జీవుడే దేవుడు
దేవుడో దేవుడంచు దేవులాడనేలరా
నిన్ను నీవు తెలుసుకుంటె నీవే దైవంబురా
మూఢ నమ్మకాల జిక్కి వ్యసనాలకు బానిసవై
నిరక్షరాస్యత కోరలలో నిర్జీవిగ మారినావు
కోర్కెలీడేరునంచు ముడుపులెన్నొ గట్టినావు
లెక్కలేని దేవుళ్ళకు మొక్కులెన్నొ మొక్కినావు
నిజతత్త్వం గానలేక మొక్కులెన్నొ మొక్కినావు
కాలసర్ప కోరలలో బందీగా జిక్కినావు
గొర్రెదాటు ఆచారాలు గొప్పగ పాటించి నీవు
అజ్ఞానపు మంటలలో మిడుతవోలె మాడినావు
మారెమ్మల మైసమ్మల మంత్రాలలొ జిక్కి నీవు
చేతబడులంటు నీవు చాదస్తం బెంచినావు
గుడులు గోపురాలంటూ వీధులన్ని దిరిగినావు
గుండెలోని దైవాన్ని గాంచలేకపొయి నీవు
తీర్థ యాత్రలెన్నొజేసి తిప్పలబడి పోయినావు
పుష్కర స్నానంబుజేసి పుణ్యమాశించినావు
గుడిలోని ప్రతిమనుగని చెంపలు వాయించినావు
చెయ్యని తప్పుకు నీవు శిక్ష ననుభవించినావు
కర్మమర్మం దెలియక నువు కంప్యూటర్ జాతకంతొ
భవిష్యత్తు నిర్ణయించి భంగపడి పోయినావు
నీవే దైవంబన్న నిజతత్త్వం దెలియలేక
కస్తూరి మృగంవోలె కారడవుల దిరిగినావు
జీవెభ్రమలొ జిక్కి నీవు దైవత్వం మరచినావు
ద్వైత భావంబుతోడ దేహంబని భ్రమసినావు
జగన్నాటకంబులోన ప్రేక్షకునిగ మిగిలిఓక
చక్కనైన పాత్ర తోడ శాశ్వతంగ నిలిచిపో
అజ్ఞానం తరిమికొట్టి ఆత్మసిద్ది పొంది నీవు
ఆనందపు టనుభూతుల నిత్యం మది నింపుకో
దీనత్వం వీడి నీవు దైవత్వం వైపు నడచి
నీలొగల దివ్యత్వం నిండుగ ప్రకటించుకో!
- నాగులవంచ వసంత రావు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home