Friday, May 23, 2008

దైవమంటే ఏమిటి?

మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాం. మనసు నిలకడకోసం ఒక విగ్రహాన్నో, చిత్రపటాన్నో ఎంచుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తాం. గతంలో అవతరించిన అవతార పురుషులను, ప్రస్తుతం సజీవులైన మహాత్ములను, బాబాలను, స్వాములను, అమ్మలను మనం పూజిస్తున్నాం. ఐతే దైవమంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు దేవుడనగా అకాశములోగాని, పాతాళములోగాని, పరలోకములోగాని, విగ్రహములోగాని, దేవాలయములోగాని, మరి ఏ ఇతర నిర్దేశిత ప్రదేశం లో గాని ప్రతిష్టించబడియున్న “స్పెషల్ ఎఫెక్ట్స్”తో కూడిన అద్భుత శక్తి కాదు. సకల చరాచర జీవజగత్తులో నిండి, నిబిడీకృతమై వున్న అనంత చైతన్య స్వరూపమే అసలైన దైవం.

మన తాతలు, తండ్రులు, దేవుని విగ్రహాలకు, చాయా చిత్రాలకు దండం పెట్టారు. మనమూ అదే బాటలో దండాలు పెడుతున్నాం. రాముడు, కృష్ణుడు, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడీ సాయి మొదలగు వారిని దేవుండ్లంటున్నాం. వారిని పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.
బాగా ఆలోచించి, విశ్లేషణ చేసుకుంటే మనం దేవుని పటానికి దండం పెట్టినంత మాత్రాన మోక్షం పొందలేము. అదెలాగంటే ధనవంతుని అమితంగా గౌరవిస్తే, శక్తిమేర పొగిడితే ధనవంతులం కాలేం. ఎంతో నేర్పుతో కష్టపడి పనిచేస్తే, దానికి అదృష్టం తోడవుతేనే మనం ధనవంతులం కాగలం. అలాగే దైవ లక్షణాలను అలవర్చుకొని, నిత్య జీవితంలో చక్కగా ఆచరణలో పెడితే దేవునిలాగ అవుతాం. అందుకే దేహేంద్రియ మనోబుద్ధుల నతిక్రమించి, దేహాభిమానాన్ని దూరం చేసుకొని, దైవభావనలోకి ప్రవేశించినట్లైతే మనం జీవన్ముక్తులమౌతాం. అందుకే మనో నిగ్రహాన్ని పాటించి, ధ్యాన మార్గాన్ని అనుసరించి మన నిజ దైవస్ధితిని తెలుసుకుందాం. దైవ భావన లో సదా నిలిచి ఉందాం.

లౌకికపరంగా గనక చూసినట్లైతే ఒకరు పరిశ్రమలో కార్మికుడుగా చేరి, తన శక్తియుక్తులను ప్రదర్శించి పారిశ్రామికవేత్త అవుతున్నాడు. మరొకరు షెడ్డులో మోటార్ మెకానిక్ గా చేరి నిరంతర శ్రమతో అనతికాలంలోనే షెడ్డుకు యజమాని అవుతున్నాడు. ఇంకొకరు హోటల్లో సాధారణ సర్వర్ గా చేరి కొద్ది కాలంలోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శించి హోటల్ యజమాని స్ధాయికి ఎదుగుతున్నాడు. ఇవన్నీ సంతోషించ దగ్గ పరిణామాలే. కాని మన నిజస్ధితి విషయానికొచ్చేసరికి మనం ఎల్లప్పుడు కంటికి కనిపించని, మనసుకు అనుభూతికాని దేవునికి దండాలు పెట్టే స్ధితిలోనే ఉంటున్నాం. మూర్తి పూజలు భక్తి మార్గంలో పరిపాటి అయినప్పటికీ, జ్ఞాన మార్గంలో అవి అక్షరమాలలో మొదటి అక్షరం మాత్రమేనని తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం వర్ణమాల పూర్తిగా నేర్చుకునేదెప్పుడు? గ్రంధపఠన చేసేదెప్పుడు? డిగ్రీలు, పిహెచ్.డీ.లు పొందేదెప్పుడు? మన నిజ దైవస్ధితిలో అనగా స్వస్వరూప సంధాన స్ధితిలో ఓలలాడేదెప్పుడు?

అందుకే ప్రస్తుతం మనమున్న స్ధాయినుండి ఒకడుగు ముందుకు వేద్దాం. మనలో దాగివున్న దైవత్వంపై అచంచలమైన విశ్వాసంతో, భక్తి మార్గంలో పయనించి, ముక్తికి చేరువై, జీవన్ముక్తులమై దివ్యజీవనం సాగిద్దాం. మానవులందరు దేవుని సంతానమన్నది నిర్వివాదాంశం. దేవుని పుత్రులు, పుత్రికలకు దైవ లక్షణాలు అనివార్యం. మనస్సు మాయలో చిక్కుకున్నందువల్ల మన నిజస్ధితిని మరచిపోయాం. నివురుగప్పిన నిప్పువలె నిజస్ధితిని మరిచి జీవిస్తున్నాం. ఒక్కసారి నిప్పుకణక మీది నివురు (బూడిద)ను ఊదేద్దాం. మనలో నిద్రాణంగా దాగివున్న దైవత్వాన్ని వెలికితీద్దాం. దైవానుభూతిని సాధించి దివ్యజీవనం సాగిద్దాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home