Sunday, June 8, 2008

అమృత సిద్ధి

మానవుడు త్రిమూర్తులుగ ఉండును. 1.స్ధూల శరీరము. 2. సూక్ష్మ శరీరము 3. అమృతత్వ స్ధితి (మోక్ష శరీరము). ప్రకృతి సైతం ఇలాగే మూడు రూపాలతో ప్రకటితమగును. 1. ఇంద్రియములకు గోచరమయ్యేది స్ధూల ప్రకృతి 2. ఇంద్రియాలకు అతీతమైనది సూక్ష్మ ప్రకృతి (అంతర్గతం, అత్యంత శక్తివంతం 3. స్ధూల, సూక్ష్మ ప్రకృతులకు అతీతమైనది మూల పరా ప్రకృతి. ఇది నిత్యం, శాశ్వతం, అచలం, స్ధిరం, సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి మార్పుగాని, నాశనంగాని ఏనాడులేదు. దీనినే ఆది పరాశక్తి యందురు.

భగవత్ సన్నిధిలో భక్తులుగ, సద్గురు సన్నిధిలో శిష్యులుగ, పెద్దల సన్నిధిలో సేవకులుగ నిలువగలిగే అభ్యాసకులు అమృతత్వ సిద్ధిని ఈ జన్మలోనే పొందగలరు. జడమును ప్రేమించే మనసును జయించిన చైతన్య భావం స్ఫురించును. ఇంద్రియ గోచర సంబంధమైనదంతయు జడమేనని తెలియవలయును. ముందుగ మనసును జయించాలి. దానికి ప్రతి క్షణం పని కల్పించాలి. సోహంభావ నిష్ఠలో లయింపజేయాలి. పర్వతం కణమయం, సింధువు బిందుమయం, అనంతకాలం క్షణమయం ఐనట్లు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు వర్తించునదంతయు ఏకత్వము యొక్క మూడు రూపాలు. ఇదంతా సత్ యొక్క మహా మాయ. ఈ జగత్తు లోని సముదాయమంతయు మాయయే. ఎందులకనగా వస్తు సముదాయమంతయు తాత్కాలికమైనది. సూక్ష్మజీవి నుండి సూర్యమండల పర్యంతం తాత్కాలికమే. సుస్ధిరం, పరిణామ రహితమైన ఏకత్వముతో పోల్చి చూచిన సృష్టి సర్వస్వం బ్రహ్మజ్ఞానికి మృగతృష్ణ జలమువలె గోచరిస్తుంది.

లౌకిక జీవి కేవలం బాహ్య దృష్టితో ప్రకృతిబ్ద్ధమైన జీవన విధానము నకు ఆకర్షితుడై తత్సంబంధమైన జీవనమును కోరుకున్నందున తనలో నిండియున్న అంత:శ్శక్తిని అమూలాగ్రం గ్రహించలేక పోవుచున్నాడు. ఫ్రతి పరమాణువులో అనన్య సామాన్య శక్తి ఉన్నపుడు మనలో ఎందుకు లేదను కోవాలి. కోట్లకొలది భౌతిక మరియు జీవాణువుల పరంపరలచే శోభిల్లుచున్న మానవునిలో సృష్టి, స్ధితి, లయ సంబంధిత శక్తితోపాటు అతనికి తెలియని అనిర్వచనీయ, మహత్తర శక్తిపూరితమైన దివ్య తత్వం ఇమిడి యున్నది. ఇట్టి అజ్ఞాతమును తెలుసుకొనుట ప్రతివారి విధి, ధర్మము, బాధ్యత.

స్వాత్మ స్వరూప భావనను కోల్పోవుటయే సమస్త దోషములకు మూలం. అత్మకు ఇతరముగ భావించునదంతయు మిధ్య. ఇట్లు మిధ్యగ నిశ్చయించు కొనుటయే నిజమైన వివేకముతొ కూడిన విచారణ. ఈ భావన మనసులో స్ధిరపడాలి. పరమాత్మ రాళ్ళయందు నిద్రావస్ధలోను, వృక్షములలో శ్వాస రూపమున, పశుపక్ష్యాది క్రిమికీటకాలలో చలన రూపములోను, కేవలం మానవునియందు మాత్రమే జ్ఞానముతో ఉన్నదని తెలుసుకోవాలి. కావున వివేకవంతుడైన మానవుడు జ్ఞాన దశనుండి దిగజారరాదు. గొర్రెలమందలో చిక్కిన సిం హపు పిల్లవలె దాని స్వరమును మరీచి గొర్రెల అరుపు అరచునట్లు మానవుడు ఈ నామ, రూప ఇంద్రజాలంలో చిక్కి తన నిజ స్వరమును మరీచి సైతాన్ స్వరముతో మెలగుచున్నడు. కావున మానవుడు తన నిజ స్ధితిని తెలుసుకొని సదా ఆత్మ జ్ఞాన శోభితుడై వర్ధిల్లాలి. అమృత సిద్ధిని సాధించి అమరత్వం పొందాలి.


(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home