Thursday, October 16, 2008

ఒక్క క్షణం ఆలోచించు!

మనిషికి మత్తెక్కించి మనసును మాయజేసి
ఇల్లును ఒళ్ళును గుల్ల చేసి, సంఘంలో చులకన చేసే
మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై
నీ ప్రభావం మానేదెప్పుడు?

ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు
“చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి
ఐస్ ముక్కల హిమతాపానికి కరిగిపోయాయి
మహాత్ముల ఉపన్యాసాలు, నీతి బొధలు
సంఘ సంస్కర్తల త్యాగఫలాలు
మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి

అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది
గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం
బరువెక్కి బక్కచిక్కి బజారుపాలైంది
మధ్యం నిషా ముందు యింద్రభొగం దిగదుడుపయ్యింది!

ఎవడన్నాడు నా దేశం బీదదని
ఒక్కసారి బార్ ను దర్శించి చూడు
కుబేరుల తలదన్నే కాసుల గలగలలు
కుంభవృష్టిలాగా మధ్యం సెలయేళ్ళు

గజం భూమి ధర గణనీయంగా పెరిగన నేడు
గజానికో బార్ వెలసినా ఆశ్చర్యం లేదు
మందు మంచినీరులా ఉపయోగించినా కరువే రాదు
లక్షలాది ప్రాణాలు బలైనా బాధే లేదు!

మనసా! ఇంద్రియాలంటే నీకెందుకింత చులకన
క్షణాలలో పడేస్తావు నీ వలలో క్షణికానందాలకు

ఆరునూరైనా అనుకున్న టైంకు హాజరు పరుస్తావు
నీ కబంధ హస్తాలలో నిత్యం బందీని చేస్తావు

నాకెందుకో కసిగా కక్ష్య తీర్చుకోవాలనుంది
మద్యం సేవించే వారిపై కానేకాదు
త్రాగడానికి మనసును ఉసిగొలిపే ఇంద్రియాలమీద
మానవాభ్యున్నతిని మట్టుబెట్టే మనో చాంచల్యం మీద!

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home