Wednesday, June 20, 2007

జ్ఞాన మార్గం

సిద్దపురుషుల చరిత అమిత శ్రద్ధగ చదువ
గుండె చెరువైపోగ కడువ కన్నీళ్ళొలికె
కారణ జన్ములకు కస్టాలు తప్పవు
ధర్మ పథమున నడువ సత్యమిలను

నామరూప జగతి సత్యంబుగా దోచు
మాయ వలన మహిని మనుజునకును
నిత్యానిత్య వస్తు వివేచన సలుపంగ
మాయ తొలగిపోయి మర్మమెరుగు

పెక్కు జనుల శవములు కనులార గాంచియు
తనకు మరణమిపుడు రాదటంచు
భౌతికమును బహుగ ప్రేమించుచుందురు
హంస ఎగిరిపోవు క్షణము దెలియలేక

మంచి పనులు జేయ మాయ యడ్డగించి
విఘ్నంబులెన్నియో కల్పించుచుండును
ఆత్మ స్థైర్యముతోడ అడుగు ముందుకు వేయ
మాయ తొలగిపోయి దారి చూపించును

సృష్టిలోన మానవ జన్మ ఉత్కృష్టము
విచక్షణ శక్తి యుండుటే దీని ఘనత
మంచి చెడ్డలుగని మసలుకుంటె మిగుల
మనిషి జన్మ యిలను బహుళ సార్ధకమగును

నేను నేనటంచు తెగ విర్రవీగును
దేహ భావముతోడ జీవుడిలను
భారమైన వేళ భగవంతుడేడును
తన బలము చాలదని అనుభవంబుతోడ

విశ్వ పరిధి బహు విశాలమై యుండగా
తా తన కుటుంబము బంధు మిత్రులంటు
నూతిలో కప్పవలె గిరిగీసుకొందురు
అదియె సర్వస్వమని తలపోయుచుందురు

కులపిచ్చి మతపిచ్చి కాంతలందున పిచ్చి
ధన కనక వస్తు వాహనంబుల పిచ్చి
పేరు ప్రతిష్టల గొప్పదనముల పిచ్చి
ఆత్మసిద్ధి కొరకు అల్లాడుటొక్కటే అసలు పిచ్చి

సిరిసంపదల కొరకు ప్రాకులాడువారి
తెలివిమంతులని తెగ జెప్పుకొందురు
పరమార్ధము కొరకు పరితపించువాని
పిచ్చివాడటంచు పరిహసింతురు జనులు

సంకుచిత భావంబు ప్రగతి నిరోధకంబు
విశాల భావంబు విశ్వపరిధి గాంచు
సజ్జన సాంగత్యమె సకల శుభకరంబు
సన్మార్గ వర్తనమె సర్వుల కామోదంబు

మనసును నులిపెట్టనిదే మాటవినదు పరికింప
సుత్తిదెబ్బల కోర్చినపుడె రాయి దేవుడగునటుల
కస్టాలెన్నొ ఎదురౌను సన్మార్గాన పయనించ
ఓర్పుతోడ చరియించ ఆనందాలు నీవెంట

భౌతికమందున బహుసుఖము గలదంటు
బాహ్య ప్రపంచాన తిరుగాడుచుందురు
అంతరంగమందు అమృత భాండమ్ము
గాంచలేరు జనులు సాధన సలుపరేని

జిహ్వ చాపల్యంతొ జీవుండు చెడిపోవు
స్పర్ష సుఖముచేత సుఖరోగములు వచ్చు
అందాల నాశించి బంధాలలో జిక్కు
శబ్ధ కాలుష్యమున చెడు మార్గమబ్బును

కామాతురతబొంద మనసు వశము దప్పు
ఉచితానుచితంబు మిగుల సన్నగిల్లు
బలహీన క్షణమొకటి బలిపశువుగా మార్చు
బంగారు భవిష్యత్తు భగ్గుమని మండును

ఎంత సంపాదించి ఎన్నాళ్ళు బతికినా
శాశ్వతంబుగాదు తనువు తర్కించి చూడగా
తన్నుద్దరించుకొని విశ్వశ్రేయస్సు కాంక్షించి
పరితపించువాడె పరమ యోగీశ్వరుండిలను

మలినరహిత మనసువలన మంచి దేహముండురా
ఇతరులభివృద్ధి గాంచి ఈర్ష్య చెందనేలరా
కుళ్ళుబోతు తనముబెంచ కూలిపోవు చూడరా
సర్వజనుల హితముగాంచి సద్గతి నువు బొందరా

కలలు గనెడువారు ధరణి కోకొల్లలు
కలలు నిజంబౌను కొందరికె ఇలను
కర్మయోగముతోనె కలలు సాకారంబు
కలలు నెరవేరుట బహుకష్టంబు చూడరా

మహిలోని బాధలు మనో కల్పితములు
పరిణతిగల మనసుచే సకల పరిష్కారములు
అత్యాశ దు:ఖమునకు మూలకారణ మగును
సంతృప్తిలేని జీవితం నిరాశకు నిలయంబు

గుడిలోని దేవునకు నదిలోని పుష్కరునకు
పూజలెన్నొ సలిపి పుష్కర స్నానాలు జేసియు
అంతరంగమందు అమృత మూర్తిని గనలేరు
అవని జనులు ద్వైత భావంబుతోడ

విశ్వపరిధిని గాంచ విమల గంభీరంబు
ఆత్మ తత్త్వమెరుగ అంతయు నేకంబు
మనసు బుద్ధిచేత గనలేము సత్యంబు
ఆత్మజాడ దెలియగవచ్చు అనుభవంబుతోడ

ఎగువ ఆకసాన దిగువ పాతాళాన
దేవుడుండు నటంచు తెగ ఊహించుకొందురు
మానవ హృదిలోని మాధవుని గానక
మాయచేత అసలు మర్మంబు దెలియక

కర్మ జన్మలయొక్క మర్మంబు నెరుగక
భౌతిక ప్రపంచాన బాధలొచ్చినవేళ
తన కర్మమేమిటని తెగ బాధపడుదురు
భగవంతునేడుకొని పశ్చాత్తాపపడుదురు

అఖిల శక్తులకు నిలయ మంతరంగమై యుండగా
బాహ్యప్రేరణ కొరకు బహు ప్రాకులాడుదురు
మనసులోని శక్తి మహిమను గనలేక
తనమీద తనకు పూర్తి విశ్వాసముయు లేక

పరమాత్మ స్మరణయే పరమ లక్ష్యముకాగ
విషయ వాంఛలతోడ వహరించు చుందురు
దేహ సుఖములకొరకు దేబిరింతురు జనులు
ఆత్మ జ్ఞానములేక అల్లాడుచుందురు

మంచి కార్యముజేయ మనశ్శాంతిని బొందు
చెడు తలంపులేమొ ఆత్మ క్షోభను బెంచు
సత్కర్మ లొనరించి సంతుష్టి నొందుటే
బరగ దైవస్థితియని దెలియవలయు

పూజ ప్రార్ధనలెన్నొ లెస్స చేయగవచ్చు
పుణ్య తీర్ఠాలెన్నొ దర్శించగవచ్చు
ధ్యాన యోగములెన్నొ ధరణి సలుపగవచ్చు
మనసు నిలుపతరమె మనుజునకును

మంచి పనులుజేయ మానవుడు మహిలోన
సజ్జనుల హృదయాలు సత్వరమె స్పందించు
దైవ సంకల్పముగ భావించుదురు జనులు
విశ్వ మానవ విభుని మహిమ దెలియ

విశ్వ వ్యాపితుడైన విశ్వేశ్వరుండిలను
గురు రూపమున వచ్చి గుర్తు జేయుచునుండు
సద్భోధనలు జేయ సాకారుడంబౌను
దేహ ధారియగు దైవమునకు ప్రణతి ప్రణతి

ప్రతి మనుజునందును ఏదొకళ దాగుండు
తీవ్ర సాధనచేత ప్రావీణ్యతను బొందు
కళను గలిగినట్టి జన్మ బహు ధన్యంబు
సకల కళలకు పరమార్ఠకళ మూలంబు

పాంచభౌతిక దేహ పరువంబు జూసుక
విషయ వాసనలందు విహరించు చుందురు
అల్ప సుఖములకొరకు అల్లాడుచుందురు
మంటలోని మిడుత మాడి చచ్చిన పగిది

నేను నేనందురు మేను భావనతోడ
నేను మేనులకు బహుగ వ్యత్యాసముండును
అంతర్ముఖుండవై అనుభూతి చెందగా
ఆత్మ నేనునుగని అలరారుచుండును

గుడిలోని దేవుండు హృదిలోను గలడంటు
సాధనలు సలుపమని శాస్త్రములు తెలుపంగ
హృదియందు గనలేక గుడిలొ వెదకుచునుంద్రు
తానె ఈశ్వరుడను తత్త్వంబు దెలియక

మంచి మనసుగలిగి మానవుడుండిన
విశ్వశక్తులన్ని మనసావహించును
మానసిక పరివర్తన మరి మరి కలుగును
ఆత్మ సిద్ధి బొంది ఆనందమందును

ఉన్నదానికన్న ఊహ యధికంబుండు
కన్నదానికన్న కలలు మెండు
విన్నదానితోడ వీనుల విందౌను
అరయ సత్యమెరుగ అన్ని సున్న

అంతరాత్మ ప్రేరణయే అభివృద్ధికి దిక్సూచి
అంతర్వాణి ననుసరించ జీవితమే పూలబాట
మనసుతోడ సాంగత్యం మొదటికే మోసమగును
ఆత్మజ్ఞాన సాధనయే మనుజున కావశ్యకంబు

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home