Tuesday, July 8, 2008

లోకం పోకడ

కాని పనులజేసి కపట మార్గంబున
తప్పించుకొన జూచు తెలివిమీరి
ప్రకృతి పగబట్టి పగదీర్చుకొంటది
తరచి చూడ నాగుబాము పగిది

అమ్మవలన బుట్టి అమ్మవలన బెరిగి
ఆలి వచ్చిన క్షణమె అమ్మ చేదాయెను
ముందు చెవులకన్న వెనుక కొమ్ములు వాడన్నట్లు
లోకరీతిని పరికింప సత్యమిలను

ఎదుటి వానియొక్క ఎదుగుదలను జూసి
కడుపునిండ విషము నింపుకొనియు
మనసులోన పెక్కు కుతంత్రాలు బన్ని
మాటలోన మిగుల ప్రేమొలుకబోతురు

ఉన్నమాట జెప్ప ఉరిమురిమి జూతురు
కల్ల మాటలు జెప్ప ఉల్లముప్పొంగును
కపటవర్తన చేత కార్యంబు దీతురు
కలియుగాన జనులు కస్టాల కోర్వలేక

పాంచభౌతిక దేహ పరిధిగానక నరులు
జల్సాలెన్నొజేసి షోకులెన్నొ వేసి
పుట్టి పెరిగినదిలను అనుభవించుట కంటు
శుష్క వేదాంతంబు తెగజెప్పుచుందురు

పరులు జూచుటకొరకు పట్టెమంచము పరుపు
పవళించు సమయాన కటికనేలయె గతి
మాయ జబ్బులు వచ్చి మంచము కరువాయె
జనుల మార్చనెంచ నెవరి తరము !

తమ సొమ్మనగానె తెగ పొదుపుజేతురు
మంది సొమ్ముగాంచ మంచినీళ్ళ పగిది
స్వపర భేదములేక వర్తించు వారలే
మానవోత్తములని మహిని తెలియవలయు

మంచి మాటలు జెప్ప మాటాడకుందురు
చెడ్డమాటలంటె చెవిగోసుకొందురు
పరుల దోషమునెంచి బరగ దూషింతురు
మనసు మర్మము దెలియని మనుజులిలను

ఇల్లు ఒళ్ళు రెంటి గుళ్ళ జేయునట్టి
మద్యపానంబును మానలేక జనులు
సంఘములో బహు చులకనైపోదురు
క్షణిక సుఖము కొరకు ప్రాకులాడిన నరులు

కలిగియున్న వేళ కలతలెప్పుడు రావు
సన్నగిల్లు వేళ సణుగుడు మొదలౌను
కలిమి లేములందు సమముగా నుండుటే
సంఘ జీవికెపుడు సరియైన మార్గంబు

పరిణయంబులకేమొ ఫంక్షను హాలులు
ఫలహారముల జూడ పదుల సంఖ్యలొ నుండు
లెక్కలేని పెక్కు భోజన పదార్ధాలు
అర్థ భాగము మిగుల వ్యర్ధమైపోవును

శీలమొక్కటె స్త్రీలకాభరణమై యుండగా
మెడనిండ నగలేసి తెగ మురిసిపోదురు
పట్టుచీరల కొరకు పరుగులే దీతురు
ఆందచందాలకధిక ప్రాధాన్యమిత్తురు

జ్ఞాన మార్గం

నామరూప జగతి సత్యంబుగా దోచు
మాయ వలన మహిని మనుజునకును
నిత్యానిత్య వస్తు వివేచన సలుపంగ
మాయ తొలగిపోయి మర్మమెరుగు

పెక్కు జనుల శవములు కనులార గాంచియు
తనకు మరణమిపుడు రాదటంచు
భౌతికమును బహుగ ప్రేమించుచుందురు
హంస ఎగిరిపోవు క్షణము దెలియలేక

మంచి పనులు జేయ మాయ యడ్డగించి
విఘ్నంబులెన్నియో కల్పించుచుండును
ఆత్మ స్థైర్యముతోడ అడుగు ముందుకు వేయ
మాయ తొలగిపోయి దారి చూపించును

సృష్టిలోన మానవ జన్మ ఉత్కృష్టంబు
విచక్షణ శక్తి యుండుటే దీని ఘనత
మంచి చెడ్డలుగని మసలుకుంటె మిగుల
మనిషి జన్మ యిలను బహుళ సార్ధకమగును

నేను నేనటంచు తెగ విర్రవీగును
దేహ భావముతోడ జీవుడిలను
భారమైన వేళ భగవంతుడేడును
తన బలము చాలదనే అనుభవంబుతోడ

భౌతికమందున బహుసుఖము గలదంటు
బాహ్య ప్రపంచాన తిరుగాడుచుందురు
అంతరంగమందు అమృత భాండమ్ము
గాంచలేరు జనులు సాధన సలుపరేని

కామాతురతబొంద మనసు వశము దప్పు
ఉచితానుచితంబు మిగుల సన్నగిల్లు
బలహీన క్షణమొకటి బలిపశువుగా మార్చు
బంగారు భవిష్యత్తు భగ్గుమని మండును

ఎంత సంపాదించి ఎన్నాళ్ళు బతికినా
తనువు శాశ్వతంబుగాదు తర్కించి చూడగా
తన్నుద్దరించుకొని విశ్వశ్రేయస్సు కాంక్షించి
పరితపించువాడె పరమ యోగీశ్వరుండు

మలినరహిత మనసువలన మంచి దేహముండురా
ఇతరులభివృద్ధి గాంచి ఈర్ష్య చెందనేలరా
కుళ్ళుబోతు తనముబెంచ కూలిపోవు చూడరా
సర్వజనుల హితముగాంచి సద్గతి నువు బొందరా

కర్మ జన్మలయొక్క మర్మంబు నెరుగక
భౌతిక ప్రపంచాన బాధలొచ్చినవేళ
తన కర్మమేమిటని తెగ బాధపడుదురు
భగవంతునేడుకొని పశ్చాత్తాపపడుదురు

పరమాత్మ స్మరణయే పరమ లక్ష్యముకాగ
విషయ వాంఛలతోడ వహరించు చుందురు
దేహ సుఖములకొరకు దేబిరింతురు జనులు
ఆత్మ జ్ఞానములేక అల్లాడుచుందురు

మంచి మనసుగలిగి మానవుడుండిన
విశ్వశక్తులన్ని మనసావహించును
మానసిక పరివర్తన మరి మరి కలుగును
ఆత్మ సిద్ధి బొంది ఆనందమందును

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home