Friday, January 11, 2008

4. ధ్యానమండలి

భారతావని వేదభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు. ఈ భూమిపై జన్మించడమే మహాభాగ్యంగా భావించేవాళ్ళు కోకొల్లలు. విదేశీయులు సైతం భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించారు. “భారతదేశంలో క్రిమిగా పుట్టినా నా జన్మ ధన్యమైనట్లే”నని ప్రకటించారు మాక్స్ ముల్లర్ మహాశయుడు. కారణజన్ములు కొందరైతే, కష్టాల కడలిలో కాకలు తీరిన యోధులు మరికొందరు.

మనిషి అజ్ఞానంలో ఉన్నతకాలం పరిమిత తత్త్వంతో ఆలోచించ డంవల్ల స్వల్ప విషయాలకే ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ స్వల్పానందమే, విషయ సుఖమే శాశ్వతం, సర్వస్వంగా భావించి దాని కోల్పోయినప్పుడు దుఖి:స్తూ ఉంటాడు. అదే వ్యక్తి కాలక్రమేణ ఒక సమస్య ద్వారానో, సంఘటన ద్వారానో సత్యాన్ని గ్రహించి, ఆచరించి, అనుభూతి చెందాక దాని మాధుర్యాన్ని పదిమందికి పంచకుండా ఉండలేకపోతాడు. తనలాగే ప్రపంచమంతా బ్రహ్మానందాన్ని అనుభవించాలని తహతహలాడతాడు. ఆ మార్గంలో ప్రజలను ఉత్తేజితులను చేయాలని ఉవ్విళ్ళూరుతాడు. సత్య సందేశాన్ని సమగ్రము గా, సంపూర్ణముగా సకల జనావళికి చేరవేసేదాకా నిద్ర పట్టదు. ఎందుకంటే జ్ఞానం తెలిసినవారిది విశ్వప్రేమ. ఈర్ష్యా ద్వేషాలు, ఉచ్చనీచాలు, తరతమబేధాలు, కుల, మత, వర్ణ, లింగ బేధంలేక, దేశ, కాల పరిమితులు లేని అవ్యాజ ప్రేమ. ఈ కోవలో చేరినవారే పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారు.

యోగ అనేది ఆధ్యాత్మిక జీవన విధానానికి శాస్త్రయుక్తమైన రూపకల్పన. ఆధ్యాత్మికతను అంతర్జాతీయంగా, విప్లవాత్మకంగా ప్రచారంచేసి ప్రస్తుత ప్రపంచాన్ని సంక్షోభం నుండి విడుదల చేయాలనే సదుద్దేశ్యంతో 1998 లో విజయవాడను ప్రధాన కేంద్రంగా చేసుకొని “ధ్యానమండలి” సంస్తను పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారి ఆధ్వర్యంలో స్ధాపించడం జరిగింది. అందుకు అనుగుణంగా వివిధ శిక్షణా కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ శిక్షణలలో అత్యంత విలువైన సమాచారంతోపాటు యోగాసనములు, సూర్య నమస్కారములు, ప్రాణా యామము, ఆక్యుప్రెజర్, అగ్నిహోత్రం, భజనలు, మంత్రాలు, శ్లోకాలు, విలువైన ప్రవచనములతో పాటు సమాధి అభ్యాసాన్ని, ధ్యానంలను కూడా అందిస్తున్నారు.

ఢ్యానమండలిని స్ధాపించడంలో గల ముఖ్య ఉద్దేశ్యమే మిటో పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారి మాటల్లో తెలుసుకొందాం. “నేను యోగాలొకి ప్రవేశించకముందు రుగ్మతలతో బాధపడుతూ నిరంతరం అశాంతితో ఉండేవాడిని. ఆర్ధికముగా ఎటువంటి లోటు లేనప్పటికి అంతరంగం మాత్రం బలహీనముగా ఉండేది. నేను జీవితాన్ని ఒక కోణములో మాత్రమే చూసాను. ప్రస్తుతం మేధావి వర్గం ఏవిధంగా ఆలోచిస్తుందో ఆనాడు నా ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. ఆనాడు నేననుభవించిన బాధలనన్నిటినీ ప్రస్తుత మేధావి వర్గం అనుభవిస్తూనే ఉంది. అటువంటి మేధావులందరినీ భౌతికవాదం మత్తునుండి విడుదలగావించి సమతుల్యంతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని స్ధాపించాలనే ఉద్దేశ్యంతో ధ్యాన మందలిని స్ధాపించడం జరిగింది. పైగా ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది కాబట్టి దానిని రక్షించడం నా విధి, కర్తవ్యం అనే భావన కలిగి ధ్యానమండలికి అంకురార్పణ గావించడం జరిగింది.

గురువులను తయారుచేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో గురూజీగారి మాటల్లో తెలుసుకుందాం. “నేను 1991 లో యోగాలోకి ప్రవేశించిన తర్వాత ప్రారంభములో కొన్ని ఇబ్బందులు పడినప్పటికి 1996 సం. వచ్చేసరికే సాధనలో పట్టుదొర్కింది. శారీరక, మాన సిక స్వస్ధత చేకూరింది. తల్లిదండ్రులద్వారా జీనుల లోపంవల్ల బిడ్డలకు సంక్రమించిన వ్యాధులకు వైద్యరంగంలో ఎటువంటి నివారణ లేదు. కాని యోగద్వారా అది సాధ్యమవుతుంది అనేదే నాకు అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. నాలాగా ఎందరో మేధావులు అంతుచిక్కని రుగ్మతలతో బాధపడడమేగాక, భౌతికవాదం మత్తులో ఇరుక్కుని పతనమవుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతను అంతర్జాతీయంగా, విప్లవాత్మకంగా ప్రవేశపెట్టాలనే తలంపుతో 1998 లో ధ్యానమండలికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఐతే ప్రపంచం అనంతం, నా జీవితం అల్పం. కాబట్టి అది ఒక వ్యక్తిద్వారా సాధ్యంకాదు. ఆందువలన సుశిక్షితులైన గురువులను తయారుచేసి సంఘటితంగా దానిని ప్రచారం చేయాలనే భావనతో ఆ కార్యక్ర మాన్ని చేపట్టడం జరిగింది. 'ఒక వ్యక్తి ఎదగడంకాదు, సమాజం ఎదగాలి’ అనే ఆశయంతోనే ఆ కార్యక్రమం మొదలైంది. మా గురువుల గురుకుల శిక్షణ దశలవారీగా జరుగుతుంది. రోజుకు 18 గంటల చొప్పున ఏకధాటిగా సాధన ఉంటుంది.ఒక గురువు పరిపూర్ణ మైనదశకు చేరాలంటే కనీసం ఒక సం. పడుతుంది. ఒక టీంగా లేకపోతే ధ్యానమండలి ఇంతగా విస్తరించేది కాదు. అందరం కలిసి బాధ్యతను పంచుకుంటున్నాం. కాబట్టి మా సంస్ధకు ఇంత స్పందన వచ్చింది”.

ధ్యానమండలి ప్రస్తుతం 5 రకాల శిక్షణలను నిర్వహిస్తుంది. దానితోబాటు విద్యార్ధులకు ప్రత్యేకముగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే వేసవి శిబిరాలను నిర్వహిస్తుంది. ధ్యానమండలి స్ధాపించబడిన తర్వాత అతికొద్ది కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదగడం, గురూజీకి అనేక అవార్డులు రావడమేగాక కార్య క్రమాలు శరవేగంతో రాష్ట్రమంతటా వ్యాపించడానికి మూల కారణం సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేయడం. ఆధ్యాత్మికతకు మనస్తత్త్వాన్ని జోడించడం, భౌతికవాదాన్ని ఆధ్యాత్మి కతతో మేళవించడం, ధ్యానాన్ని వైద్యంతో జతపరచడం వంటి వినూత్న ప్రయోగాలను గురించి విపులంగా వివరించడం జరిగుతున్నది.

ధ్యానమండలి భవిష్యత్ ప్రణాళిక గురించి గురూజీగారి మనో గతం అవలోకిద్దాం. “ప్రస్తుతం ప్రపంచమంతా భౌతికవాదం మత్తులో ఉంది. సుఖసౌకర్యాల ముసుగులో బంధింప బడింది. పతనా వస్ధకు చేరుకుంది. వనరుల కొరకు అందరూ నిరంతరం పరుగులు తీస్తున్నారు. మానవునకు మానవుడే శత్రువయ్యాడు. ప్రపంచ శ్రేయ స్సుకన్నా, పతనాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నైతిక విలువలు పతనమయ్యాయి. మానవ సంబధాలకన్నా ఆర్ధిక సంబంధాలే ప్రధానమవుతున్నాయి. ప్రపంచాన్ని శాంతిమార్గం వైపుకు మళ్ళించడం కొరకు అనేక రకాల సంస్కరణలు వెలుగులోకి వచ్చాయి. అనేకమంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం మాత్రం నామ మాత్రంగానే ఉంది. ఇవే పరిస్ధితులు మున్ముందు కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అందులకే పతనమవుతున్న ప్రపంచానికి మేం రూపొందించిన విధానాన్ని వినూత్న పంధాలో ఉన్నందువలన, అన్నివర్గాల వారికి ఆమోద యోగ్యమైనందువలన నిరంతరం కృషిచేసి ఆధ్యాత్మికతను ప్రపంచ వ్యాప్తం చేయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మేం చేసింది ఆంధ్రాకే పరిమితమైంది. భవిష్యత్తులో దేశానికి, దేశమునుండి ప్రపంచమంతటికీ వ్యాపింపజేస్తాం. అందరు సమస్యను ఉపరితలంలో చూశారు. పరిమిత తత్త్వంలో ఉండి పనిచేశారు. అందుకే ఊహించని రీతిలో ఫలితాన్ని పొందలేకపోయారు. మేం దానికి
ఒక సుదీర్ఘ ప్రణాళికను రూపొందిస్తున్నాం. యోగ విశ్వవిద్యాలయాన్ని, యోగ పరిశొధనా కేంద్రాన్ని, యోగ విద్యాలయాలను నెలకొల్ప డమేగాక, సమాజంలోనికి చొచ్చుకుపోయి సామాజిక సేవా కార్య క్రమాల ద్వారా ప్రజలందరినీ ఐక్యం చేయాలనుకుంటున్నాం. అందుకు అవసరమైన చర్యలు చేపడతాం. తప్పక ఫలితాలు సాధిస్తాం – ప్రజలకు అందిస్తాం”.

ధ్యానమండలికి అనుబంధంగా ‘ధ్యానమాలిక’ ఆధ్యాత్మిక మాసపత్రికను నడుపుతూ కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలకు సంబంధించిన వివిధ వ్యాసాలు ప్రచురించి అట్టడుగు ప్రజలలో కూడా యోగంపట్ల, ఆధ్యాత్మిక మార్గంపట్ల అవగాహన కలిస్తున్నారు. ఈ సంస్ధ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి పాఠకులకు తెలియజేస్తున్నారు.

జ్ఞాన మార్గంలో తనకు కలిగిన అనుభవాలను కుండబద్దలు కొట్టినట్లుగా తన మనోభావాలును ప్రకటించి, చెప్పింది చేసి చూపించగల సత్తాగల ఉత్తమ గురువు శ్రీ బిక్షమయ్య గురూజీ అని చెప్పక తప్పదు. ఫ్రజలలో మంచిని పెంచాలన్న తపన, సమస్యను మూలమునుంచి పరిశీలించి, పరిశోధించి, తగు పరిష్కారం చూపే తత్త్వంగలవారని వారి రచనలను చదివితే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఎంతో సాధన చేసి యోగమార్గంలో, ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్ధాయిని సాధించి, అతి సామాన్య ప్రజలకు సైతం భక్తి, ధ్యానం, యోగంపట్ల మంచి అవగాహన కలిగిస్తున్న ఇలాంటి సంస్ధలో మనమూ చేరి మనకు చేతనైన సహకారాన్ని అందించి, తగురీతిన సేవలు చేద్దాం. మన సంపూర్ణ ఆరోగ్యాన్ని యోగా ద్వారా పదిలపరచుకొని, పదిమందికి ఈ మార్గంలోని మంచిని బోధించి జ్ఞానదానం చేద్దాం. ప్రపంచశాంతికి మనవంతు ప్రయత్నం చేసి మానవులుగా జన్మించినందుకు జన్మ సార్ధకం చేసుకుందాం. మరింత సమాచారం కొరకు www.dhyanamandali.org ను దర్శించండి.

- నేతి విజయదేవ్

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home