Thursday, May 8, 2008

సద్గ్రంధ పఠన

చీకటిని తొలగించాలంటే వెలుతురును ఆహ్వానించాలి. జ్ఞానాన్ని పొందాలంటే అజ్ఞానాన్ని పారద్రోలాలి. జ్ఞాన సముపార్జనలో ఆధ్యాత్మిక గ్రంధములను పఠించుట అతి కీలకమైనది. మానవ మేధస్సుకందని అనేక రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. ఆలాగే మానవునికి తెలియని ఎన్నో అద్భుతమైన, అత్యంత విలువైన విషయాలు మన గ్రంధాలలో భద్రపరచబడి ఉన్నాయి. అందులకే ప్రతివారు విధిగా గ్రంధ పఠన చేయవలసిన అవసరమెంతైనా ఉంది. సద్గ్రంధ పఠన చేయడం ఇంకా ఉత్తమమైనది.

మానవ జీవితం నీటి బుడగలాంటిది. ఒక్కొక్క క్షణం గదచిపోతూ ఉంటుంది. జీవిత పరమార్ధాన్ని ప్రాప్తించుకొనుటకు సద్గ్రంధ పఠనే శరణ్యం. "మంచి పుస్తకం మంచి స్నేహితునివంటిది". మంచి పుస్తకం చదవడంవల్ల మనసులోని ముడులు విచ్చుకొని విశాలభావాలు వెల్లివిరుస్తాయి. మనిషిలో మార్పు వచ్చి, ఎద కరుణ రసంతో పొంగి పొరలుతుంది. పుస్తకంలోని పునీత వాక్యాలు హృదయాన్ని కదిలించివేస్తాయి. అంతరంగాన్ని అనంత భావ తరంగాలతో మధించగలుగుతాయి.

మానవుడు తన సర్వశక్తులను స్ధంభింపజేసి, ఈశ్వర భావనలో పూర్తిగా లీనమై, దివ్యమైన రచనలు పఠించినట్లైతే జ్ఞాన సరస్వతీదేవి ప్రతి అక్షరంలో మహత్తర శక్తిగా నిండుకొని, అనంతకోటి సద్భావనా తరంగాలను వెదజల్లగలదు. అణు విస్పోటనం కొంత ప్రేదేశం వరకే. హృదయ విస్పోటనం విశ్వవ్యాపిత ప్రభంజనమై విరాజిల్లుతుంది. శతకోటి హృదయాలను స్పందింపజేస్తుంది.

అంతటి శక్తి పూరితమైన, భావగర్భితమైన రచనలు చదివి మానవులు తమ ప్రస్ధుత స్ధితినుండి ఒక మెట్టు పైకి వెళ్ళగలిగితే జన్మ ధన్యమైనట్లే. సమత, మమత, మానవత, సేవ, పవిత్ర ప్రేమ భావాలు కేవలం సద్గ్రంధ పఠనవల్లే సాధ్యం. మహాత్ముల జీవిత చరిత్రలు, సద్గురువుల సందేశ గ్రంధములు, దేశభక్తి పూరిత దివ్య రచనలను అహర్నిశలు పఠించి ఆత్మోన్నతిని పొందడం అభిలషణీయం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home