Thursday, June 7, 2007

దైవత్వం

జగమంతా నిండియున్న భగవంతుని ఉనికినుండి
కోర్కెలీడేర్చుకొనగ భువికి యరుగుదెంచినావు

గతజన్మల కర్మఫలము ననుభవింప నీవు
ఈ ధరణియందు జీవునిగ అవతరించినావు నేడు

పసిపాపగ మెలగినపుడు నిష్కపటంగా బ్రతికినావు
యవ్వన దశకు చేరగనే కామ వికారాలు బొందినావు

అరిషడ్వర్గాల జిక్కి నిజతత్త్వం మరచినావు
ఈర్ష్యా ద్వేషాలతోడ స్వార్ధంబును బెంచినావు

దేహమే నిత్యంబని సౌందర్యాల గాంక్షించినావు
ధనమే శాశ్వతంబని ఆశలొబడి పోయినావు

అంతులేని కోర్కెలతో అలమటించి పోయి నీవు
మనశ్శాంతి కరువైపోగ మనోవ్యాధి బొందినావు

చపలత్వపు మనసుజేరి దేశాలన్ని దిరిగినావు
ఎక్కడ ఏమీ దొరకక బేజారెత్తి పోయినావు

పంచ జ్ఞానేంద్రియాల పంచనబడి పోయినావు
వంచన చేసే మనసుకు లొంగిపోయిన నీవు

తల్లిదండ్రులొక పక్క భార్యా బిడ్డలు మరో పక్క
సమస్యలు ఒకవైపు సమాజం మరోవైపు

అంతులేని సుడిగుండాలలొ ముంచెత్తిన గాని
బ్రతుకుమీద ఆశచేత భరియించు చున్నాడవు

కస్టాలు కన్నీళ్ళు వేధింపులు వెక్కిరింతలు
రోగాలు ప్రమాదాలు వృద్దాప్యం మృత్యువాత

ఎన్నీ ఎదురైనగాని మనసు పరమార్ధం వైపు పోదు
మాయ యనగ యిదేనేమొ మహిలోన తరచి చూడ

జీవ భ్రమలొ జిక్కి నీవు దేహంబని భ్రమసినావు
దేహభ్రాంతి వీడకుంటె జీవన్ముక్తి లేనెలేదు

కోర్కెలు కొండెక్కకుంటె మరు జన్మ తప్పదు మరి
శాస్త్రంబును పాటించనిచో సద్గతియే లేదు మనకు

సజ్జన సాంగత్యంబుతొ సంస్కారం బెంచుకొని
సద్గురు బోధకులచేత పరమార్ధం తెలుసుకొని

నిత్య జీవితంలో నువు ముక్తి బాట పయనించి
భగవంతుడి ఒడిలో నువు భధ్రంగా ఒదిగిపో!

- నాగులవంచ వసంత రావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home