Sunday, May 25, 2008

దివ్యుడా! కనువిప్పుకో!!

ఓ ఆత్మ వీరుడా! అజ్ఞాన దశనుండి మేల్కొని సకల జీవరాసులలో సర్వేశ్వరుని దర్శించ నేర్వమని వేదాలు ఘోషిస్తున్నాయి. మానవుడు మాయలోపడి పరమేశ్వరుని మరచి ఏవిధంగా ప్రాపంచిక జీవన యానం సాగిస్తున్నాడో శాస్త్రాలు సెలవిస్తున్నాయి. బుల్లి బుల్లి నడకలతో బాల్య్లం గడచిపోతుంది. చిట్టి చిట్టి మాటలతో చిరుప్రాయమంతా కరగిపోతుంది. యవ్వన దశకు చేరగానే ఇంద్రియాల వత్తిడివల్ల ఎండమావిలాంటి కామ వాంచను తీర్చుకోవడానికి వడివడిగా పరుగెడుతాడు. సుందరమైన దేహ సౌందర్యానికి దాసుడై చిందులేస్తూ అంతరాత్మ ప్రభోదాన్ని సైతం ధిక్కరిస్తాడు. మనసులో విషము నింపుకొని సైతం పెదవులపై ప్రేమ ఒలకబోస్తూ కపట జీవితాన్ని కొనసాగిస్తాడు. అహంకారప్రవృత్తిలో అన్నుమిన్ను తెలియక నాదే పైచేయని దర్పాన్ని ప్రదర్శిస్తాడు.

ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడున్నాడనే సత్యాన్ని గ్రహించలేక ప్రతిమ లను పూజిస్తూ ప్రాణులను హింసిస్తూ ఉంటాడు. బలం బాగా వస్తుందని జీవులను చంపి తింటాడు. కాని కాళుడు కన్నెర్ర జేసినప్పుడు చతికిల బడక తప్పదనే విషయాన్ని గ్రహించలేకపోతాడు. సత్త్వ, రజో, తమో గుణములనెటి త్రిగుణములలో చిక్కి ఎన్నో బాధల ననుభవిస్తూ, మాయ చేత పెడతన్నులు తింటూ ఉంటాడు.

కాబట్టి ఓ మానవా! కాలమంతా కరిగిపోతూ ఉంది. నీ వయసేమో రోజు రోజుకు తరిగిపోతూ ఉంది. మృత్యువు క్షణ క్షణం దగ్గరవుతూ ఉంది. ఐనప్పటికి నీకు మాత్రం బ్రతుకుపై ఆశ చావడంలేదు. మృత దేహాన్ని చూడగానే “ఈ రోజు ఇంట్లో – రేపు మంట్లో” అంటూ అంతులేని వైరాగ్యాన్ని ప్రదర్శించి, స్మశానం నుండి బయటికి రాగానే మాయావినోదంలో మునిగి పోతున్నావు.

మాట విననటువంటి మనసుతో సాంగత్యం చేసి, మాయలో చిక్కుకొని మానవ జన్మ పరమార్ధమైన ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనే విషయాన్ని మరచిపోయావు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో కర్మఫలానుసారం వివిధ శరీరాలను ధరించి, బహు జన్మల పుణ్యపాక వశాన మానవ జన్మ ఎత్తావు. ఇకనైనా కనువిప్పు కలిగించు కొని ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి, జనన మరణ కాలచక్రం నుండి విడుదలై మోక్షం పొందాలని పురాణాలు బోధిస్తున్నాయి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home