Tuesday, May 27, 2008

నీలో శక్తిని గుర్తించు

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అద్భుత శక్తి అంతరాంతరాల్లో అణగి మణగి ఉంటుంది. ఏ మనిషీ ప్రతిదాంట్లోనూ సమర్ధుడు కాడో, ఏ వ్యక్తీ ప్రతి విషయంలోనూ అసమర్ధుడు కాడు. అతి సాధారణ స్ధాయిలో ఉన్న వ్యక్తిలోనైనా, అసామాన్యమైన శక్తి సామర్ధ్యాలుంటాయి. ఆ శక్తిని తెలుసుకోనంతకాలం ఎవెరైనా ఎదుగూ బొదుగూ లేకుండా, ఏమాత్రం అభివృద్ధి చెందకుండా అలాగే ఉండిపోతారు. ఐతే తనకు తెలియ కుండానే తనలో దాగివున్న అనంత శక్తిని తెలుసుకున్న నాడు, ప్రేరణను పొందిననాడు అనూహ్యమైన మానసిక మార్పు సంభవించి అద్భుతమైన అభివృద్ధిని సాధించగలడు.

ఆ శక్తిని మనకు ఎవరో ఇచ్చేది కాదు. మనం పుచ్చుకునేది కాదు. మనంతట మనం సాధనచేసి సాధించుకోవాలి. దీన్ని సాధించిన నాడే మనం మన గమ్యాన్ని చేరుకో గలుగుతాం. మన ధ్యేయం, లక్ష్యం దిశగా దూసుకుపో గలుగుతాం. హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు. కొండలనైనా పిండిచేయగల సత్తా, సముద్రాన్ని ఒక్క అంగలో దాటగల సమర్ధత, పెను వృక్షాలను పెకలించగల శక్తి, పర్వతాలను అరచేత్తొ పైకెత్తగల సామర్ధ్యం తనలో నిక్షిప్తమై ఉన్నాయని తెలుసు కున్న తరువాతే సంజీవినీ పర్వతాన్ని అరచేత్తో తీసుకురాగలిగాడు.

లక్ష్యాన్ని సాధించాలంటే, గమ్యాన్ని చేరుకోవాలంటే మన ప్రయత్నంలో అత్యంత తీవ్రత, విషయంలోకి లోతుగా వెళ్ళే స్వభావాన్ని అలవర్చుకోవాలి. సముద్రం పైపైన వెదకినట్లైతే మనకు ముత్యాలు దొరకవు. ముత్యపు చిప్పలు దొరకాలంటే సముద్రపు అట్టడుగుకు చేరు కోవాలి. పిచ్చికుక్క కాటువేస్తే సంక్రమించే భయంకర రేబిస్ వ్యాధి నాశనానికి వాక్సిన్ కనుగొన్న లూయీ పాశ్చర్ కి తనలో గొప్ప పరిశొధకుడు దాగున్నాడని, మానవాళి శ్రేయస్సు కోసం ఎన్నో వాక్సిన్ లను కనుగొనగల శక్తి తనలో దాగుందని ఆయన శ్రీమతి తెలియజేసే వరకు ఆయనకు తెలియనే తెలియదు.

లూయీ పాశ్చర్ 1849 లో మేరీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మానవాళిపట్ల మృత్యు దేవతగా నిలిచిన రేబిస్ వ్యాధికి మందు కనుగొనాలన్న దృఢమైన సంకల్పం, పట్టుదల ఆయనలో ఉండేది. తన మనసులోని మాటను పెళ్ళయ్యాక భార్యకు చెప్పి ఆ మందు కనుగొనటం తనవల్ల కాదని, తనకన్ని తెలివితేటలు లేవని, మరో పరిశోధకుడి సహాయంతో పిచ్చికుక్క కాటుకి వాక్సిన్ కనుగొనాలనే ఆలోచనను భార్యముందు ఉంచాడు. అప్పుడు అతని భార్య “మీ శక్తి ఏమిటో మీకు తెలియదు, వాక్సిన్ కనుగొనడానికి మరొక పరిశోధకుడి అవసరం ఏమాత్రం అక్కరలేదు, మీరొక్కరే వాక్సిన్ కనుగొనగలరు, ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది” అని చెప్పింది. అప్పుడు తెలిసివచ్చింది పాశ్చర్ గారికి తనలోని శక్రి సామర్ధ్యాలేమిటో. ఆ రోజునుండి ఎన్నో పరిశోధనలు చేసి తన ప్రాణాలను ఫణంగా పెట్టి అప్పట్లో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధికి వాక్సిన్ కనుగొని మానవాళి రేబిస్ మృత్యు కోరల బారిన పడకుండా రక్షించగలిగాడు.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home