Friday, May 9, 2008

కీర్తి ప్రతిష్టలు

ఉత్కృష్టమైన జ్ఞాన మార్గంలో కీర్తి ప్రతిస్టలకు అంతగా ప్రాధాన్యత లేదు. కాని సామాన్య మానవ జీవితానికి కీర్తి ప్రతిస్టల అవసరం ఎంతైనా ఉంది. కనీసం వాటికోసమైనా దాన గుణమును అలవరచుకునే అవకాశం లభిస్తుంది. వారి పెద్దల పేరుమీద విద్యాలయాలు నడపడం, వైద్య శాలలు నెలకొల్పడం, ఉచిత సత్రములు కట్టించడం, అన్న దానం వంటి సేవా కార్యక్రమాలు ఈ కోవలోకి వస్తాయి. తద్వారా మానవుడు మానసిక స్ధాయిని విశాల పరచుకొని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకొంటాడు. తన కుటుంబ గౌరవాన్ని, వంశ పేరు ప్రతిస్టలను కాపాడుకోగల్గుతాడు.

కేవలం డబ్బు మాత్రమే కీర్తి కిరీటాలను అందించగలదనుకోవడం అత్యాశే అవుతుంది. సుఖ సంతోషాలతో బ్రతకడానికి డబ్బు అవసరమే. లెక్కకు మిక్కిలి ఆస్తిపాస్తులు సంపాదించినంత మాత్రాన ప్రపంచం తనను అభినందిస్తుందని, గౌరవిస్తుందని భావించడం దురాశే అవుతుంది. అపరిమితమైన సంపదను కూడబెట్టే ప్రయత్నంలో మనకు తెలియకుండానే ఎందరో శత్రువులు ఏర్పడతారు. మనిషికి కోరికలు ఎక్కువై అరిషడ్వర్గాల బారిన పడతాడు. సాటివారు మనల్ని చూసి ఈర్ష్య పడతారు. ప్రక్కవారు, ఎదుటివారు మన అపార సంపదను చూసి “తప్పుడు మార్గంలో సంపాదించి ఉంటాడు – లేకపోతే ఇంతలోనే అంత ఎలా సంపాదించ గలుగుతాడు” అంటూ సూటిపోటి మాటలంటారు.

న్యాయసమ్మతంగా, ధర్మ బద్ధంగా ఆర్ధికంగా ఎందగడంలో తప్పులేదని పెద్దల ఉవాచ. దానితోబాటు సంపాదించిన ధనాన్ని అర్హులైన వారికి దానం చేస్తే కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. దాన ధర్మాల్లాంటి మంచి పనులు చేసి మానసికానందాన్ని దండిగా పొందాలి. కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పటికన్నా – మీ వలన ఏదో మేలుపొందిన వ్యక్తి మనసారా అభినందించి, కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తున్నప్పుడో – లేక ఈ సమాజం మీ మంచితనాన్ని గుర్తించి మీకు ఘన సన్మానాలు చేసినప్పుడో కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. కనుక కీర్తి ప్రతిష్టలను కూడా మహా భాగ్యంగానే భావించి, వాటిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home