Sunday, June 3, 2007

దాన గుణం

గుడిసెలోన యున్నవాడు మేడ కొరకు తపియించె
మేడలొ నివసించువాడు పది మేడలను కాంక్షించె

సైకిలున్నవాడేమొ బైకు కొరకు దేబిరించె
బైకు గలిగిన వాడు కారు కొరకు కలవరించె

వేల సంపదలున్నవాడు లక్షల కొరకు ప్రయత్నించె
లక్షలు గూడిన పిదప కోట్ల కొరకు పరుగులెత్తె

ఆశయంటె యిదేనేమొ అవనిలోన పరికింప
ఆశ ఉండవచ్చుగాని అత్యాశ నీకు తగదెప్పుడు

ఆశపాశ బద్ధుడవై అనుక్షణం తపియించి
సాలెపురుగు వోలె అత్యాశలోన జిక్కినావు

ఇంకొచెం ధనముంటె దానాలెన్నొ జేసెవాడినని
అంతరాత్మ హితోక్తిని అతి తెలివిగ ఆణచివేసి

జీవిత కాలమంత ధనకాంక్షలొ జిక్కినావు
కోట్లకు పడగెత్తినా కోర్కెలెన్నొ బెంచినావు

కలిగిన దానిలొ దానం ఈరోజు చెయ్యనోడు
రేపు కలిసొస్తే చేస్తాడనేది కల్లయని తెలుసుకో

ఉన్నంతలోనె సదా ఉదారంగ దానం చేసి
మానవ జన్మ సార్ధకతను మహిలోన చాటాలోయి

మృత్యువెపుడు కబళించునొ మనకసలే తెలియదోయి
కనురెప్ప పాటులోన జీవితమ్ము అంతరించు

నీవు కన్న కలలన్నీ కల్లలుగా మారునోయి
శ్వాస ఆడినపుడె విరివిగ దానంబు జేయవోయి

గుప్తదాన మొనరించి గట్టి ఫలము నొందవోయి
దానకర్ణుడు యనెటి బిరుదాన్ని బొందవోయి!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home