Saturday, June 23, 2007

రచయిత పరిచయం

కవి, రచయిత శ్రీ నాగులవంచ వసంతరావు గారు సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నారు.

2004 ఫిబ్రవరి మాసంలో “సద్భావనా స్రవంతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని రచించి ప్రచురింపజేయడం జరిగింది.60 ఆధ్యాత్మిక వ్యాసాలుగల ఈ పుస్తకం పలువురు ఆధ్యాత్మిక వేత్తల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.

ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 12 ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. శ్రీ బిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న “ధ్యాన మాలిక“ అధ్యాత్మిక మాస పత్రికలో ప్రచురింపబడిన “దివ్యుడా కనువిప్పుకో!” అనే కవితకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషికం, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక లభించాయి.

“చేతన” సచివాలయ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో వరుసగా 2006 మరియు 2007 సంవత్సరాలలో “పరానుకరణ” “జీవితం” అనే కవితలకు జ్ఞాపికలు మరియు శాలువాతో సత్కారం జరిగింది. చేతన కవితా సంకలనంలో ప్రచురింపబడ్డాయి.

“నవ్య సాహితీ సమితి” వారి ఉగాది కవి సమ్మేళనంలో చదివిన కవితకు శాలువాతో సత్కారం జరిగింది. “సాహితీ స్రవంతి” హైదరాబాదు శాఖ వారి “కలాలు- గళాలు” 2006 కవితా సంకలనంలో “కల్తీ-కాలుష్యం” కవిత ప్రచురింపబడింది.

2006 ఫిబ్రవరి మాసంలో బాబా సర్వకెంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే గ్రంథం సంకలనం చేసి ప్రచురింపబడింది. ఫ్రముఖ విద్యావేత్తల, మేధావుల ప్రశంసలనందుకున్నది.

బాబా సర్వకెంద్రుల వారిచే రచింపబడి, నాచే సంకలనం చేయబడి, 2007 జనవరి 29వ తేదీన ఆవిష్కరింపబడిన “సుజ్ఞానోదయ సర్వాత్మ తత్త్వములు” గ్రంథం బహుళ ఆదరణ పొందినది.

“సుగంధ సాహిత్య సౌరభాలు” సంస్థ ఆధ్వర్యంలో 2007 మార్చి 19వ తేదీన నిర్వహింపబడిన ఉగాది కవి సమ్మేళనంలో “జీవితం” కవితకు సన్మానం, జ్ఞాపిక లభించాయి.

2007 సంవత్సరంలో రచించిన “చైతన్య స్రవంతి” (కవితా సంకలనం) మరియు “నిత్య సత్యాలు” (పద్య శతకం) పలువురి ఆధ్యాత్మిక వేత్తల, మేధావుల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.

Wednesday, June 20, 2007

జ్ఞాన మార్గం

సిద్దపురుషుల చరిత అమిత శ్రద్ధగ చదువ
గుండె చెరువైపోగ కడువ కన్నీళ్ళొలికె
కారణ జన్ములకు కస్టాలు తప్పవు
ధర్మ పథమున నడువ సత్యమిలను

నామరూప జగతి సత్యంబుగా దోచు
మాయ వలన మహిని మనుజునకును
నిత్యానిత్య వస్తు వివేచన సలుపంగ
మాయ తొలగిపోయి మర్మమెరుగు

పెక్కు జనుల శవములు కనులార గాంచియు
తనకు మరణమిపుడు రాదటంచు
భౌతికమును బహుగ ప్రేమించుచుందురు
హంస ఎగిరిపోవు క్షణము దెలియలేక

మంచి పనులు జేయ మాయ యడ్డగించి
విఘ్నంబులెన్నియో కల్పించుచుండును
ఆత్మ స్థైర్యముతోడ అడుగు ముందుకు వేయ
మాయ తొలగిపోయి దారి చూపించును

సృష్టిలోన మానవ జన్మ ఉత్కృష్టము
విచక్షణ శక్తి యుండుటే దీని ఘనత
మంచి చెడ్డలుగని మసలుకుంటె మిగుల
మనిషి జన్మ యిలను బహుళ సార్ధకమగును

నేను నేనటంచు తెగ విర్రవీగును
దేహ భావముతోడ జీవుడిలను
భారమైన వేళ భగవంతుడేడును
తన బలము చాలదని అనుభవంబుతోడ

విశ్వ పరిధి బహు విశాలమై యుండగా
తా తన కుటుంబము బంధు మిత్రులంటు
నూతిలో కప్పవలె గిరిగీసుకొందురు
అదియె సర్వస్వమని తలపోయుచుందురు

కులపిచ్చి మతపిచ్చి కాంతలందున పిచ్చి
ధన కనక వస్తు వాహనంబుల పిచ్చి
పేరు ప్రతిష్టల గొప్పదనముల పిచ్చి
ఆత్మసిద్ధి కొరకు అల్లాడుటొక్కటే అసలు పిచ్చి

సిరిసంపదల కొరకు ప్రాకులాడువారి
తెలివిమంతులని తెగ జెప్పుకొందురు
పరమార్ధము కొరకు పరితపించువాని
పిచ్చివాడటంచు పరిహసింతురు జనులు

సంకుచిత భావంబు ప్రగతి నిరోధకంబు
విశాల భావంబు విశ్వపరిధి గాంచు
సజ్జన సాంగత్యమె సకల శుభకరంబు
సన్మార్గ వర్తనమె సర్వుల కామోదంబు

మనసును నులిపెట్టనిదే మాటవినదు పరికింప
సుత్తిదెబ్బల కోర్చినపుడె రాయి దేవుడగునటుల
కస్టాలెన్నొ ఎదురౌను సన్మార్గాన పయనించ
ఓర్పుతోడ చరియించ ఆనందాలు నీవెంట

భౌతికమందున బహుసుఖము గలదంటు
బాహ్య ప్రపంచాన తిరుగాడుచుందురు
అంతరంగమందు అమృత భాండమ్ము
గాంచలేరు జనులు సాధన సలుపరేని

జిహ్వ చాపల్యంతొ జీవుండు చెడిపోవు
స్పర్ష సుఖముచేత సుఖరోగములు వచ్చు
అందాల నాశించి బంధాలలో జిక్కు
శబ్ధ కాలుష్యమున చెడు మార్గమబ్బును

కామాతురతబొంద మనసు వశము దప్పు
ఉచితానుచితంబు మిగుల సన్నగిల్లు
బలహీన క్షణమొకటి బలిపశువుగా మార్చు
బంగారు భవిష్యత్తు భగ్గుమని మండును

ఎంత సంపాదించి ఎన్నాళ్ళు బతికినా
శాశ్వతంబుగాదు తనువు తర్కించి చూడగా
తన్నుద్దరించుకొని విశ్వశ్రేయస్సు కాంక్షించి
పరితపించువాడె పరమ యోగీశ్వరుండిలను

మలినరహిత మనసువలన మంచి దేహముండురా
ఇతరులభివృద్ధి గాంచి ఈర్ష్య చెందనేలరా
కుళ్ళుబోతు తనముబెంచ కూలిపోవు చూడరా
సర్వజనుల హితముగాంచి సద్గతి నువు బొందరా

కలలు గనెడువారు ధరణి కోకొల్లలు
కలలు నిజంబౌను కొందరికె ఇలను
కర్మయోగముతోనె కలలు సాకారంబు
కలలు నెరవేరుట బహుకష్టంబు చూడరా

మహిలోని బాధలు మనో కల్పితములు
పరిణతిగల మనసుచే సకల పరిష్కారములు
అత్యాశ దు:ఖమునకు మూలకారణ మగును
సంతృప్తిలేని జీవితం నిరాశకు నిలయంబు

గుడిలోని దేవునకు నదిలోని పుష్కరునకు
పూజలెన్నొ సలిపి పుష్కర స్నానాలు జేసియు
అంతరంగమందు అమృత మూర్తిని గనలేరు
అవని జనులు ద్వైత భావంబుతోడ

విశ్వపరిధిని గాంచ విమల గంభీరంబు
ఆత్మ తత్త్వమెరుగ అంతయు నేకంబు
మనసు బుద్ధిచేత గనలేము సత్యంబు
ఆత్మజాడ దెలియగవచ్చు అనుభవంబుతోడ

ఎగువ ఆకసాన దిగువ పాతాళాన
దేవుడుండు నటంచు తెగ ఊహించుకొందురు
మానవ హృదిలోని మాధవుని గానక
మాయచేత అసలు మర్మంబు దెలియక

కర్మ జన్మలయొక్క మర్మంబు నెరుగక
భౌతిక ప్రపంచాన బాధలొచ్చినవేళ
తన కర్మమేమిటని తెగ బాధపడుదురు
భగవంతునేడుకొని పశ్చాత్తాపపడుదురు

అఖిల శక్తులకు నిలయ మంతరంగమై యుండగా
బాహ్యప్రేరణ కొరకు బహు ప్రాకులాడుదురు
మనసులోని శక్తి మహిమను గనలేక
తనమీద తనకు పూర్తి విశ్వాసముయు లేక

పరమాత్మ స్మరణయే పరమ లక్ష్యముకాగ
విషయ వాంఛలతోడ వహరించు చుందురు
దేహ సుఖములకొరకు దేబిరింతురు జనులు
ఆత్మ జ్ఞానములేక అల్లాడుచుందురు

మంచి కార్యముజేయ మనశ్శాంతిని బొందు
చెడు తలంపులేమొ ఆత్మ క్షోభను బెంచు
సత్కర్మ లొనరించి సంతుష్టి నొందుటే
బరగ దైవస్థితియని దెలియవలయు

పూజ ప్రార్ధనలెన్నొ లెస్స చేయగవచ్చు
పుణ్య తీర్ఠాలెన్నొ దర్శించగవచ్చు
ధ్యాన యోగములెన్నొ ధరణి సలుపగవచ్చు
మనసు నిలుపతరమె మనుజునకును

మంచి పనులుజేయ మానవుడు మహిలోన
సజ్జనుల హృదయాలు సత్వరమె స్పందించు
దైవ సంకల్పముగ భావించుదురు జనులు
విశ్వ మానవ విభుని మహిమ దెలియ

విశ్వ వ్యాపితుడైన విశ్వేశ్వరుండిలను
గురు రూపమున వచ్చి గుర్తు జేయుచునుండు
సద్భోధనలు జేయ సాకారుడంబౌను
దేహ ధారియగు దైవమునకు ప్రణతి ప్రణతి

ప్రతి మనుజునందును ఏదొకళ దాగుండు
తీవ్ర సాధనచేత ప్రావీణ్యతను బొందు
కళను గలిగినట్టి జన్మ బహు ధన్యంబు
సకల కళలకు పరమార్ఠకళ మూలంబు

పాంచభౌతిక దేహ పరువంబు జూసుక
విషయ వాసనలందు విహరించు చుందురు
అల్ప సుఖములకొరకు అల్లాడుచుందురు
మంటలోని మిడుత మాడి చచ్చిన పగిది

నేను నేనందురు మేను భావనతోడ
నేను మేనులకు బహుగ వ్యత్యాసముండును
అంతర్ముఖుండవై అనుభూతి చెందగా
ఆత్మ నేనునుగని అలరారుచుండును

గుడిలోని దేవుండు హృదిలోను గలడంటు
సాధనలు సలుపమని శాస్త్రములు తెలుపంగ
హృదియందు గనలేక గుడిలొ వెదకుచునుంద్రు
తానె ఈశ్వరుడను తత్త్వంబు దెలియక

మంచి మనసుగలిగి మానవుడుండిన
విశ్వశక్తులన్ని మనసావహించును
మానసిక పరివర్తన మరి మరి కలుగును
ఆత్మ సిద్ధి బొంది ఆనందమందును

ఉన్నదానికన్న ఊహ యధికంబుండు
కన్నదానికన్న కలలు మెండు
విన్నదానితోడ వీనుల విందౌను
అరయ సత్యమెరుగ అన్ని సున్న

అంతరాత్మ ప్రేరణయే అభివృద్ధికి దిక్సూచి
అంతర్వాణి ననుసరించ జీవితమే పూలబాట
మనసుతోడ సాంగత్యం మొదటికే మోసమగును
ఆత్మజ్ఞాన సాధనయే మనుజున కావశ్యకంబు

- నాగులవంచ వసంత రావు

Tuesday, June 19, 2007

లోకం పోకడ

ఇస్టమైన పనిని ఇంపుగా యొనరించు
కస్టతర కార్యంబు కాలరాయు
ఇస్టకస్టములను సమముగా నెంచుటే
తెలియ జ్ఞాన సిద్ధికి పరమ గురుతు

కాని పనులజేసి కపట మార్గంబున
తప్పించుకొన జూచు తెలివిమీరి
ప్రకృతి పగబట్టి పగదీర్చుకొంటది
తరచి చూడ నాగుబాము పగిది

అమ్మవలన బుట్టి అమ్మవలన బెరిగి
ఆలి వచ్చిన క్షణమె అమ్మ చేదాయెను
ముందు చెవులకన్న వెనుక కొమ్ములు వాడన్నట్లు
లోకరీతిని పరికింప సత్యమిలను

ఎదుటి వానియొక్క ఎదుగుదలను జూసి
కడుపునిండ విషము నింపుకొనియు
మనసులోన పెక్కు కుతంత్రాలు బన్నియు
మాటలోన మిగుల ప్రేమొలుకబోతురు

ఉన్నమాట జెప్ప ఉరిమురిమి జూతురు
కల్ల మాటలు జెప్ప ఉల్లముప్పొంగును
కపటవర్తన చేత కార్యంబు దీతురు
కలియుగాన జనులు కస్టాల కోర్వలేక

పాంచభౌతిక దేహ పరిధిగానక నరులు
జల్సాలెన్నొజేసి షోకులెన్నొ వేసి
పుట్టి పెరిగినదిలను అనుభవించుట కంటు
శుష్క వేదాంతంబు తెగజెప్పుచుందురు

పరులు జూచుటకొరకు పట్టెమంచము పరుపు
పవళించు సమయాన కటికనేలయె గతి
మాయ జబ్బులు వచ్చి మంచము కరువాయె
జనుల మార్చనెంచ నెవరి తరము !

కలిసియొచ్చు వేళ కలిపి వర్తకంబు
నస్టమొచ్చు వేళ నక్కియుండు
కలిమిలేములందు సమముగా నుండుటే
పొత్తు వ్యాపారంబు పొసగు నిలను

కాంతనడ్డుబెట్టి కానిచ్చుదురు పనులు
ధనముతోడను జరుగు ధరణిలోన పనులు
మందు విందులతోడ పనులెల్లదీతురు
పొగడినంతనె జనులు పడిపోవుచుందురు

తమ సొమ్మనగానె తెగ పొదుపుజేతురు
మంది సొమ్ముగాంచ మంచినీళ్ళ పగిది
స్వపర భేదములేక వర్తించు వారలే
మానవోత్తములని మహిని తెలియవలయు


అస్టకస్టాలతోడ అవమానాలెన్నొ బొంది
ఆత్మీయులు కలువగనే అమిత ఆనందముతో
కడుపులోని కాదారము కక్కివేయుదురు జనులు
మనో ప్రశాంతతను బొంది ఊరడింతురు నరులు

చెప్పునంతసేపు తెగ ఊపుదురు తలలు
వినయ విధేయతలు విరివిగ ప్రదర్శింతురు
బయటకు జనగానె దులిపేసుకుందురు
లోకరీతిని గాంచ సత్యమిలను !

మంచి మాటలు జెప్ప మాటాడకుందురు
చెడ్డమాటలంటె చెవిగోసుకొందురు
పరుల దోషమునెంచి బరగ దూషింతురు
మనసు మర్మము దెలియని మనుజులిలను

ఇల్లు ఒళ్ళు రెంటి గుళ్ళ జేయునట్టి
మద్యపానంబును మానలేక జనులు
సంఘములో బహు చులకనైపోదురు
క్షణిక సుఖము కొరకు ప్రాకులాడిన నరులు

కలిగియున్న వేళ కలతలెప్పుడు రావు
సన్నగిల్లు వేళ సణుగుడు మొదలౌను
కలిమి లేములందు సమముగా నుండుటే
సంఘ జీవికెపుడు సరియైన మార్గంబు

చదువు రానివాని చులకనగ జూతురు
చదువుకొనగ మిగుల సౌఖ్యమబ్బు
చదువు విలువ దెలుప నెవరికి శక్యంబు
చదువు వలన జన్మ సార్ధకంబు

ఇస్టపడి చదివితేనె అబ్బుతుంది చదువిలలో
కస్టపడి చదివినచో కడకు బాధలే మిగులును
పరుల కొరకు పఠియింప ఫలితమెపుడు రాదింక
పట్టుదలతో చదివినంత ఫలితం ఆకాశమంత

ఆలోచనలు మాని ఆచరణలో నిలుచుటే
సకల సమస్యలకు పరిష్కారమౌను పరికింప
అభీష్ట కార్యములందు అత్యధిక కృషి సలుపుటే
కార్యసాధనకు చక్కటి మార్గమగును మహిలో

మహిని మనుజుల యొక్క భవిష్యత్తు నూహించ
కర్మవీరుని కరమందున స్పష్టంగా కనిపించగ
కర్మయోగము యొక్క మర్మంబు దెలియక
జ్యోతిష్కునకు తమ చేతులందింతురు !

నీతులెన్నొ జెప్పి గోతులెన్నొ త్రవ్వి
ప్రత్యక్షమందున ప్రశంసింతురు జనులు
పరోక్షమందున బరగ దూషింతురు
కపట వర్తన చేత మానసమున

ఆదర్శములు చెప్పుటకు అందముగ నుండును
ఆచరణలో మిగుల కస్టముగ తోచును
మాటలకు చేతలకు వ్యత్యాసముండిన
ఇలలొ మనిషి మాటకు విలువ సున్న
ధనము బలము గలుగ పామరపు జనులు
పండితోత్తములను బహు నీచముగ జూతురు
ధనము బలములలోనె సర్వంబు గాంతురు
లెక్కలేని పాడు పనులెన్నొ జేతురు

ధనరాసులను జూసి తెగ మురిసిపోదురు
మనో నియంత్రణను అసలు పాటించరెపుడు
పునాదులు లేనట్టి భవనంబు చందాన
సద్గుణంబులు లేని సంపాదనటులౌను

బ్రతికి యున్నవేళ పలుకరించని వారు
శవము గాంచినంత తెగ ప్రశంసింతురు
రక్త సంబంధులు బంధు మిత్రులెల్ల
శవము చుట్టుజేరి శోకాలు దీతురు

పరిణయంబులకేమొ ఫంక్షను హాలులు
ఫలహారముల జూడ పదుల సంఖ్యలొ నుండు
లెక్కలేని పెక్కు భోజన పదార్ధాలు
అర్థ భాగము మిగుల వ్యర్ధమైపోవును

శీలమొక్కటె స్త్రీలకాభరణమై యుండగా
మెడనిండ నగలేసి తెగ మురిసిపోదురు
పట్టుచీరల కొరకు పరుగులే దీతురు
ఆందచందాలకధిక ప్రాధాన్యమిత్తురు

యవ్వనంబున యున్న ఆడపిల్లల గాంచి
మాయమాటలు జెప్పి వశపరచుకొందురు
జ్ఞానేంద్రియంబుల జాడదెలియని వనితలు
మగవారి మాటలకు పడిపోవుచుందురు

తా చేయుచున్నది తప్పని తెలిసియు
మాయ బన్నిన వలలొ మనసు జిక్కుకొనగ
తరచు జేయుచునుంద్రు తప్పులెన్నొ జనులు
మానసిక శాస్త్రంబు మధియించి చూడగా

కార్యముండు వేళ కాకాలు బాకాలు
అమిత వినయముతోడ కార్యంబు దీతురు
పనిజరిగినంతనే పలుకరించరు జనులు
లోకరీతిని మార్చ నెవరి తరము !

ఉన్నదానిని మరచి లేనిదానికి వగచి
మానసంబునందు మరి మరి తలపోసి
రక్తమును మరిగించి క్లేశమును బొందగా
మాయ జబ్బులు వచ్చు మానళికి ఇలలొ

చూచి నేర్చువాడు బహు ఉత్తముండిలను
చెప్పనడచు వాడు మధ్యముండు
చెప్పినను వినకుండ చెడిపోవు మూర్ఖుండు
మందభాగ్యుని మార్చ నెవరికి శక్యంబు

పొద్దుపొడిచినదాది పరమ బిజియందురు
ధన సంపాదనందు తెగ మునిగి తేలుచు
కనురెప్ప పాటున కాళుడు మింగునని
అసలు విషయంబు దెలియక అల్లాడుచుందురు
పరుగెత్తైనా పాలు తాగమంటుందీ లోకం
ఎంత సంపాదించినా అంతులేని ధన దాహం
పప పుణ్యాలకు స్ఠానమేలేదు లేషం
సరిదిద్దుకోకపోతె మానవ మనుగడకే దోషం

సుఖ సౌకర్యములకు బహు వ్యత్యాసముండును
భొగ భాగ్యములందు సుఖముగలదని తలతురు
ఆత్మతత్త్వమెరుగ విచారణ సలుపరు
జ్ఞాన తృష్ణలేని తామస మనస్కులు

పరుల సహాయం కోసం ఎదురుచూడబోకురా
ఒకటి పొందావంటే వందిచ్చుకోవాలిరా
తుంటవేసి మొద్దు అందుకొన్న చందానరా
ఆత్మ విశ్వాసంతో అవనిలో చరించరా !

మనిషి చూచుటకేమొ అందముగనుండును
మాటలేమొ మంచి వరహాల మూటలు
అనంతరంగమందు అపసవ్య భావనలు
కపట మనస్కుని ప్రవర్తన యిటులుండు

గొప్పదనముల పిచ్చి తుచ్చమై యుండగా
బంధువర్గమందు బహు ప్రదర్శింతురు
వంద సంఖ్యలొనుండు బంధు ఖ్యాతికన్న
ఆత్మజ్ఞానమబ్బ విశ్వ ఖ్యాతిని బొందు

Saturday, June 16, 2007

మానవ నైజం

ఇతరులభివౄద్దిని కన్నులారగాంచి
ఈర్ష్యమూలంబున ఇలలోన జనులు
తన ఉనికికే అది బహు ప్రమాదంబని
తలపోతురు మిగుల నిత్యంబు మదిలో

ఎన్నెన్నొ గత జన్మల శుభాశుభ కర్మల
ఫలితమెరుంగని అజ్ఞాన నరులు
పొరుగు సంపద జూసి సంతసంబొందక
తనకు లేదటంచు తెగ కుమిలిపోదురు

ఎంతవారికిలను అంత ఆలోచనే
అరయ మనస్తత్వ శాస్త్రమెరుగ
తానున్న స్థితిలోనె ఇతరులుండాలని
మానసంబున తెగ ఆరాటపడుదురు

ఆదర్శ మార్గాన పయనింప బూనిన
ఓర్వలేని జనులు కొందరిలను
ప్రోత్సహించుట మాని నిందింప జూతురు
లోకరీతిని పరికింప సత్యమిలను

అందరి హృదిలోని పరమాత్ముడొక్కడని తెలయక
తమ మార్గమే గొప్పదని తర్కించుదురు జనులు
ఊర్ధ్వమానసాన పయనించి చూడగా
విశ్వవ్యాపితమైన విశ్వేశ్వరుండొక్కడే !

- నాగులవంచ వసంత రావు

అపసవ్య పోకడలు

సభ్య సమాజపు అపసవ్య పోకడలు
గుండె లోతుల్లో గునపాలై గుచ్చుకుంటే
లావాలా పొంగుకొస్తుంది బాధామయ కవిత్వం
అపసవ్యాన్ని సవరించుకుంటేనే ఉంటుంది భవితవ్యం

శృతిమించిన శృంగారపు చేస్టలు
తామే అన్యోన్యులమన్న హావ భావాలు
అన్నీ నడిరోడ్డు పైనే విచ్చలవిడిగా
హైటెక్కు రోడ్డు మీదే నింగీ నేలా సాక్షిగా

ఎదుటివాడు బాగుపడితే కుళ్ళు
తన విజయానికేమో జలదరించును ఒళ్ళు
ప్రగతి మార్గానికివి వేస్తాయి సంకెళ్ళు
నీచ సంస్కారానికివి చక్కని నకళ్ళు

మూర్ఖుని చిత్తం ఉంగరాల జుట్టు
ఎంత ప్రయత్నించినా మారదు ఒట్టు
మారినట్లుగా చేస్తాడు కనికట్టు
మారాడని నమ్మావా నీపని ఫట్టు

పెంచాలి అనంతంగా హృదయాన్ని
దించాలి సమూలంగా అహంకారాన్ని
త్రుంచాలి క్షుధ్ర మమకారాన్ని
పంచాలి విశ్వవ్యాప్త ప్రేమ తత్వాన్ని
- నాగులవంచ వసంత రావు

Thursday, June 14, 2007

జీవ కారుణ్యం

నూకలెన్నొ జల్లి అమిత ప్రేమగ బెంచి
బిలబిలమని తిరిగె కోడిపిల్లల గాంచి
ఉల్లమందు మిగుల సంతసంబును బొంది
పెరిగి పెద్దవగానె పట్టికోతురు జనులు !

శాంతి ప్రేమలకు చిరునామాలుగా యున్న
పక్షి కపోతమును పట్టుకొనుటకు నరులు
ఉచ్చులెన్నొబన్ని ఉపాయముతో బట్టి
లేశమైన మదిలొ ప్రేమలేక భొంచేతురు !

చూడముచ్చటైన కుందేలు పిల్లల దెచ్చి
యింటిముందు మిగుల యిష్టపూర్తిగ బెంచి
బుల్లి పాపలతోటి బహుళ క్రీడలు జరిపి
పైసలాశ కొరకు ప్రాణాలు దీతురు !

ఆకులలములు బెట్టి అడివంతయు దిప్పి
గొఱ్రె మేకలవంటి జంతువులెన్నొ బెంచి
పెరిగిబలువగానె కటికవానికి యమ్మి
సొమ్ముజేసుకొనగ తెగ మురిసిపోదురు !

లేడి జింక వంటి వన్య ప్రాణులెన్నొ
అందచందాలొలుకు వయ్యారపు నడకలతొ
వన సంపదలకే వన్నె తెచ్చువేళ
వేటగాళ్ళు వెళ్ళి వధియింప జూతురు !

పుట్టి పెరిగినదాది ముసలితనమ వరకు
లెక్కలేని పెక్కు పనులెన్నొ జేయించి
పాలు పెరుగులెన్నొ దండిగారగించి
వట్టిపోయిన క్షణమె వధశాల కిత్తురు !

కటిక వానియొద్ద కరవాలమును జూసి
“మే మే అంబా” యనుచు జాలి చూపులతోడ
తమ్ము వధియింప వద్దని మూగ భాషన పలుక
మూగ జీవుల జంప మనసెట్ల ఒప్పునో !

శాకాహారమందు సకల పోషక పదార్ధములుండగా
మాంస ముద్దలు మింగ మాయ జబ్బులు వచ్చె
ఆరోగ్య రీతియు శాకాహారమె మేలు
అరయ జనులు ఆరొగ్య సూత్రమెరుగ

గాంధీ మహాత్ముడు నుడివిన సత్యాహింసలు
గౌతమ బుద్ధుడు వచించిన జీవ కారుణ్యము
జీసస్ క్రైస్తు చెప్పిన కరుణారస హృదయము
నేడు ఆచరణ శూన్యమై గంగపాలైనాయి !

- నాగులవంచ వసంత రావు

నువ్వే ఆ ఒక్కడివి!

బహు దుర్లభమైనది మానవ జన్మ
బహుమతిగా ఇచ్చాడు భగవంతుడు ప్రేమతో

భౌతిక సుఖ సంపదలు పశ్చాత్య పోకడలు
పర భషా వ్యామోహాలు ధన కనక వస్తు వాహనాలు
వ్యర్ధ గర్వాలు ఆధిక్యతా భావనలు అహంకార ప్రదర్శనలు
కామినీ కాంచన కీర్తి ప్రతిష్టలు దేహ భావనలు

మనిషి మారే దశలో మహమ్మారిలా పీడిస్తాయి
భౌతిక ప్రపంచమే సత్యమని భ్రమలు కల్పిస్తాయి

లక్షలాది మంది భక్తులు నన్ను పూజించి
ఆరాధించినా అందులో ఎవరో ఒక్కడు
మాత్రమే నన్ను పూర్తిగా తెలుసుకుంటాడని
అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ

సాధించాలనే తపన ఉంటే ఏవీ అడ్డు రావు
సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు

ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం సముపార్జించాలి
లక్షలాది మంది భక్తుల్లో ఆ ఒక్కడివి నువ్వే కావాలి!

కర్మలు కరిగించుకొని వాసనలు తొలగించుకొని
భక్తిని రగిలించుకొని జ్ఞాన దిశగా పయనిస్తుంటే
మమకారాలు మనో వికారాలు మాయా వినోదాలు
రాగ ద్వేషాలు అరిషడ్వర్గాలు అడ్డుగా నిలుస్తాయి

ఇప్పటికే లక్షల జన్మలు నీకు తెలేకుండానే గడిచాయి
బహుజన్మాంతర పుణ్యపాక వశాన మానవజన్మ పొందావు
అలక్ష్యం చేస్తే ఏదో ఒక రోజున గతాన్ని తలుచుకొని
వెక్కి వెక్కి ఏడుస్తావు పశ్చాత్తాపం చెందుతావు !

ఆకాశంలో ధృవతారగా వెలగాలని లేదా !
మహాత్ముల జాబితాలో నీకు చేరాలని లేదా !
సువర్ణాక్షరాలతో చరిత్ర పుటల్లో లిఖించబడాలని లేదా !
పరమాత్మ ఒడిలో భద్రంగా ఒదిగిపోవాలని లేదా !

ఉంటే సాధన చేసి ఆ ఒక్కడివి నువ్వే కావాలి
జనన మరణ కాలచక్రం నుండి తప్పించుకోవాలి
కష్టాలు కడగండ్లు ఈతిబాధలనుండి విముక్తి పొందాలి
పునర్జన్మలేని శాశ్వత పరమాత్మ సన్నిధిని చేరాలి

మభ్యపెట్టడానికి వ్రాసిన ఒట్టిమాటలు కావివి
పురాణాలలో శాస్త్రాలలో పెద్దల ప్రవచనాలలో
మహపురుషుల మహర్షుల బొధనలలోని
సారాంశాలు అనుభూతులలోని నగ్న సత్యాలు

- నాగులవంచ వసంత రావు

Wednesday, June 13, 2007

జంట కవులు

ఇంద్రియాలు మహా ప్రమాదకారులు
పడవేస్తాయి మనసును మాయాజాలంలో

శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలతో నిత్యం
ఆనందానుభూతులను అనుభవిస్తుంది మనసు

పంచపాండవుల్లాంటి గొప్ప ఐకమత్యం
మనసును లొంగదీసుకునే పరమ లౌక్యం

ఇంద్రియాల ఒత్తిడికి మనసు చిత్తవుతుంది
అనుభవాల చిరుజల్లులతో తడిసి ముద్దవుతుంది

యవ్వనంలో మదపుటేనుగుల బలం
ఎంతకూ తనివితీరని మధురానుభవం

ఆనందాల అనుభవాల మేలి ముసుగులో
ఒళ్ళును ఇల్లును తెగ గుల్ల చేస్తాయి

పరమ గుట్టుగా సాగిపోయే జీవన నౌకను
నడి సముద్రంలో నిర్ధక్షిణ్యంగా ముంచేస్తాయి

సొమ్మొకడిది సోకొకడిదన్నట్లు
రద్దిమోసేది ఇంద్రియాలయితే

రసానుభూతి పొందేది మనస్సు
రోగాలపాలయ్యేది అమాయక శరీరం

రెండూ కంటికి కనిపించని తోడుదొంగలు
తెలివిగా పని కానిచ్చుకునే బుడుబుంగలు

కుదురుగా కూర్చున్న ఇంద్రియాలను కదిపితే
చుట్టుముడుతాయి తేనెటీగల్లా రసానుభూతులకోసం

అసలుకన్న కొసరు ముద్దన్నట్లు
అనుభవాలకన్న ఊహలలోనే అమితానందం

అందరు హాయిగా అనుభవిస్తుంటే
నాకెందుకు మడి తడియని మనసు గోల చేస్తుంది

పొందినదానికన్న పోగొట్టుకున్న దెక్కువని
అల్ప సుఖాలలోన ఆనందం లేనేలేదని

అంత్యకాలంలో అసలు విషయం తెలుసుకుని
మనసు మరీ మరీ బాధ పడుతుంది

మనసే ఒక మహమ్మరి మనిషే ఒక అహంకారి
బుద్ధి చక్కగా వికసిస్తే అవుతుంది పరోపకారి

- నాగులవంచ వసంత రావు

చెదిరిన కల

చల్లని సాయంత్రం వేళ ఆఫీసుపని ముగించుకొని
ఆఫీస్ స్పెషల్ బస్సులో కాలనీ వైపు ప్రయాణం

కాలనీ స్వాగత ద్వారాలకు అల్లంత దూరంలో
అత్యంత ఆర్భాటంతో స్వాగతం పలికే బ్యానర్లు

అత్యాధునికంగా అలంకరించిన రెండు భవనాలు
నా కాలనీకి యింత అదృష్టం పట్టిందా అన్న ఆనందం

అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన
రానే వచ్చింది బస్సు స్వాగత ద్వారాల మధ్యకి

ఏ శుభకార్యమో లేక విద్యా సంస్థ ప్రారంభొత్సవమో
జరుపుకుంటుందేమోనని మదిలో ఆలోచన

కాలనీకి మహర్దశ పట్టబోతుందన్న ఆనందం
బ్యానర్ చదివిన నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను

కళ్ళు బైర్లు కమ్మి ఒక్కసారిగా బస్సుదిగాను
మరొక్కసారి రెండువైపులా బ్యానర్లను తీక్షణంగా చదివాను
నేను చూసింది నిజమేనని నిండా నిర్ధరించుకున్నాను
మందుపాతర పేలినంత పెను శబ్ధంతో
కాళ్ళకింద భూమి కంపించినట్లైంది

వందలాది పాఠశాలలు, వేలాది విద్యార్థులు
లెక్కలేనన్ని కళాశాలలు, ఉపన్యాసకులు
వేలాదిమంది ఉద్యోగులు, విద్యావేత్తలు
నా కాలనీ అంతా మేధావుల మేలు కలయికే

అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది
గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం
బరువెక్కి బజారుపాలైంది

ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు
“చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి
ఐస్ ముక్కల హిమతాపానికి కరిగిపోయాయి
మహాత్ముల ఉపన్యాసాలు, నీతి బొధలు
సంఘ సంస్కర్తల త్యాగఫలాలు
మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి

మధ్యం నిషా ముందు యింద్రభొగం దిగదుడుపే
ఎవడన్నాడు నా దేశం బీదదని
ఒక్కసారి బార్ ను దర్శించి చూడు
కుబేరుల తలదన్నే కాసుల గలగలలు
కుంభవృష్టిలాగా మధ్యం సెలయేర్లు

గజం భూమి ధర గణనీయంగా పెరిగన నేడు
గజానికో బార్ వెలసినా ఆశ్చర్యం లేదు
మందు మంచినీరులా ఉపయోగించినా కరువే రాదు
పరోపకారానికి పదిసార్లు ఆలోచించాలిగాని
స్వాత్మానందానికి సవాలక్ష ఖర్చైనా ఫర్వాలేదు

మనసా! ఇంద్రియాలంటే నీకెందుకింత చులకన
క్షణాలలో పడేస్తావు నీ వలలో క్షణికానందాలకు

ఆరునూరైనా అనుకున్న టైంకు హాజరు పరుస్తావు
నీ కబంధ హస్తాలలో నిత్యం బందీని చేస్తావు

నాకెందుకో కసిగా కక్ష్య తీర్చుకోవాలనుంది
మద్యం సేవించే వారిపై కానేకాదు
త్రాగడానికి మనసును ఉసిగొలిపే ఇంద్రియాలమీద
మానవాభ్యున్నతిని మట్టుబెట్టే మనో చాంచల్యం మీద!

- నాగులవంచ వసంత రావు

Tuesday, June 12, 2007

బలహీనతలు

మనసుకు మత్తెక్కించి ఇంద్రియాలను ఉసిగొలిపే
అశ్లీల సాహిత్యం కాదు నేడు జగతికి కావలసింది

ఇంద్రియాలను శాంతపరచి మానసిక వికాసం కలిగించే
విజ్ఞాన జనిత, భక్రిరస పూరిత ఆధ్యాత్మిక రచనలు కావాలి

అమాయకులను భయపెట్టే క్షుధ్ర రచనలు
కాసులను మూటగట్టుకునే ఆత్మవంచనలు

ద్వంద్వార్ధాల పాటలతో క్యాసెట్లు, సి.డి.లు
జుగుప్సాకర భంగిమలతో అతివల పోస్టర్లు

ఇంద్రియాలు పట్టుదప్పి రసాస్వాదనకై పరుగులు
మనసును మత్తెక్కించే మాయాజాలాలు

అర్ధనగ్న దృశ్యాలు, హావభావ అనాగరిక చేష్టలు
కళ్ళు తెరచి చూడలేని శ్రంగార భంగిమలు

ఇంద్రియాలను పట్టుతప్పించే విపరీతపు సంగీతాలు
మన సినిమాలు, టి.వి.లు బహుచక్కగా ప్రదర్షిస్తునాయి

మూఢ నమ్మకాలను ప్రోత్సహించే యంత్ర తంత్రాలు
మానవ జాతికి పట్టిన బహుకాలపు మూర్ఖత్వపు చీడలు

దేవుడు ఆవరించిండంటూ తెగ ఊగే పూనకాలు
మద్యం మత్తులో జనానికి వేసే మోసపు టోపీలు

గతాన్ని భూతంలా వర్ణించి వర్తమానాన్ని వక్రీకరించి
భవిష్యత్తు గురించి భయపెట్టే కంప్యూటర్ వగైరా

జ్యోతిష్యాలు మానవ మనుగడకు అశనిపాతాలు
ప్రపంచ ప్రగతి మార్గానికి తీరని అవరోధాలు

అదృష్టం తన చేతుల్లోనే, చేతల్లోనే గలదని తెలియక
అమాయకంగా జ్యోతిష్కునికి చేయందించే ప్రబుద్ధులు

మాటకారులకు కాసుల పంటగా మారే అక్షయ పాత్రలు
మూఢ విశ్వాసాల, బలహీనతల గూట్లో చిక్కిన చిలుకలు

ముక్తి ప్రసాదిస్తామంటూ మూటలు కోరే స్వామీజీలు
కాషాయం ముసుగులో దర్జాగా జీవించే అపర కుబేరులు

హృత్ తాప నివారణ గావించకనే విత్తాపహరణ చేసే బాబాలకు
ముక్తిని అంగడి వస్తువుగా భావించే అమాయక భక్తులే సమిధలు
- నాగులవంచ వసంత రావు

విచిత్ర లోకం

వింతల బొంత సోదరా ఈ లోకం
విచిత్రంగా ప్రవర్తిస్తుంది నీ పట్ల

తనదెప్పుడూ మొదటి స్తానమేనంటుంది
నీదెప్పుడూ కడపటి స్థానమని తేలుస్తుంది

గాడిద నెక్కమంటాడు గడుసుగా ఒకడు
దనిది మాత్రం ప్రాణంకాదా అంటాడు మరొకడు

పెను ఉప్పెనలాంటి విమర్శల అలలు
రేపుతాయి మనో వీధిలో అల్లకల్లొలాలు

తన దారిలోకి తెచ్చుకో జూస్తుంది ఎప్పుడూ లోకం
తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం

కామెర్ల రోగికి లోకమంతా బహు పచ్చన
లోకం దృష్టిలో నీ స్తానం బహు చులకన

లోకుల మాటలు వింటే పడతావు ఎన్నో తిప్పలు
అంతర్వాణిని అనుసరిస్తే సాధిస్తావెన్నో విజయాలు

లోకుల ప్రశంసలకు అతిగా పొంగిపోకు
మెప్పులు గొప్పలు త్వరలోనే మాసిపోవు

లోకపు అపసవ్యపు మాటలకు వెరవకు
అంతర్ లక్ష్యాన్ని ఎప్పుడూ నువు మరువకు!

- నాగులవంచ వసంత రావు

Thursday, June 7, 2007

బలి పశువు

మూర్తులను సేవించే నేటి దేవాలయాలు
కొంతమంది యువతీ యువకుల ప్రేమాలయాలు

శృతిమించిన విద్యార్ధుల వేధింపులు
తెస్తాయి విద్యాలయాలకు తలవంపులు

అల్లారుముద్దుగా పెంచుకున్న అమాయకపు
ఆడపడచుల బంగారు భవిష్యత్తుకై
అందమైన ఆశా సౌధాలెన్నో నిర్మించిన
తల్లిదండ్రుల కలలన్నీ కల్లలైపోతున్నాయి
కన్నెళ్ళే చివరికి కన్నవారికి మిగులుతున్నాయి

తాను ప్రేమించిన యువతి
తన ప్రేమను తిరస్కరించిందని
యాసిడ్ పోసో గొంతు కోసో
కసాయిగా ప్రవర్తించిన ప్రేమ ఉన్మాది
సమాజానికి మహా ప్రమాది

తాను సమాజంలో మంచిగా జీవిస్తున్నా
తన చుట్టూవున్న సామాజిక ఉన్మాదులు
అమాయక జీవితాలనే కర్కశంగా
కబలిస్తున్నారు పరమ కామాంధులు

తాను వాహనం చక్కగా రోడ్డుపై నడుపుతున్నా
ప్రక్కవాడి చోదక ప్రావీణ్యతా లోపానికి
బలియయ్యే బడుగు నిరపరాధి
తప్పుడు లైసెన్సులకు బలిపుశువైన సంఘజీవి

నీవు మంచిగా ఉన్నంతమాత్రాన సరిపోదు
నీ చుట్టూ సమాజాన్ని ఒక్కసారి పరికించి చూడు
మత్తువదలి మహత్తర శక్తిగా విజృంభించు
సంఘ విద్రోహులను సమూలంగా మట్టుపెట్టు

సామాజిక స్పృహను సదా గుండెల్లో రగుల్చుకో
అన్యాయాలను ఎదిరించే ధైర్యాన్ని పెంచుకో

వర్తమాన కాలంలో సభ్య సమాజంలో జరిగే
అన్యాయాలను, అక్రమాలను రూపుమాపడానికి
సమయానుకూలంగా అస్త్రాన్ని సంధించు
ప్రళయకాల ప్రభంజనంలా ప్రయోగించు!

- నాగులవంచ వసంత రావు

దైవత్వం

జగమంతా నిండియున్న భగవంతుని ఉనికినుండి
కోర్కెలీడేర్చుకొనగ భువికి యరుగుదెంచినావు

గతజన్మల కర్మఫలము ననుభవింప నీవు
ఈ ధరణియందు జీవునిగ అవతరించినావు నేడు

పసిపాపగ మెలగినపుడు నిష్కపటంగా బ్రతికినావు
యవ్వన దశకు చేరగనే కామ వికారాలు బొందినావు

అరిషడ్వర్గాల జిక్కి నిజతత్త్వం మరచినావు
ఈర్ష్యా ద్వేషాలతోడ స్వార్ధంబును బెంచినావు

దేహమే నిత్యంబని సౌందర్యాల గాంక్షించినావు
ధనమే శాశ్వతంబని ఆశలొబడి పోయినావు

అంతులేని కోర్కెలతో అలమటించి పోయి నీవు
మనశ్శాంతి కరువైపోగ మనోవ్యాధి బొందినావు

చపలత్వపు మనసుజేరి దేశాలన్ని దిరిగినావు
ఎక్కడ ఏమీ దొరకక బేజారెత్తి పోయినావు

పంచ జ్ఞానేంద్రియాల పంచనబడి పోయినావు
వంచన చేసే మనసుకు లొంగిపోయిన నీవు

తల్లిదండ్రులొక పక్క భార్యా బిడ్డలు మరో పక్క
సమస్యలు ఒకవైపు సమాజం మరోవైపు

అంతులేని సుడిగుండాలలొ ముంచెత్తిన గాని
బ్రతుకుమీద ఆశచేత భరియించు చున్నాడవు

కస్టాలు కన్నీళ్ళు వేధింపులు వెక్కిరింతలు
రోగాలు ప్రమాదాలు వృద్దాప్యం మృత్యువాత

ఎన్నీ ఎదురైనగాని మనసు పరమార్ధం వైపు పోదు
మాయ యనగ యిదేనేమొ మహిలోన తరచి చూడ

జీవ భ్రమలొ జిక్కి నీవు దేహంబని భ్రమసినావు
దేహభ్రాంతి వీడకుంటె జీవన్ముక్తి లేనెలేదు

కోర్కెలు కొండెక్కకుంటె మరు జన్మ తప్పదు మరి
శాస్త్రంబును పాటించనిచో సద్గతియే లేదు మనకు

సజ్జన సాంగత్యంబుతొ సంస్కారం బెంచుకొని
సద్గురు బోధకులచేత పరమార్ధం తెలుసుకొని

నిత్య జీవితంలో నువు ముక్తి బాట పయనించి
భగవంతుడి ఒడిలో నువు భధ్రంగా ఒదిగిపో!

- నాగులవంచ వసంత రావు

Tuesday, June 5, 2007

సహకారమే ఊపిరిగా…

రెండు చేతులు కలిస్తే చప్పట్లు
రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు

భావ సారూప్యం సాధిస్తే సహకారం
సంఘ సభ్యులందరికి ఉపకారం

బడాబడా సంస్తలు బోర్డు తిప్పినవేళ
సంఘ సభ్యుల ఆర్తనాదాల గోల

స్వార్థ చింతన సహకారానికి గొడ్డలిపెట్టు
పారదర్శకతే సహజీవనానికి ఆయువుపట్టు

మనిషి మనిషిగా జీవించడం ఓ కళ
దగాచేసి ధనికుడ నవుతననుకోవడం ఓ కల

జీవితం ఎల్లప్పుడు శాశ్వతం కాదు
నైతిక విలువలు లోపిస్తే ప్రగతి రాదు

మానవత్వం లోపించిన సమాజం
అధ:పాతాళాలకి దిగజారే ప్రమాదం

కష్టించి, చెమటోడ్చి, పొదుపు చేసి
పైసా పైసా కూడబెట్టుకున్న సభ్యుల ధనం
కస్టకాలంలో ఆదుకుంటుందని భావిస్తుంది జనం

విద్యాబుద్ధులకు, పెళ్ళి శుభకార్యాలకు
వ్యాపారాది వివిధ జీవన వృత్తులకు
ఉపకరిస్తుందని దాచుకున్న శ్రమఫలం

స్వార్థపరుల సంకుచిత బుద్ధి వల్ల
ఒక్కసారిగా ధనమంతా హుష్ కాకీయని తెలిసినవేళ
ప్రాణాలు విలవిలలాడిన సభ్యుల ఆక్రందన
ఒక్క క్షణం ఆ స్తానంలో నీవుంటే తెలుస్తుంది నిజం

ఆర్తనాదాలతో ఆదుకొమ్మంటున్న
సంఘ సభ్యుల హృదయ ఘోష
అరణ్యరోదనగా మిగిలిన ఆఖరి సన్నివేశం

విద్యార్థి లోకంలో బోలెడన్ని ఆశలు
నవ వధూవరుల్లో వర్ణించలేని భవిష్యత్ కలలు
నిరుద్యోగి కళ్ళల్లో చిగురిస్తున్న ఆశలు

సహకారం సహకరించలేదని తెలిసిన క్షణం
అంధకారబంధురమైన భవిష్య జీవనం

మనశ్శాంతిలేక మనుగడ సాగిస్తున్న దగాకోరులు
కళ్ళెదురుగానే ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ
సభ్య సమాజ దోపిడీదారులకు కనువిప్పు
సత్యాన్ని గ్రహించి మనగలిగితెనే భవిష్యత్తు

నేటి మన సభ్యుల సహకారం
కావాలి భావి తరాలకు మార్గదర్శకం

చేతులతో పాటు హృదయాలు కలవాలి
ఒక్కత్రాటిపై అహర్నిశలు నడవాలి
వ్యక్తిగా సాధించలేని కార్యాన్ని
సమిష్థిగా సాధించగలమని చాటాలి

ప్రపంచానికే సహకారులు ఆదర్శంగా నిలవాలి
మనస్పర్ధలు లేని మనుష్యులుగా మెలగాలి
మమతానురాగాలను దండిగా పంచుకోవాలి
మానవత్వ పరిమళాలను మెండుగా వెదజల్లాలి

మనొభీస్ఠం నెరవేరాలని సర్వేశ్వరుని ప్రార్ధిద్దాం!
సహకారమే ఊపిరిగా కలకాలం జీవిద్దాం!!

- నాగులవంచ వసంత రావు

Monday, June 4, 2007

జీవుడే దేవుడు

దేవుడో దేవుడంచు దేవులాడనేలరా
నిన్ను నీవు తెలుసుకుంటె నీవే దైవంబురా

మూఢ నమ్మకాల జిక్కి వ్యసనాలకు బానిసవై
నిరక్షరాస్యత కోరలలో నిర్జీవిగ మారినావు

కోర్కెలీడేరునంచు ముడుపులెన్నొ గట్టినావు
లెక్కలేని దేవుళ్ళకు మొక్కులెన్నొ మొక్కినావు

నిజతత్త్వం గానలేక మొక్కులెన్నొ మొక్కినావు
కాలసర్ప కోరలలో బందీగా జిక్కినావు

గొర్రెదాటు ఆచారాలు గొప్పగ పాటించి నీవు
అజ్ఞానపు మంటలలో మిడుతవోలె మాడినావు

మారెమ్మల మైసమ్మల మంత్రాలలొ జిక్కి నీవు
చేతబడులంటు నీవు చాదస్తం బెంచినావు

గుడులు గోపురాలంటూ వీధులన్ని దిరిగినావు
గుండెలోని దైవాన్ని గాంచలేకపొయి నీవు

తీర్థ యాత్రలెన్నొజేసి తిప్పలబడి పోయినావు
పుష్కర స్నానంబుజేసి పుణ్యమాశించినావు

గుడిలోని ప్రతిమనుగని చెంపలు వాయించినావు
చెయ్యని తప్పుకు నీవు శిక్ష ననుభవించినావు

కర్మమర్మం దెలియక నువు కంప్యూటర్ జాతకంతొ
భవిష్యత్తు నిర్ణయించి భంగపడి పోయినావు

నీవే దైవంబన్న నిజతత్త్వం దెలియలేక
కస్తూరి మృగంవోలె కారడవుల దిరిగినావు

జీవెభ్రమలొ జిక్కి నీవు దైవత్వం మరచినావు
ద్వైత భావంబుతోడ దేహంబని భ్రమసినావు

జగన్నాటకంబులోన ప్రేక్షకునిగ మిగిలిఓక
చక్కనైన పాత్ర తోడ శాశ్వతంగ నిలిచిపో

అజ్ఞానం తరిమికొట్టి ఆత్మసిద్ది పొంది నీవు
ఆనందపు టనుభూతుల నిత్యం మది నింపుకో

దీనత్వం వీడి నీవు దైవత్వం వైపు నడచి
నీలొగల దివ్యత్వం నిండుగ ప్రకటించుకో!

- నాగులవంచ వసంత రావు

మేలుకొలుపు

జీవితమంటేనే కష్ట సుఖముల పెనుగులాట
మర్మం తెలుసుకుంటే మనకది వెలుగుబాట

లక్ష్య నిస్ఠలో నీకు కలిగిన మరపు
చేస్తుంది జీవితానికి అంతులేని చెరుపు

గరిటెడంత కృషి మేసి గొప్పగా పొంగిపోకు
గంపెడంత ఫలితం రాలేదని దిగులుగా కృంగిపోకు

క్షణికోద్రేకంలో చేసిన తప్పు
తెస్తుంది జీవితానికెంతో ముప్పు

గతాన్ని మరువనంతకాలం ఉంటుంది పురోగతి
మరచిన మరుక్షణమే అవుతుంది అధొగతి

సహజ జీవనమే సద్గతికి రహదారి
విలాస జీవితమే వినాశనానికి వారధి

చదువు నేర్పిన చక్కని సంస్కారాన్ని
నిలువెత్తు స్వార్థం స్వాహా మేసింది
అదేమని ప్రశ్నించిన అంతరాత్మ
నోరు నొక్కింది అంతులేని అహంకారం

తాత్కాలిక ఆనందాలకు తిలోదకాలిద్దాం
ఉత్తమ సంస్కారాలకు ఊపిరిపోద్దాం
ఉత్తుంగ తరంగమై ఉవ్వెత్తున లేద్దాం
జాతి ఔన్నత్యాన్ని జగతికి చాటుదాం
- నాగులవంచ వసంత రావు

Sunday, June 3, 2007

దాన గుణం

గుడిసెలోన యున్నవాడు మేడ కొరకు తపియించె
మేడలొ నివసించువాడు పది మేడలను కాంక్షించె

సైకిలున్నవాడేమొ బైకు కొరకు దేబిరించె
బైకు గలిగిన వాడు కారు కొరకు కలవరించె

వేల సంపదలున్నవాడు లక్షల కొరకు ప్రయత్నించె
లక్షలు గూడిన పిదప కోట్ల కొరకు పరుగులెత్తె

ఆశయంటె యిదేనేమొ అవనిలోన పరికింప
ఆశ ఉండవచ్చుగాని అత్యాశ నీకు తగదెప్పుడు

ఆశపాశ బద్ధుడవై అనుక్షణం తపియించి
సాలెపురుగు వోలె అత్యాశలోన జిక్కినావు

ఇంకొచెం ధనముంటె దానాలెన్నొ జేసెవాడినని
అంతరాత్మ హితోక్తిని అతి తెలివిగ ఆణచివేసి

జీవిత కాలమంత ధనకాంక్షలొ జిక్కినావు
కోట్లకు పడగెత్తినా కోర్కెలెన్నొ బెంచినావు

కలిగిన దానిలొ దానం ఈరోజు చెయ్యనోడు
రేపు కలిసొస్తే చేస్తాడనేది కల్లయని తెలుసుకో

ఉన్నంతలోనె సదా ఉదారంగ దానం చేసి
మానవ జన్మ సార్ధకతను మహిలోన చాటాలోయి

మృత్యువెపుడు కబళించునొ మనకసలే తెలియదోయి
కనురెప్ప పాటులోన జీవితమ్ము అంతరించు

నీవు కన్న కలలన్నీ కల్లలుగా మారునోయి
శ్వాస ఆడినపుడె విరివిగ దానంబు జేయవోయి

గుప్తదాన మొనరించి గట్టి ఫలము నొందవోయి
దానకర్ణుడు యనెటి బిరుదాన్ని బొందవోయి!

- నాగులవంచ వసంత రావు

Saturday, June 2, 2007

మహాత్ముడు

ఎవరన్నారు నీవు సామాన్యుడివని
నీకు నువ్వే ఊహించుకున్నావు భావించుకున్నావు
పొరుగువాడితో పదే పదే పోల్చి చూసుకున్నావు
నలుగురితో నారాయణయని సర్దుకు పోతున్నావు

గొర్రెల మందలో ఒకటిగా దూరావు
అసలు స్వరం మరచి అనుకరిస్తున్నావు
ఒక్కసారి నీ గతాన్ని సిమ్హవలోకనం చేసుకో
నీ నిజ స్వరూపం అవగతమనుతుంది చూసుకో!

పులిలాంటి వాడివి పిల్లిగా మారావు
సిం హ గర్జన మాని హీన స్వరం అలవర్చుకున్నావు
ఒక్కసారి నవచైతన్యాన్ని మదినిండా నింపుకో
మాయపొరలను జ్ఞాన ఖడ్గంతో చేధించుకో!

ఇందృయాల సందిట్లో బందీవైపోయావు
బాహ్యాకర్షణలకు బలిపశువుగా మారావు

ఇంద్రియాలు మనస్సు జంట కవులు
తీస్తాయి కూనిరాగలు ఉత్సాహం ఉరకలేసినప్పుడు
చల్లుతాయి ఇంద్రియాలు అనుభవాలనే మత్తు
చేస్తాయి మనస్సును ఆదమరిస్తే చిత్తు

ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకో
ఒక్కసారి నీ విశ్వరూపాన్ని ఊహించుకో
విశ్వ శక్తులను నీలో విలీనం గావించుకో
అంతర్ముఖుడవై ఆత్మాన్వేషణ సాగించు

అంతులేని ఆత్మానుభూతిని అనుభవించు
ఆధ్యాత్మిక అమృతత్వాన్ని ఆస్వాదించు

పుట్టగానే గాంధీ “మహాత్ముదు” కాలేదు
పురిటిలోనే సిద్ధార్ధుదు “గౌతమ బుద్ధునిగా” మారలేదు
బాల్యంలోనే నరేంద్రుడు “వివేకానంద” అవలేదు
కృషిలేకుండానే “అబ్దుల్ కలాం” భారత రాష్ట్రపతి కాలేదు

కారణ జన్ములుగా కొందరు భూమిపై అవతరిస్తే
కర్మలు పండించుకొని కడతేరినవారు మరికొందరు

“నేతి నేతి” (ఇది కాదు ఇది కాదు) అని
పదే పదే ఘోషిస్తున్నాయి మన వేదాలు
అనాదిగా బొధిస్తూనే ఉన్నారు ఆత్మ జ్ఞానులు
సమకాలీనులు సమయానుకూలంగా ప్రవచిస్తున్నారు

అందుకే స్వామి వివేకానంద ఏనాడో పిలుపునిచ్చాడు
“పరమ పవిత్రులు, నిస్వార్థపరులైన కొంతమంది
యువతీ యువకులను వారి తల్లిదండ్రులు నాకప్పగిస్తే
యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించ గలను” అని

నేడు ప్రపంచం నలుమూలలా లక్షలాది మంది
రామకృష్ణ మఠం ద్వారా లబ్ధి పొందుతున్నారు

అరిషడ్వర్గాలు, ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు,
మతకల్లోలాలు, ప్రాంతీయ పక్ష పాతాలు, అశాపాశాలు,
మాయామోహాలు, మమకారబంధాలు పెంచుకుంటే
“సామాన్యుడివే” త్రుంచుకుంటేనే “మహాత్ముడివి.”

స్వల్ప సుఖాలకోసం సామాన్యుడిగా జీవిస్తావో
మనువు పేరును నిలబెట్టి మహాత్ముడిగా మారి
ఆచంద్ర తారార్కం ధృవతారగా వెలిగిపోతావో
నీ అభీస్ఠంపై ఆధారపడి ఉంది ఆలోచించుకో!

- నాగులవంచ వసంత రావు

Friday, June 1, 2007

పరానుకరణ

మనిషేమో ఇక్కడ
మనసేమో అక్కడ
భారతీయులమంటూనే
బహిర్దేశాల పోకడ

భౌతికంగా స్వతంత్రులం
అయ్యామన్న మాటేగాని
భావ స్వాతంత్ర్యాన్ని
మాత్రం పూర్తిగా కోల్పోయాం

పాలించట్లేదన్న మాటేగాని
పచార్లు మాత్రం వాళ్ళ చుట్టే

మన సంస్కృతీ సాంప్రదాయాలను
విదేశీయులు విపరీతంగా ఆదరిస్తుంటే
మనం మాత్రం తగుదునమ్మా యని
తెగ అనుకరిస్తున్నాం వారిని వేషభాషల్లో

దాలర్ల కోసం ఒకటే కలవరింతలు
దాబు దర్పాల కోసం పరితపింపులు
గొప్పతనం కోసం పడుతున్న తిప్పలు
తెస్తాయి మానవాళికి ముప్పులు

విదేశీ వస్తువనగానే విపరీతమైన మోజు
తన దేశందనగానే తగని నిట్టూర్పు

సగం ప్రదర్శించడమే సంస్కారమైతే
సాంతానికి మరి అర్థమేమిటో
నిక్కచ్చిగా నిఘంటువును ఆస్రయించవలసిందే
చరిత్రను చమత్కారంగా తిరగ వ్రాయవలసిందే

- నాగులవంచ వసంత రావు

చదువుల తల్లి

విద్య యనే రెండక్షరాలలో
విశ్వమంత దాగున్నదిరా
చదువుల తల్లిని సంపాదించుటె
సకల విద్యల సారమురా

పాలనిచ్చిన తల్లే నీకు
ప్రథమ గురువని తెలియరా
ఊహ తెలిసిన క్షణం నుండి
తల్లే నీకు దైవమురా

జ్ఞానం నేర్పే గురువే నీకు
ఇలలో అపర బ్రహ్మమురా

విదేశ చదువు మోజులలో
పరదేశ వస్త్ర ఫోజులలో
ఎండమావుల వెంట పరుగులెత్తకు
మాతృదేశ గౌరవాన్ని మంటగలుపకు

విదేశీయుల ధనం కోసం
విద్యలెన్నో నేర్చి నీవు
పరుగులెత్తి పాలు త్రాగుచు
జన్మభూమినె మరచినావు

నోట్ల కట్టల ఎరను వేసి
మేధనంతా పీల్చినారు
జన్మ భూమికి అంతులేని
ద్రోహమెంతో జేసినావు

స్వంత లాభం కోసమై నువు
జన్మ భూమినె మరచినావు
నీదు సౌఖ్యం ముఖ్యమంటూ
దేశప్రగతిని మరచినావు
- నాగులవంచ వసంత రావు

మాయ

ఎండమావి లాంటిది మాయ
ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా
ఊహించి. ఊరించి, ఉసిగొలిపి
తెగ తికమక పెడుతుందీ మాయ

మాయ చేతిలో మహామహులే మట్టికరిచారు
చరిత్ర హీనులుగా చివరికి మిగిలిపోయారు

బావిలోని నాచులాంటిది మాయ
వైరాగ్యమనే రాళ్ళను తరచుగా రువ్వితే
అసలు స్వరూపం అవగతమౌతుంది
అజ్ఞానాంధకారాలు అంచెలంచెలుగా
పటాపంచలై సత్యదర్శనమౌతుంది చివరికి

పిల్లిలా పొంచి వుంటుంది మాయ
మనసు ఎప్పుడు బలహీనపడుతుందా అని

ఒక్క క్షణంలో మోసంలో పడవేస్తుంది
మోహావేశంలో మత్తుగా ముంచెత్తుతుంది

అష్ఠ, శత, సహస్రావధానులైనా సరే
ఆదమరిస్తే మాయ చేతిలో పసిబిడ్డలే

సర్వసంగ పరిత్యాగులైనా, విరాగులైనా సరే
నిగ్రహం కోల్పోతే మాయకు గులాములే!

భాషా పాండిత్యాలకు లొంగనిదీ మాయ
ఎంతటి విద్వాంసులైనా మాయకు అధీనులే

ఇంద్రియాలకు లోబడి ప్రవర్తించినంత కాలం
అంతర్వాణిని పెడచెవిని పెట్టి తిరిగినంత కాలం

సాధించలేమోనని సందేహించకు సాధకుడా!

మహాత్ముల నీతిబొధల స్ఫూర్తితో
శజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనలతో

వర్తమాన పరిస్థితులను విపులంగా విశ్లేషిస్తూ
మాయ కళ్ళకే మాయ పొరలు కమ్మించి

ఆకాశ వీధిలో సూర్య భానునిలా నిత్యం వెలిగిపో!
మాయను నిండా జయించి మహాత్ముడిగా మిగిలిపో!!


- నాగులవంచ వసంత రావు

హృదయ శుద్ధి

మానవ హృదయమే మహోన్నత దేవాలయం
సమస్త దేవతలకు చక్కటి ప్రశాంతి నిలయం

హృదయం దున్నిన దుక్కిలా ఉండాలి
ఏ క్షణాన తొలకరి జల్లులు వర్షిస్తాయో

ఏ హృదయం అనంత సద్భానలను
చకోర పక్షిలా ఆస్వాదిస్తుందో

ఏ హృదయంలో ఎన్ని జ్ఞాన పుష్పాలు
వికసించి విరబూసి ఉవ్వెత్తున లేస్తాయో

హృదయం ఉషర క్షెత్రమైతే
సంకల్ప బీజం గట్టిదైనా వ్యర్ధమే

సంకల్ప బీజం బలహీనమైతే
హృదయం శుద్ధమైనా వృధాయే

హృదయం సంకల్పం రెందూ మంచివైనప్పుడు
జ్ఞాన తరంగాలు ఉవ్వెత్తున లేసి ఎగిసిపడు

అణు విస్పోటన ప్రభావం కొంత ప్రదేశం వరకే
హృదయ విస్పోటనం విశ్వ వ్యాపిత ప్రభంజనం

మానసిక సంకల్పాలకు హృదయమే కేంద్ర స్థానం
అందుకే మనసును హృదయంలో విలీనం చేయి

అనంత దివ్య శక్తులకు నిలయం హృదయం
ఉద్దీపన గావిస్తే మానవాళికే మహోదయం

హృదయ స్పందన భాషగా మారి బహిర్గతమైతే
శతకోటి మానవ హృదయాలను పులకింపజేస్తుంది

తలను కాదు హృదయాన్ని అనంతంగా పెంచాలి
మానవత్వాన్ని చేతలలో పదుగురికి పంచాలి

ఓక్క సంఘటన చాలు మనిషి పూర్తిగా మారడానికి
ఓక్క హృదయ స్పందన చాలు మానవాళి గమ్యం చేరడానికి

మేడి పూతలాంటి ఒక్క మెరుపు చాలు
హృదయ వికాసం జరిగి విశ్వవ్యాపితమవడానికి

దేవుడెక్కడో ఆకాశం ఆవల కూర్చుని లేడు
దయగల హృదయంలోనే దాగి ఉన్నాడు చూడు

ఒక్క సద్గురువు మాత్రమే మహిలో
సత్ శిష్యుని హృదయ తంతిని మీటగలడు

యావత్ ప్రపంచానికే బొధించగల
మహా ప్రవక్తగా మార్చగలడు

- నాగులవంచ వసంత రావు