కడుపులోని కాదారము కక్కివేయుదురు జనులు
మనో ప్రశాంతతను బొంది ఊరడింతురు నరులు

చెప్పునంతసేపు తెగ ఊపుదురు తలలు
వినయ విధేయతలు విరివిగ ప్రదర్శింతురు
బయటకు జనగానె దులిపేసుకుందురు
లోకరీతిని గాంచ సత్యమిలను !

మంచి మాటలు జెప్ప మాటాడకుందురు
చెడ్డమాటలంటె చెవిగోసుకొందురు
పరుల దోషమునెంచి బరగ దూషింతురు
మనసు మర్మము దెలియని మనుజులిలను

ఇల్లు ఒళ్ళు రెంటి గుళ్ళ జేయునట్టి
మద్యపానంబును మానలేక జనులు
సంఘములో బహు చులకనైపోదురు
క్షణిక సుఖము కొరకు ప్రాకులాడిన నరులు

కలిగియున్న వేళ కలతలెప్పుడు రావు
సన్నగిల్లు వేళ సణుగుడు మొదలౌను
కలిమి లేములందు సమముగా నుండుటే
సంఘ జీవికెపుడు సరియైన మార్గంబు

చదువు రానివాని చులకనగ జూతురు
చదువుకొనగ మిగుల సౌఖ్యమబ్బు
చదువు విలువ దెలుప నెవరికి శక్యంబు
చదువు వలన జన్మ సార్ధకంబు

ఇస్టపడి చదివితేనె అబ్బుతుంది చదువిలలో
కస్టపడి చదివినచో కడకు బాధలే మిగులును
పరుల కొరకు పఠియింప ఫలితమెపుడు రాదింక
పట్టుదలతో చదివినంత ఫలితం ఆకాశమంత

ఆలోచనలు మాని ఆచరణలో నిలుచుటే
సకల సమస్యలకు పరిష్కారమౌను పరికింప
అభీష్ట కార్యములందు అత్యధిక కృషి సలుపుటే
కార్యసాధనకు చక్కటి మార్గమగును మహిలో

మహిని మనుజుల యొక్క భవిష్యత్తు నూహించ
కర్మవీరుని కరమందున స్పష్టంగా కనిపించగ
కర్మయోగము యొక్క మర్మంబు దెలియక
జ్యోతిష్కునకు తమ చేతులందింతురు !

నీతులెన్నొ జెప్పి గోతులెన్నొ త్రవ్వి
ప్రత్యక్షమందున ప్రశంసింతురు జనులు
పరోక్షమందున బరగ దూషింతురు
కపట వర్తన చేత మానసమున

ఆదర్శములు చెప్పుటకు అందముగ నుండును
ఆచరణలో మిగుల కస్టముగ తోచును
మాటలకు చేతలకు వ్యత్యాసముండిన
ఇలలొ మనిషి మాటకు విలువ సున్న
ధనము బలము గలుగ పామరపు జనులు
పండితోత్తములను బహు నీచముగ జూతురు
ధనము బలములలోనె సర్వంబు గాంతురు
లెక్కలేని పాడు పనులెన్నొ జేతురు

ధనరాసులను జూసి తెగ మురిసిపోదురు
మనో నియంత్రణను అసలు పాటించరెపుడు
పునాదులు లేనట్టి భవనంబు చందాన
సద్గుణంబులు లేని సంపాదనటులౌను

బ్రతికి యున్నవేళ పలుకరించని వారు
శవము గాంచినంత తెగ ప్రశంసింతురు
రక్త సంబంధులు బంధు మిత్రులెల్ల
శవము చుట్టుజేరి శోకాలు దీతురు

పరిణయంబులకేమొ ఫంక్షను హాలులు
ఫలహారముల జూడ పదుల సంఖ్యలొ నుండు
లెక్కలేని పెక్కు భోజన పదార్ధాలు
అర్థ భాగము మిగుల వ్యర్ధమైపోవును

శీలమొక్కటె స్త్రీలకాభరణమై యుండగా
మెడనిండ నగలేసి తెగ మురిసిపోదురు
పట్టుచీరల కొరకు పరుగులే దీతురు
ఆందచందాలకధిక ప్రాధాన్యమిత్తురు

యవ్వనంబున యున్న ఆడపిల్లల గాంచి
మాయమాటలు జెప్పి వశపరచుకొందురు
జ్ఞానేంద్రియంబుల జాడదెలియని వనితలు
మగవారి మాటలకు పడిపోవుచుందురు

తా చేయుచున్నది తప్పని తెలిసియు
మాయ బన్నిన వలలొ మనసు జిక్కుకొనగ
తరచు జేయుచునుంద్రు తప్పులెన్నొ జనులు
మానసిక శాస్త్రంబు మధియించి చూడగా

కార్యముండు వేళ కాకాలు బాకాలు
అమిత వినయముతోడ కార్యంబు దీతురు
పనిజరిగినంతనే పలుకరించరు జనులు
లోకరీతిని మార్చ నెవరి తరము !

ఉన్నదానిని మరచి లేనిదానికి వగచి
మానసంబునందు మరి మరి తలపోసి
రక్తమును మరిగించి క్లేశమును బొందగా
మాయ జబ్బులు వచ్చు మానళికి ఇలలొ

చూచి నేర్చువాడు బహు ఉత్తముండిలను
చెప్పనడచు వాడు మధ్యముండు
చెప్పినను వినకుండ చెడిపోవు మూర్ఖుండు
మందభాగ్యుని మార్చ నెవరికి శక్యంబు

పొద్దుపొడిచినదాది పరమ బిజియందురు
ధన సంపాదనందు తెగ మునిగి తేలుచు
కనురెప్ప పాటున కాళుడు మింగునని
అసలు విషయంబు దెలియక అల్లాడుచుందురు
పరుగెత్తైనా పాలు తాగమంటుందీ లోకం
ఎంత సంపాదించినా అంతులేని ధన దాహం
పప పుణ్యాలకు స్ఠానమేలేదు లేషం
సరిదిద్దుకోకపోతె మానవ మనుగడకే దోషం

సుఖ సౌకర్యములకు బహు వ్యత్యాసముండును
భొగ భాగ్యములందు సుఖముగలదని తలతురు
ఆత్మతత్త్వమెరుగ విచారణ సలుపరు
జ్ఞాన తృష్ణలేని తామస మనస్కులు

పరుల సహాయం కోసం ఎదురుచూడబోకురా
ఒకటి పొందావంటే వందిచ్చుకోవాలిరా
తుంటవేసి మొద్దు అందుకొన్న చందానరా
ఆత్మ విశ్వాసంతో అవనిలో చరించరా !

మనిషి చూచుటకేమొ అందముగనుండును
మాటలేమొ మంచి వరహాల మూటలు
అనంతరంగమందు అపసవ్య భావనలు
కపట మనస్కుని ప్రవర్తన యిటులుండు

గొప్పదనముల పిచ్చి తుచ్చమై యుండగా
బంధువర్గమందు బహు ప్రదర్శింతురు
వంద సంఖ్యలొనుండు బంధు ఖ్యాతికన్న
ఆత్మజ్ఞానమబ్బ విశ్వ ఖ్యాతిని బొందు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home