Monday, May 26, 2008

నారదుడి సంసారమోహం

మాయ ఇలాంటిదని తెలియరానిది. ఓకరోజు నారదుడు శ్రీహరిని సమీపించి “స్వామీ! అసాధ్యాన్ని సుసాధ్యంచేసే నీ మాయను నాకు చూపించు” అని వేడుకొన్నాడు. శ్రీహరి తల పంకించాడు. ఆ తరువాత ఒకరోజు శ్రీహరి నారదుణ్ణి వెంటబెట్టుకొని ఒకానొక చోటికి ప్రయాణమైనాడు. కొంత దూరం వెళ్ళాక శ్రీహరికి దాహమైంది. ఎంతో అలసి కూర్చుండిపోయి, “నారదా! నాకు చాలా దాహం వేస్తోంది. ఎక్కడికైనా వెళ్ళి కొంచెం మంచి నీళ్ళు పట్టుకురా” అన్నాడు. నారదుడు వెంటనే నీళ్ళు వెదకడానికి బయలుదేరాడు.

సమీపంలో ఎక్కడా నీటి చుక్క లేదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏరు ఒకటి ఉన్నట్లు కనిపించింది. నారదుడు ఆ ఏటివద్దకు వెళ్ళగానే అక్కడొక దివ్య సుందరాంగి కనబడింది. ఆమె సౌందర్యాన్ని చూసి నారదుడు మోహం చెందాడు. ఆమె సమీపానికి పోగానే, మృదు మధుర వాక్కులతో ఆమె నారదుణ్ణి పలుకరించింది. అచిరకాలంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నారదుడు ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చెయ్యసాగాడు. కాలక్రమాన ఆమెవల్ల అతడికి సంతానం కలిగింది.

ఇలా నారదుడు ఆలుబిడ్డలతో మహానందంగా కాలం గడుపుతూంటే, ఆ దేశంలో గొప్ప కరువు కాటకం సంభవించింది. వేలకొద్ది జనాన్ని మృత్యువు కబలించసాగింది. అప్పుడు నారదుడు ఆ చోటు విడిచి మరోచోటుకి పోవటం మంచిదని భార్యతో అన్నాడు. భార్య కూడా సమ్మతించగా వారిద్దరూ వంతెనమీదుగా పోతూంటే హఠాత్తుగా పెద్ద వరద వచ్చింది. ప్రవాహ వేగంలో పిల్లలంతా ఒక్కొక్కరే కొట్టుకు పోయారు. చివరకు భార్యకూడా నీళ్ళలో మునిగిపోయింది. అపరిమిత దు:ఖంతో నారదుడు నది ఒడ్డున చతికిలబడి భోరున విలపించసాగాడు!

ఆ సమయంలో శ్రీహరి అతణ్ణి సమీపించి, “నారదా! మంచి నీళ్ళు ఏవి? నువ్విలా ఏడుస్తున్నావెందుకు?” అంటూ పలుకరించాడు. స్వామిని చూడగానే నారదుడు ఉలిక్కిపడి లేచాడు.జరిగిపోయినదంతా నారదుడికి తేటతెల్లమైంది. అప్పుడు నారదుడు చేతులు జోడించి “మహాప్రభో! నీకు పదివేల నమస్కారాలు! అత్యద్భుతమైన నీ మహామాయకు శతకోటి నమస్కారాలు!” అని శ్రీహరితో అన్నాడు

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home