Sunday, May 25, 2008

జీవిత పరమార్ధం

అనంత కాలచక్రంలో జీవితకాలం అల్పంగా గోచరించినప్పటికి, అర్ధం చేసుకోగల శక్తి ఉంటే శతకోటి సుగంధ పరిమళాల మాల మానవ జీవితం. ఉత్సాహంగా పనిచేస్తూ, ఆనందంగా జీవిస్తూ, సాటివారికి సాయంచేస్తూ బ్రతకడమే నిజమైన జీవితం. సద్భావనలు సంతరించుకొని సన్మార్గాన పయనిస్తూ, సమత మమత మానవతలను పరిఢవిల్లజేసేదే జీవితం. ఆదర్శాలను ఆచరణలో ప్రతిబింబిస్తూ, తెరచిన పుస్తకంలా ఉండేదే అసలైన జీవితం.

దురలవాట్లతో దిగజార్చు కుంటే జీవితం దు:ఖ సాగరమౌతుంది. మలచుకోగల నేర్పు ఉంటే మహోన్నత శిఖరమౌతుంది. సంసార సాగరం లో సమస్యల తిమింగలాలు అలజడులు రేపి అల్లకల్లోలాలు సృష్టించినా, సుడి గుండాలుగా మారి సునామీలా విరుచుకుపడినా, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మనగలిగేదే జీవితం. ఆదర్శాలను ఆచరణలో అమలుచేయబోతే సహించలేని సభ్య సమాజం తూలనాడినా, అభాండాలువేసి అభాసుపాలు చేసినా, గుండెనిబ్బరంతో ముందుకు సాగేదే జీవితం.

నీవు నమ్మిన సిద్ధాంతాలతో ఎవరూ ఏకీభవించకున్నా, అవి అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా ఏకమై ఎదిరించినా, నిందించి నీరుగార్చినా, అహర్ణిశలు ఆత్మోన్నతికి శ్రమించడమే అసలైన జీవితం. మనసును నియంత్రించి, అరిషడ్వర్గాలను జయించి, అనునిత్యం ఆత్మానందంలో మునగడమే దివ్య జీవనం. గర్వమే సర్వ అనర్ధములకు మూలం, అహంకారం నశిస్తేనే ఉదయిస్తుంది ఆత్మ జ్ఞానం.

“బలమే జీవనం – బలహీనతే మరణం” అని చాటిన స్వామి వివేకా నందులవారి సిమ్హ గర్జనకు స్పందించి, పరిపూర్ణమైన ఆరోగ్యంతో, మానసిక వికాసంతో, విశాల హృదయంతో వర్తించగలిగేదే విలువైన జీవితం. బహుజన్మల పుణ్యపాక వశాన భగవంతుడిచ్చిన వరం మన జీవితం. 84 లక్షల జీవరాసులలో ఉత్కృష్టమైనది మానవ జన్మ. అందులకే విషయ వాసనలను విసర్జించి, స్ధితప్రజ్ఞతను సాధించి, ఆత్మ జ్ఞానాన్ని అనుభూతి చెందినదే సంపూర్ణ జీవితమని శాస్త్రాలు సెలవిస్తున్నాయి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

1 Comments:

At May 26, 2008 at 8:48 PM , Blogger Naga said...

అద్భుతం. కృతజ్ఞతలు.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home