Thursday, June 12, 2008

నేను విచారణ

ఇతరుల గురించి ఆలోచించటం, తెలుసుకోవటం ఎంతైనా కష్టం. మీ గురించి మీరు ఆలోచించనేర్వండి. ఇది సులభ మార్గం. మొదటి ఆలోచన నేను. ప్రగాఢ విచారణచే ఈ నేను ఆత్మలో లీనమై ఆత్మ నేనే ప్రకాశిస్తుంది. ఇదియే జీవన్ముక్తి. నిర్వాణము, పరలోక స్వర్గ రాజ్యం మీలోనే గలదు. బయట వెదకటం భ్రమ మాత్రమే. తన నిజ స్వరూపమైన ఆత్మలో మేల్కొన్నవాడు సచ్చిదానందపూర్ణ మైన ఆత్మను స్వస్వరూపం గా అనుభవిస్తాడు. బాహ్య ఎరుకే మిధ్యా నేను. దీనిని పోగొట్టుకున్నపుడే అసలైన ఆత్మ దేవ నేను దక్కుతుంది. నిజాత్మను పరిపూర్ణముగ గ్రహించినపుడు ఆ మహా అఖండశక్తి తన ఉనికి సత్తానుండి ఆవిర్భవించి శాశ్వతముగ వర్ధిల్లు తుంది. దీనినే బట్టబయలు, ముక్తి, మోక్షం, వైకుంఠం, పరంధామం, పరలోక స్వర్గ రాజ్యం అని రకరకములుగ చెప్పుకొందురు.

ఎవరెన్ని చెప్పినను ఆదిమూల తత్త్వం ఏకం, అవిభాజ్యం. ఆ దివ్య స్వర్గ రాజ్యం నీయందేగలదు. దీనిని నీలో దర్షించిననే తిరిగి బయట ప్రతిఫలిస్తుంది. తన్ను తానెరుంగుట ప్రతి మానవుని ప్రధమ కర్తవ్యం. తనను తాను తెలుసుకోకుండ ఎన్ని తెలుసుకున్నా లాభం లేదు. తాననే ఒక అంకె లేనిచో ప్రక్కనున్న సున్నాలకు విలువ సున్న. ఆ ఒక అంకెను తెలుసుకోవాలన్న రామకృష్ణ పరమహంస వాణి యధార్ధము. లౌకిక భ్రమ లోలురు ఆత్మ విచారణ నుండి ఎంతకాలం తప్పించుకు తిరిగినా చివరకు అదియే శరణ్యం కాక తప్పదు. ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. ఆత్మాన్వేషణలో మునుగనంతవరకు సమస్యలు, సందేహాల బాధలు తప్పవు. తనను తాను కనుగొన్నవారికి మహాశక్తులు హస్తగతం కాగలవు. ఈ శక్తులను సద్వినియోగ పరుచనియెడల భ్రష్టులయ్యెదరు. మీ ముందు మహామహులమని విర్రవీగే వారిలో కొందరు ఈ అధమ స్ధాయికి దిగజారి పోయారు. జనులచే దేవుడనిపించు కోవచ్చు. అది సరిపోదు. ఈ లోకంలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తరువాత క్షుధ్రహం లోలురై ఎవరెక్కడ పతనపడుచున్నారో సులభం గా గ్రహించవచ్చు.

ఉన్నది అంతా ఒకే చిన్మయ చైతన్య అఖండ సత్తు. ఈ స్ధితిలో చూచేది ఎవరు ? చూడబడునది ఏమిటి ? అవి రెండు మిధ్య. ఉన్నదే ఉన్నది. ఉన్న దంతయు అదే తనకు తానైన స్వత:స్సిద్ధ దైవం. దేహేంద్రియ మనో బుద్ధులతో తాదాత్మ్యం చెందిన నేనుకు ఈ సర్వాంతర తత్త్వం తెలియదు. వ్యక్తి గత నేను సత్యాత్మ దైవమునుండి మరల మరల పుడుతూ అందులోనే లయిస్తుంది. ఎవరెటు తిరిగినా మరల నేను వద్దకు రావలసిందే. ఆ నేనెవరో నిశ్చయించి తెలుసుకో! ఈ లోకంలో అందరు అజ్ఞానాంధకార కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. కేవలం ఆత్మ జ్ఞానమే కారా గార విముక్తికి మార్గం. మనసు బహిర్ముఖమైన అజ్ఞానం. అంతర్ముఖమైన జ్ఞానం. లోచూపువల్లనే సహజాత్మ దర్శన భాగ్యం. నేనెవరో గ్రహించిన మాయసంగతి బయటపడుతుంది. కనిపించేదంతయు నేనులో అదృశ్యమై తీరుతుంది. అందులకే అది అశాశ్వతం. ఆత్మ కనబడునది కాదు. అదృశ్యమయ్యెడిది కాదు. అందులకే ఈ ఆత్మదర్శనాన్ని శాశ్వతం చేసుకోవాలి. నిజమైన దైవ నేను మిధ్యా నేనును తొలగించి ఆత్మనేనుగ మిగులుతుంది. విజ్ఞానమయ కోశం నుండి మిధ్యా నేను పుడుతుంది. ఈ నేనుతోనే నిజమైన నేను ఆత్మను గ్రహించాలి. ముల్లును మరియొక ముల్లుతో తీసి రెంటిని పారవేయునట్లుగ ఎరుకద్వారా శుద్ధ ఎరుకనెరింగి ఆ రెంటిని మానుటయే పరిపూర్ణ దైవత్వం. నేను అనే ప్రధమ తలంపు పైననే మనో సంకల్పములన్నియును నిలువగలవు. ఈ ప్రధమ తలంపే లేని పక్షంలో మిగతా సంకల్పములకు తావులేదు. నేను తెలిసిన తర్వాతనే ఇతరం తెలిసినది. ఈ నేను మూలమైన ఆత్మలో అదృశ్యమైనపుడు, లయించినపుడు సిద్ధించేదే ఆత్మ సాక్షాత్కారం. ఇదే నిజమైన నేను. మానసిక తలంపులకు ఆధారమైన బహిర్గత నేనును విసర్జించిన అంతర్గత నేను నిన్ను ఆవహిస్తుంది. ఈ నేనే నిజమైన ఆత్మ. ఇదే పరమాత్మ. ఆది మద్యాంతం లేనిదిది. ఏకాగ్రమైన దృష్టితో నేను శరీరంలో ఎక్కడ పుడుతుందో చూడు. హృదయావిష్టుడైన నీవు పరిపూర్ణ సచ్చిదానందమును నీ స్వరూపముగ అనుభవిస్తావు.

ఉన్నదంతయు చిన్మయ సత్తు. ఇది ఆత్మ లక్షణము. నేనున్నాననెటి భావనయే సర్వేశ్వరుని మొదటి నామము. వాస్తవముగ చెప్పాలనిన భగవంతుడే ఆత్మ. నిశ్చలమైన ఏకాగ్రపూరిత అంతర్గత విచారణచే దప్ప ఎన్ని ప్రదేశాలు, దేశాలు తిరిగినా ఆత్మజ్ఞానము సిద్ధించదు. సర్వ శక్తులతో మనసును ఆత్మాభిముఖం చేయాలి. ఇదే ఆత్మ విచారణ. అంతటగల ఆత్మను అనుభవపూర్వకంగ గ్రహించాల్సిందేగాని ఉత్తమాటలు పొసగవు. ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు. నాలుక ద్వారా తెలుస్తుంది. ఆత్మజ్ఞానము అంతే. నేనును విచారించటమనిన అహం వృత్తిని విచారించటం. ఈ విచారణను ముందుగ మనసుతోనే ఆరంభించాలి. మనసును అంతర్ముఖపరచి విపరీతంగ శతృసైన్యమువలె దూసుకువస్తున్న తలంపులను నిరోధిస్తూ హృదయస్ధానాన్ని గుర్తించాలి. మనసు హృదయంలో లీనంకాగానే నిశ్చలానందం కలుగుతుంది. ఈ ఏకావస్ధలో పరిపూర్ణ జ్ఞానం అవిచ్చిన్నంగా ప్రకాశిస్తుంది. నామ రూప జగతి ఎన్నిసార్లు వచ్చి పోయినను, విశ్వ ప్రకృతి ఎన్నిమార్పులు చెందుచున్నను తదధిష్ఠాన సత్తు మాత్రం మారదు. సర్వమునకు ఆధారభూతమైయున్న అఖండ చైతన్యం ఏనాడు నశించేది కాదు. అది సదా నిర్వికారం. సినిమా థేయేటర్ లో ఎన్ని ఆటలు మారినా అన్ని ఆటలు ప్రదర్శింపబడే వెండితెర మాత్రం మారదు. సర్వాధిష్ఠాన పర:బ్రహ్మ సూత్రము అంతేనని గ్రహించాలి. ఓ మానవా! నీకు అద్భుత శరీరం ప్రసాదించబడింది. జ్ఞాన సాధన సత్కర్మలకు వీలుపడునట్లు చూసుకో. ఈ శరీర కూర్పుకు ఎవరు కర్తయో చక్కగ తెలుసుకో. ఏ చేర్పులు, మార్పులు లేని చిన్మయ స్ధితిని చేరుకో. ఈ విశ్వంలో ఏ పదార్ధం కూడ దైవమునకు భిన్నంగ లేదు. సర్వేశ్వర స్వామి ఒక కాలానికి, ఒక ప్రదేశానికి కట్టుబడిలేడు. ఆయన అంతట, అన్నివేళలా ఏకరీతిగ యున్నాడు. ఇట్టి అక్షర పర:బ్రహ్మమునకు అన్యముగ ఏమియును లేదని రూఢిపరచుకోవటమే నిజమైన స్ధితప్రజ్ఞ పదవి.

తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. మిధ్యా నేనును విసర్జించటమే తన్ను వదలటం. తత్త్వమసి. వ్యక్తుల మానసిక కర్మయే పుట్టుకలకు మూలం. ఆత్మ అజం, అమరం. చావు పుట్టుకలు పరమార్ధంలో లేవు. అందులకే పరమార్ధ కోర్సులో ప్రవేశించండి. అగ్ని సెగలో మూకుడులో వేపుడు చేయబడిన గింజలు భూమిలో విత్తి తగిన జల సదుపా యం కలిగించినను మొలకెత్తవు. కారణం ఏమనగా బీజాంకురములు నశించినవి. అలాగే జన్మ కారణోపాది కారణ శరీరము దగ్ధము కానంతవరకు పునరపి జననం, పునరపి మరణం తధ్యం. నేనులేని స్ధానంలేదు. నేనులేని వస్తువు లేదు. నేనులేని జగము లేదు. నేను లేని జీవము లేదు. నేనులేని దైవం లేదు. నేనులేని ఏ నేను లేదు. సమస్త నేనులకు నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఏకీభవించి నాయందే లీనమైయున్నది గాన నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము.
మనో అవగాహన లేకుండ ప్రపంచ అవగాహన కుదరదు. ఆత్మజ్ఞానం లేని ప్రపంచ జ్ఞానం వ్యర్ధం. నీవు ఎక్కడినుండి ఉద్భవిస్తున్నావో ప్రపంచం, వివిధ వస్తుజాలము అక్కడినుండే జనిస్తుంది. సర్వైక్య కూడలి కర్తను తెలుసుకో. నేను పుట్టాను అని భావించే ప్రతివారికి చనిపోయిన పిదప ఏమి జరుగుతుందో అనే సందేహం రాగలదు. నేను అను తలంపు ఎక్కడ పుడుతుందో తెలుసుకో. ఇది సర్వరోగ నివారక సంజీవి. జన్మకు మూలమైన “అహం”ను పోగొట్టుకొనిన శరీరమనెటి పునర్జన్మ రాదు. కారణోపాది దగ్ధం ఐనపుడే జన్మరాహిత్యం. ఇట్టివారే నిజమైన కారణము పొందినట్లు. స్ధితికుదురని గురువులు ఇచ్చట పడిపోవుచున్నారు.

నీ శరీరం నిద్రించిన పడకపై ఉంటుంది. కాని స్వప్నంలో అదే శరీరంతో ఒకచోట సంభాషించు చున్నట్లు, మరియొక చోట విందులో పాల్గొనినట్లు వారి వారి చిత్త ప్రవృత్తి ననుసరించి స్వప్నములుండు. స్ధూల శరీరం నీదైన, నీవైన స్వప్నావస్ధలోని సూక్ష్మ శరీరం ప్రమాదకారి. దానిని నశింపజేయాలి. పైపై తతంగములచే ఇది అసాధ్యం. ఇక్కడే చాలామంది తికమక పడిపోవుచున్నారు. నేను అనే తలంపు లేకుండ శరీరం నశించగానే సరిపోదు. పూర్వ సంస్కారములతో, వాసనలతో వాయువు పుష్పముల వాసనను దూరముగ తీసికొని పోవునట్లుగ మిధ్యా నేను మరల జన్మిస్తుంది. సంకల్పానికి మూలమైన ఆత్మలో చేర్చి, నేనెవడను అనెటి ప్రగాఢ విచారణచేత ఇది సాధ్యమగును. నేను చేస్తున్నాననెటి కర్తృత్వభావన వీడి సర్వేశ్వరుని చేతిలోని ఉపకరణముగ తనను భావించి, ఉచ్చ, నీచముల పాటించక , అందరిలొ ఉన్న ఈశ్వరుని దర్శించువారు, ఈశ్వరారాధకులు, సంఘసేవ చేయువారు ధన్యులు. ఆత్మ జ్ఞానమును మించిన సంఘసేవ లేదు. వసుదైక కుటుంబ భావమే ఆత్మ జ్ఞానార్హత.

మత సిద్ధాంతములన్నియును ఆత్మదర్శనంతో ముగిసిపోగలవు. ఈ దేహంతో ఉన్నపుడే సత్యాత్మ దృష్టిని స్ధిరపరచుకోవాలి. దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను హాయిగ కోరుకొనునట్లు మృత్యువును ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన స్ధితి.
నీ లోపలికి లోతుగ మినిగి తరచి చూడు. నీలో నిక్షిప్తముగ దాగియున్న అతి రహస్యమైన, మనోహరమైన, శుభప్రదమైన, ఆనంద దాయకమైన, అనశ్వరమైన ఆత్మజ్ఞాన నిధులను గుర్తించి స్వంతం చేసుకో. హృదయ కవాటాన్ని తెరచుకో. మనోనేత్రంతో ప్రపంచాన్ని గాంచు. మాయ తెరను చేధించు. ఆత్మను దర్శించు. ఇదియే సత్య భగవన్ మార్గము. శక్తునికన్యధా శక్తిలేదు. అద్వైతులు చెప్పే మాయను విశిష్టాద్వైతులు మారే స్వభావంగలది అన్నారు. ఏమార్పులు, చేర్పులు లేకుండ సర్వాధారముగ, సర్వాకారముగనున్న శాశ్వత సత్యమును గ్రహించాలి. ఇదియే పరమార్ధం. ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైత సమస్త పీఠ సాంప్రదాయములు, మూల సిద్ధాంతములు చిన్మయ పరమార్ధ సాగరంలో నదులుగ కలిసిపోగలవు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home