Monday, January 7, 2008

సద్భావనా స్రవంతి

ముందుమాట

దివ్యాత్మ స్వరూపులారా! సృష్టి ప్రారంభమై ఇప్పటికి యుగాలు గతించాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం కలియుగం లో 5110 సంవత్సరం లో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. క్రీస్తు శకం 21వ శతాబ్ధం లో పయనిస్తున్నాం. రాజులు గతించారు. రాజ్యాలు పోయాయి. విదేశీయుల కబంధ హస్తాలనుండి బయటపడ్డాం. మన శరీరాలు జనించాయి. పెరిగి పెద్దవై నశించే తరుణం ఆసన్నమైనది. ఈ సృష్టి ఇంకెన్నో యుగాల పర్యంతం నిర్విరామంగా జరుగవలసియున్నది. ఈ కాల గమనం లో మన శరీరాల అస్థిత్వం క్షణకాలం మాత్రమే. అందులకే మన శారీరక జీవనకాలంలో సర్వ సద్గుణ సంపత్తిని మూటగట్టుకొని, ఉత్తమ సంస్కారాలను బలపరుచుకొని, వర్త మాన కాలంలో భౌతిక సుఖాలను పరిమితంగా అనుభవిస్తూనే, మన ఆత్మ శ్రేయస్సుకోసం రాచబాటలు వేసుకుందాం. ముక్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు “దేహ భావన నుండి దైవ భావం”లోకి పయనిద్దాం. దైవావతారులమై జీవిద్దాం.
శరీరం నాదనుకున్నప్పుడే కష్టాలు, కన్నీళ్ళు. సచ్చిదానంద పర:బ్రహ్మ స్వరూపులమనే భావన కలిగిననాడు అంతా పరమానందమే. ప్రతి పామర పూత ఫలవంతమయ్యే రోజు రాగలదు, ఇంకెన్ని జన్మలకైనను నిజమెరింగిన పిదప ప్రతి అజ్ఞాని వెక్కి వెక్కి ఏడువవలసి వస్తుంది. ఫ్రస్తుతం ఎందరో అజ్ఞానులు జ్ఞానోదయ తదనంతరం గత జీవితముల తలచుకొని కృంగిపో తున్నారు.
సాకారం నుండి నిరాకారం లోకి, సగుణం నుండి నిర్గుణం లోకి, ద్వైతం నుండి అద్వైతం లోకి, వ్యస్టి భావన నుండి విశ్వభావం లోకి, దేహ భావన నుండి ఆత్మ భావనలోకి రావడమే ఆద్యాత్మిక పరిజ్ఞానం, ఆత్మానందానికి పరమ సోపానం! సకల చరాచర జీవజగత్తులో పరమాత్మను దర్శించిన వాడే ఆత్మ జ్ఞాని. కనుక స్వత:హాగా మనమంతా సాక్షాత్తూ దైవ స్వరూపులమై ఉన్నాం. ఇట్టి మన నిజ స్వరూపాన్ని తెలుసుకొని, ఆత్మానందాన్ని అనుభవించి, అనుబూతి చెందడమే మోక్షం, జన్మ రాహిత్యం. మానవ జన్మ ఎత్తిన పిదప తన నిజ స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే పాపం! తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతర మానవ జీవులకు తెలియజెప్పక పోవడమే మహాపాపం!!

ఈ గ్రంధం లో జీవిత గమనంలో నాకు తటస్తించిన సంఘటనలను, సందర్భాలను, ప్రేరణలను, అనుభవాలను, దివ్య అనుభూతులను ఆధారం చేసుకొని, మనో విశ్లేషణ గావించి, నిత్యానిత్య వస్తు వివేచనతో ఆత్మ విచారణ గావించి, ఆ భావాలకు అక్షర రూపం ఇవ్వడంజరిగింది. ఈ గ్రంధం లో ఉదహరించిన ప్రతి అంశం ఒక మనో వికాసాన్ని, ఆత్మ పరిశీలనా భావాన్ని, ఆధ్యాత్మిక తత్త్వాన్ని, ఆత్మోద్ధరణ ప్రాశస్ధ్యాన్ని తెలియజేస్తుంది.

పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు కలిగి మానవాకారంలో ఉన్న మనిషి ప్రకృతి గుణములతో పుట్టి, బాల్యదశలో కల్లకపట మెరుగక, పవిత్రముగా ఉంటూ, పెరిగి పెద్దై నిజజీవితములో నిత్య కృత్యాలు నిర్వర్తించడానికి సమాజములోకి ప్రవేశించగానే తనలోని నిష్కల్మ షత్వాన్ని కోల్పోతున్నాడు. త్రిగుణములలో చిక్కి, ఇంద్రియాల వత్తిడివల్ల మనసు వశం తప్పగా తప్పటడుగులు వేస్తాడు. సమకాలీన సమాజ నీతికి తలయొగ్గి, అంతరాత్మ ప్రభొధాన్ని మరచి నలుగురితో నారాయణ యంటూ తాను, తన కుటుంబం, తన బంధువర్గమంటూ గిరిగీసుకొని జీవి స్తున్నాడు.తాను ఏర్పరచుకున్న సంకుచిత పరిధిలో పరిభ్రమిస్తూ అదే జీవిత సర్వస్వమని భావిస్తున్నాడు. తన జీవనపోరాటానికి, ఆర్ధిక పరిపుష్టికి, హోదా, పలుకుబడి, గొప్పదనాలు ప్రదర్శించుకొనుటకు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన ఆర్ధికాభివృద్ధే జీవిత లక్ష్యంగా ఎంచుకొని, నీతినియమాలకు, సామాజిక న్యాయానికి, సమతా మమతలకు, ఉచితానుచితాలకు తిలోదకాలిచ్చి, సమాజ దృష్టిలో తాను ఉన్నత స్థానంలో ఉన్నానని నిరూపించుకోవడానికి నానా యాతనలు పడుతున్నాడు.

ఈ దశలో మానవుడు తన నిజస్థితిని మరచి, తాను పంచభూత నిర్మిత దేహంగా భ్రమించి, దాని బాగోగులకు అధిక ప్రాధాన్యతనిచ్చి తన అసలు స్వరూపాన్ని మరచిపోయాడు. ఫెద్దలు, మహానుభావులు, మహనీయులు, సర్వసంగ పరిత్యాగులు, సద్గురువులు అనాదిగా అసలు సత్యాన్ని ప్రవచిస్తూనే ఉన్నారు. ఐనా మానవుడు మాయలో పడి గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు.

ఒకనాడు వేదములు, ఉపనిషత్తులు, తత్త్వశాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్యం మున్నగు విద్యలు రహస్యముగా ఉంచబడినవి. కాని నేటి ఆధునిక కంప్యూటర్ యుగంలో ప్రతి శాస్త్రము బట్టబయలు గావింపబడినది. పూర్వకాలములో మునీంద్రులు ముక్కు మూసుకొని అడవులలో తపస్సు చేసుకునేవారు. కాని ప్రస్తుతం ప్రతి జీవి, ధ్యానం, యోగంలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియలను సాధనచేస్తూ ఉద్ధరణ నిమిత్తం పాటుపడుతున్నారు. మీరుకూడా ఇదేమార్గంలో పయనించి ఆత్మానందాన్ని అనుభవించాలని ఆకాంక్షిస్తున్నాను.

మనిషి వ్యక్తిత్వానికి ఆర్ధిక పరిపుష్టే గీటురాయిగా తలంచిన సమాజం, అందులో అంతర్భాగమైన మానవుడు భౌతిక సుఖ సంపదలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. ఖర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలలో సహజత్వం కొల్పోయి, ఆడంబరం, కృత్రిమత్వం చోటుచేసుకుంది. ఫలాపేక్ష లేకుండా పనిచేసే ప్రావీణ్యతను మానవుడు సాధించలేక పోతున్నాడు. భక్తి మార్గంలో పరవశించిపోయి రామకృష్ణ పరమహంస, భక్త తుకారాం, భక్త మీరాభాయి వలె భగవత్ సాక్షాత్కారానికై వలవలా కన్నీరు కార్చి, తహతహలాడ లేకపోతున్నాడు. ధ్యానం, యోగం లాంటి సాధనా ప్రక్రియలు కేవలం శారీరక రుగ్మతలను నివారించుకొనుట వరకే పరిమితమయ్యాయి. ఇక జ్ఞాన మార్గంలో పయనించి సమాధి స్థితిని పొంది, స్థితప్రజ్ఞతతో ఆనందమయ జీవితం గడిపేవారి సంఖ్య సమాజంలో బహు స్వల్పాతి స్వల్పమనే చెప్పాలి.

ఆశాపాశాలకు, విషయవాంచలకు, రాగద్వేషాలకు, అరిషడ్వర్గాలకు, తళుకుబెళుకులకు, సామాజిక కట్టుబాట్లకు బానిసయైన మనిషి తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తనకు భిన్నంగా దైవత్వంగలదని, ఆనందమనేది బయట ఎక్కడో ఉన్నదని భావించి, బాహ్య ప్రపంచంలో సంచరిస్తున్నాడు. అంతర్ముఖుడై అసలైన ఆనందాన్ని చవిచూడలేక పోతున్నాడు. ఈ ప్రస్థానంలో మనశ్శాంతి కరువై దిక్కుతోచక దీనంగా విలపిస్తున్నాడు.పాశ్చాత్య విష సంస్కృతికి ఆకర్షింపబడి భౌతికవాదంలో కాలం గడుపుతున్నాడు.

ఈ గ్రంధం చదివి ఏ కొద్ది మందైనా తమ ఆలోచనాసరళిలో దోషముంటే సవరించుకొని, ఆచరణశీలురై తామున్న ప్రస్తుత భౌతిక, మాన సిక స్తితినుండి పైకెదిగి, తమ వ్యక్తిత్త్వాన్ని ఎవరెస్టు శిఖరమంత ఉన్నతంగా పెంచుకొని, ఉదాత్తమైన, ఉన్నతమైన ఆలోచనాసరళిని ఏర్పరచుకొని, ఉత్కృస్టమైన ఆదర్శాలను, లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశించుకుని, మానవ జీవిత పరమార్ధమైన ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించి, జన్మ సార్ధకం చేసుకో గలిగితే నాయీ ప్రయత్నం సఫలమైనట్లుగా భావించి పరమానందం చెంద గలను. ఎవరికి వీలున్న పరిధిలో వారు జ్ఞాన ప్రచారాన్ని చేపట్టి, సమస్త మానవాళిని దైవస్వరూపులుగా మార్చే దిశగా సర్వులు పయనించాలని నా అభిలాష. అందుకోసం ఇలాంటి “సద్భావనా స్రవంతులు” ఎంతగానో తోడ్పడతాయని నా ప్రగాఢ విశ్వాసం.

తాత్త్వికునికి సైతం సామాజిక స్పృహ పరమావశ్యకం కాబట్టి సమకాలీన సమాజంలోని మనుష్యుల మనస్తత్త్వాన్ని పరిశీలనాత్మక దృష్టితో అవలోకిస్తూ, భావాలకు అక్షర రూపమిచ్చి, యదార్ధాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే యుక్తాయుక్తాలను, నిజానిజాలను విచారించి, మానసిక పరిణతిని పొంది, సాత్త్వికాహార నియమంతో, సజ్జన సాంగత్యం సలుపుతూ, నియమ నిష్ఠలతో సాదనలు సలిపి, ఆత్మాను సంధానానికి జ్ఞానమార్గమొక్కటే శరణ్యమని తలంచి, నా గురుదేవులు బాబా సర్వకేంద్రులవారు ప్రవచించిన తత్త్వసారాన్ని మరియు మహర్షులు, సర్వసంగ పరిత్యాగులు నుడివిన సూక్తులలోని మకరందాన్ని సేకరించి, సమకాలీన సమాజంలో మానవుని ప్రవర్తనారీతిని గమనించి, ఆకళింపు చేసుకొన్న అనుభవంతో ఏ కొద్దిమందికైనా ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుందనే సదుద్దేశ్యంతో నాకు తోచిన రీతిలో వివిధ వ్యాసాలుగా, కవితా రూపంలో, పద్య శతకంగా పాఠకులముందు ఉంచడం జరిగింది. ఫ్రతిస్పందన పాఠక దేవుళ్ళనుండి పొందవలసి ఊంది. ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్ని అమూలాగ్రం చదివి, తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.

గమనిక: నా గురుదేవులు బాబా సర్వకేంద్రులు నా చిన్నతనంలో చేసిన ఆధ్యాత్మిక నామధేయమైన “నేతి విజయదేవ్” పేరుతో ఇకమీదట రచనలు కొనసాగగలవని పాఠకదేవుళ్ళకు తెలియజేయుచున్నాను.

సకల చరాచర సుఖాభిలాషి,
నేతి విజయదెవ్

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home