Wednesday, June 18, 2008

దైవ నేను

ఆత్మే దేవుడు. నేనున్నాను అనేది భగవంతుడు. ఆత్మను తెలుసుకోవడానికి సులువైన మార్గం ఏమనగా, సకలేంద్రియముల సంచలనాన్ని నిలిపి తాను తానుగ ఉండడమే ఆత్మ విద్య. గాఢ నిద్రలో దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలో నీవు నిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే.

తలంపులున్నంత కాలం ప్రయత్నం తప్పదు. ఇతర తలంపులను ఎగురజిమ్మిన నేను నేను అంటూ ఆత్మ భాసిల్లటం తధ్యం. దీనిని ఏ పేరుతో పిలిచినా తేడా రాదు. ఎల్లప్పుడు ఏ ప్రయత్నం లేకుండ అందేది జ్ఞానం. ప్రయత్నమే ఉపాసన. జ్ఞానమనునది లక్ష్యం. ఫ్రయత్నములన్నియును ఈ లక్ష్యం యొక్క స్వరూపాలే. ఆత్మ సదా నేను నేను అంటూ ఉంటుంది. అంతరింద్రియ పంచకముగాని, బాహ్యేంద్రియ పంచకముగాని, స్ధూలభూత పంచకముగాని ఆ మహా సత్తా కన్న భిన్నంగాదు. సముద్ర నామముగ సముద్ర జలము అంతట యున్నట్లు అలలుగ కొద్ది భాగము, నురుగుగ కొద్ది భాగము, బుడగగ త్వరలో లయించిపోవునట్లు గ విశ్వ విరాడ్రూప తేజోమయ చేతన సత్తా సదా ఉనికిని పొందును. దేవ, తిర్యగ్మనుష్య, పశు పక్ష్యాదులుగను, జనన మరణములుగను, పాప పుణ్యము లుగను, శుభాశుభములుగను, నామ రూపములుగను, గురు శిష్యులుగను, జీవేశ్వరులుగను, నిత్యానిత్యములుగను తోచుచు ఒకటి శాశ్వతమని, మరొకటి క్షణికమని చెప్పబడుచున్నది.

ఆత్మలేని భగవంతుడుండడు. ఆత్మే దేవుడు. నేను ఆత్మనై యున్నాను. కృష్ణుడు అర్జునునికి జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నీలోనివారే. సమస్త లోకాలు భావనలే. వాటికి కర్తవు నేవే. అన్నో కల్పిత సత్యాలు. బహురూపములుగ భాసిల్లుచున్నది ఒకే విశ్వరూపం. ఆ వైకుంఠపురం నీలోనిదే.

చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లో విశ్వసించి నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ‘ఆ నేనే’ సర్వమయం, సర్వప్రియం, సర్వలయం, సర్వాధారం, సర్వాధిష్టానం, సర్వోన్నతం, సర్వ స్వతంత్రం, నిష్క్రియం, నిష్కళంకం, నిత్యపూజ్యం, నిత్యశుద్ధం, నిర్గుణం, నిర్ద్వంద్వం, నిరామయం, నిర్వాణ నిలయం, నిష్ప్రపంచం, కేవలచల పరమాద్వైతం, పరాత్పరం, పరిపూర్ణ పరబ్రహ్మం.

ఎంతటి పామర లౌకిక చిత్తులైనను ఏదో ఒకనాడు సంఘటన, సమస్యల ప్రభావంతో ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.

సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, సురులు అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, బాబాలను, స్వాములను, మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే అహం మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు. ఆతడు ఏదశలోయున్నను లక్ష్యం నుండి వైదొలగడు.

ఆత్మనుండి ఉద్భవించిన ప్రాణమును తిరిగి అందులో లయపర్చటమే ప్రాణా యామము. నిఘావేసి పరిశీలిస్తుంటే తలంపులన్ని ఎగిరిపోగలవు. పూర్ణశాంతి తప్పక లభ్యమౌతుంది. అదియే నీ స్వరూపం. మనస్సును నిస్సంకల్పముగా ఏకాగ్రపరచుటయే మనోలయ ధ్యానం. అనంత చైతన్య స్రవంతి నీ స్వరూపం. ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ వెళ్ళి తరచి చూచుకో. ఇదియే అసలైన మార్గం. మిధ్యా నేనుతో ఏకత్వం విడనాడవలయును. సంకల్పాల సమూహమే మనస్సు. అన్నియును మిధ్యా నేను తలంపులపై ఆధారపడియున్నవి. అందులకే ఈ నేను యొక్క జన్మస్ధానం అన్వేషిస్తే మిధ్యా అహం తలంపు అంతరించి, అదృశ్యమై నిజమైన నేను నిర్విరామంగ స్వయంప్రకాశమై తేజరిల్లుతుంది. సమస్త ముక్తి మార్గములకు నిలయమిది. నిజమైన నేనే దైవం. ప్రతి నేను దైవ నేను స్వరూపమేనని గ్రహించవలయును.

ఆనందం బయట విషయాలలో లేదు. ఉన్నదని తలంచినా అది క్షణికం. ఆత్మలో నిజమైన ఆనందం గలదు. అందులకే ఆత్మానందులు కండి. బాహ్య విషయాలను స్మరిస్తూ ఉన్నంతకాలం మనసుంటుంది. అందులకే అంతర్దృష్టిని అలవర్చుకొని ఆత్మదర్శనం పొందనేర్వాలి. మనో నిలకడ పొందగనే దీని ఆట ఆగుతుంది. ఇక పాడే పాట నేను నేనే నేనైన సత్య దైవ నేను. ఇది తగ్గేది కాదు. హెచ్చేది కాదు. ఆత్మే హృదయం. ఈ స్ఫురణతో మానవుడు ఉండాలి. హృదయమునుండి వెలుగు మెదడునకు ప్రసరిస్తుంది. ఇదే మనసుకు స్ధానం. ఈ వెలుగు సహాయంతో మనసు ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఆత్మ ప్రకాశ పరివర్తనతో మనసు పనిచేస్తుంది. మనసు అంతర్ము ఖం కాగానే ఆత్మ తేజం ప్రవాహంగ వెల్లువై ప్రవహిస్తుంది. నేను అనే ప్రధమ సంకల్పమునుండి మనసును వేరుచేసి, దాని మూలమైన ఆత్మలో లయపరచిన మిగిలేది ఆత్మే. అదియే సత్య నేను. బాహ్యాంతర చైతన్యంగ నిలచిన వెలుగే పర:బ్రహ్మం.

విచక్షణ కలిగించే ఆలోచన మనసులోని దీపం. ఈ దీప దర్శనమే పాపనాశనం. పండుగల వెనుకగల కీలక రహస్యం తెలుసుకో. సత్యం సర్వత్ర నిండియున్నది. మానవుడు తన చైతన్యాన్ని విస్తృతపరచుకొని పరిసరాలతో తాదాత్మ్యం పొందుచు తన అంతరంగ శక్తులను విశ్వాంతరంగ శక్తులతో సమన్వయ పరచుకోవాలి. వ్యక్తి తన మనో తేజాన్ని తన కార్యకలాపముల వరకే కేంద్రీకరించు దశలో వ్యక్తికి, విశాల విశ్వానికి మధ్యన అగాధం ఏర్పడుతుంది. ఇది సరియైన ఆలోచనా విధానం కాదు. కేవలం అవగాహనా లోపం మాత్రమే. దీనివలన కృత్రిమమైన ఎడబాటు ఏర్పడుతుంది. విశ్వం లోని మానవుడు పరమ సత్యంగా ఆవిర్భవించాలి. వ్యక్తి శక్తి విశ్వావృత అనంత శక్తితో మిళితమైనపుడు సాధించలేనిది సృష్టిలో ఉండదు. కేవలం శాస్త్ర జ్ఞానంతో సృష్టిని కొలవాలని ప్రయత్నంచేసే మానవునకు, ఆధ్యాత్మిక దృష్టిగల మానవుడు గాంచగల దివ్యదర్శనం కాదు. విశ్వ గురుత్వము వహించిన భారతీయుని దృష్టిలో ఉదయించే సూర్యుడు, వీచే గాలి, పూసే పూలు, ప్రవహించే జలము, ఫలవంతమైన భూమి పవిత్ర అంశాలుగ భాసిల్లును. ఉప్పునీటిలో తేలికగ కరిగిపోవటానికి కారణం అది దాని సహజ స్వరూపము. అలాగే మనసు దాని సహజస్ధితియైన ఆత్మలో లయించగలదు.

బాహ్యాకారమునుబట్టి కాదు విలువ. లోన సరుకు, సత్తా ఉండవలయును. మానవుడు తన అంతర్గత శక్తులను మరిచి పైకి కనిపించే శరీరంవరకే తనదని భావించి ఆ పరిధివరకే మురిసిపోతున్నాడు. అనంత స్వరూపంతో తన అనుబంధాన్ని ఎంతమాత్రం స్ఫురణకు తెచ్చుకోవడం లేదు. అందులకే సాగరమునుండి వేరైన జలబిందువు వలె క్రుళ్ళిపోవలసి వస్తుంది. ఇకనైనా సర్వాత్మ దైవ మహా సాగరంలో గ్రుంకులిడాలి. అదియే మీ సహజస్ధితి. అణువునుండి అనంత పర్యంతం చిన్మయ పరతత్త్వ అంశమే గనుక భిన్నదృష్టి ఏనాడు తగదు. ఏందరో స్ధితప్రజ్ఞులు, అవధూతలు, సర్వసంగ పరిత్యాగులు, సాధువులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు, ఉత్సాహవంతులు, నీతికోవిదులు, రాజులు, రారాజులు, ఎంకెన్ని తరహాలవారున్నను మహర్షులకే భారతదేశంలో ప్రధమ పీఠం. ఆత్మానుభూతిపొంది, నిస్వార్ధ చిత్తులై అన్నింటితో తాదాత్మ్యం చెంది, విశ్వజీవనంలో ప్రవేశించినవారే మహర్షులు. సర్వవిధములైన చైతన్యముతో సంబంధముగలిగి ఉండటమే మానవత్వానికి పరమావధి. ఇదియే జీవన్ముక్తి మార్గమని భారతీయుల ప్రగాఢ విశ్వాసము. ఇది అక్షరాల సత్యము.

సర్వ పరిపూర్ణ దైవజ్ఞానికి ప్రత్యేకించి యనకుండ సమస్త ప్రాణులపట్ల పవిత్ర ప్రేమానురాగములు గోచరిస్తాయి. కేవలం ఆలయాలలోనే గాకుండ విశాల విశ్వంలో ఎక్కడ చూచినా అక్కడ పూజార్హమైన వస్తువు గోచరిస్తుంది. పవిత్ర ప్రేమకు అసహ్యమనునది లేదు. నీ శక్తిని దైవ శక్తితో జోడించి చూడు. ఎవడు శాశ్వతుడో, సర్వ పరిపూర్ణుడో, సర్వోన్నతుడో, ఎవని శక్తిచే సూర్యుడు చైతన్యవంతుడై ప్రకాశించు చున్నాడో, ఎవని మూలమున పంచభూతములు, గ్రహమండలములు చలించుచున్నవో అట్టి సర్వకేంద్ర స్వామి నీలో అంతర్యామిగ ఉన్నాడు. ప్రాణవాయువు సర్వాంతర్యామి స్వరూపమే. అందులకే ఈ కాంతి, ఈ ప్రాణము, ఈ సర్వము మన ఆత్మలో అంతర్లీన మై ఉన్నవని ప్రతివారలు భావించవలయును.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home