Wednesday, June 13, 2007

చెదిరిన కల

చల్లని సాయంత్రం వేళ ఆఫీసుపని ముగించుకొని
ఆఫీస్ స్పెషల్ బస్సులో కాలనీ వైపు ప్రయాణం

కాలనీ స్వాగత ద్వారాలకు అల్లంత దూరంలో
అత్యంత ఆర్భాటంతో స్వాగతం పలికే బ్యానర్లు

అత్యాధునికంగా అలంకరించిన రెండు భవనాలు
నా కాలనీకి యింత అదృష్టం పట్టిందా అన్న ఆనందం

అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన
రానే వచ్చింది బస్సు స్వాగత ద్వారాల మధ్యకి

ఏ శుభకార్యమో లేక విద్యా సంస్థ ప్రారంభొత్సవమో
జరుపుకుంటుందేమోనని మదిలో ఆలోచన

కాలనీకి మహర్దశ పట్టబోతుందన్న ఆనందం
బ్యానర్ చదివిన నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను

కళ్ళు బైర్లు కమ్మి ఒక్కసారిగా బస్సుదిగాను
మరొక్కసారి రెండువైపులా బ్యానర్లను తీక్షణంగా చదివాను
నేను చూసింది నిజమేనని నిండా నిర్ధరించుకున్నాను
మందుపాతర పేలినంత పెను శబ్ధంతో
కాళ్ళకింద భూమి కంపించినట్లైంది

వందలాది పాఠశాలలు, వేలాది విద్యార్థులు
లెక్కలేనన్ని కళాశాలలు, ఉపన్యాసకులు
వేలాదిమంది ఉద్యోగులు, విద్యావేత్తలు
నా కాలనీ అంతా మేధావుల మేలు కలయికే

అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది
గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం
బరువెక్కి బజారుపాలైంది

ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు
“చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి
ఐస్ ముక్కల హిమతాపానికి కరిగిపోయాయి
మహాత్ముల ఉపన్యాసాలు, నీతి బొధలు
సంఘ సంస్కర్తల త్యాగఫలాలు
మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి

మధ్యం నిషా ముందు యింద్రభొగం దిగదుడుపే
ఎవడన్నాడు నా దేశం బీదదని
ఒక్కసారి బార్ ను దర్శించి చూడు
కుబేరుల తలదన్నే కాసుల గలగలలు
కుంభవృష్టిలాగా మధ్యం సెలయేర్లు

గజం భూమి ధర గణనీయంగా పెరిగన నేడు
గజానికో బార్ వెలసినా ఆశ్చర్యం లేదు
మందు మంచినీరులా ఉపయోగించినా కరువే రాదు
పరోపకారానికి పదిసార్లు ఆలోచించాలిగాని
స్వాత్మానందానికి సవాలక్ష ఖర్చైనా ఫర్వాలేదు

మనసా! ఇంద్రియాలంటే నీకెందుకింత చులకన
క్షణాలలో పడేస్తావు నీ వలలో క్షణికానందాలకు

ఆరునూరైనా అనుకున్న టైంకు హాజరు పరుస్తావు
నీ కబంధ హస్తాలలో నిత్యం బందీని చేస్తావు

నాకెందుకో కసిగా కక్ష్య తీర్చుకోవాలనుంది
మద్యం సేవించే వారిపై కానేకాదు
త్రాగడానికి మనసును ఉసిగొలిపే ఇంద్రియాలమీద
మానవాభ్యున్నతిని మట్టుబెట్టే మనో చాంచల్యం మీద!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home