Saturday, May 24, 2008

మత సామరస్యం

ఈ లోకంలో కులముల పేరిట కుమ్ములాటలకన్న మతముల పేరిట జరిగిన అల్లకల్లోలాలు, రక్తపాతాలు, మారణహోమాలు మిన్న. ఈ దోషం ఎక్కడుంది? మతములోనా, మనిషిలోనా? ఇంగిత జ్ఞానం లేనపుడు మనిషిని ఏ మతము ఉద్ధరించదు. ఎవరికి వారు తమ మతాలతో తాదాత్మ్యం చెందినట్లు ఇతర మతాలతో తాదాత్మ్యం చెందలేక పోవటమే సమస్త అనర్ధములకు మూలం.

దుర్మతాంధులకు తమ మతము తప్ప ఇతర మతములు గోచరించవు. అన్యమతాలు అసలు మతాలే కావని, వారిదే సరియైన మతమని వాదిస్తారు. నిలదీసి అడిగితే వారి మతములోని ఆంతర్యమే వారికి తెలియదు. స్వమత విజ్ఞాన శూన్యతే పరమత ద్వేషానికి కారణం. ఒక మతములో పుట్టి పెరిగిన వారికి ఆ మత భ్రమలో అంతయు తెలిసినట్లు
ఉండెదరు. తన మతంతో ఎక్కువ పరిచయం ఉన్నందున విశేషాంశము లు అతని దృష్టిపధమున నిలువవు.

ఇక మరికొందరికి తమ మతమే మహోన్నతమైనది, సత్యమైనది, మిగతా మతములు భూటకములని, మా మతములో చేరిననే తప్ప స్వర్గ రాజ్య ప్రవేశము లేదని భ్రమించెదరు. ఇది మరీ సంకుచిత దృష్టి. నీ విశ్వాసము నీకెంతో ఎదుటివారి విశ్వాసం వారికంతే. నీ దృష్టిలో ఎదుటివారినెలా భావిస్తున్నావో, వారి భావన నీ విష యంలో అంతే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలనిన మతములన్నియును అసంపూర్ణములు. కేవలం సంపూర్ణ దైవమతమే కాలాతీతం, సర్వ జనులకు ఆదర్శప్రాయమైనది. సమస్త మతములు దీని శాఖలు.

నీలో శక్తి ఉన్నచో ఏ మతము స్వీకరించకుండా ఉండు. ముందు నీ మతి భ్రమణము నరికట్టుకో. నీవనగా ఏమిటి? నీ నిజస్ధితిని తెలుసుకో. నిన్ను నీవు అర్ధం చేసుకో! నీవు ప్రకృతి దాసుడవు కారాదు. లే! నీకు నేవే లక్ష్యం, కేంద్రం కావాలి. ఆధ్యాత్మిక పరిభాషలో దీనిని స్వనిష్ట అంటారు. దుర్మత మౌఢ్యం అంతరించు గాక! దృక్పథములో మార్పు రాకుండా ఎన్ని మతములు పట్టినా వృధా శ్రమయే మిగులుతుంది. మతాలను లోతుగ అధ్యయనం చేస్తే అన్నింటిలో అంతేనని తెలుస్తుంది.

మతం అంటే ఏమిటి? మతి పరిధిలో నిలుపుకొన్న విశ్వాసాలకే మతమని పేరు పెట్టుకున్నాం. ఏ మతముతో సంభంధం లేకుండా నైనా ఉండాలి లేదా సర్వమత సమన్వయ దృక్పధము కలిగి మెలగాలి. మీకిష్టమైన, నచ్చిన ఏ మత పరిధిలోనైనా ఎదగండి కాని ఏ ఇతర మతములను దూషించరాదు. సర్వమత సామరస్య హృదయులు కావాలి. మత గ్రంధాలలో ఏమి చెప్పిన వాటిని శిరసావహించి ఆచరించ వలసిందేగాని ప్రశ్నించ వీలులేదనటం అధికార మత వాదం. హేతువునకు నిలబడిన వాటినే స్వీకరించాలనేది మానవతా వాదం. సర్వ మతాలను తనలో కలుపుకొను సామర్ధ్యం గలవారు ధన్యులు. అలాగే సర్వ మతాలలో తాను కలిసిపోగలగాలి.

సైన్సుతో లౌకిక జ్ఞానం పొంది లౌకిక భద్రతను, మతముతో పరలోక భద్రతను పొందనేర్వాలి. సైన్సుకు ఇతరమైనది లేదనుకోరాదు. ఆధారం లేకుండ ఆధేయం నిలువలేదు. ప్రతి దానికి ఒక ఆధారం కలదు. సర్వాధారుడవై నీవున్నావనెటి స్వరనాధం వినండి. ఒక్క మాటలో చెప్పాలనిన మతి ఉన్నంతవరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మతం ఉన్నట్లే. స్వభావ సిద్ధమైనదంతయు వారల పాలిట మతములే కాగలవు. నిజమైన మతం బాహ్య రూపాలలో లేదు. మనో దృక్పధములో, సరిహద్దులకు బద్ధమై లోక మతములు కలవు.

మతానికి, అంతర్గత విలువలకు సంబంధం గలదు. ప్రతి మతానికి పారమార్ధిక విలువ ఉండాలి. చిక్కంతా ఇక్కడే గలదు. మత విధానాలు పారమార్ధిక విలువలను సాధించి పెట్టగలవనే నమ్మకం కుదురాలి. చిత్తశుద్ధిని కలిగించి, ఆత్మజ్ఞాన ప్రభావితుని చేసే మతమేదైనా ఉన్నచో దానిని అనుసరించవలయును. ఈ స్ధితిలో వ్యక్తికి వేయి మతములున్నా దోషంలేదు. ఏ మతానికైనా విశ్వాసం ప్రాతిపదిక.

మతం వ్యక్తి వికాసాన్ని, దృక్పధాన్ని ప్రభావితం చేయాలి. మానవుని హృదయాన్ని విశాల భావాలతో వ్యాకోచింపజేసి విశ్వేశ్వర దర్శనం కలిగించాలి. విశ్వకళ్యాణానికి రాచబాటలు వేయాలి. శర్వజనుల శ్రేయస్సును కాంక్షించునదే నిజమైన మతం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home