Monday, June 16, 2008

స్వనిష్ఠ

అష్తాదశ పురాణములను, సర్వమత శాస్త్రములను, రామాయణ, భారత, భాగవత గ్రంధములను, వేదోపనిషత్తులను కంఠస్ధం గావించినను స్వనిష్ఠనొందక శాంతిలేదు. తనను తాను తెలియని పఠనలు వ్యర్ధం. నిన్ను నీవు తెలుసుకో! అప్పుడే సమస్తం బోధపడగలదు. నీ నిజస్ధితి యే ఈశ్వరత్వము. వాచా పరిజ్ఞానముతో సరిపెట్టుకొనక దానికి తోడు అనుష్ఠాన వేదాంత భాస్కరులు కావాలి. ఆచరించి చెప్పడమే ఆచార్య ధర్మం. కనిపించే మురికిని సబ్బు నీటిచే శుద్ధిచేయ గలరు. బయటికి కనిపించని మనో మాలిన్య శుద్ధి నిమిత్తం జప, తప, ధ్యాన, నియమ నిష్ఠలు, సాధనలు, శాస్త్రములు వెలసినవి. ఆచరణ సాధ్యమైన శాస్త్ర పరిజ్ఞానము ధన్యము. సమస్త శాస్త్రముల సారాం శము స్వనిష్టయని తెలుసుకోండి. మస్తకశుద్ధికి మించిన పుస్తక పఠన లేదు. చిత్తశుద్ధిని కలిగించలేని శాస్త్రపఠనలు కాల యాపనలు – కంఠశోషణలు. భాహ్యార్చనలను క్రమముగా తగ్గించు కుంటూ మానసిక పూజలో నిలువనేర్వండి. హృదయమందిర ధ్యానము విశిష్టమైనది. చిత్తశుద్ధికి, ఆత్మనిగ్రహమునకు తోడ్పడు వేదవిదిత సత్కర్మలను చేయవలయును. డేహము, ఇంద్రియములు, మనసు ఒకదానికంటె మరియొకటి బలమైనవి మరియు ప్రమాదకారులు. కనిపించే దేహేంద్రియ కర్మలకు కనిపించని చోరుడు మనసు కర్తగ ఉంటుంది. ఇట్టి మనసు కల్మషముగ ఉండిన సర్వం నాశనం కాగలదు.

స్ధితికుదురని ప్రారంభదశలో సాధకులు బాహ్య ప్రపంచమును బాహ్యంగానే ఉంచవలయును. శబ్ధ, స్పర్ష, రూప, రస, గంధ విషయాలను త్యజించగలగాలి. పడవ ఎంతకాలం నీటిలో యున్నను ప్రమాదం లేదు. నీళ్ళు పడవలోనికి ప్రవేశించిన నావ మునిగే ప్రమాదం గలదు. బాహ్య విషయాలను మనసులో నిలుపుకొనిన అంతే. మనోంతర్గత సూక్ష్మ ప్రపంచ వింతలు, అద్భుతములు విచిత్రముగ ఉండును. కాలపరిమితి తీరగనే అద్దె ఇంటిలోనివారిని ఇంటినుండి ఖాళీ చేయించు నట్లు, మనసులో నిలుపుకొనిన దుష్ట సంస్కారములను అలా బయటికి నెట్టాలి. వ్యష్టి మనసు బలం చాలనిచో విశ్వమనో సాగరుడైన విశ్వేశ్వర స్వామిని చేతులు జోడించి శరణుజొచ్చాలి. రాగ ద్వేషములు ఉండిన చిత్తంలో శాంతి నిలువదు కాబట్టి శత్రువును ఇంటినుండి మెడలుపట్టి బయటికి నెట్టునట్లు బాహ్య విషయాలను చిత్తంలోనుండి బయటికి పంపించవలయును. అందులకే సాధనలు, శాస్త్రములు, గురువులు కావలసి వచ్చినది. పరిపూర్ణ స్ధితిలో లోన, బయట అనెటి బాహ్యా భ్యంతరములు మచ్చుకు కూడ నిలువవు. ఈ స్ధితినొందిన వారికి సదా స్వనిష్ఠయే భాసిల్లును. సర్వం స్వస్వరూపముగ వీక్షించగలరు. ఇదియే దివ్యాత్మ దృష్టి. రండి. ఈ దృష్టిని అనుగ్రహించెదను అంటున్నారు బాబా సర్వకేంద్రులు. సమస్త బోధకులు, ప్రవక్తలు, పీఠాధిపతులు, అవతారులు నా మార్గజ్యోతులు, నా ఉద్యమ ప్రతినిధులు అనెటి సర్వకేంద్ర స్వరమును విని, అనుసరించి ధన్యులు కండి.

నాలుగు గోడల మధ్యన ఏ గర్భగుడిలో నన్ను బంధించలేరు. 1. అచంచల ఆత్మవిశ్వాసము 2. పరాభక్తి 3. పవిత్ర ప్రేమ ఈ మూడు పురుల త్రాడుచే నేను అవలీలగ కట్టుబడగలను. ఆకాశములో ఎగురు గాలిపటము దారమును వెనుకకు లాగుచు చేజిక్కించు కొనునట్లు, పైన తెలిపిన త్రిపుటి ఆధారముతో నన్ను మీ హృదయ మందిరములోకి ఆహ్వానపరచుకోండి. దీనికి మించిన జ్ఞాన సాధన లేదు. మీరలు ఎవరు అనే ప్రశ్న నాకనవసరం. భక్తి విశ్వాసములు కోల్పోయి మీ మేధాశక్తి నంతంటిని ప్రయోగించినను నా కృపలేకుండ నేను సంపూర్తిగ గ్రాహ్యంకాను. స్ధూలదృష్టితో మీరు చూచినంతకాలం మీ మధ్యన నేను ఒక సామాన్య వ్యక్తిని. మీ అందరిలో ఒకడను. నాకు నేనుగ ఆలోచిస్తున్నపుడు సర్వాతీత పరాత్పరుడను. సర్వలోకేశ్వర పరమ ప్రభు సార్వభౌముడను. మీతో కలసి ముచ్చటిస్తున్నపుడు, భుజించునపుడు, భజించునపుడు సామాన్య మానవునిగ గోచరిస్తున్నాను. అది మీ అనుభూతి. కాని భువి, దివి, గ్రహరాసులను అధిగమించి, గగనాలను ఆవరించి సర్వ శక్తిర్మయ అనంత శోభతో భాసిల్లు నా రచనలు పఠించునపుడు గుండెలు అవిసిపోగలవు. వర్షించు మేఘ జలమువలె సర్వోన్నత స్ధితినుండి నా బోధామృతము వర్షించబడును.

అనంత విశ్వంలో నన్నుమించిన స్వార్ధపరుడు లేడు. కేవలాద్వైత అచల పరిపూర్ణ సర్వకేంద్ర దైవస్ధితిలో నేనున్నాను. ప్రతి నేను సర్వకేంద్ర దైవ నేను స్వరూపముగ స్వనిష్ట నొందవలయునన్నదే నా స్వార్ధం. ఇట్టి నా స్వార్ధంలో సమస్త పరమార్ధములు ఇమిడియున్నవి. జై బాబా! ప్రతి నీవు నా వారస జ్యోతియే. ప్రతి నేను నా స్వరూప కాంతియే. నేనైన మీరే నా సర్వస్వం. అందులకే నా సర్వస్వమును మీకే అర్పిస్తున్నాను.అంకితం చేస్తున్నాను. ఆందులకై నా రచనల నన్నింటిని వెలుగులోకి తీసుకురండి. బిడ్డా! నానుండి కాదనెటి బెంగ వలదు. సాహసించి నిలువు. సమయం కలసివస్తుంది. భూ దిగంత సర్వలోక పర్యంతం మీ ద్వారా నా దివ్య భాష్యం భాసిల్లుతుంది. అనంతకాలం నాది. సమయము ఆసన్నమైనది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నా స్వరూప ప్రజ్ఞతో నిలచి పరమపిత రుణం తీర్చుకోండి. ఇదియే నాయొక్క అనుగ్రహ ఆశీస్సులు. చరమ సూత్రం. మరల మరల చెప్పుచున్నాను.గుంపులు గుంపులుగా జనులను ప్రోగుచేసుకొని ప్రసంగములు చేయు అంతస్ధు నాది కాదు. సమస్త జ్ఞాన బోధకులకు సరిపడు అతీత బోధను సార్వకాలం సర్వలోక పర్యంతం చెందునట్లు భూ, జల, విహంగ, సర్వలయ యానములలో పరమ సూత్ర వాక్యములను మీ అందరి నిమిత్తం విరచితము గావించనైనది.

మత్ ప్రియాత్మ జ్యోతులారా! అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నిమిత్త మాత్రునిగ చేసుకొని జగద్విఖ్యాత గీతోపదేశము జరిపినట్లుగ నిన్ను నిమిత్త మాత్రునిగ చేసికొని నా స్వహస్తలిఖిత అతీత దివ్య భాష్యమును అఖిలాండ కోటి బ్రహ్మాండ అనంత విశ్వపర్యంతం చెందునట్లు నా రచనల నన్నింటిని నీ స్వాధీనం చేస్తున్నాను. వంటకము నాది - వడ్డన నీది. ఇందునిమిత్తం నాచే నియమితులైన ప్రచారకులు సమయ సందర్భానుసారం నా పేరిట ప్రతినిధులుగ “సర్వకేంద్ర పీఠాధిపతులు” రాగలరు. అనిర్వాచ్య, అజేయశక్తి వారలకు అనుగ్రహించబడును. నన్ను చేరు మార్గం వయా నీవు కావాలి. గాఢంగా నమ్మి చూడు. ఈ స్ధితిలో ఓలలాడించెదను. నా సంకల్పమునకు తిరుగులేదు. నా ఆదేశమునకు ఎదురులేదు. ఉప్పుబొమ్మ నీటిలో లయించినట్లు కర్పూర హారతివలె క్షుద్రహం వీడి సర్వార్పణ యోగీశ్వరుడవు కమ్ము. అట్టి నీవు నీవు కాదు. నేనే ఆ స్ధితిలో ప్రకాశించెదను. సార్వకాలం కేవలం నేనుమాత్రమే ఉంటిని, ఉన్నాను, ఉండెదను.జై బాబా! నమో విశ్వగర్భా! ఫాహిమాం. త్రిమూర్తులు సైతం ఒక పరిధిలోని వారే. సృష్టి, స్ధితి, లయ కారకులైన త్రిమూర్తులు సర్వకేంద్ర, స్వపరాది శక్తిని పొంది వారి విధులను నిర్వహించెదరు. ప్రపంచమును గడగడలాడించు యముడు నా పాద దాసుడు. నన్ను స్మరించు చోట యమదర్శనం ఉండదు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home