Wednesday, May 28, 2008

విశాల దృక్పధం

మానవుడు తన చుట్టూ, తన కుటుంబ సభ్యులచుట్టూ, బంధువులు, స్నేహితులతో ఒక ఆలోచనా వలయాన్ని ఏర్పరచుకుంటాడు. కొన్ని పరిమితులను విధించుకుంటాడు.వ్యష్టి, కుటుంబ వలయం అల్పభావనతో కూడినటువంటిది. తనకు బహుళ ప్రయోజనకారిగా కనిపించినా సమాజపరంగా ఆలోచిస్తే స్వల్ప ప్రయోజనాన్ని కలిగించేటటు వంటిది. అల్ప ప్రయోజనం, సంకుచిత భావననుండి అనంత భావనలోకి, తద్వారా విశ్వభావనలోకి మనస్సును పయనింప జేయడం ఉత్తమ మానవుని ప్రధమ కర్తవ్యం. వ్యష్టి వలయాన్ని క్రమంగా కుటుంబ వలయంగా వ్యాకోచింపజేసి ఆపై ప్రపంచ పరిధిలో విస్తరింపజేసి, చివరికి విశ్వ వలయంగా రూపొందించుకోవాలి.

వ్యక్తి సుఖం కుటుంబ సభ్యుల సుఖంకన్నా స్వల్ప ప్రయోజనం కలిగి నటువంటిది. అందులకే వ్యక్తి తన సుఖాన్ని కుటుంబ సభ్యుల సౌఖ్యం కోసం త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. అలాగే కుటుంబ సుఖాన్ని విశ్వ శ్రేయస్సుకోసం త్యాగం చేయాలి. మానవుడు తన అలోచనా విధానాన్ని అంచెలంచెలుగా అనంత భావనవైపు, విశ్వ శ్రేయస్సుకోసం విస్తృతపరుస్తూ ఉండాలి. వ్యష్టి వలయాన్ని విశ్వ వలయం గా విశాలతర మొనర్చి విశిష్టమైన ఆలోచనలతో ఉత్తమ జీవనాన్ని సాగించాలి.

“సంకుచితత్వమే మరణం – విశాలత్వమే జీవనం” అన్నారు స్వామి వివేకానంద. అందులకే మన మనసులను విశాలపరచి విశ్వపర్యంతం విస్తరింపజేద్దాం. వినూత్న శోభతో, ఆదర్శ భావాలతో, సత్కార్యా చరణతో, సద్భావనా స్రవంతులతో, త్రికరణ శుద్ధితో మన మనసును మంచి మార్గంవైపు మళ్ళించుకొని, విశ్వవలయాన్ని నిర్మించుకుందాం. అల్ప దేహ భావనలో చిక్కి, అనంత విశ్వ విరాట్ స్వరూపాన్ని సంకుచిత పరిధిలో ఆలోచించి మన నిజ స్ధితిని మనం మరచిపోతున్నాం. నిద్రాణమై ఉన్న మన మనస్సుకు చైతన్యం రగిలించి విశ్వవ్యాపిత మొనరిద్దాం. విశ్వ తేజోమయులమై దివ్య భావనలతో జీవిద్దాం. మన జన్మలను చరితార్ధం చేసుకుందాం.

నేటి మన మంచి భావనలే బంగారు భవిష్యత్తుకు మూల స్ధంభాలు. అందుకే మన భావనలను ఉదాత్తపరచుకొని, ఉత్కృష్టమార్గంలో పయనింప జేద్దాం. సద్భావనా తరంగాలను విశ్వవ్యాపితం గావిద్దాం. విశ్వమనస్కులమై జీవిద్దాం. వ్యష్టి భావనలో ఉన్నంత వరకు పురోగతి శూన్యం. విశ్వభావనలోనే ఇమిడి ఉంది ఎంతో అభివృద్ధి. మానవుడు తన అభివృద్ధిని తాను చూసుకుంటూ, పక్కవాడి గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించ నేర్చుకోవాలి. మానవుడు తన అనంతమైన దివ్య స్ధితిని మరచి, లోకమాయలో చిక్కి తన చుట్టూ వ్యష్టి వలయాన్ని ఏర్పరచుకుంటున్నాడు. జ్ఞానమనే కత్తెరతో వ్యష్టి వలయాన్ని చేధించి, విశ్వభావనలో పయనించి, విశ్వ వలయంలో జీవించాలి. విశ్వేశ్వర అనుభూతిని పొంది విశ్వపూజ్యులం కావాలి. సకల చరాచర జీవజగత్తులో అంతర్యామిని దర్శించగలగాలి. విశ్వ కుటుంబ భావనతో జీవించనేర్వాలి.

“జగన్మిధ్యా-బ్రహ్మసత్యం.”ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమంతా ఒక సుదీర్ఘ కలగా, బ్రహ్మ పదార్ధమొకటే సత్యమైనదిగా మనం అనుభూతి చెందాలంటే మనలోని అవిద్యను, అజ్ఞానాన్ని సాధన చతుష్టయంతో పారద్రోలాలి. జ్ఞాన భానుడు మనలో ఉదయించినపుడే అంతర్నిహితంగా దాగివున్న అంతర్యామిని దర్శించ గలుగుతాం. అంతర్ముఖు లమై జీవించ గలుగుతాం. అనంత సచ్చిదానంద స్వరూపాన్ని విశ్వ వలయంలో కాంచగల్గుతాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home