Saturday, May 24, 2008

సరళ వాక్కు

మనం తీసుకునే ఆహారాన్నిబట్టి ఆలోచనలు, ఆలోచనను బట్టి సంభాషణలు ఉంటాయి. జిహ్వచాపల్యంచేత రజోగుణ భూయిష్ట మైన మాంసాహారమును భుజించినచో కామ క్రోచములు ప్రకోపించి నాలుక వశముదప్పే ప్రమాదము కలదు. శుద్ధ సాత్వీకాహారమును మాత్రమే తీసుకున్నట్లైతే మనస్సు మన ఆధీనంలో ఉంటుంది.

అన్నపు సూక్ష్మాంశమే మనస్సు కాబట్టి మనం తీసుకునే అహారం మీద, మంచి ఆలోచనలమీద మన మనస్సు ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం రుచిగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. అప్పుడే మనకు ఉత్కృష్టమైన ఆలోచనలు, ఉదాత్త మైన భావాలు కలుగుతాయి. ఆ భావాలను అలా అలా ఉదాత్తం చేస్తూ, ఉద్దీపన గావిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. పరుష వాక్కులు మన నాలుకలపై దొర్లకుండా జాగ్రత్తపడవచ్చు. కటువైన మాట ఎదుటివారి మనస్సును గాయపరచి, చిత్రవధ చేస్తుంది.

మంచి మాటలతో ఎన్ని పనులైనా సాధించవచ్చు. నోరు మంచిదైతే ఊరుమంచిదంటారు. మన మాటమీదే మనకు లభించే గౌరవం ఆధారపడి ఉంటుంది. మాటలో మృదుత్వం, చేతలో నైపుణ్యం, వ్రాతలో పటుత్వం ఉండాలి. లేకుంటే మనలను ఎవ్వరూ లెక్కచేయరు. ఎవరూ మనలను గుర్తించి, గౌరవించరు. ఫదిమందిచేత గుర్తింపు పొందాలంటే, గౌరవాన్ని సంపాదించుకోవాలంటే, మన మాట రామ బాణంలా ఉండాలి. ఎదుటివారి హృదయంలో మళయమారుతంలా చొచ్చుకుపోవాలి. మన మాట ఎదుటివారిలో పరివర్తన తీసుకు రాగలిగినదిగా ఉండాలి. అందుకే మన మాట ఎప్పుడూ సరళంగా, సవ్యంగా, దివ్యంగా ఉండాలి. అపసవ్యపు మాటలు మన నాలుక దరిచేరకుండు గాక! సదా సరళ వాక్కులే మన నాలుకపై నర్తించునుగాక!

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home