Sunday, May 25, 2008

భక్తి మార్గం

ముక్తిని సాధించుటకు అనేక మార్గములు గలవు. అందులో భక్తి మార్గము అత్యంత సులువైనది. భగవంతుని నామాన్ని జపిస్తూ, రూపాన్ని ధ్యానిస్తూ చేసే పూజలను, ఉపాసనలను భక్తి అంటారు. భక్తి యోగంలో జీవుడు దేవుని ఎల్లవేళలా స్ధుతిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు.

భక్తి యోగం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. “ప్రప్రధమమున మనస్సును, బుద్ధిని పరమాత్మయందు స్ధిరముగ నిలుపవలెను. మనస్సు సంకల్పించును. బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవంతుని విషయమై దృఢమగు నిశ్చయమును కలుగజేయునది బుద్ధియే. కావున దానిని కూడ మనస్సులో చేర్చవలెను. అట్లు మనో బుద్ధుల రెండింటిని ఇతరమైన దృశ్య వస్తువులయందు ప్రవేశింపనీయక, ఒక్క భగవంతునియందే లగ్నమై యుండు విధముగా ప్రయత్నింపవలెను. అట్లు చేసినచో భక్తుడు ధ్యేయ వస్తువగు ఆ పరమాత్మయందే సదా నివసింపగలడు. ఉప్పు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేనియందు సంలగ్నమై యుండునో దాని యందే లయించి తదాకారమగును. కావున ఎల్లప్పుడు భగవంతునియందు స్ధిరముగ ఉండునట్టి మనస్సు క్రమముగ ఆ దైవాకారమునే పొందును. అదియే మోక్షము”.

మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము కలుగుచున్నవి. కాబట్టి మనస్సును ఏదొ ఒక విధముగ భగవంతునియందు నిలుపవలెను. మనస్సు నిలువనిచో దానిని ఏదో ఒక విధముగ నిలుకడ పొందునట్లు చేయ వలెను. మోక్షము పొందుటకు ఇంతకంటె వేరు మార్గము లేదని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు.

మనో నిశ్చలత్వమును సాధించలేని వారు క్రమముగ దైవ కార్యములయందు, పరోపకార క్రియలయందు ఆసక్తి కలిగి, వానిని నిష్కామముగ ఆచరించుచు రావలయును. జపము, ప్రార్ధన, కీర్తన, భజన, పూజ, వ్రతములు మున్నగు వానిని భగవంతుని ప్రీత్యర్ధము గావించుచుండవలెను. దానిచే మనస్సు శుద్ధము కాగా క్రమముగ జ్ఞానముదయించి మనుజుడు మోక్ష సిద్ధిని పొందగలడు. ఆతి సూక్ష్మమైన మనస్సును, సంకల్పములను అరికట్టలేని వారికి యీ కర్మ మార్గము అతి సులువైనదని భగవానువాచ.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home