Tuesday, June 5, 2007

సహకారమే ఊపిరిగా…

రెండు చేతులు కలిస్తే చప్పట్లు
రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు

భావ సారూప్యం సాధిస్తే సహకారం
సంఘ సభ్యులందరికి ఉపకారం

బడాబడా సంస్తలు బోర్డు తిప్పినవేళ
సంఘ సభ్యుల ఆర్తనాదాల గోల

స్వార్థ చింతన సహకారానికి గొడ్డలిపెట్టు
పారదర్శకతే సహజీవనానికి ఆయువుపట్టు

మనిషి మనిషిగా జీవించడం ఓ కళ
దగాచేసి ధనికుడ నవుతననుకోవడం ఓ కల

జీవితం ఎల్లప్పుడు శాశ్వతం కాదు
నైతిక విలువలు లోపిస్తే ప్రగతి రాదు

మానవత్వం లోపించిన సమాజం
అధ:పాతాళాలకి దిగజారే ప్రమాదం

కష్టించి, చెమటోడ్చి, పొదుపు చేసి
పైసా పైసా కూడబెట్టుకున్న సభ్యుల ధనం
కస్టకాలంలో ఆదుకుంటుందని భావిస్తుంది జనం

విద్యాబుద్ధులకు, పెళ్ళి శుభకార్యాలకు
వ్యాపారాది వివిధ జీవన వృత్తులకు
ఉపకరిస్తుందని దాచుకున్న శ్రమఫలం

స్వార్థపరుల సంకుచిత బుద్ధి వల్ల
ఒక్కసారిగా ధనమంతా హుష్ కాకీయని తెలిసినవేళ
ప్రాణాలు విలవిలలాడిన సభ్యుల ఆక్రందన
ఒక్క క్షణం ఆ స్తానంలో నీవుంటే తెలుస్తుంది నిజం

ఆర్తనాదాలతో ఆదుకొమ్మంటున్న
సంఘ సభ్యుల హృదయ ఘోష
అరణ్యరోదనగా మిగిలిన ఆఖరి సన్నివేశం

విద్యార్థి లోకంలో బోలెడన్ని ఆశలు
నవ వధూవరుల్లో వర్ణించలేని భవిష్యత్ కలలు
నిరుద్యోగి కళ్ళల్లో చిగురిస్తున్న ఆశలు

సహకారం సహకరించలేదని తెలిసిన క్షణం
అంధకారబంధురమైన భవిష్య జీవనం

మనశ్శాంతిలేక మనుగడ సాగిస్తున్న దగాకోరులు
కళ్ళెదురుగానే ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ
సభ్య సమాజ దోపిడీదారులకు కనువిప్పు
సత్యాన్ని గ్రహించి మనగలిగితెనే భవిష్యత్తు

నేటి మన సభ్యుల సహకారం
కావాలి భావి తరాలకు మార్గదర్శకం

చేతులతో పాటు హృదయాలు కలవాలి
ఒక్కత్రాటిపై అహర్నిశలు నడవాలి
వ్యక్తిగా సాధించలేని కార్యాన్ని
సమిష్థిగా సాధించగలమని చాటాలి

ప్రపంచానికే సహకారులు ఆదర్శంగా నిలవాలి
మనస్పర్ధలు లేని మనుష్యులుగా మెలగాలి
మమతానురాగాలను దండిగా పంచుకోవాలి
మానవత్వ పరిమళాలను మెండుగా వెదజల్లాలి

మనొభీస్ఠం నెరవేరాలని సర్వేశ్వరుని ప్రార్ధిద్దాం!
సహకారమే ఊపిరిగా కలకాలం జీవిద్దాం!!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home