Wednesday, May 28, 2008

నిన్ను నీవు తెలుసుకో

విశ్వ సృష్టికి మూలం భగవంతుడు. దీన్ని మనందరం ఒప్పుకుంటాం. మనమంతా భగవంతుని బిడ్డలం. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. మనమంతా భగవత్ స్వరూపులం. ఈ మాటనగానే ఒక్కసారి ఉలికి పడతాం. ముఖాలు చూసుకుంటాం. భుజాలు తడుముకుంటాం. మనం భగవంతులం కావటమేమిటని తర్కించుకుంటాం.

జీవునికి దేవునికిగల సంబంధం, తండ్రీ కొడుకులకు గల సంబంధం లాంటిది. తండ్రికి కొడుకుకు జన్యుపరంగా ఎంతో సారూప్యం గోచరిస్తుంది. అలాగే భగవంతునికి మనకు ఎంతో సామీప్యం, సారూప్యమున్నది. అందులకే మనం భగవత్ స్వరూపులం అని తలపోయడంలో తప్పులేదు. ఈ భావన సత్యమని మనకు నిండా నమ్మకం కలగాలంటే, మనలోని అహంకారన్ని పూర్తిగా తొలగించుకోవాలి. క్షుధ్ర దేహాభిమానాన్ని వదలుకోవాలి. దేహభావన, అహంకారం ఉన్నంతవరకు ఆత్మ జ్ఞానం చిక్కదు, దైవ దర్శనం కాదు. నిన్ను నీవు పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవాలి. అప్పుడే మనకు దైవానుభూతి కలుగుతుంది. పరమేశ్వరునియొక్క విభూతి తత్త్వం గ్రాహ్యమౌతుంది.

ఈ లోకంలో మనం ఎన్ని చదువులు చదివి, ఎన్ని డిగ్రీలు, పిహెచ్.డి.లు సంపాదించినా, ఎన్ని కొత్త విషయాలను కనిపెట్టినా, ఎన్ని ఘనకార్యాలు చేసి గిన్నీస్ బూక్ లోకి పేరు ఎక్కినా నిన్ను నీవు తెలుసుకోనట్లైతే ఆ చదువులకు అర్ధం, పరమార్ధం లేదు. అందులకే చదివి చదివి చచ్చేదాని కన్న, చావని బ్రతుకని చదువు చదువ నేర్చుకోవాలి. ద్రవ్య జ్ఞానముతో పాటు దైవ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. దైవ భావనలో సదా నిలిచిపోవాలి.

నిన్ను నీవు నిండా తెలుసుకున్నట్లైతే నీ స్వరూపమే పూర్తిగా మారి పోతుంది. నీలో జ్ఞాన తరంగాలు వెల్లివిరుస్తాయి. నీ మాటల్లో, చేతల్లో, భావంలో చైతన్యం ఉరకలు వేస్తుంది. నీలో నిర్భయత్వం చోటు చేసుకుంటుంది. 60 లో 20 సం.ల ఉత్సాహం, 20 లో 60 సం.ల వైరాగ్యం పుట్టుకొస్తుంది.

స్వస్వరూప సంధాన స్ధితియే మోక్షం. నీలో నీవు రమించినపుడే పరమానందం. నీ నిజస్ధితిని తెలుసుకొనకుండుటకు మించిన ఘోర పాపం మరొకటిలేదని శాస్త్రాలు సెలవిస్తున్నాయి. నిన్ను నీవెరింగిన నీవే నిజ దైవం. నీకు మొక్కోటి దేవతలమీద నమ్మకమున్నా, నీ మీద నీకు నమ్మకం లేనట్లైతే ముక్తి శూన్యం. అందులకే నేను దేహం కాదు, ఆత్మ స్వరూపాన్ననే భావనకు రావాలి. అప్పుడే సర్వం బట్టబయలు కాగలదు. సర్వం నీలో లయించిన అనుభూతి చిక్కుతుంది. చిక్కిన అనుభూతిని చక్కగా కాపాడుకొని చిన్మయ భావంలో జీవించాలి. ఇహమేవ! ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలోనే ముక్తి సాధనకు ప్రయత్నం చేద్దాం. ముక్తికాంతను వరిద్దాం. ఆనంతాత్మ సాగరంలో మునిగి తేలుగాం. జీవన్ముక్తుల మౌదాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home