Saturday, June 2, 2007

మహాత్ముడు

ఎవరన్నారు నీవు సామాన్యుడివని
నీకు నువ్వే ఊహించుకున్నావు భావించుకున్నావు
పొరుగువాడితో పదే పదే పోల్చి చూసుకున్నావు
నలుగురితో నారాయణయని సర్దుకు పోతున్నావు

గొర్రెల మందలో ఒకటిగా దూరావు
అసలు స్వరం మరచి అనుకరిస్తున్నావు
ఒక్కసారి నీ గతాన్ని సిమ్హవలోకనం చేసుకో
నీ నిజ స్వరూపం అవగతమనుతుంది చూసుకో!

పులిలాంటి వాడివి పిల్లిగా మారావు
సిం హ గర్జన మాని హీన స్వరం అలవర్చుకున్నావు
ఒక్కసారి నవచైతన్యాన్ని మదినిండా నింపుకో
మాయపొరలను జ్ఞాన ఖడ్గంతో చేధించుకో!

ఇందృయాల సందిట్లో బందీవైపోయావు
బాహ్యాకర్షణలకు బలిపశువుగా మారావు

ఇంద్రియాలు మనస్సు జంట కవులు
తీస్తాయి కూనిరాగలు ఉత్సాహం ఉరకలేసినప్పుడు
చల్లుతాయి ఇంద్రియాలు అనుభవాలనే మత్తు
చేస్తాయి మనస్సును ఆదమరిస్తే చిత్తు

ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకో
ఒక్కసారి నీ విశ్వరూపాన్ని ఊహించుకో
విశ్వ శక్తులను నీలో విలీనం గావించుకో
అంతర్ముఖుడవై ఆత్మాన్వేషణ సాగించు

అంతులేని ఆత్మానుభూతిని అనుభవించు
ఆధ్యాత్మిక అమృతత్వాన్ని ఆస్వాదించు

పుట్టగానే గాంధీ “మహాత్ముదు” కాలేదు
పురిటిలోనే సిద్ధార్ధుదు “గౌతమ బుద్ధునిగా” మారలేదు
బాల్యంలోనే నరేంద్రుడు “వివేకానంద” అవలేదు
కృషిలేకుండానే “అబ్దుల్ కలాం” భారత రాష్ట్రపతి కాలేదు

కారణ జన్ములుగా కొందరు భూమిపై అవతరిస్తే
కర్మలు పండించుకొని కడతేరినవారు మరికొందరు

“నేతి నేతి” (ఇది కాదు ఇది కాదు) అని
పదే పదే ఘోషిస్తున్నాయి మన వేదాలు
అనాదిగా బొధిస్తూనే ఉన్నారు ఆత్మ జ్ఞానులు
సమకాలీనులు సమయానుకూలంగా ప్రవచిస్తున్నారు

అందుకే స్వామి వివేకానంద ఏనాడో పిలుపునిచ్చాడు
“పరమ పవిత్రులు, నిస్వార్థపరులైన కొంతమంది
యువతీ యువకులను వారి తల్లిదండ్రులు నాకప్పగిస్తే
యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించ గలను” అని

నేడు ప్రపంచం నలుమూలలా లక్షలాది మంది
రామకృష్ణ మఠం ద్వారా లబ్ధి పొందుతున్నారు

అరిషడ్వర్గాలు, ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు,
మతకల్లోలాలు, ప్రాంతీయ పక్ష పాతాలు, అశాపాశాలు,
మాయామోహాలు, మమకారబంధాలు పెంచుకుంటే
“సామాన్యుడివే” త్రుంచుకుంటేనే “మహాత్ముడివి.”

స్వల్ప సుఖాలకోసం సామాన్యుడిగా జీవిస్తావో
మనువు పేరును నిలబెట్టి మహాత్ముడిగా మారి
ఆచంద్ర తారార్కం ధృవతారగా వెలిగిపోతావో
నీ అభీస్ఠంపై ఆధారపడి ఉంది ఆలోచించుకో!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home