Thursday, June 7, 2007

బలి పశువు

మూర్తులను సేవించే నేటి దేవాలయాలు
కొంతమంది యువతీ యువకుల ప్రేమాలయాలు

శృతిమించిన విద్యార్ధుల వేధింపులు
తెస్తాయి విద్యాలయాలకు తలవంపులు

అల్లారుముద్దుగా పెంచుకున్న అమాయకపు
ఆడపడచుల బంగారు భవిష్యత్తుకై
అందమైన ఆశా సౌధాలెన్నో నిర్మించిన
తల్లిదండ్రుల కలలన్నీ కల్లలైపోతున్నాయి
కన్నెళ్ళే చివరికి కన్నవారికి మిగులుతున్నాయి

తాను ప్రేమించిన యువతి
తన ప్రేమను తిరస్కరించిందని
యాసిడ్ పోసో గొంతు కోసో
కసాయిగా ప్రవర్తించిన ప్రేమ ఉన్మాది
సమాజానికి మహా ప్రమాది

తాను సమాజంలో మంచిగా జీవిస్తున్నా
తన చుట్టూవున్న సామాజిక ఉన్మాదులు
అమాయక జీవితాలనే కర్కశంగా
కబలిస్తున్నారు పరమ కామాంధులు

తాను వాహనం చక్కగా రోడ్డుపై నడుపుతున్నా
ప్రక్కవాడి చోదక ప్రావీణ్యతా లోపానికి
బలియయ్యే బడుగు నిరపరాధి
తప్పుడు లైసెన్సులకు బలిపుశువైన సంఘజీవి

నీవు మంచిగా ఉన్నంతమాత్రాన సరిపోదు
నీ చుట్టూ సమాజాన్ని ఒక్కసారి పరికించి చూడు
మత్తువదలి మహత్తర శక్తిగా విజృంభించు
సంఘ విద్రోహులను సమూలంగా మట్టుపెట్టు

సామాజిక స్పృహను సదా గుండెల్లో రగుల్చుకో
అన్యాయాలను ఎదిరించే ధైర్యాన్ని పెంచుకో

వర్తమాన కాలంలో సభ్య సమాజంలో జరిగే
అన్యాయాలను, అక్రమాలను రూపుమాపడానికి
సమయానుకూలంగా అస్త్రాన్ని సంధించు
ప్రళయకాల ప్రభంజనంలా ప్రయోగించు!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home