Tuesday, May 6, 2008

యువత - నడత

భారతదేశ భవిష్యత్తు యావత్తు యువతీ యువకుల భుజస్కందాలపైనే ఉందని, వారు దానికి సమర్ధులని స్వామి వివేకానందులవారు ఏనాడో పిలుపునిచ్చారు. వారు యువతరంపై అంతులేని ఆశలు పెట్టుకున్నారు. వజ్ర సంకల్పంతో విద్యనార్జించి, విజ్ఞానవంతులుగా మారి జాతి ఔన్నత్యానికి రాచబాటలు వేయాలని ఎన్నో కలలుగన్నారు. నేటి యువతరం ఆలోచనా విధానం, ప్రవర్తననుగనక గమనించినట్లైతే తీరని ఆవేదన కలుగక మానదు.

నేటి యువతరం ఎందుకిలా భాద్యతారహితంగా తయారయ్యారు అనేది అనేకమంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. తమ పిల్లలు తమలా కస్టపడ కూడదని, తాము తిన్నా తినకున్నా వారికోసం ఎంతో త్యాగం చేసి పెద్దలు తమ పిల్లలను పెంచుతున్నారు. పిల్లల ముందే “ మీరు కస్టాలపాలు కాకుండా ఉంట మాకంతే చాలు, నీ బాగే మా భవిష్యత్తు, మమ్ముల చూడకపోయినా నీవు సుఖపడితే చాలు” వంటి మాటలు తరచుగా కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. దీనిని ఆసరాగా తీసుకొని పిల్లలు పచ్చి స్వార్ధపరులుగా తయారవుతున్నారు. కొంతవరకు ఈ విషయంలో తల్లిడండ్రులే భాద్యులని చెప్పక తప్పదు.

పక్కవాడి గురించి కాని, సమాజం గురించి కాని పిల్లలకు బోధించక, కేవలం తాను మంచి మార్కులు తెచ్చుకొని,మంచి ఉద్యోగం సంపాదించుకొని, హాయిగా జీవించమని పిల్లలకు లేత మనసులలో చిన్నప్పటినుండి నూరిపోయడం వలన వారిలో విశాల భావాలు మొలకెత్తడం లేదు. అదే విధంగా తమ తల్లిదండ్రులపట్ల ప్రేమాభిమానాలను, త్యాగాలను చేయలేక పోతున్నారు. తమవరకే గానుగెద్దులా గిరిగీసుకొని జీవిస్తున్నారు. ఏ కొద్దిమంది యువతీ యువకులు మాత్రమే తల్లిదండ్రుల ప్రేమను, వారు చేసిన త్యాగాన్ని అర్ధం చేసుకొని వారిపట్ల ప్రేమాభిమానాలతో నడచుకోగలుగు తున్నారు.

యువతరం తమ స్నేహితులతో చాలా మంచి సంభంధాలను కలిగి ఉంటారు. కాని ఇంట్లో తల్లిదండ్రులపట్ల నిర్లక్ష్య భావంతో మాట్లాడతారు. తమ అహంకారాన్ని మాతా పితరులపై ప్రదర్శిస్తారు. వారి మాటలకు ఎదురు చెప్పలేరని మానసికముగా సిద్ధపడి మనోవేదనకు గురిచేస్తారు. తల్లిదండ్రుల ప్రేమను బలహీనతగా భావించి రకరకాల కోర్కెలను తీర్చుకొనుటకు వారిని పావులుగా వాడుకొని చివరికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుపట్ల తల్లిదండ్రులు కన్న కలలను కల్లలు చేస్తున్నారు. ఇతరుల ముందు చాల సౌమ్యంగా, సంస్కారవంతంగా మాట్లాడే పిల్లలే ఇంట్లోవారిపట్ల చాలా దురుసుగా, తలబిరుసుగా ప్రవర్తి స్తూ ఉంటారు.

నటించడంలో పిల్లలు సిద్ధహస్తులని చెప్పవచ్చు. తమ పిల్లలు చాలా మంచివారు, బుద్ధిమంతులని తల్లిదండ్రులు భావించేలా వారి ప్రవర్తన ఉంటుంది. కాని నిజానికి వారి అసలు స్వరూపం వారి స్నేహితులకు తెలుస్తుంది. స్నేహితుల మాటలకు ఇచ్చిన విలువ తల్లిదండ్రుల మాటలకు ఇవ్వరు. ఎందుకంటే స్నేహితుల మాటలు మధురంగా, ఇంద్రియాలను ఉసిగొలిపి, మనసుకు మత్తెక్కించేవిగా ఉంటాయి. పెద్దవారి మాటలు కటువుగా, ఆచరణకు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి పెడచెవిని పెడతారు. తమ స్నేహితులకు వారితల్లిదండ్రులిచ్చిన ప్రాధాన్యత మీరు మాకివ్వడం లేదని తల్లిదండ్రులతో పోరాడుతూ ఉంటారు యువతీ యువకులు.

యువతలో భావ కాలుష్యం ఇదివరకు కేవలం స్నేహితులవల్లే వచ్చేది. కాని ఈనాడు ఇంటర్నెట్ ద్వారా చెప్పలేనంత భావ కాలుష్యం యువతీ యువకులున్న ప్రతి ఇంటికీ చేరుకుంటుంది. రకరకాల సంభాషణలు జరుపుతూ ఇంద్రియాలను ఉద్రేకపరుచుకుంటూ సమయం గడుపుతూ తాము బాగా ఎంజాయ్ చేస్తున్నామని భ్రమపడుతూ, తల్లిదండ్రుల కంట్లో కారం కొడుతున్నారు చాలా మంది యువతీ యువకులు. ఎంతో ఉపయోగకరమైన ఇంటర్నెట్ సాధనాన్ని చిల్లర విషయాలకు ఉపయోగించడం క్షమించరాని నేరం. కంప్యూటర్ ముందు గంటల తరబడి చాటింగ్ చేస్తూ, ఇంద్రియాలతో ఆనందిస్తూ, మనసునిండా విషాన్ని నింపుకుంటుంది యువతరం. తాము నవీన విజ్ఞానాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకో గలుగుతున్నామని పరిశీలించుకోవాలి. ఈ విషయంలో ఎవరికి వారే అంతరాత్మను ప్రశ్నించుకోవాలి.

ఇక సెల్ ఫోన్ సంగతి సరేసరి. ప్రేమికులకిదో వరమని చెప్పవచ్చు. రహస్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కుటుంబ పెద్దలకు తెలీకుండా ప్రేమ వ్యవహారాలు సాగించవచ్చు. అవసరమున్నా లేక పోయినా గంటలతరబడి పిచ్చాపాటి మాట్లడుకోవడం మనం గమనించవచ్చు. తల్లిదండ్రులకు బిల్లుల రూపంలో అంతులేని భారాన్ని మోపవచ్చు.

శ్రద్ధగా చదువుకునే వయసులో సినిమా మోజులోపడి కర్తవ్యాన్ని మరచిపోతున్న ఎందరో యువతీ యువకులను మనం కళ్ళారా చూస్తున్నాం.
రంగుల ప్రపంచానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందన్న విషయం తెలియని పసి వయసులో సినిమాలో మాదిరిగా ప్రేమలు, త్యాగాలు, ఫైటింగులు చేయాలని యువతరం ప్రయత్నించి, భవిష్యత్తును అంధకారబంధురం చేసుకుంటున్నారు.

ఇక పెళ్ళి విషయానికొస్తే ప్రెమించి పెళ్ళిచేసుకోవాలనేది యువతరం కోరికలలో ప్రధానాంశంగా మారింది. చదువుకునే రోజుల్లోనే, తెలిసీ తెలియని వయసులో, అనుభవంలేని తరుణంలో ఎదుటివ్యక్తిని అంచనా వేయటం చాలా కస్టం. వ్యక్తిత్వ పరిశీలనకు అవకాశమే లేదు. అలాంటి సమయంలో కొత్త వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించడం నిజంగా సాహసమనే చెప్పాలి. క్షణిక ఆవేశంలో, కామ వికారాలతో వికృతమైన నిర్ణయాలు తీసుకున్న పాపానికి జీవితాంతం అస్టకస్టాలు పడుతున్న ఎంతోమంది యువతీ యువకులను మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రతినిత్యం పత్రికల్లో మోసపోయిన వారి గురించన కధలెన్నో చదువుతున్నాం. వాటిని చూసి కూడా యువతరం తమ ఆలోచనా సరళిని మార్చోకోక పోవడం కడు శోచనీయం.

ప్రేమించి పెళ్ళి చేసుకోని జీవితం అసంపూర్ణమనే భావనకు యువత దిగజారింది. ఎవరు యోగ్యులో, సమర్ధులో అనే అంశం పిల్లలకన్నా పెద్దలకే బాగా తెలుసునన్న నగ్నసత్యాన్ని యువత జీర్ణించుకోలేక పోతున్నది. ఫ్రెమించని జీవితం వ్యర్ధమనే భావనకు యువత రాడం నిజంగా దురదృష్టకరం. పోనీ వారి ప్రేమ అంత పవిత్రమైనదా అంటే సమాధానం దొరకదు. కామోద్రేకాన్ని, తొందరపాటుతనాన్ని ప్రేమగా వర్ణించుకుంటున్నారు యువతరం.


ఉద్యోగం చేసే సమయంలో ప్రేమించడం, పెళ్ళిచేసుకోవడం కొంతమేరకు సమర్ధనీయం. ఆ వయసులో కొంత అనుభవం, ఇంద్రియ నిగ్రహం, వ్యక్తిత్వ వికాసం కలుగుతాయి కాబట్టి ఎంపిక చేసుకోవడంలో తప్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఎన్నొ జంటలు మధ్యలోనే విడిపోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. యువత తాము ప్రేమించడమే కాకుండా తమ సన్నిహితులు ప్రేమిస్తే వారి వివాహ ఏర్పాట్లు చేసి, దగ్గరుండి పెళ్ళి జరిపించడంలో ఆరితేరిపోతున్నారు. దానినొక సమాజ సేవా కార్యక్రమంగా పరిగణిస్తున్నారు.

యువత ఎంతసేపటికి తమ జీవితం, భవిష్యత్తు, సంపాదన గురించే కలలు కంటూ ఉంటారు. తమను కని, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రుల కలల విషయం మర్చిపోతున్నారు. అంతులేని స్వార్ధంతో ప్రవర్తించి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తున్నారు. పెద్దల అహాన్ని దెబ్బ తేసే విధంగా మాటల్లో, చేతల్లొ ప్రదర్శిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో
చేయి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. పట్టరాని కోపంతో పెద్దలను దూషించడం మనం కొంతమంది పిల్లల విషయంలో గమనించ వచ్చు. పెద్దల మనసు ఎంతగా గాయపడి తల్లడిల్లిందో పిల్లలకు తెలియని శోచనీయమైన పరిస్ధితి నేడు నెలకొని ఉంది.

తమ చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలే తమను ఎదిరిస్తుంటే చూసి తట్టుకోలేక తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. వారు ఎక్కడ చెడు త్రోవలో పయనిస్తారొనని పరిపరి విధాల పరితపిస్తుంది తల్లి మనస్సు. పిల్లలలో వచ్చిన ఆకస్మిక మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు కన్నవారు. వారిలో మార్పుతేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సంస్కారంగల కొంతమంది పిల్లలు ఈ దశలో తమ ధోరణిని మార్చుకుంటున్నారు. అంతులేని అహంకారంతో, వ్యర్ధ గర్వంతో మూర్ఖంగా ప్రవర్తించే కొంత మంది పిల్లలు మానసిక మార్పుకు సిద్ధపడక మొండిగా ప్రవర్తిస్తూ తల్లి దండ్రులను మనోవేదనకు గురిచేస్తున్నారు.

సాంసారిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లలను కని, పెంచి, ప్రయోజకులను చేయాలని కన్న కలలు మంచులా కరిగిపోతుంటే నిశ్చేష్టులై తిలకిస్తున్నారు. చేసేదిలేక చతికిలబడిపోతున్నారు. ఇలాంటి దుర్దశ ఎవరికీ పట్టకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నారు. యువతరం మనసు మార్చమని మూగగా రోదిస్తున్నారు.

నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home