Thursday, June 14, 2007

జీవ కారుణ్యం

నూకలెన్నొ జల్లి అమిత ప్రేమగ బెంచి
బిలబిలమని తిరిగె కోడిపిల్లల గాంచి
ఉల్లమందు మిగుల సంతసంబును బొంది
పెరిగి పెద్దవగానె పట్టికోతురు జనులు !

శాంతి ప్రేమలకు చిరునామాలుగా యున్న
పక్షి కపోతమును పట్టుకొనుటకు నరులు
ఉచ్చులెన్నొబన్ని ఉపాయముతో బట్టి
లేశమైన మదిలొ ప్రేమలేక భొంచేతురు !

చూడముచ్చటైన కుందేలు పిల్లల దెచ్చి
యింటిముందు మిగుల యిష్టపూర్తిగ బెంచి
బుల్లి పాపలతోటి బహుళ క్రీడలు జరిపి
పైసలాశ కొరకు ప్రాణాలు దీతురు !

ఆకులలములు బెట్టి అడివంతయు దిప్పి
గొఱ్రె మేకలవంటి జంతువులెన్నొ బెంచి
పెరిగిబలువగానె కటికవానికి యమ్మి
సొమ్ముజేసుకొనగ తెగ మురిసిపోదురు !

లేడి జింక వంటి వన్య ప్రాణులెన్నొ
అందచందాలొలుకు వయ్యారపు నడకలతొ
వన సంపదలకే వన్నె తెచ్చువేళ
వేటగాళ్ళు వెళ్ళి వధియింప జూతురు !

పుట్టి పెరిగినదాది ముసలితనమ వరకు
లెక్కలేని పెక్కు పనులెన్నొ జేయించి
పాలు పెరుగులెన్నొ దండిగారగించి
వట్టిపోయిన క్షణమె వధశాల కిత్తురు !

కటిక వానియొద్ద కరవాలమును జూసి
“మే మే అంబా” యనుచు జాలి చూపులతోడ
తమ్ము వధియింప వద్దని మూగ భాషన పలుక
మూగ జీవుల జంప మనసెట్ల ఒప్పునో !

శాకాహారమందు సకల పోషక పదార్ధములుండగా
మాంస ముద్దలు మింగ మాయ జబ్బులు వచ్చె
ఆరోగ్య రీతియు శాకాహారమె మేలు
అరయ జనులు ఆరొగ్య సూత్రమెరుగ

గాంధీ మహాత్ముడు నుడివిన సత్యాహింసలు
గౌతమ బుద్ధుడు వచించిన జీవ కారుణ్యము
జీసస్ క్రైస్తు చెప్పిన కరుణారస హృదయము
నేడు ఆచరణ శూన్యమై గంగపాలైనాయి !

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home