Friday, May 30, 2008

గృహస్ధాశ్రమ ప్రాశస్ధ్యం

నిత్యజీవితమును పవిత్రపరచునదే పరమార్ధ వేద విద్య. ఇది గృహస్ధులకు చాలా ముఖ్యం. ఆశ్రమములన్నింటిలో గృహస్ధాశ్రమము సర్వ శ్రేష్టమైనది. ఎందులకనగా గృహస్ధాశ్రమము లేనిచో మిగతా ఆశ్రమాలకు స్ధానం లేదు. సర్వాశ్రమ కూడలి గృహస్ధాశ్రమము. చక్కని గృహస్ధాశ్రమము నుండియే సమస్త మహనీయాత్ములు, అవతారులు ఉద్భవించగలరు.

వివాహము పరమార్ధ జీవనమునకు ఆటంకము కాదని మహా సాధ్వీమణి, ఆదర్శ గృహిణి శ్రీమతి శారదా దేవి నిరూపించినది. భార్యా భర్తలిద్దరు పరస్పరం అవగాహన చేసికొని, శారీరక దృష్టి నతిక్రమించి, మానసికంగా, భౌద్ధికంగా అనంతకాల పర్యంతం విశ్వం కోసం బాహ్యాభ్యంతర బేధం వీడి భగవన్మతులై మెలగు దంపతులు
ధన్యాతి ధన్యులు.

సంసారంలో తొలిఘట్టం వివాహము. అది సార్ధకం, విజయవంతం కావాలనిన ఆ బాధ్యత స్త్రీ పురుషులిరువురిపై ఆధారఫడి ఉంటుంది. అనుస్ఠాన వేదాంతి స్వామి రామతీర్ధ అన్నట్లు “కళ్ళజోడు కంటి చూపునకు అవరోధం కాకుండునట్లు దంపతులిరువురు ఒకరికొకరు భారంగ, భయంకరంగ గోచరించకుండునట్లు చూచుకోవలయును.

హిందువులకు కృత్యాకృత్య విదాయక ప్రమాణ గ్రంధము వేదము. అట్టి వేద ప్రతిపాదిత విధానములన్నియును నివృత్తి బోధకములే. వేదములు మానవులను పాప తాపములనుండి విముక్తులను చేయునిమిత్తమే అవత రించాయి. “వేదో నారాయణ: సాక్షాత్” అనెటి భాగవతోక్తి ప్రకారం వేదం సాక్షాత్ నారాయణ స్వరూపమే.

వివాహ ఆంతర్యం గ్రహించలేనివారు మాత్రమే వివాహాన్ని కామ మయంగా, భోగ విలాస మరియు సంతానోత్పత్తి సాధనంగా భావిస్తారు. కేవలం శారీరక ఆశయములతో, ఇంద్రియ చాపల్య పశువాంచా ప్రవృత్తుల తీర్చుకొను నిమిత్తమేగల దాంపత్యములు హృదయైక్యం కానందున నిప్పులోపడిన ఉప్పువలె చిటపటలతో చివరకు దావాగ్ని వలె చిచ్చున ముంచుట తధ్యం.

ఈ లోకంలో భార్య ఎవరు? భర్త ఎవరు? అవి అస్ధిర శరీర సంబంధములు. ఆత్మకు అవిలేవు. ఆత్మ ఏ లింగబేధంలేని చైతన్య స్ధితి. భర్తయనగా భరించువాడని అర్ధము. “గతిర్భర్తా ప్రభుసాక్షి” యనెటి గీతా శ్లోకానుసారం సమస్త చరాచర జగత్తును ధరించి, యావద్విశ్వమును భరించువాడొక్కడే పరాత్పరమ ప్రభుస్వామియని గ్రహించాలి.

ఉదయాస్తమానము సమస్యలతో సతమతమయ్యే గృహస్ధులు మోక్షమును సాధించుట దుస్తరము, వీలు చిక్కదని కొందరు భావిస్తుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఉదా: జనక మహారాజు చక్రవర్తి పదవి నలంకరించియు తన రాచకార్యములతో పాటు వీలు కలుగజేసుకొని వసిష్ఠ మహర్షి సన్నిధిలో స్ధిరచిత్తుడై కూర్చుండి ఆత్మబోధ విని తరించాడు. అట్టిచో గృహస్ధులకు రాచకార్యములకు మించిన కార్య కలాపములుండవు గదా! ఆలోచించండి! విధిగా తీరిక చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వివాహ సంబంధం శారీరక పరిధుల నతిక్రమించి, నిత్యం పవిత్ర ప్రేమానురాగ బద్ధమై, సౌజన్యంతో, సౌశీల్యంతో, ఆదర్శ కుటుంబముగ, దివ్య గోపురముగ వర్ధిల్లాలి. అప్పుడే చల్లని సంసారం లో చక్కని సంతానం ఉద్భవించగలరు. వారు సీతారాములవలె. రాధాకృష్ణులవలె, పార్వతీ పరమేశ్వరులవలె మెలగి తమ దాంపత్య జీవితాన్ని ధన్యం చేసుకోగలరు.

దంపతులిరువురు సమర్ధులైనచో గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యం పాటించవచ్చు. అట్టి కుటుంబములు నిజముగ రాజయోగ మఠములన వచ్చు. గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యమనగా కేవలం రుతుకాల సంపర్కమును మాత్రమే కోరుకోవడం. రుతుకాల నిర్ణయము: స్త్రీలకు స్వాభావికముగ పదహారు దినములు రుతుకాలమని శాస్త్రములు చెప్పుచున్నవి. అందులో మొదటి నాలుగు దినములు మంచివికావు. అలాగే పదకొండు, పదమూడవ రాత్రి నిషిద్ధములు. తక్కిన పది రాత్రులు ప్రశస్ధములు. ఏకాదశి, శివరాత్రి మొదలగు పర్వదినములు సజ్జన వర్జితములని శాస్త్ర వచనము. గృహస్ధులు ఈపాటి బ్రహ్మచర్య వ్రతదీక్ష కలిగియున్నను వారు సాధువులే యనవచ్చు. సిం హము మూడు సంవత్రములవరకు బ్రహ్మచర్యం కాపాడుకొని కలువగలదు. ఆందుకే దానికంత పరాక్రమము.

గృహస్ధాశ్రమ బ్రహ్మచర్య రాజయోగ దీక్ష విషయంలో దంపతుల ఒప్పందం ముఖ్యం. పద్మినిజాతి స్త్రీ ఎన్నోరకముల ఉపమానములతో భర్తకు నచ్చజెప్పి తన మార్గంలోకి మార్చుకోగలదు. అలాగే సౌశీల్యంగల పురుషుడు చక్కని శిక్షణచే తన భార్యను ప్రగతిపధంలో నడిపించును. ఏ వంశంలో స్త్రీలు పవిత్రంగ ఆదరింపబడుదురో ఆ వంశమున ఉత్తమ సంతతి జనించును.

“నివృత్త రాగస్య గృహం తపోవనం.” రాగరహితమైన గృహమే పవిత్ర పుణ్యక్షేత్రము. పడవ సముద్రంలో ఉండవచ్చుగాని, సముద్రము పడవలోనికి ప్రవేశించకూడదు. అటులే సంసారంలో మానవుడుండ వచ్చుగాని, మనిషి మనసులో సంసారం ఉండకూడదు. తామర పత్రం నీటిపై, కుమ్మరి పురుగు బురదలో తిరుగునట్లు నిర్లిప్తులై నిలవాలి. నిత్య జీవితంలో గృహస్ధాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ దంపతులు జగతికి ఆదర్శప్రాయులై నిలిచి జీవిత పరమార్ధాన్ని సాధించాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home