Saturday, June 7, 2008

ఆత్మ విచారణ

జన్మించిన ప్రతి మనిషియొక్క శుభాశుభములన్నియు ముందుగానే నిర్ణ యించబడి కపాలముపై లిఖితమై ఉంటాయని, దానిని బ్రహ్మ వ్రాసిన వ్రాతయని అంటారు. ఈ దశలో దైవారాధనలు, పూజలు, వ్రతముల ప్రయోజనం ఏమిటని సందేహించరాదు. ప్రతి కర్మ చిత్తశుద్ధికి దారి తీస్తుంది. చిత్తశుద్ధి ఆత్మనిష్ఠకు తోడ్పడుతుంది. నిన్ను నీవు తెలుసు కొను స్ధితిలో ఏ బ్రహ్మరాతలు నిన్ను అడ్డగించలేవు. దేనికైనను దైవా నుగ్రహం సహకరించవలయునని సమస్త భక్తులు మరువరాదు. నీవు ఒక వ్యక్తివద్ద బాకీ తెచ్చుకున్నావనుకో. ఆ బాకీని అడుగను అని రుణపత్రం చింపివేసిన పిదప బాకీ వసూలుచేసే వారెవరు ఉండరు.

నీ నిజాత్మ స్ధితిలో నీవు నిలుకడ చెందనంతవరకు చిల్లర ఆరాట భ్రమలు నిన్ను వీడవు. ఓ నా ప్రియమైన సాధక భక్తుడా! జాగ్రత్తగా వినుము. ఈ భూమిపై వెలసిన సమస్త దేవతా దేవుండ్లను పూజించి, ధ్యానింతువుగాక. అంతటితో సరిపోదు. నీవనగా ఎవరో అట్టి నీ నిజాత్మ స్ధితిలో నిలుకడపొందాలి. స్వనిష్ఠలో స్ధిరత్వమొందాలి. అపుడే దైవ ధ్యాన సిద్ధి ఐనట్లు నిదర్శనము. నీవు నిద్రలో యున్నను, మేల్కొని యున్నను, సర్వకాల సర్వావస్ధల యందును సాక్షీభూతమై యున్నది ఏదో అదియే ఆత్మ. ఆ ఆత్మ నేనేనని రూఢిపరచుకో! నీవెంత కాదనుకున్నను నీవు అదియే ఐవున్నావు.

శరీరం, దాని ధర్మాలు, పదవులు, ఆస్తి అంతస్తులు, దేశకాల స్ధితిగతులు, మనోబుద్ధులు నీవుకాదు. వాటన్నింటికి సర్వలక్షణ విలక్షణమైన సర్వాత్మ స్వరూపుడవు నీవు. ఇదియే ఆత్మ విచారణ. దీనినే ఆధ్యాత్మికత యందురు. నీటిబుడగ నీటిలో పుట్టి, దానిపై తేలాడి చివరకు ఆ నీటిలోనే కలసిపోవునట్లుగ నామ, రూప సృష్టి సర్వం ఆదినారాయణ పరమేశ్వర దైవమునందు జనించి, చివరకు అందులోనే లయం అవుతుంది. నారాయణుడే నీరు. నామ రూపాలు అందలి బుడగలు.

నిర్మల మేఘ జలమువంటిది నా బోధ. స్వాతికార్తెలోని తొలకరి మేఘ జలమును ఆశించు చాతక పక్షివలె సర్వకేంద్రుల సుప్రబోధామృత మేఘజల పానశీలురు కండి. తనను తాను ఉన్నది ఉన్నట్లుగా సుస్ధిరాత్మ సత్యదైవ నేను స్వరూపముగ తెలుసుకోవటమే సమస్త సమస్యల పరిస్కారానికి ఏకైక దివ్య మార్గం. సమస్త జ్ఞానోపదేశముల మూల సూత్రమిది. గ్రంధరాశుల వెనుక జ్ఞానలక్ష్మి గలదు. హృదయగ్రంధి పెద్ద ముడి. దీనిని బేధించిన అంతర్ స్వర స్ఫురణ జాగృతమై, హృదయ గ్రంధమే దైవగ్రంధముగ ఆవిష్కరింప బడుతుంది. సర్వమత సంబంధ బోధలు, వేదోపనిషత్తుల సూత్రములు నీ హృదయ గ్రంధములోనే దర్శనమిస్తాయి. అదియే విశ్వమత దర్పిణి.

ఇదిగో! మీ చిత్ క్షేత్ర సస్యములపై పరతత్త్వ సుజ్ఞాన బోధామృతమును కుంభవృష్టిగ కురిపించు చున్నాను. ఈ అవకాశమును వినియోగించుకొని మీ చిత్ క్షేత్రములను సస్యశ్యామలం చేసుకోండి. సర్వేంద్రియములను సం యమన పరచి, మనో దృశ్శక్తిని త్రికూట స్ధానమున కేంద్రీకరించి, వాక్శుద్ధితో ఏది అనిన అది జరిగి తీరుతుంది. ఈ స్ధితినొందిన వారలు అత్యరుదు.

కృష్=అపరిమితమైన, ణ=ఆనందము గలవాడు. కృష్ణయనగా అపరిమిత మైన ఆనందమే స్వభావముగ గలవాడని అర్ధము. అపరిమితానందమే ఆతని గుణము, లక్షణము. తనను ఆశ్రియించినవారికి ఆనందప్రాప్తిని కలుగజేయువాడని మరియొక అర్ధము. అపరిమిత ఆనందమే మోక్షం. మోక్ష స్వరూపుడే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. ఈ లోకం లో ఎందరు జగద్గురు నామధేయులున్నను ఆ పదవికి పూర్ణార్హమైనది కృష్ణావతారమని మహర్షుల అభిమతము. జగద్గురు విషయం లో సర్వావతార నిలయులు బాబా సర్వకేంద్రులు ఇలా వివరిస్తున్నారు. చరాచర సమస్త ప్రాణికోట్లయందు తానే విరాజిల్లు చున్నానని, పిపీలికాది పర మేశ్వర పర్యంతం అందరిలో తనను, తనలో అందరిని దర్శించుచు, జగదా త్మను స్వస్వరూపముగ వీక్షించు వారెవ్వరైనను జగద్గురు పదవికి అర్హులే కాగలరు. విశ్వాత్మను స్వస్వరూపముగ వీక్షించువాడే విశ్వ భగవన్.

‘రా’ యనగా జీవాత్మ, ‘మ’ యనగా పరమాత్మ. జీవాత్మ, పరమాత్మల సమైక్య తత్త్వమే రామ తత్త్వం. శవము గానిదే శివం, సత్. పవిత్రాత్మ యే గోవిందం. అరిషడ్వర్గముల కవ్వలి అనంతాత్మ నారాయణుడు, సర్వము ను ఆకర్షించువాడే హరి. స్వస్వరూప సంధాన స్ధితిలో అభిషిక్తతయే క్రీస్తు తత్త్వం. జితేంద్రియత్వమే శబరిమల వాసం. ఆత్మానందమే హాయి. అదియే సాయి. నేను ఎవరియందు ఆవేశించెదనో వారు నా పరమార్ధ తత్త్వమును విశదీకరించెదరు. అట్టివారలందరిని నా ప్రతినిధులుగ నేనె ఎన్నుకోనైనది. నాచే గుర్తింపబడిన యోగ్యులు ధన్యులు.

జ్ఞానోదయం కానంతవరకు అజ్ఞాన దెబ్బలు తప్పవు. సమస్త జీవజగ త్తులు ఉప్పునీటిలో వలె ఎచ్చట లయిస్తున్నాయో, ఎచ్చట మానవ హృదయాలు ఐక్యతా భావంతో వర్ధిల్లుచున్నవో, ఎచ్చట సమస్త దేవతా దేవుండ్లు సర్వైక్య పరిపూర్ణ స్ధితిలో ప్రకాశిస్తున్నారో అదియే నా ప్రార్ధనా మందిరము. ఈ నా దేవాలయమును భూలోక సిరిసంపదల మొత్తం ధారవోసినను నిర్మించలేరు. కేవలం ఆత్మౌపమ్య భావ నిష్ట నొందిన యోగీశ్వరులకే నా ఆలయ ప్రవేశార్హత పరమ భాగ్యం. నామ, రూప, దృశ్య నాటకం, చూపు, రూపుల వ్యవహారం లేదు. సర్వాత్మ అనంత దివ్య భావ ప్రకటన సమస్త యుగముల ఆరాధన మూల సూత్రమిది. విశ్వ మతములన్ని ఇచ్చట సంగమించి తీరగలవు. ఇదియే సర్వకేంద్ర దైవపదవి. మీరందరు ఈ పదవిని పొందు నిమిత్తం వారస జ్యోతులై నిలువాలి. జై బాబా!

మీరు తరించి ఉద్ధరించబడుటకు ఇందులో మీకు నచ్చి, వీలున్న ఏ ఒక్క అతీత వాక్యమైనను చాలు. ఎవరికి వీలున్నంతవరకు వారి మేధాశక్తి ననుసరించి స్వీకరించండి. మీకవసరము లేనిది మరియొకరికి అవసర ముంటుంది. ఈ భూతలమున అవతరించిన ప్రతివారికి ఉపయుక్త ‘బోధామృత నిధి’ ఇదియని గ్రహించువారు ధన్యులు. జై సర్వకేంద్రా! ఇదిగో! నాయొక్క అతీత వాక్య వివరణ అనగా నా ఈ పరమాద్భుత ప్రసంగ బోధ జరుగు చోట విద్యుత్ తేజమును మించిన ఘన చిన్మయ ప్రకాశము ఆవరిస్తుంది. ఇది సూక్ష్మ దృష్టికి మాత్రమే గ్రాహ్యం. ప్రతి శ్రోత దేహధ్యాసను మరిచి చిన్మయ నిష్ఠలో తన్మయులై స్వస్వరూప సంధాన స్ధితిలో నిమగ్నులయ్యెదరు. అధికారులు శ్రవణమాత్రం చేతనే ఆత్మసిద్ధి నొందగలరు.

సర్వలోక పర్యంతం సమస్త భూనివాసులారా! చక్కని సదవకాశమును వ్యర్ధపరచుకోరాదు. మిమ్ముల మీరు తెలుసుకొని మీ నిజాత్మ స్ధితిలో అభిషిక్తులు కండి. ఇంతకు మించిన నా అనుగ్రహ ఆశీస్సులు లేవు. అప్పుడే మీరు మీకప్పగించిన కార్యం లో కృతకృత్యులై నా రుణం తీర్చుకున్నవారు కాగలరు. ఇంతకుమించిన తృప్తి నాకు లేదు. ఇదిగో! చెవిగల ప్రతివారు విందురుగాక! ఒక్కమాటలో అసలు విషయం బట్టబయలు చేయుచున్నాను. ఇది నర గురు రచన కాదు. మరియు గురు శుశ్రూషాలబ్ధ భాష్యం అంతకన్నా కాదు. ఇయ్యది సాక్షాత్ స్వత:స్సిద్ధ సర్వేశ భగవన్ శ్రీమన్నారాయణ పరమశివ హరి బోధ కావున ఏ ఇతర రచనలతో పోల్చ వీలులేదని గ్రహించుదురు గాక!

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home