Wednesday, May 30, 2007

దివ్యుడా! కనువిప్పుకో!!

ఆత్మవీర లేవర! అజానమత్తు వీడరా!
సకల జీవరాసులలో స్వామిని దర్శించరా!

బుల్లి బుల్లి నడకలతో బాల్యమంత గడిచిపోయె
చిట్టి చిట్టి మాటలతో చిరుప్రాయం కరిగిపోయె

యవ్వనంపు పొంగులలో ఇందృయాల పరుగులలో
ఎండమావి సుఖములకై వడివడి దరిజేరినావు

సుందర దేహంబు జూసి చిందులెన్నొ వేసినావు
అంతరాత్మ ప్రభోదాన్ని అణగద్రొక్క జూసినావు

పెదవులపై చిరునగవులు మనసులోన ద్వేషాగ్నులు
కపట నాటకంబులతో జీవితమ్ము సమసిపోయె

ప్రతిమల పూజించనేర్చి ప్రాణుల హింసించినావు
సకల జీవరాసులలో స్వామిని దర్శించలేక

సోమరితనాన్ని వీడి చైతన్యం బెంచరా
నైపుణ్యతగల పనియే పూజగ భావించరా

బలంబాగ వస్తుందని జీవులారగించినావు
చావు దగ్గరైనవేళ చతికిలబడి పోయినావు

బలంబేడ బోయెర నీ బతుకేమైపోయెర
శాకాహారంబులోనె శక్తున్నది చూడర

త్రిగుణాలలొ జిక్కినీవు తిప్పలెన్నొ బడుచుంటివి
మాయచేత పెడతన్నులు దండిగ నువు దినుచుంటివి

జీవులెనుబది నాలుగు లక్షల దేహాలలొ జేరినావు
బహుజన్మల పుణ్యంబున మానవజన్మ మెత్తినావు

కాలమెల్ల కరిగిపోయె వయసేమొ తరిగిపోయె
మృత్యువేమొ ముంచుకొచ్చె బ్రతుకు ఆశ చావదాయె

కళేబరంబు గాంచినంత వైరాగ్యం లెస్సబెంచి
స్మశానంబు దాటగనె మాయలొబడి పోతివోయి

మాటవినని మనసుజేరి మాయచేత జిక్కినావు
మానవ పరమార్థమైన జ్ఞానంబును మరచినావు
// ఆత్మవీర లేవర //

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home