Wednesday, May 30, 2007

భరతమాత కన్నీటి భాష్యం

భరతమాత కన్నీటి భాష్యం

తెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేను
అష్ట కస్టంబులతోడ అవమానం బొందినాను

నాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరి
గాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరి

ఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించి
దాస్య సృంఖలాలను త్రెంచివేసి నిస్క్రమించిరి

వీర పుత్రులెందరినోగని స్వతంత్రమ్ము బొందినాను
నా బిడ్డల భవిష్యత్తుకై బోలెడు కలలుగన్నాను

ఏదీ ఆ వీరత్వం ఎక్కడుంది ఉడుకు రక్తం
నరనరంబులలోన మిగుల స్వార్థంబే నిండుకుంది

కుటిల రాజకీయాలతొ కపట వేషధారణతో
చిలుక పలుకులెన్నొ పలికి చిత్రంగా బతుకుచుండిరి

వర్తకంబున నీతిదప్పి సరుకును నల్లబజారు చేర్చి
సామాన్యుడి గుండెలపై బరువెంతో మోపినారు

సరస్వతిని పూజిస్తూనె చదువులమ్ము కొనుచుండిరి
విద్యాలయాలన్నింటిని వ్యాపారంగ మార్చేస్తిరి

పుట్టంగనె మెకానిక్కు షెడ్డులోన బెట్టినచో
పదియేండ్ల కాలంలో షెద్దు యజమానై కూర్చుంటే

పదిహేను సంవత్సరాలు లక్షలెన్నొ ఖర్చుపెడితె
చదువేమో అబ్బదాయె ఉద్యోగం దొరకదాయె

హైటెక్కూ చదువులంటు బి.టెక్కూలెన్నొ చేసి
బరితెగించి రోడ్డుమీద రొమాన్సులెన్నొ చేయుచుండిరి

చదువుకున్న మేధావులంత విదేశాల కేగుచుంటె
వట్టిపోయిన పొదుగువోలె కృశియించి పోయినాను

పరదేశపు వేషభాషలు పరగ గొప్పయని యెంచి
మాతృభాష విలువనేమొ మంటగలుప జూసినావు

విదేశీయులు తంతె తప్ప దేశభక్తి పుట్టదు మరి
అవమానిస్తేనె తప్ప విప్లవంబు లేవదేమొ

భరత మాతనని నేను ఏమి జూసి గర్వించను
కన్నతల్లి కంట్లోనె కారంజల్లు కొడుకులుంటె

గాంధీయే నేడుంటే గుండెబగిలి చచ్చెటోడు
బోసుగనక బతికుంటే భోరున విలపించెటోడు

సత్యాహింసలన్న జాతిపిత మాట మరచి
ఉగ్రవాదమంటు లెస్స ఉన్మత్తుడవైతివోయి

భవిష్యత్తు తలచుకొని భారంగా నిట్టూర్చితి
కరుగని హృదయాల గాంచి కన్నీటిని కార్చుచుంటి

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home