Wednesday, May 7, 2008

మాయ

మాయ ఎండమావి లాంటిది. మనిషికి లేనిపోని భ్రమలను కల్పించి బోల్తా కొట్టించేదే మాయ. మాయను జయించలేక మహామహులే మట్టి కరచినట్లు చరిత్ర చెబుతోంది. మాయ మనసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనసెప్పుడు బలహీనపడుతుందాయని ఎదురుచూపులు చూస్తుంది. ఎలుకకోసం పిల్లి కాచుకొని కూర్చున్నట్లుగా మాయ అదనుకోసం పొంచి ఉంటుంది.మనసు తాత్కాలిక ఆనందాలకోసం పెంపర్లాడినప్పుడు మాయ తన పనిని అతి సులువుగా నెరవేర్చుకుంటుంది.

నైతిక విలువలను పతనం చేయటంలో మాయ మనసుకు బాగా సహక రిస్తుంది. మనిషిని అనేక బలహీనతలకు బలిచేసి, పేరు ప్రతిష్టలను మంటగలిపి సభ్య సమాజంలో దోషిగా నిలబెడుతుంది. రకరకాల ట్రిక్కులతో, మ్యాజిక్కులతో వశపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక మార్గంలో లొంగకపోతే మరొక దారిలో వశం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మనిషిలోని బలహీనతలను పసిగట్టి ఉపాయంతో లొంగదీసుకుంటుంది.

జీవితాంతం మాయలో చిక్కి, శాప విమోచన కాగానే పూర్వ రూపం దాల్చిన పురాణ గాధలెన్నో మనం చదివాం. మనకు తెలియకుండానే
రెప్పపాటులో మాయలో చిక్కుకుంటాం.అదే మాయకున్న అమోఘమైన శక్తి. మాయ ప్రభావంలో ఉన్నంతసేపు కలలో గాంచిన దృశ్యాలన్నీ నిజమని ఆ క్షణంలో మనం నమ్మినట్లుగా, మాయలో ఉన్నప్పుడు మనం చేసే పనులు సవ్యంగానే తోస్తాయి. నిజం తెలుసుకునేసరికి పరిస్ధితి చేయిదాటి పోతుంది. అనేకమైన అనర్ధాలు జరిగిపోతాయి.

ఆధ్యాత్మిక అహం సన్నిధిలో మాత్రమే ముంగీస ముందు పామువలె మాయ పడుకుంటుంది. మంచి మార్గం వీడిన మనిషిని మాయ పెడతన్నులు తంతుంది. తన గుప్పిట్లో శాశ్వతంగా బంధించుకుంటుంది. ఇంత గొప్ప శక్తిగల మాయను జయించాలంటే మానవుడు వివేక, వైరాగ్యాలను దండిగా సంపాదించుకోవాలి. నిత్యానిత్య వస్తు వివేచన కలిగి యుండాలి. మనం మానసికంగా ఏ స్ధితిలో ఉన్నామో మనల్ని మనం ఎల్లప్పుడు విశ్లేషణ గావించుకోవాలి. బ్రతుకు బండిని బహు జాగ్రత్తగా నడుపుకుంటూ, మాయకు చిక్కకుండా మంచి మనిషిగా మసలుకుంటూ జీవితాన్ని పండించుకోవాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home