Tuesday, January 8, 2008

1. మనో నియంత్రణ

ఈ శరీరము పంచభూతముల మిశ్రమము. ఐదు కర్మేంద్రి యములు, ఐదు జ్ఞానేంద్రియంలతో కూడినటువంటిది. ఈ పది ఇంద్రియ ములకు మనస్సు అధిపతిగా ఉండి, సూచనలిస్తూ మన శరీరమును నడిపిస్తూ వున్నది, కంటికి కనపడేది దేహము, కనిపించనిది మనస్సు. ఈ కన పడని మనస్సు కనపడే దేహాన్ని అనగా పది ఇంద్రియములను శాసిస్తూ ఉన్నది. ఈ శరీరము మనస్సు ఆధీనమై యున్నది. ఈలాంటి మనస్సును మనం శరీరం నుంచి వేరుచేసి సాక్షీభూతంగా ఉంటూ, దాని చేష్టలను గమనిస్తూ, మనస్సుకు సరియైన శిక్షణ నిచ్చినట్లైతే అది మనం చిప్పినట్లుగా వింటుంది. అందుకే పెద్దలు మంచి మనస్సు ఉండాలి అంటారు. మనస్సు మంచిగా ఉండాలన్న, చెడ్డగా తయారుచేసు కోవలన్నా మన చేతల్లో, చేతుల్లోనే ఉంది.

మానవ మనుగడకు మనో సం యమనం చాలా అవసరం. మనస్సు చాలా శక్తివంతమైన ఆయుధం. మానవ జీవితమంతా మనస్సు మీదే ఆధారపడి ఉంది. మనస్సు చేయలేని అద్భుతాలు లేనేలేవు. మనస్సు బాగుంటే చాలు, మనం బాగున్నట్లే. ఈరోజు నామనస్సేం బాగాలేదండీ అంటాం. అదే మనస్సు నిన్నటిదాకా బాగుంది. ఈరోజు నీ మనస్సు బాగాలేనట్లుగా అనిపిస్తుంది. అంటే మనస్సు నీ చుట్టూతా వున్న పరిస్తితులు, పరిసరాలు, సమస్యల ప్రభావాలకు లోనై ఈరోజు బాగాలేదని నీకు అనిపిస్తూ వుంటుంది. కాని మూలం లోకి వెళ్ళి బాగా పరిశీలించి, పరీక్షించి చూసినట్లైతే మనస్సు యొక్క స్ధితి ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. కాని అది ఎప్పుడైతే దృశ్యాలలో, భావాలలో ఇరుక్కుపోతుందో అప్పుడే మనస్సు తన నిశ్చలత్వాన్ని కోల్పోయి అల్లకల్లొలంగా తయారవుతుంది. మనస్సు ఇలాంటి స్ధితిలో ఉన్నప్పుడు మనం మన మనస్సు బాగా లేదంటాం.

మనంగనక మనస్సు అలోచనాసరళిని నిశితంగా పరిశీ లించినట్లైతె, దాని చేష్టలను విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళి నట్లైతె అది అనేకమైన పరిస్ధితులకు, ప్రభావలకు, ఒత్తిడులకు, అనుభవాలకు గురియవుతూ ఉంటుంది. క్షణ క్షణం ఇలా మార్పు చెందేటటువంటి మనస్సును ఒక దారిలో పెట్టడమే, మచ్చిక చేసుకుని దానికి ఒక మంచి మార్గాన్ని, గమ్యాన్ని ఏర్పరచి సక్రమమైన మార్గంలో పయనించేటట్లు చేయడమే మనో నియంత్రణ.

మనస్సు చేసే వికృత చేష్టలనుబట్టి, చంచల స్వభావాన్ని గమనించి దాన్ని కోతితో పోల్చారు పెద్దలు. కోతి చెట్టెక్కి ఒక కొమ్మ మీద స్ధిరంగా కూర్చోకుండా, ఈకొమ్మ మీదికి, ఆకొమ్మ మీదికి గంతులేస్తూ వుంటుంది. కారణం దాని స్వభావమే చంచలం కాబట్టి. అలాగే మనస్సు కూడా రక రకాలుగా చలిస్తూ ఉంటుంది. ఇలాంటి చలనమయ మైనటువంటి మనస్సును ఒడిసిపట్టుకోవడమే మనో నియంత్రణ. ఐతే ఈ కోతి లాంటి మనస్సును ఎలా మచ్చిక చేసుకోవాలి? ఎలా చేజిక్కించు కోవాలి, చెప్పు చేతుల్లొ పెట్టుకోవాలి అన్నదే మన ముందున్న ప్రధాన జటిల సమస్య.

మనస్సు బాగుంటే మనిషి బాగున్నట్లే. మరి మనస్సే బాగా లేనప్పుడు మనిషి బాధలకు లోనుకావడం, చెడుభావాలకు, ప్రలోభాలకు తలవంచినపుడు మనిషి జీవితం చెడిపోవడం ఖాయం. అందుకే మనం ముందుగా మనస్సును బాగుచేసుకోవాలి. మనస్సును తృప్తిపరచుకుని నిశ్చలత్వాన్ని సాధించాలి. కాని నిజానికి చెప్పినంత సులువు కాదు చేయటం. ఐతే మనంగనక మన ముందు ఒక ఆదర్శాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని ఉంచుకున్నట్లై తే ఈ చంచలమైన మనస్సును ఒక మంచి మార్గంలో పయనింపజే యడం అంత కస్టమైన పనేంకాదు.

“నీరు పల్లమెరుగు – నిజము దేవుడెరుగు” చాలా చక్కటి, చిక్కటి వాక్యం. నీరెలాగైతే పల్లానికి వెళుతుందో మానవుని మనస్సు ఎప్పుడూ నీచ స్ధాయికే పయనిస్తూ ఉంటుంది, ఎందుకంటే దాని స్వభావమే అది కాబట్టి. అందునా అది దృశ్యాలతోగాని, వస్తువులతోగాని, పరిస్ధితులతోగాని, భావాలతోగాని ప్రభావితం చేయబడ్డప్పుడు, అందులో మనస్సు గాఢంగా లీనమై నీచమైన అలోచనలు చేస్తుంది. అందుకే శిక్షణనిచ్చిన మనస్సు ఎప్పుడూ తప్పు చేయదు. శిక్షణనిచ్చిన మనస్సు రబ్బరు బంతి లాంటిది. శిఖణనివ్వని మనస్సు మట్టి ముద్దలాంటిది. ఒకవేళ తెలిసో, తెలియకో ఒకసారి తప్పు జరిగినా, శిక్షణపొందినటువంటి మనస్సు రబ్బరు బంతిలాగా ఉచ్చ స్ధానానికి మరల చేరుకోగలు గుతుంది. అదే శిక్షణలేని మనస్సు మట్టి ముద్దలాగా నీచంలో భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మన మనస్సుకు సరియగు శిక్షణను ఇచ్చినట్లైతె, దానిని ఒక క్రమబద్ధమైన మార్గంలో పెట్టగలిగినట్లైతే “మన బ్రతుకంతా ఆనందాల పండగ”.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతముల కలయికతో మానవ శరీరము తయారైనది. ఈ శరీరములో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఐదు జ్ఞానేంద్రియములు గలవు. మరియు కాళ్ళు, చేతులు, ఉదరము, జననేంద్రియము, మల విసర్జక అవయవం అను ఐదు కర్మేంద్రియములు గలవు. ఈ పది ఇంద్రియములకు అధిపతిగా మనసు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు చేతిలో మనిషి కీలుబొమ్మ. మనసు చెప్పినట్లుగా మనిషి నడచుకోవలసిందే. మనసునుబట్టి మనిషి జీవితం ఉంటుంది. అందుకే అనుభవజ్ఞులైన పెద్దలు మంచి మనస్సు ఉండాలి అంటుంటారు.

మానవుని మనస్సు ఎల్లప్పుడు స్వేచ్చగా విహరించాలని కోరుకుంటుంది. తన యిష్టము వచ్చినట్లుగా తిరిగే మనసుకు అడ్డుతగిలితే ఎదురు తిరుగుతుంది. ఎక్కడలేని బాధలను అనుభవిస్తుంది. శరీరానికి ఏమాత్రం కస్టం కలగకుండా స్వేచ్చగా, హాయిగా తిరగాలని కోరుకుంటుంది మనస్సు. విచ్చలవిడిగా తిరిగే మనసుకు ఎలాంటి కట్టుబాట్లు, హద్దులు ఏర్పరచినా వెంటనే స్పందిస్తుంది. ఏవిధంగానైనా ఆ కట్టుబాట్ల బంధం నుండి బయటపడి హాయిగా తిరగాలని ఆరాటపడుతుంది.

ఒక విషయం మీద ఏకాగ్రత కుదరాలంటే మనస్సు పూర్తిగా సహకరించాలి. ఎల్లప్పుడూ చంచలంగా తిరిగే మనస్సును ఒక్కసారిగా ఒక విషయంపై శ్రద్ధ చూపించమంటే తట్టుకోలేక పోతుంది. ఒకే దగ్గర ఉండి విషయ సేకరణగాని, పనిలో నైపుణ్యతనుగాని సాధించాలంటే మనస్సు మనిషి ఆధీనంలో ఉండాలి. దానికి ఎక్కువ శ్రద్ధ, పట్టుదల తోడు కావాలి. లేనిచో మనస్సు మనిషిని యిట్టే బోల్తా కొట్టించి హాయిగా పనినుంచి తప్పించుకుంటుంది.

"మనస్సుకు కష్టపడడమంటే ససేమిరా యిష్టముండదు. ఎప్పుడూ సుఖంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది మనస్సు. ఫరిశ్రమ లేకుండానే ఫలితాలు రావాలని ఆరాటపడుతుంది. అణువంత పనిచేసి పర్వతమంత ఫలితాన్ని కోరుతుంది మనస్సు".

"గాలి,శబ్ధము,కాంతికన్నా వేగవంతమైనది మనస్సు. మనిషి ఇక్కడే ఉన్నా మనస్సు మాత్రం ప్రపంచం చుట్టూ క్షణకాలంలో సంచరించి మరల స్వస్థానానికి చేరుకుంటుంది. మనస్సుకు మనస్సే సాటి. మనస్సు తలచుకుంటే చేయలేని పని అంటూ ఏదీ లేదు. మనస్సు చంచల స్వభావం గలది కాబట్టి దానిని పెద్దలు కోతితో పోల్చారు. కోతి ఏ విధంగానైతే ఒకచోట నిలువకుండా అటు ఇటు పరుగెడుతుందో, మనస్సు కూడా పరి పరి విధాలుగా అనేక విషయాలపై పరుగెడుతుంది. ఇలాంటి మనస్సును అదుపులో పెట్టుకోవా లంటే దానిని మచ్చిక చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు".

"సూర్యినిచుట్టూ భూమి తిరిగినట్లుగా మనస్సు చుట్టూ మనిషి తిరుగుతూ వుంటాడు. మనస్సు చెప్పినట్లుగా మనిషి ప్రవర్తిస్తుంటాడు. మానవ శరీరంలోని అవయవాలు మనస్సు చెప్పిన ప్రకారం నడచుకోవలసిందే. ప్రాణమున్న అస్థిపంజరం మానవ దేహం. దానిని నడిపించేది మనస్సనే వాహనం. కంటికి కనిపించనిది, చెవికి వినిపించనిది, స్పర్శకు అందనిది మనస్సు. కేవలం మనిషి ప్రవర్తన, కదలికలు, దైనందిన వ్యవహారాలలో మనసు ఉనికి కనబడుతూ ఉంటుంది".

ఎంతో గొప్పగా చెప్పుకొనే మనస్సును చూపించమంటే భౌతికముగా దానికి ఎలాంటి అస్థిత్వం లేదు. కళ్ళతో చూడలేనిది మనసు. కేవలం అనుభూతి ద్వారానే మనస్సును చూడగలం. కళ్ళతో చూడలేదు కాబట్టి మనస్సు లేదు అనడానికి వీలులేదు. ఈ ప్రపంచంలో కొన్నింటికి మాత్రమే భౌతికమైన ఆధారాలు లభిస్తాయి.
మరికొన్నింటిని కళ్ళతో చూసి, చెవులతో విని, శరీరంతో తాకి అనుభూతి చెందకపోయినా మానసికముగా వాటి మనుగడను గుర్తించ వచ్చు. పగటిపూట ఆకాశంలో చుక్కలు కనిపించనంత మాత్రాన నక్షత్రాలు లేవని ఎవరూ అనలేరు. ప్రతి క్షణం భూమి తన చుట్టు తాను తిరుగుచు సూర్యునిచుట్టు పరిభ్రమించడం మన స్ధూల దృస్టికి కంపించకపోయినా సూక్ష్మంగా అలోచిస్తే అది కాదనలేని నగ్న సత్యం. ఎంతో పెద్ద వైశాల్యంగల భూమి క్షణ క్షణం కదులుతున్నప్పటికి దాని ప్రభావం మనకు ప్రత్యక్షంగా కనిపించదు. అదే విధంగా మనిషికి మనస్సున్న మాట నిజం. ఐతే ఆ మనస్సును అదుపు చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నాడు మానవుడు.

మనిషికి మనసెందుకిచ్చావని దేవుణ్ణి నిందిస్తున్నాడొక కవి. మనిషికి మనస్సే ఒక పెద్ద శిక్షగా భావించబడుతోంది. మనస్సుంటే అన్నీ బాధలే. అన్నీ కష్టాలే, కన్నీళ్ళే. అందుకే మనస్సులేని వారిని పాషాణ హృదయులు అంటారు. అంటే వారికి మనస్సు లేదని కాదు అర్ధం. వారికి కూడా మనస్సు ఉంటుంది కానీ దానికి ఏమాత్రం స్పందన ఉండదు. ఎదుటివారి కష్టాలకు, కన్నీళ్ళకు ఆ మనస్సు చలించదు.

మనస్సెప్పుడూ తన ఆధిక్యతనే కోరుకుంటుంది. తాను ఇతరులకన్న అన్ని విషయాలలో గొప్పగా ఉండాలని భావిస్తుంది. ఇతరుల గురించి పొగిడితే మనస్సు ఎంతమాత్రం తట్టుకోలేక తెగ బాధపడుతుంది. తనగురించి
గొప్పగా చెబితే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఇతరులలో లేని ఏదో ఒక ప్రత్యేకత తనలో ఉన్నట్లుగా ఊహించుకుంటుంది మనస్సు. ఆ విషయం
ఇతరులు గ్రహించారా లేదా అని పదే పదే ఆరాలు తీస్తుంది, ఆర్భాటాలు చేస్తుంది. ఏదో ఒకవిధంగా తన గొప్పతనాన్ని తెలియజేసే సన్నివేశాన్ని మాటల సందర్భంలో చొప్పించి ఎదుటివారి చెవిలో వేసేదాకా నిద్రపట్టదు ఈ మాయ మనస్సుకు.

"చిన్నపిల్లలు వద్దన్న పనిని చేసితీరుతారు. మనస్సు పరిస్ధితి కూడా అంతే. ఏసంకల్పము రాకూడదని అనుకుంటామో ఖచ్చితంగా ఆ సంకల్పాలనే మనస్సు రప్పిస్తుంది. అందులకే స్వేచ్చను ఇచ్చి నైపుణ్యముగా మనస్సును బుద్ధియందు, బుద్ధిని ఆత్మయందు స్ధాపితము గావించవలయును. ఇదే మనోలయ యోగము. అమనస్క స్ధితి".

స్వామి శివానందులవారు సాధనచేయు ప్రారంభ దినములలో మనస్సును జయించుటకు ఎన్నొ కష్టాలు అనుభవించినట్లు వ్రాసుకున్నారు. మన మనస్సు ఏదైతే సంకల్పిస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టేసరికి కొద్దిరోజుల తరువాత మనస్సు నెమ్మదిగా తన మాట వినడం మొదలుపెట్టిందట. ప్రారంభ దశలో మనస్సును జయించుటకు ఎవరికి అనుకూలమైన పద్ధతిని వారు ప్రయోగించి మనస్సును వశపరచుకోవాలి. దొంగచేతికి తాళంచెవి ఇచ్చినట్లు నామ, రూప, దృశ్య గోచర ప్రపంచమంతయు నీ ఆధీనంలో గలదని మనస్సుకు బాధ్యతను అప్పగించాలి. అప్పుడు ఏచిక్కులు ఉండవు.

"ఈ భూమిపై మనం చూస్తున్న గిరులు, తరులు, సెలయేర్లు, సమస్త వస్తువులకు వయస్సుంది. భూమికి వయస్సుంది. పంచభూత నిర్మిత ప్రపం చానికి వయసుంది. సూర్య చంద్రులకు వయసుంది. కాని విశ్వ మనస్సుకు వయసు లేదు. వయసులేని మనస్సు వశంగావడం అంత తేలికైన పని కాదు సుమా" అంటున్నారు బాబా సర్వకేంద్రులు.

"నిలుకడలేని మనస్సుకు సంకెళ్ళువేసి, బహిర్ముఖ పదార్ధముల వైపు సంచరించకుండ,మదపుటేనుగును లొంగదీయుటకు అంకుశమువలె
నియమనిస్ఠలు, దీక్షలు, వ్రతములు, ఆరాధనలు, మౌనవ్రతములు, చాతుర్మాస్య వ్రతములు మొదలగునవి ఆ కోవలోనివి. మనస్సు యోచనలో కేంద్రీకరింప బడినపుడు అది మానస పూజ. దీనిచే అజ్ఞాని జ్ఞాని యగును. మానవుడు మాధవుడగును".

"మనస్సు జలమువంటిది. నీటిని ఏ పాత్రలో పోసిన ఆ పాత్ర ఆకారముగ మారునట్లు, మనస్సు దేనిని చింతించిన తదాకారముగ పరిణమించ గలదు. ఆందులకై నిరంతరం ఆత్మ చింతనా నిమగ్నులు కావాలి. భావములు పర్వతముల వంటివి. అభేధ్యములు. భావోద్రేక ప్రకంపన తరంగములు విశ్వమయముగ వ్యాపించును. అందులకై సద్భా వన శీలురు కావాలి. నీ భావన భగవన్మయ మైనపుడు జగమంతయు నీకు భగవన్మయముగానే భాసిల్లుతుంది" అంటున్నారు బాబా సర్వకేంద్రులు.

"కర్మకాండలో పాల్గొనినపుడు శరీరముతో పనులు జరుగును. ఇంద్రియ మనంబులు అలాకావు. ఇంద్రియములు కూడా జడములే. మనో ప్రేరణ ననుసరించి అవి పనిచేయగలవు. కన్ను మూసినంతనే సంకల్ప శక్తినిబట్టి మంచిగాని, చెడుగాని క్షణములో జరుగును. దేహేంద్రియములు అదుపులో ఉండాలనిన మనో నియంత్రణ అత్యవసరము. ప్రతి సాధకుడు ఈవిషయమును మరువకూడదు. మనస్సు కంటికి కనిపించదు. వాయుభూత సంబంధమైన మనస్సు క్షణములో ప్రపంచమును చుట్టి రాగలదు. ఏ రాకెట్ వేగము దీనితో సరిపోదు. గ్రామాలు, దేశాలు, గోళాలు, వ్యక్తులు, శక్తులు అన్నింటిని మనస్సు చూడగలదు. కనిపించని వాటిని కూడా ఊహించి తనలో లీనము గావించుకుంటుంది. మనో నిగ్ర
హమే సమస్త సాధనలకు మూలసూత్రం" అంటున్నారు బాబా సర్వ కేంద్రులు.

"బహిర్ విషయాలలోకి ప్రవేశించకుండ చూచుకోవటం జ్ఞానసిద్ధి. ఒక గదిలో వస్తువులు ఉన్నాయనిన అవి వాటంతట అవి రావు. బయటనుండి తెచ్చినవే రాగలవు. అలాగే మనస్సులోకి సంకల్ప ప్రేరణల ద్వారా విషయాలు ప్రవేశించును. ఒక్కొక్క వస్తువును తీసినపుడు గది ఖాళీ కాగలదు. అలాగే సంకల్పబలంతోనే నిర్విషయ సిద్ధి తధ్యం. ముల్లును ముల్లు ద్వారా తీసి రెంటిని పారవేయునట్లు ఎరుకద్వార ఎరుకనెరింగి రెంటిని మానుకోవాలి. సంకల్పబలము గొప్పది. సద్విషయ ములలో ఇది ముఖ్యం. కాయిక, వాచిక, మానసిక సమస్త కర్మలు మనో మయములు. అందులకే మనోనిగ్రహమే త్రికరణ శుద్ధికి మూలం" అంటున్నారు బాబా సర్వ కేంద్రులు.
- నేతి విజయదెవ్

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home