Thursday, May 31, 2007

డబ్బు - జబ్బు

సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు
డబ్బు చుట్టూ లోకం తిరుగుతోంది

డబ్బంటే అందరికీ అంతులేని మోజే
డబ్బే మనిషిని పీడించే పెద్ద జబ్బు

మనిషికి డబ్బే లోకమైనప్పుడు
నీతి నియమాలకు నిత్యం తిలోదకాలే!

దొంగతనం, హత్య, మోసం, దగా,
శ్రమదోపిడీ, జూదం, వ్యభిచారం,
మోసపు వ్యాపారం లాంటి వాటి ద్వారా
డబ్బు దండిగా సంపాదించవచ్చు

డబ్బు లేనిదే డుబ్బుకు కొరగావన్నది నాటి సామెత
డాలర్ లేనిదే దమ్మిడీకి పనికిరావన్నది నేటి సూక్తి

డబ్బుకోసం ఒకటే ఆయాసపు పరుగులు
బి.పి. షుగర్ తగ్గడానికి ప్రాత:కాల నడకలు

ఎంత సంపాదించినా తీరని దాహం
మనిషిని చేస్తుంది డబ్బుకు దాసోహం

స్నేహితుల్ని విడదీసి హత్యలు చేయిస్తుంది
మంచితనాన్ని మానవత్వాన్ని మంటగలుపుతుంది

డబ్బు పిచ్చి మనిషి మెదడుకు క్యాన్సర్
పిచ్చి ముదిరితే సభ్య సమాజంతో డ్యాన్సులే

డబ్బును నియంత్రించి బ్రతకాల్సిన మనిషి
డబ్బు చుట్టూ దాసోహమంటూ ప్రదక్షిణలు

నిజ జీవితంలో నిరాడంబరంగా జీవించాల్సిన మనిషి
జల్సాలకు, వినోదాలకోసమై డబ్బుకు గులామైనాడు

పక్కవారిని, బంధువులను సంపాదనలో మించిపోవాలని
వారిముందు తన హోదా, గొప్పతనాన్ని ప్రదర్శించాలని
ఇతరులకంటే తాను అధిక తెలివిమంతుడనని,
తన డాబు దర్పం ఇతరులకు తెలియాలనే ఆరాటం

డబ్బుతోటే మనిషికి విలువ పెరిగినప్పుడు
డబ్బును కోల్పోయిన మనిషి విలువ సున్నాయేనా?

ధర్మబద్దంగా డబ్బు సంపాదించమని
తద్వారా కామ మొక్షాలను సాధించాలని శాస్త్ర వచనం

- నాగులవంచ వసంత రావు

Wednesday, May 30, 2007

జీవిత పరమార్థం

అనంత కాలచక్రంలో జీవితకాలం అల్పమే ఐనా
శతకోతి సుగంధాళ పరిమళ మాల జీవితం

ఉత్సాహంగా పనిచేస్తూ ఆనందంగా జీవిస్తూ
సాటివారికి సాయం చేయడమే జీవితం

సద్భావనలు పెంచుకొని సన్మార్గాన పయనిస్తూ
సమత, మమత, మానవతలు పరిఢవిల్లేదే జీవితం

ఆదర్శాలను ఆచరణలో ప్రతిబింబిస్తూ
తెరచిన పుస్తకంలా ఉండేదే అసలైన జీవితం

దురలవాట్లతో దిగజార్చుకుంటే దు:ఖ సాగరమౌతుంది
మలచుకోగల నేర్పు ఉంతే మహోన్నత శిఖరమౌతుంది

సంసార సాగరంలో సమస్యల తిమింగలాలు
అలజడులు రేపినా అల్లకల్లొలాలు సృష్ఠించినా
సుడిగుండాలుగా మారి సునామీలా విరుచుకుపడినా
మొక్కవోని ఆత్మ విస్వాసంతో మనగలిగేదే జీవితం

ఆదర్శాలను ఆచరణలో అమలు జరుపబోతే
సహించలేని సభ్య సమాజం తూలనాడినా
అభాంఢాలు వేసి అభాసుపాలు చేసినా
గుండెనిబ్బరంతో ముందుకు సాగేదే జీవితం

నీవు నమ్మిన సిద్దాంతాలతో ఎవరూ ఏకీభవించకున్న
అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఉన్నప్పుడు
ప్రపంచమంతా ఏకమై ఎదిరించినా నిందించి నీరుగార్చినా
అహర్నిశలు ఆత్మోన్నతికి సృమించడమే అసలైన జీవితం

గర్వమే సర్వ అనర్ధములకు మూలం
అహంకారం నశిస్తేనే ఉదయిస్తుంది ఆత్మజ్ఞానం
మనసును నిగ్రహించి అరిషడ్వర్గాలను జయించి
అనునిత్యం ఆత్మానందంలో మునగడమే దివ్య జీవన

"బలమే జీవితం - బలహీనతయే మరణం" అని చాటిన
స్వామి వివేకానంద సిం హగర్జనకు స్పందించి
పరిపూర్ణమైన ఆరోగ్యంతో మానసిక వికాసంతో
విశాల హృదయంతో వర్తించగలిగినదే విలువైన జీవితం

బహుజన్మల పుణ్యపాక వశాన భగవంతుడిచ్చిన వరం
84 లక్షల జీవ్రాసులలో ఉత్కృష్ఠమైనది మానవజన్మ
విషయ వాసనలను విసర్జించి స్థితప్రజ్ఞతను సాధించి
ఆత్మజ్ఞానాన్ని సంపాదించినదే పరిపూర్న జీవితం
- నాగులవంచ వసంత రావు

ఆత్మారాముడు

దశేంద్రియాలనే దశకంఠుని వధించు
మాయలేడిలాంటి మనసును జయించు
సౌశీల్యమనే సీతను వరించు
సీతారాముల కల్యాణం ప్రతియేటా జరిపించు

కోటిసార్లు రామనామం వ్రాయడమే బహు మేటి
రాముని సద్గుణాలను అలవర్చుకోవడమే సాటి

కొదండరాముని నామం సతతం స్మరించు
కామక్రోధాలను సమూలంగా జయించు

ఆలయంలో కొంగుబంగారంగా కొలువున్న దేవుడు
నీ హృదయసీమలో నెలకొన్న ఆత్మారాముడు

మానవ హృదయమే మహోన్నత దైవమందిరం
అందులో నెలకొన్న ఆత్మారాముడు బహు సుందరం

మల్లెపూవులాంటిది సజ్జన సాంగత్యం
పెంచుతుంది నీలో మహోన్నత ఔన్నత్యం

శిలను కాదు శిల్పిని పూజించు
మానవునిలో మాధవుని దర్శించు

ఎదుటివారి కష్థాలకు స్పందిస్తే మానవత్వం
చేయికలిపి చెయూతనిస్తే దైవత్వం

అనంత దివ్యశక్తులకు నిలయం హృదయం
ఉద్దీపన గావిస్తే మానవాళికే మహోదయం

- నాగులవంచ వసంత రావు

భరతమాత కన్నీటి భాష్యం

భరతమాత కన్నీటి భాష్యం

తెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేను
అష్ట కస్టంబులతోడ అవమానం బొందినాను

నాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరి
గాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరి

ఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించి
దాస్య సృంఖలాలను త్రెంచివేసి నిస్క్రమించిరి

వీర పుత్రులెందరినోగని స్వతంత్రమ్ము బొందినాను
నా బిడ్డల భవిష్యత్తుకై బోలెడు కలలుగన్నాను

ఏదీ ఆ వీరత్వం ఎక్కడుంది ఉడుకు రక్తం
నరనరంబులలోన మిగుల స్వార్థంబే నిండుకుంది

కుటిల రాజకీయాలతొ కపట వేషధారణతో
చిలుక పలుకులెన్నొ పలికి చిత్రంగా బతుకుచుండిరి

వర్తకంబున నీతిదప్పి సరుకును నల్లబజారు చేర్చి
సామాన్యుడి గుండెలపై బరువెంతో మోపినారు

సరస్వతిని పూజిస్తూనె చదువులమ్ము కొనుచుండిరి
విద్యాలయాలన్నింటిని వ్యాపారంగ మార్చేస్తిరి

పుట్టంగనె మెకానిక్కు షెడ్డులోన బెట్టినచో
పదియేండ్ల కాలంలో షెద్దు యజమానై కూర్చుంటే

పదిహేను సంవత్సరాలు లక్షలెన్నొ ఖర్చుపెడితె
చదువేమో అబ్బదాయె ఉద్యోగం దొరకదాయె

హైటెక్కూ చదువులంటు బి.టెక్కూలెన్నొ చేసి
బరితెగించి రోడ్డుమీద రొమాన్సులెన్నొ చేయుచుండిరి

చదువుకున్న మేధావులంత విదేశాల కేగుచుంటె
వట్టిపోయిన పొదుగువోలె కృశియించి పోయినాను

పరదేశపు వేషభాషలు పరగ గొప్పయని యెంచి
మాతృభాష విలువనేమొ మంటగలుప జూసినావు

విదేశీయులు తంతె తప్ప దేశభక్తి పుట్టదు మరి
అవమానిస్తేనె తప్ప విప్లవంబు లేవదేమొ

భరత మాతనని నేను ఏమి జూసి గర్వించను
కన్నతల్లి కంట్లోనె కారంజల్లు కొడుకులుంటె

గాంధీయే నేడుంటే గుండెబగిలి చచ్చెటోడు
బోసుగనక బతికుంటే భోరున విలపించెటోడు

సత్యాహింసలన్న జాతిపిత మాట మరచి
ఉగ్రవాదమంటు లెస్స ఉన్మత్తుడవైతివోయి

భవిష్యత్తు తలచుకొని భారంగా నిట్టూర్చితి
కరుగని హృదయాల గాంచి కన్నీటిని కార్చుచుంటి

- నాగులవంచ వసంత రావు

దివ్యుడా! కనువిప్పుకో!!

ఆత్మవీర లేవర! అజానమత్తు వీడరా!
సకల జీవరాసులలో స్వామిని దర్శించరా!

బుల్లి బుల్లి నడకలతో బాల్యమంత గడిచిపోయె
చిట్టి చిట్టి మాటలతో చిరుప్రాయం కరిగిపోయె

యవ్వనంపు పొంగులలో ఇందృయాల పరుగులలో
ఎండమావి సుఖములకై వడివడి దరిజేరినావు

సుందర దేహంబు జూసి చిందులెన్నొ వేసినావు
అంతరాత్మ ప్రభోదాన్ని అణగద్రొక్క జూసినావు

పెదవులపై చిరునగవులు మనసులోన ద్వేషాగ్నులు
కపట నాటకంబులతో జీవితమ్ము సమసిపోయె

ప్రతిమల పూజించనేర్చి ప్రాణుల హింసించినావు
సకల జీవరాసులలో స్వామిని దర్శించలేక

సోమరితనాన్ని వీడి చైతన్యం బెంచరా
నైపుణ్యతగల పనియే పూజగ భావించరా

బలంబాగ వస్తుందని జీవులారగించినావు
చావు దగ్గరైనవేళ చతికిలబడి పోయినావు

బలంబేడ బోయెర నీ బతుకేమైపోయెర
శాకాహారంబులోనె శక్తున్నది చూడర

త్రిగుణాలలొ జిక్కినీవు తిప్పలెన్నొ బడుచుంటివి
మాయచేత పెడతన్నులు దండిగ నువు దినుచుంటివి

జీవులెనుబది నాలుగు లక్షల దేహాలలొ జేరినావు
బహుజన్మల పుణ్యంబున మానవజన్మ మెత్తినావు

కాలమెల్ల కరిగిపోయె వయసేమొ తరిగిపోయె
మృత్యువేమొ ముంచుకొచ్చె బ్రతుకు ఆశ చావదాయె

కళేబరంబు గాంచినంత వైరాగ్యం లెస్సబెంచి
స్మశానంబు దాటగనె మాయలొబడి పోతివోయి

మాటవినని మనసుజేరి మాయచేత జిక్కినావు
మానవ పరమార్థమైన జ్ఞానంబును మరచినావు
// ఆత్మవీర లేవర //

- నాగులవంచ వసంత రావు

మాతృభాష మాధుర్యం

మాతృభాష మాధుర్యం

భరత ఖండమందు ఆంధ్ర దేశమ్ములో
తెలుగు తల్లిపాలు లెస్స త్రాగి
అమృతమ్మువంటి అమ్మపదము మరచి
మమ్మి యనుచు లెస్స తిరిగినావు

రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయిన పగిది
విత్తంబు కోసమై విదేశాలకేగి
ఉద్యొగంబులేక ఊడిగాలు చేసి
మాతృభాషనేమొ మరచినావు

ఆరంభశూరుదు ఆంధ్రుడేనటంచు
మధ్యలోనె తెలుగు మరచినావు
పరభాష మోజులో మాతృభాషను మరచి
ఆంధ్రమాతకు ద్రోహంబు చేసినావు

అవలక్షణాలున్న ఆంగ్లభాష కన్న
తేనెలొలుకుచున్న తెలుగుభాష మిన్న
రాయలు మెచ్చిన రాజభాష తెలుగు
మధురమైనట్టిది మాతృభాష తెలుగు

తెలుగు బిద్దనంచు తెగ చెప్పుకొని నీవు
ఆంగ్లభాషలోన అతి ప్రయాసగ మాట్లాడి
మాతృభాష యనగ మౌనంబు వహియించి
తెలుగుభాషకు తెగులు సోకించినావు

తెలుగునాట బుట్టి తెలుగునాట పెరిగి
తెలుగు సంస్కృతియు తెలిసి నీవు
అన్యభాషలోన అతి యాసగ మాట్లాడి
తెలుగు తెలియనట్లు తెగఫొజులిస్తివి

పొరుగు రాష్త్రాలలో అతిదొడ్డ మనసుతో
మాతృభాషలోన మధురంగ మాట్లాడి
మాతృభాషామ తల్లిని బహుగ రక్షించగ
తెలుగు మాట్లాడుటకు తెగ సిగ్గుపడితివి

మాతృభాషలోన పరిపాలనను జరుప
ఉత్తర్వులెన్నియో వెడలుచున్నను గాని
మానసంబున నీకు మాతౄభాష పైన
ప్రేమ పుట్టకపోతె ఫలితమేమి ?

విఙులైనవారు విషయంబు గ్రహియించి
ఆంధ్రమాత హృదయ స్పందనను గమనించి
నిత్యజీవితాన అత్యంత ప్రేమతో
మాతృభాష తెలుగు మరువకుందురు గాక !

- నాగులవంచ వసంత రావు

నవ యువకులార లేవండీ!

నవ యువకులార లేవండీ!

నవ యువకులార లేవండీ నడుంకట్టి నడవండీ
భరతమాత భవిష్యత్తు మీ చేతిలొ గలదండీ

దేశ ప్రగతికోసం రథచక్రాలై తిరగండీ
మాతృదేశ పురోగతికి సమిధలుగ మారండీ

కుళ్ళు రాజకీయాలు మనకసలే వద్దండీ
కపట నాటకాలు మీరు మానుకుంటె ముద్దండీ

భరతదేశ భవిష్యత్తూ యువత మీద గలదన్న
స్వామి వివేకానంద మాట సత్యంబని నమ్మండీ

తళుకు బెళుకు ఆకర్షణ మత్తులొబడి పోకండీ
తాత్కాలిక ఆనందం అభివృద్దికి చేటండీ

దురలవాట్లన్నింటికి దూరంగా ఉండండీ
బలహీనతలకు లోనైతె భవిష్యత్తు లేదండీ

వౄత్తితొ సంతృప్తి పదక ప్రవౄత్తిని గాంచండీ
ఇష్తమైన ప్రవౄత్తిలొ అభీష్థం నెరవేరండీ

కష్థించి పనిచేసి కర్మయోగివి గమ్మురా
కృషియందే అదృష్థం గలదని నువు నమ్మరా

ఉరకలెత్తు ఉత్సాహం ఉప్పొంగనీయరా
ఆకసంబె నీ హద్దని నిరూపించి చూపరా

ఉదయించే సూర్యున్ని ఎవ్వరాప గలరురా
యువతలోని ఉత్సాహం ఊరకుండిపోదురా

అంతులేని ఆర్ధృతను గుండె నిండ నింపరా
స్పందన కరువైన బ్రతుకు మోడు వృక్షమేనురా

సామాజిక స్పృఝను బొంది చక్కగ నువు నడవరా
సర్వ జనుల క్షేమంబును సతతం కాంక్షించరా

అద్భుతాలు సృస్థించి చరిత్రలో నిలవరా
ఆకసాన దృవతారగ సతతం నువు వెలగరా

// నవ యువకులార లేవండీ //

- నాగులవంచ వసంత రావు

విద్యార్థీ లేవరా !

విద్యార్థీ లేవరా !

విద్యార్థీ లేవరా! కనులు తెరచి చూదరా!
నీదూ హస్తంబులలో విశ్వ భవిత గలదురా

చిన్న చిన్న విజయాలతొ సంతృప్తిని బొందకురా
విశ్వమంత పొగదునంత విజ్ఞానివి గమ్మురా

అల్పసుఖములెల్ల నీవు అంతరింప జేయరా
అంతులేని జ్ఞాననిధుల బొందీ సుఖియించరా

నిన్ను నిండ ముంచు నిద్ర మర్మమేదొ దెలియరా
నిత్యం నువు జాగ్రత్తతొ నిద్ర మేల్కొమ్మురా

సినిమాలని షికార్లని లెస్స తిరగమాకురా
కొద్దిపాతి ఓర్పుతోద విజయం వరియించరా

క్లాసులోన పాఠాలను శృద్దగ నువు వినుమురా
ఇంటికొచ్చినాక మరల తిరగవేసి చూడరా

చెడ్డవారి సహవాసం చేసీ చెడిపోకురా
మంచివారితో ఎప్పుడు మసలుకుంటె మేలురా

బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ భ్రాంతిలొ నువు బడకురా
పిన్న వయసులోనె ప్రేమ ఉన్మాదివి గాకురా

విదేశీయ విష సంస్క్రుతి విరివిగాదరించి నీవు
భరతమాత గుందెలను బరగజీల్చ మాకురా

ర్యాగింగుల ముసుగులోన చిత్రహింసలెన్నొ భరియించి
బ్రతుకుపైన ఆశవదలి బలిపశువుగ మారినారు

హిమాలయమంత నీవు ఎత్తు ఎదిగి చూపరా
అఖిల జగతికి నీవు ఆదర్శం గమ్మురా

గురువూ పెద్దలయందూ గౌరవంబు జూపరా
పెద్దవారి ఆశీస్సులు వ్యర్ధం గాబోవురా

నిన్నుగన్న తలిదండ్రుల ఆశలు నెరవేర్చరావి
ద్యార్థి లోకంబులొ మిన్నగ నువు నిలవరా

నీకు చదువు నేర్పిన గురు ఋణము దీర్చుకొమ్మురా
గురువు కృపను బొంది నీవు విశ్వఖ్యాతి నొందరా

// విద్యార్థీ లేవరా //

- నాగులవంచ వసంత రావు