Wednesday, March 19, 2008

వ్యక్తిత్వ వికాసము - తల్లిదండ్రుల పాత్ర

నేటి బాలబాలికలే రేపటి పౌరులు. అట్టి బాల బాలికలే భారతదేశ బంగారు భవిష్యత్తుకు పునాదిరాళ్ళు. యువతీ యువకుల భుజస్కందాల పైనే భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు ఆధారపడి యున్నదని స్వామి వివేకానంద సుమారు వంద సంవత్సరాల క్రితమే పిలుపునిచ్చి జాతిని జాగృతం చేశారు.

ఈ లోకంలో ఉత్తమ శిక్షకులు ముగ్గురు.
1. తల్లి 2. తండ్రి 3. ఆచార్యుడు. పిల్లలకు తల్లినుండి కలిగినంత మేలు మరెవరినుండి కలుగదు. గర్భధారణ మొదలుకొని సంపూర్ణ వ్యక్తిత్వము పెంపొందు నంతవరకు తన సంతతికి శీలసంపదకు వలయు విషయములను ఉపదేశించునట్టి స్త్రీ పరమ ధన్యురాలు.

తమ పిల్లలు ఎవరిముందు ఎలా గౌరవాభిమానములు కలిగియుండ వలయునో తల్లిదండ్రులు వివరించి చెప్పవలయును. సరళమైన, స్వచ్చ మైన, మృదువైన సంభాషణ ముఖ్యము. ధర్మయుక్తమగు ఆచరణ కలిగి, సత్యమని నిశ్చయముగ తెలిసిన దానిని గ్రహించి, ప్రకటించి, ప్రచారము చేయుడని బాలలకు ఉపదేశించవలయును.

పిల్లలను తల్లిదండ్రులు నిర్భయ వాతావరణములో పెంచవలయును. పిరికిమందు నూరి పోయరాదు. ఎదురులేని సాహసవీరులుగ తయారుచేయాలి. పిల్లలను వ్యర్ధులు, పనికిమాలినవారని సంభోధించరాదు. నీలో చాలా శక్తిగలదు, నీవు దేనినైనా సాధించగలవు అని ఆత్మ విశ్వాసము పెంపొందేలా ప్రోత్సహించాలి. సమత, మమత, మానవతలు పరిఢవిల్లే భావములను వారి లేత మనస్సులలో నాటాలి. విశ్వ విశాల ప్రేమ తత్త్వమును, సేవా భావమును, పరోపకార చింతనను అలవర్చాలి.

తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్య ధోరణిలో చూడరాదు. పిల్లలను కనటం గొప్పకాదు. తమ సంతతిని సత్ పౌరులుగ తీర్చిదిద్దాలి. పిల్లలకు క్రమశిక్షణ యనెటి కంచె చాలా అవసరము. పిల్లలపట్ల అతిగారాభము పనికిరాదు. పిల్లలను ఐదు సం వత్సరముల వరకు వారి వారి ఆర్ధిక పరిస్ధితినిబట్టి రాజబోగాలతో పెంచాలి. ఆరు సం వత్సరములనుండి పదహారు సం వత్సరముల వయస్సు వరకు శత్రు సేవకులుగ చూడాలి. పదహారు సంవత్సరములు దాటిన నాటినుండి మిత్రులుగ చూడగలగాలి. యుక్తాయుక్త పరిజ్ఞానము అలవడి పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడే పర్యంతం ప్రతి విషయములో బాధ్యతను విస్మరించకుండ సూచనలు, సలహాలు, ఆజ్ఞలు పాటింపజేయవలయును. తల్లిదండ్రుల పెంపకముపై పిల్లల భవిష్యత్తు ఆధారపడియున్నదని మరువరాదు.

తల్లిదండ్రులు శైశవదశనుండి తమ పిల్లలకు నరనరములలో జీర్ణించుకొనే విధముగా దేశభక్తి, విశ్వవిశాల సమైక్య దృష్టి, పరమత సహనము, మానవత్వము, ప్రేమ, దయ మొదలగు సుగుణములు అలవడునట్లు చూడవలయును. అంతేగాని కులాభిమాన, మతోన్మాద భావాలను ప్రేరేపించరాదు. మూఢ నమ్మకములు, దురాచారములు పిల్లల మనస్సులలో జొరబడకుండునట్లు జాగ్రత్త వహించాలి.

పెద్దలు పిల్లల ఆత్మ వికాసానికి చేయూత నివ్వాలి. ముఖ్యముగా వ్యక్తిత్వ వికాసము, మానసిక విషయాలను చిన్నతనములోనే నేర్పాలి. వారల లేత మనస్సులలో ఏ తలంపులైనను చేరగని ముద్రగా నిలిచిపోగలవు. కావున పిల్లలను భయ వాతావరణములో పెంచరాదు.
వారు చేసే మంచి పనులను, తెలివితేటలను ప్రశంసిస్తూ, అభివృద్ధి కరమైన విషయాల వైపు పిల్లలను బాగా ప్రేరేపించాలి. దేశభక్తుల,మహాత్ముల, గొప్ప గొప్ప విజయాలను సాధించిన వారి జీవిత చరిత్రలను వివరించి వారిచే చదివింపజేసి, వారిలో నూతన ఉత్సాహాన్ని, స్ఫూర్థిని కలిగించాలి.

తమ పిల్లలను కాన్వెంట్ ఇంగ్లీషు మీడియములో చదివిస్తేనే బాగా చదువుకుంటారనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు సవరించుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన జరిగితే విషయ అవగాహన సులభంగా అర్ధమౌతుంది. నేడు అనేకమంది విద్యార్ధులు పల్లె సీమలలో, తెలుగు మీడియంలో చదివి ఐ.ఐ.టి., గేట్, ఎం.బి.ఏ. వంటి వాటిలో ఘన విజయం సాధించి ,పెద్ద చదువులు చదివి, ఉన్నత పదవులను పొంది, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించటం మనం కళ్ళారా చూస్తున్నాం.

పెద్దల ఆచరణ పిల్లలకు సర్వవిదిహముల ఆచరణయోగ్యమై ఉండాలి. మార్గదర్శకులు ముందు సన్మార్గములో నడవాలి. ఏ ఇంటిలో నైనను తల్లిదండ్రుల నడవడి తమ సంతతికి క్షేమకరమై యుండాలి. పిల్లలలో వ్యతిరేక ధోరణి తలయెత్తకుండా పెద్దలు జాగ్రత్తపడాలి. తగు రీతిని మానసిక శిక్షణనిచ్చి సంఘ శ్రేయోభిలాషులుగా తయారు చేయాలి. దీనిని సాధించుటకై ప్రతి తల్లిదండ్రులు తమవంతు కృషి చేయాలి. పసిపిల్లల సంపూర్ణ మానసిక, వ్యక్తిత్వ వికాసానికి చెయూతనిచ్చి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినట్లైతే భరత మాత కన్న కలలను పండించి, ఆనందాభుదిలో ఓలలాడించ గలమనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

- నాగులవంచ రజని