Sunday, June 8, 2008

స్వస్వరూపం

అజ్ఞాని, ఆత్మజ్ఞాని ఉభయులు సృష్టిని చూస్తున్నారు. అజ్ఞాని దృష్టిలో తనకు భిన్నముగ ప్రపంచము కనిపిస్తుంది. ఆత్మజ్ఞాని దృష్టిలో ప్రపంచము తనకు వేరుగ గోచరించదు. దీనినిబట్టి తేడాలు దృష్టిలో గలవేగాని సృష్టిలో మాత్రం కాదని తెలుస్తుంది. దృష్టిని బట్టియే సృష్టి గోచరిస్తుంది. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే విశాల విశ్వం ఆత్మ స్వరూపముగా విరాజిల్లుతుంది. చూచేవానికే సృష్టి. ఆ చూచేవానిని చూడనేర్చుకోవాలి. ప్రపంచం ఆత్మగ సత్యం. ఈ విశ్వమంతయు మహా వెలుగునుండి, శబ్ధమునుండి జనిస్తుందని భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. ఈ విశ్వంలో ఏపదార్ధము కూడ చిన్మయ చైతన్య శక్తికి భిన్నంగా లేదు.

దివ్య ప్రకాశమే వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై యున్నాడు. వెలుగు సంబంధులై మెలగనేర్వాలి. ఆదియందుగల శబ్ధమే ప్రణవం. త్రిమూర్త్యాత్మక ప్రణవ స్వరూపమే ప్రపంచం. కొందరు ఆదియందు వాక్యము పుట్టెను అంటారు. శబ్ధ సముదాయమే వాక్యం. వాక్య సముదాయమే వ్యాసం. వ్యాసముల సమాహారమే విశ్వం. అజ్ఞాన బంధితులై మిధ్యా నేనుతో వ్యవహరించిన దయ్యాలు కాగలరు. సుజ్ఞాన పరిధిలో సత్య నేనుతో వ్యవహరించిన దైవాలు ఔతారు. ప్రతి ప్రాణి సహజ పరిపూర్ణ దివ్యస్ధితిని పొందు పర్యంతం, సాగరైక్యంగోరు నదిని అనుసరించవలయును. మనమందరం అఖండ సచ్చిదానంద సర్వేశ్వర స్వామి స్వరూపులమేగాని వేరు ఎంతమాత్రం కాదు.

సృష్టిలో అణువునుండి ఆకాశ నక్షత్ర పర్యంతం, జీవాణువునుండి పరమాత్మ వరకు, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక లోకాలకు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి మూడు అవస్ధలలోను ఉన్న వస్తువులు ఆయా లోకాల్లోని, ఆయా స్ధితులలోని ద్రవ్యంలో నిర్మాణం ఐనవి. ఈ వివిధ ద్రవ్య రూపాలన్నింటికి మూలమైన నియతి ఒకే ఒకటి. అదియే “సత్”. ఉండేది ఈ ఒక్కటే. నామ రూపాలు మిధ్య. సర్వ పరిపూర్ణముగ ఉన్నది ఒక్కటే. రెండవది లేదుగాన సామ్యం పొసగదు. పోల్చటం కుదరదు. ఏకైక చిన్మయ చైతన్య “సత్” అప్రమేయమై, అమోఘమై, అనంతమై, సమస్త నామ రూపాలకు ఆధారమై, మణులందు సూత్రమువలె సర్వత్ర, సర్వసాక్షి రూపమున సూత్రాత్మగా భాసిల్లుచున్నది. ఇదే భగవంతం. అన్నింటికి ఐక్యతను పొందజేసే అంశమే ఈ అఖండ “సత్”. అందరూ సత్ స్వరూపులే. ఈ సత్తే పరమ శివం.

సృష్టిలో సర్వత్ర ఏకత్వమే గోచరిస్తుందనిన అన్ని వస్తువులు ఒక్కటియని కాదు. ఒకే పదార్ధ నిర్మితములని భావం. మట్టితో వివిధ రకముల పాత్రలు, బంగారంతో వివిధ రకములౌ ఆభరణములు తయారు చేసినను మన్ను, బంగారం ఒక్కటే కదా! అలాగే నామ, రూప సృష్టి గతించినను మూలమైన సత్ ఏనాడు నశించదని తెలుసుకోవాలి. మానవుడు, దేవుడు, అణువు, మహత్తు ఇవి వ్యవహారంలో భిన్నంగా కంపించినా తత్వత: అవి పూర్ణములే. పరిపూర్ణతయే వీటి లక్షణము. ఉన్నదంతా కేవల సచ్చిదానంద పర:బ్రహ్మ పదార్ధమే. ఈ స్ధితిలో చిన్నా, పెద్దా తారతమ్యం లేదు. అంతా, అన్నీ పర:బ్రహ్మమే. ఇతరం ఎంతమాత్రం లేదు.

ఈ సృష్టిలో నిర్జీవ పదార్ధం ఏదియునులేదు. ప్రతి పరమాణువు కూడా జీవకళతో ఉట్టిపడుతుంది. ఇలాగే సూక్ష్మ లోకాల్లో, అన్ని అంతస్తుల్లో ఉండే ప్రతి సూక్ష్మ అణువు జీవంతో నిండియున్నది. సర్వం సజీవమయం ప్రోక్తం. విద్యుత్ శక్తి ఒకటే ఐనను ధనము, రుణము, పాజిటివ్, నెగెటివ్ అని రెండుగా వ్యక్తమౌతుంది. అలాగే ఉన్నదంతా ఒకే పదార్ధమైన సర్వ్వాది మూలకారణ చైతన్య సత్. చైతన్యం, పదార్ధం అని రెండుగా వ్యక్తమౌతుంది. చిన్మయ పర:బ్రహ్మ సత్ అద్వితీయం, అప్రమేయం, అనంతం. అన్ని రూపాలలో ఇది పూర్ణంగా వెలసియున్నది. అన్ని రూపాలు దీని రూపాలే. ఒక్కమాటలో చెప్పాలనిన ద్వైతం అనేది లేనేలేదు. ఉన్నదంతా కేవలద్వైత, అచల, పరిపూర్ణ పర:బ్రహ్మమే. ఈ నామ, రూపాలతో కనిపించే సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే ఒకటి. ఇది అనంతం. సర్వాది మూలకారణం. కారణం వేరు. మూల కారణం వేరు. ఈ అఖండ మూల తత్వమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మూలం. ఇది నిత్య శుద్ధం. నిర్గుణం, నిర్వికారం, నిర్విచేష్టం. దీనికి, కనిపించే ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు. దీనినే సత్, అస్తి అనవచ్చు.

ప్రతి ప్రాణి పరిణామ దశనుండి నిర్వికార శాశ్వత దైవస్ధితిలో ఎన్ని మన్వంతర కాలాలకైనను స్వస్వరూప ప్రజ్ఞతో స్వచైతన్యమెరింగి సర్వేశ్వర స్వామి స్వరూపంగా నిలువక తప్పదు. ఇది నిశ్చయం. ప్రతివారలు ఎంతకాలానికైనను దివ్య మానవ స్ధితిని పొందక తప్పదు. మహాగ్నిగుండం నుండి వెలువడిన అగ్నికణముల వంటివారు జీవులు. విశ్వాత్మలోగల అన్ని లక్షణాలు విస్ఫులింగమైన జీవునిలో గలవు. ఈ జీవాత్మలన్నియును క్రమముగా పరిణామదశ నొందుచు ఏదొ ఒకనాడు శాశ్వత ఆత్మ స్ధితిలో విలీనం కాకతప్పదు. మానవుడు తన నిజస్ధితిని పొందు పర్యంతం విశ్రమించరాదు. ఇది సకల ధర్మముల సారాంశము. సృష్టి సర్వస్వం పరమ సత్యముయొక్క బాహ్య స్వరూపమే ఐనను దాని వ్యక్త రూపం తాత్కాలికము కావున భ్రమ, భ్రాంతి, మాయ, సైతాన్, ఎరుక అన్నారు. అంతరంగ పరిణామ ప్రక్రియలను హస్తగతం చేసుకొనిన వారలే గుప్త సంకేతాలను గుర్తించి బహిర్గతం చేయగల సమర్ధులు. భౌతిక శాస్త్రజ్ఞులకు అంతుచిక్కనంత మాత్రాన సనాతన శాశ్వత పరమార్ధ సిద్ధాంతం మారదు, మరుగుపడదు. కేవలం తపోసంపన్నులైన, జ్ఞాన నిష్టులైన మహర్షులు తమ స్ధూల, సూక్ష్మ, కారణ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలను శక్తివంచన లేకుండ పరిశుద్ధపరచు కొనినందుననే అట్టివారలకు మాత్రమే బ్రహ్మాండ జగన్నిర్మాణ రహస్యములు బోధపడగలవు. యోగవిద్యా సంపన్నులకే సృష్టి రహస్యం గ్రాహ్యం కాగలదు.

ఏది ఈ సమస్తమును తనయందు ఇముడ్చుకొని సర్వోన్నతముగ ఉన్నదో అదియే సర్వకేంద్రం అని గ్రహించాలి. ఇది విశ్వమంతట ప్రతి అణువులోను నిక్షిప్తమై యున్నది. జీవరాసులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి గలదు. మానవ మేధస్సు అతిమానస భూమిక నధిరోహించిననే చిన్మయ పరతత్వం బోధపడుతుంది. టేప్ రికార్డ్ చేయు క్యాసెట్ లో మాటలు, పాటలు, వివిధ రాగాలు, ద్వనులు నిక్షిప్తమై ఉన్నట్లుగ, జరిగిపోయిన, జరుగుచున్న విషయాలన్ని సూక్ష్మాకాశ క్యాసెట్ లో టేప్ చేయబడి ఉండును. సూక్ష్మాకాశ పత్రముపై ముద్రింపబడి యుండును. ఇవి విశ్వంలో సూక్ష్మాతి సూక్ష్మంగ చోటుచేసుకొని యుండును. యోగ విద్యలో నిష్ణాతులైన ప్రసిద్ధ పురుషులు వారి ఆధ్యాత్మిక శక్తిచే సూక్ష్మాకాశంలో ముద్రితమైన విషయాలను గ్రహించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివలె కాలజ్ఞాన చరిత్రలను రచించగలరు. యోగ విద్యా ప్రావీణ్యులు తలంచినంతనే శరీర ధ్యాసను వీడి తురీయ స్ధితికి చేరగలరు. స్వశక్తితో సమాధి అవస్ధను పొందగలరు. యోగ విద్యాభ్యా సముచే ప్రకృతిని సులభముగా స్వాధీన పరచుకొనవచ్చును. దీనిచే సర్వ వ్యాపి, సర్వశక్తి సమన్వితుడైన అనంతాత్మను తెలుసుకోవచ్చు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home