Wednesday, May 7, 2008

వైరాగ్య సంపద

“మగువ కుచంబులు బంగరు చెండ్లని మరి మరి మోహము జెందకురా తగదుర చీయవి మాంస ముద్దలని తలచి యసహ్యము నొందుమురా” యని ఆది శంకరులు భజగోవిందంలో కామ వాంచను వైరాగ్య భావంతో ఎలా నిగ్రహించుకోవచ్చో తెలియజేశారు. ధన కనక వస్తు వాహనాది సంపదలకన్న వైరాగ్య సంపద చాలా గొప్పది. తీవ్ర వైరాగ్యంచేతనే పచ్చి వ్యభిచారియైన వేమన యోగిగా మారగలిగాడు. ప్రగాఢ వైరాగ్యం మూలంగా సిద్ధార్ధుడు గౌతమ బుద్ధునిగా మారాడు. మానవుడు సంసారంలో సంచరించేటప్పుడు బురదలో కుమ్మరిపురుగు మాదిరిగా, తామరాకుపై నీటిబొట్టువలె విషయాలను మనసుకు అంటించుకోకుండా ఉండాలంటే తీవ్ర వైరాగ్య భావమే శరణ్యమౌతుంది.

సాధు సజ్జనుల సాంగత్యంవల్ల, ఆధ్యాత్మిక గ్రంధ పఠనలవల్ల, నిత్యానిత్య వస్తు వివేచనవల్ల్ల మానవునిలో వైరాగ్య భావం కలుగుతుంది. తద్వారా తనలో తాను అంతర్ముఖుడై జ్ఞాన మార్గంలో పయనిస్తాడు. వైరాగ్య భావన పరాకాష్టనొందితే మనకు కనిపించే తళుకు బెళుకుల ప్రపంచమే నిత్యం, సత్యమనే భ్రమ తొలగుతుంది. తాత్కాలికమైన సౌకర్యాలు, సుఖాలు శాశ్వతం కావని, నిత్య సత్యమైన, అజరామరమైన ఆత్మతత్త్వం మాత్రమే శాశ్వతమైన సంపదగా మానవుడు గుర్తిస్తాడు.

వైరాగ్యం గురించి మన పురాణాలలో, శాస్త్రాలలో ఎంతో విపులముగా వివరించబడింది. వైరాగ్యమంటే పంచ భూతములతో కూడిన దేహము నాదనే భావనను తొలగించుకొని, భౌతిక సుఖ సంపదలపై ఆకాంక్షను వదలుకోవాలని అర్ధము. అంతేగాని మనం చేసే నిత్య కర్మలలో అనాసక్తిని పెంచుకోమని అర్ధం కాదు. మనం చేసే దైనందిన కార్యకలాపాలలో 60 సం.లలో 20 సం.ల ఉత్సాహం, 20 సం.ల లో 60 సం.ల వైరాగ్యం కలిగి ఉండాలి. అప్పుడే మనం మన విద్యుక్త ధర్మాలను సమర్ధవంతంగా నెరవేర్చగలం.


మానవుడు దైనందిన జీవన పోరాటంలో దుస్ట సాంగత్యంపట్ల, చెడు తలంపులపట్ల, దురలవాట్లయందు వైరాగ్య భావనను ప్రదర్శించాలి. మంచి స్నేహితులను సమకూర్చుకొని, మంచి భావాలను పెంపొందిచుకొని, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. మానవజన్మ పరమార్ధమైన ధర్మార్ధ కామ మోక్షములను సాధించడానికి ప్రగాఢ వైరాగ్య భావనే ఉత్తమమైన మార్గమని గ్రహించాలి..

నాగులవంచ వసంతరావు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home